Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శ్రీ సోమేపల్లి సోమయ్య జీవితం తల్లి భారతికి సమర్పణ చేశారు- ‌యస్‌.‌వి.శేషగిరిరావు - About Somepalli Somayya in Telugu

జీవితాంతం ఒకే సంస్థకు అంకితమైన వారికి వ్యక్తిగత, సంస్థాగత జీవితాలంటూ వేరుగా ఉండవు. ఆ సంస్థ చరిత్ర, గమనమే వారి జీవితం. అలాంటి కోవ...


జీవితాంతం ఒకే సంస్థకు అంకితమైన వారికి వ్యక్తిగత, సంస్థాగత జీవితాలంటూ వేరుగా ఉండవు. ఆ సంస్థ చరిత్ర, గమనమే వారి జీవితం. అలాంటి కోవకు చెందిన వారే సోమేపల్లి సోమయ్యగారు.

1940, 50 దశకాలు అటు ప్రపంచంలో, ఇటు భారతదేశ చరిత్రలో అత్యంత క్లిష్టమైనవి. ఒకవైపు రెండవ ప్రపంచయుద్ధం, మరొకవైపు క్విట్‌ ఇం‌డియా నినాదంతో స్వాతంత్య్ర పోరాటం అంతిమ ఘట్టానికి చేరిన రోజులు. ఇస్లామిక్‌ ‌వేర్పాటువాదం దేశమంతటా రక్తపాతాన్ని సృష్టిస్తున్న రోజులు కూడా. కమ్యూనిస్టు ఉద్యమం ఉవ్వెత్తున్న లేచి మేధావివర్గాన్నీ, యువతనూ విశేషంగా ఆకర్షిస్తున్న కాలం. ఈ తరుణంలో ఆంధ్రలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి బీజారోపణ జరిగింది. ఈ నేపథ్యానికి సోమయ్య గారితో పాటు నేనూ ప్రత్యక్ష సాక్షినే.

ముందుగా నాటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని గురించి ప్రస్తావించాలి. అది 1935-45 దశకంలో కోస్తా జిల్లాల్లో గ్రామగ్రామానికి విస్తరించింది. ఎంతగా అంటే, ప్రొద్దున్నే వాకిళ్ల ముందు ముగ్గుల్లో సైతం సుత్తీ – కొడవలి దర్శనమిచ్చేవి. బెజవాడను ‘ఆంధ్రా మాస్కో’ అనేవారు. రాజకీయాల్లోకి కులతత్త్వం ప్రవేశించింది. ఒక సామాజిక వర్గం పెద్ద ఎత్తున కమ్యూనిస్టు విషకౌగిలిలోకి వెళ్లిపోయింది. దాంతో కమ్యూనిస్టు పార్టీ జవసత్త్వాలు అమాంతంగా పెరిగి పోయాయి. ఆ పార్టీ ప్రభావం కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాలేదు. కవులు, రచయితలు, కళాకారులు ఎర్రజెండా ఎత్తుకొన్నారు. గ్రాంధిక భాషపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి వంటి వారు బోల్షివిక్‌ ‌విప్లవం ముందుతరాల వారైనా, తమవారేనని కమ్యూనిస్టులు ప్రచారం చేశారు. వారి గ్రంథాలను పునర్ముద్రించటం, వారి చిత్రాలతో క్యాలండర్‌లు పంచడం వంటి ప్రచార కార్యక్రమాలతో, ఆ మహనీయులంతా కమ్యూనిస్టులనే భ్రమ కలిగించారు. శ్రీశ్రీ, ఆరుద్ర వంటి ప్రతిభావంతులైన కవులు, కమ్యూనిజం బాటపట్టారు. ‘ప్రజానాట్యమండలి’ పేరుతో కళాకారులు, ‘అభ్యుదయ రచయితల సంఘం’ పేరుతో సాహివేత్తలకు వేదికలు సమకూర్చారు. తెనాలికి చెందిన నాజర్‌ ‌బుర్రకథ దళం కమ్యూనిస్టు పార్టీకి విశేష సేవలందించింది.

1943లోనే ‘ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌నిజ స్వరూపం’ అనే చిన్న పుస్తకాన్ని చండ్ర రాజేశ్వరరావు రాశాడు. దాన్ని మైపాడు (నెల్లూరు జిల్లా) వంటి కుగ్రామంలోని గ్రంథాలయంలో నేనూ చూచాను.

అంతర్జాతీయ పరిణామాలు కూడా కమ్యూ నిస్టులకు ఎనలేని ప్రాబల్యాన్ని సంతరించి పెట్టాయి. రెండవ ప్రపంచయుద్ధానంతరం ఎర్రజెండా ప్రతిష్ట నింగినంటింది. ఎర్రజెండాల సైనిక శకటాలు బెర్లిన్‌ను ఆక్రమించడాన్ని చూపించే ‘ఫాల్‌ ఆఫ్‌ ‌బెర్లిన్‌’ ‌డాక్యుమెంటరీ చిత్రాన్ని సిపిఐ గ్రామగ్రామాన ప్రదర్శించింది. మన దేశం కమ్యూనిస్టు వ్యవస్థలోకి వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవనే భ్రాంతిని భారత కమ్యూనిస్టు పార్టీ కోస్తా జిల్లాల్లో కల్పించింది.

మరొకటి రాడికల్‌ ‌హ్యూమనిజమ్‌. ‌తెనాలి వారే ఆవుల గోపాలకృష్ణమూర్తి, త్రిపురనేని రామస్వామి చౌదరి రాడికల్‌ ‌హ్యూమనిజం పేరుతో, నాస్తికవాదం పేరుతో హిందూధర్మంపై విరుచుకుపడ్డారు.

ఎంత వ్యతిరేక పవనాలున్నప్పటికీ కోస్తాలోని జిల్లా కేంద్రాల్లో, ముఖ్య పట్టణాల్లో శాఖలు మొదలైనాయి. క్రమంగా సంఘానికి వచ్చే యువకుల సంఖ్య పెరిగింది. అలాంటి ముఖ్య కేంద్రాలలో తెనాలి ఒకటి.

సోమయ్య గారిదీ తెనాలే. పాత గుంటూరు జిల్లాలో ఒంగోలు సమీపంలోని చీమకుర్తి దగ్గరి పల్లామిల్లి పుట్టిన ఊరు. పేద కుటుంబం. సోమయ్య గారి చిన్న తనంలో వారి కుటుంబం బ్రతుకుదెరువు కోసం తెనాలి వచ్చి స్థిరపడింది. సోమయ్యగారికి 9 సంవత్సరాలున్నప్పుడే తండ్రి చనిపోయారు. తల్లి కట్టెల అడితి నడుపుకొంటూ కుమారుడిని చదివిస్తుండే వారు.

‘‘సంఘంలో మీరు ఎలా చేరారని’’ నేను వారినే అడిగాను. ఆ సందర్భాన్ని వివరించడం అవసరమే. 1989 సెప్టెంబర్‌లో ఇద్దరం ఒక రోజుంతా హైదరాబాదు శివార్లలోని ఒక తోటలో గడిపాం. వారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. 1989 వారి జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం. 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్‌గా అవిభక్త ఆంధప్రదేశ్‌లో సంఘ విస్తరణకు కృషిచేసి ప్రక్కకు తప్పుకుంటున్న తరుణమది. అప్పుడావిషయం నాకు తెలియదు.

మా ఇద్దరి మధ్య ఆత్మీయతకు మూలాధారం సిద్ధాంతమే కాబట్టి, సంభాషణంతా దాని చుట్టూ తిరిగింది. ‘‘మీ బాల్యం, స్కూలు, కాలేజి రోజుల గురించి తెలిసిన కంభంపాటి నారాయణ లాంటివారు లేరు. భావితరాలకు ఆ వివరాలు తెలియాలి. కొన్ని ప్రశ్నలడుగుతాను. జ్ఞాపకాల్లోకి వెళ్లండి!’’ అన్నాను. పైన ఉదహరించింది ఆ క్రమంలోనే వేసిన మొదటి ప్రశ్న.

అవనిగడ్డలో ఆంధప్రదేశ్‌ ‌తుపాను బాధితుల సహాయ సమితి కార్యదర్శి ఆర్‌. ‌నాగరాజ్‌ను సోమయ్య గారు ప్రముఖ సర్వోదయ నాయకులు గోపరాజు లవణం గారికి పరిచయం చేస్తున్నప్పటి ఫొటో. పక్కన జి. పుల్లారెడ్డి, హేమలత లవణం, బండారు దత్తాత్రేయ, జిఎస్‌కె ఆచార్య, వేదాంతం సంగమేశ్వరశాస్త్రి, డా।। వడ్డి విజయసారథి.

వారం ఆలస్యమైతే…: క్విట్‌ ఇం‌డియా ఉద్యమం రోజులు. తెనాలిలో కాల్పులు జరిగాయి. 9 మంది ప్రాణాలు కోల్పో యారు. ఉద్రిక్త వాతావరణం ఉండేది. సోమయ్యగారు ఫిఫ్త్‌ఫారం (ఇప్పటి 10వ తరగతి)లో ఉన్నారు. రామానుజం అనే క్లాస్‌మేట్‌ ‌సంఘానికి తీసుకెళ్లాడు. ‘సంఘంలో చేరడం ఒకవారం ఆలస్యమైతే కమ్యూనిస్టు పార్టీలో చేరి ఉండేవాడి’ని అని చెప్పారు. తనకు మంచి మార్కులు వస్తుండేవనీ, ముఖ్యంగా గణితంలో క్లాసులో టాపర్‌గా ఉండేవాడిననీ చెప్పారు.

గుంటూరులో ఇంటర్మీడియేట్‌ ‌చదువుతున్నప్పుడు, బ్రాడీపేటలో వారు వెళ్లిన శాఖకు నాడు వచ్చిన విద్యార్థుల్లో ఇద్దరు అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌ముఖ్య మంత్రులైనారు. ఒకరు భవనం వెంకట్రామ్‌, ‌మరొకరు యన్‌.‌టి.రామారావు. సుప్రసిద్ధ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కూడా ఆ శాఖకు వస్తుండేవారట.

‘‘తర్వాత కాలంలో వీరిని కలుసుకొన్న సందర్భా లున్నాయా?’’ అని అడిగాను. యన్‌.‌టి.ఆర్‌ను మాత్రం ఒకసారి కలిశానని చెప్పారు. 1970వ దశకంలో సూర్యాపేట వాస్తవ్యులు, నల్లగొండ జిల్లా సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌పుల్లయ్యగారు కొత్తగా నిర్మించిన హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవానికి రామారావు వచ్చారని, ఆ ఒక్కసారే కలిశామని చెప్పారు. ‘‘దత్తాత్రేయ దండోపంత్‌ ‌బందిష్టే’’ ఎలా ఉన్నారని రామారావు వాకబు చేశారని చెప్పారు. వారు చదువుకొనే రోజుల్లో గుంటూరులో బందిష్టే ప్రచారక్‌.

‌నెల్లూరు జిల్లాతో అనుబంధం: సంఘంపై నిషేధాన్ని జూలై 1949లో తొలగించిన తర్వాత, 1950 వేసవిలో అవిభక్త మద్రాసు రాష్ట్ర సంఘ శిక్షావర్గ నెల్లూరులో జరిగింది. ఆంధ్రలో జరిగిన మొదటి ఒటిసి అది. ఆ రోజుల్లో యన్‌.‌యం.దేశ్‌పాండే నెల్లూరు జిల్లా ప్రచారక్‌. ‌వారొక ఫైర్‌‌బ్రాండ్‌. ‌మూర్తీభవించిన చైతన్యం. 16 ఏండ్ల వయసులో యస్‌యస్‌ఎల్‌సి తర్వాత, నేరుగా నాగపూర్‌ ‌నుంచి 1946లో ప్రచారక్‌గా నెల్లూరికి వచ్చారు. వి.ఆర్‌.‌కాలేజిలో ఇంటర్మీడియేట్‌లో చేరారు. చిన్న చదువైనా ఇంగ్లీషులో అనర్గళంగా ఉపన్యసించేవారు. వారి ఇంగ్లీషు వాగ్ధాటికి లెక్చరర్లు సైతం ఆశ్చర్యపోయేవారు. నెల్లూరు జిల్లాలో సంఘానికి బలమైన పునాదులు పడ్డాయంటే కారణం వారే. ఒటిసి వి.ఆర్‌. ‌కాలేజీలో జరిగింది. గురూజీ మూడురోజులున్నారు.

ఆ ఒటిసిలో సోమయ్యగారు శిక్షక్‌. ఒటిసి తర్వాత నెల్లూరు నగర ప్రచారక్‌గా ఉండిపోయారు. అప్పుడు వారి వయసు 22-23. నాకు 14 ఏండ్లు. అప్పటి నుంచి 1995లో వారు తుదిశ్వాస విడిచేవరకు మా అనుబంధం కొనసాగింది. నన్ను ఆప్యాయంగా ‘‘శేషూ!’’ అని పిలిచేవారు. ఆ పిలుపులో అమృతధార ఒలుకుతుండేది.

దేశ్‌పాండే పర్వతశిఖరాల నుంచి వేగంగా దుమికే జలపాతం లాంటి వారైతే, అదే ప్రవాహం మైదాన ప్రాంతంలో నిశ్శబ్దంగా సాగే నది లాంటివారు సోమయ్యగారు. ప్రతి నది గమనంలోను ఈ రెండు పార్శ్వాలుంటాయి. దేశ్‌పాండేగారు హరిద్వార్‌ ‌దగ్గరి గంగ అయితే, సోమయ్యగారు వారణాసి దగ్గరి గంగ లాంటివారు.

1952లో దేశ్‌పాండే గారు గుంటూరు జిల్లాకు వెళ్లగా, సోమయ్యగారు నెల్లూరు జిల్లా ప్రచారక్‌ అయినారు. క్రమంగా సోమయ్యగారు కార్యకర్తలను తీర్చిదిద్దే శైలితో ఫలితాలు కనిపించటం ప్రారంభ మైంది. వారి సంపర్కంలోకి వచ్చిన యువకుల్లో భవిష్యత్తులో కార్యకర్తలుగా ఎదుగగలిగిన వారిని ముందుగానే గుర్తించి, స్నేహ మాధుర్యంతో వారిపై చెరగని ముద్రవేశారు. అవిభక్త ఆంధప్రదేశ్‌లో సంఘవ్యాప్తికి నెల్లూరు జిల్లా నుంచి వెళ్లిన వారి కృషి గణనీయంగా ఉందంటే కారణం సోమయ్యగారు. వ్యక్తిగత సంభాషణల్లో, పలకరింపుల్లో సౌమ్యత, సహజత్వం ఒలుకుతుండేది. తద్వారా వారిపై ఎనలేని గౌరవం ఏర్పడేది. ఇండ్లకు వచ్చినప్పుడు వారు వ్యవహరించే తీరు, పాటించే మర్యాద, కుటుంబాల్లో వారికి అభిమానాన్ని సంతరించి పెట్టాయి. సోమయ్యగారు హైదరాబాదులో మా ఇంటికి వచ్చినప్పుడల్లా పండగ వాతావరణం ఉండేది.

రాయలసీమలో భీకర క్షామం: 1951లో రాయలసీమ, నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి రాపూరులలో భీకర క్షామం ఏర్పడింది. బావులు, చెరువులు ఎండిపోయాయి. ఎండకి రాలిపోతున్న పక్షుల చిత్రాలను దినపత్రికల్లో చూడటం నాకీనాటికీ జ్ఞాపకం. ఆ ప్రాంతంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సహాయ కార్యక్రమాలు చేపట్టింది. నెల్లూరు జిల్లా డెల్టా ప్రాంతంలోని స్వయంసేవకులు సోమయ్యగారి నేతృత్వంలో చిత్తూరు జిల్లాలో, నెల్లూరు మెట్ట ప్రాంతాలలో గంజి కేంద్రాలు నిర్వహించారు. ఆ కేంద్రాలను నిర్వహించిన స్వయంసేవకులు మామూలు భోజనం ఏర్పాటు చేసుకునే వీలున్నా గంజితోనే సరిపెట్టుకునేవారు. వారి నిష్ఠ అలాంటిది. గంజి కేంద్రాలకు పంపేందుకు డెల్టా ప్రాంతంలో స్వయంసేవకులు బియ్యం, వడ్లూ సేకరించేవారు. నెల్లూరు శాఖకు చెందిన ‘శిశుగణ’ స్వయంసేవకులు చందాల కోసం ట్రంకు రోడ్డు మీద క్రమశిక్షణతో పాటలు పాడుతూ నడుస్తున్నప్పుడు ఎందరి కళ్లో చెమర్చాయి. అంత శ్రమించి స్వయంసేవకులు చిత్తూరు జిల్లాకు బియ్యం పంపడానికి సిద్ధం చేస్తే, నెల్లూరు తాసిల్దార్‌ అన్నదాత మార్కండేయులు పర్మిట్‌ ఇవ్వకుండా జాప్యం చేశాడు. ప్రజలు ప్రాణాలు నిలబెట్టడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌పూనుకుంటే అది కూడా జరగనియ్యకుండా అధికార యంత్రాంగం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని మెప్పించడానికి చేసిన అమానవీయ చర్య అది. సోమయ్యగారికి ఆగ్రహం వచ్చింది. తాలూకాఫీసుకు వెళ్లి మార్కండేయులను దులిపేశారు. అదే రోజు పర్మిట్‌ ‌వచ్చింది.

ఆ రోజుల్లో ప్రచారక్‌లు కేవలం 30 రూపాయ లతో నెలంతా సర్దుకోవలసి ఉండేది. ఉత్తరాలు కార్డుల మీదనే రాసేవారు. పోస్టల్‌ ‌ఖర్చుల కోసం సోమయ్యగారు అప్పుడప్పుడూ రాత్రిపూట భోజనం మానెయ్యడం నాకు బాగా గుర్తుంది. నగర ప్రచారక్‌గా కాలినడకనే తిరుగుతుండేవారు. జిల్లా ప్రచారక్‌ అయిన తర్వాత వారి దగ్గర ఒక సైకిలుండేది.

కోవూరు తాలుకా కమ్యూనిస్టుల కంచుకోట. సిపిఐ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామం కోవూరికి దగ్గరే. ముఖ్యంగా చేనేత వర్గం కమ్యూనిస్టు ఉద్యమంలో చేరిపోయింది. అయినప్పటికీ, కోవూరు పట్టణశాఖ (పెన్నా నది ఉత్తరం) చాలా పటిష్టంగా ఉండేది. మెరికల్లాంటి స్వయంసేవకులు ఉండేవారు. వారంతా జీవితంలో ఉన్నత స్థానాలలోకి వెళ్లారు. ఆ శాఖ ముఖ్యశిక్షక్‌గా రమణయ్య అనే ఫైర్‌‌భ్రాండ్‌ ‌కార్యకర్త ఉండేవారు. అతను టైఫాయిడ్‌తో చనిపోయాడు. అంత్యక్రియలకు నెల్లూరు నుంచి చాలా మంది స్వయంసేవకులు సైకిళ్లమీద కోవూరు వెళ్లారు. అన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 10 దాటింది. నాకు సైకిలు లేదు. నా అవస్థ చూచి సోమయ్యగారే నన్ను తన సైకిల్‌మీద తానే తొక్కుతూ నెల్లూరు దాకా తీసు కొచ్చారు. ఆ సంఘటన నేనెన్నడూ మరచిపోలేదు.

1952 సాధారణ ఎన్నికలు: 1952 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌ ఆం‌ధ్ర జిల్లాల్లో పోటీ చెయ్యలేదు. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. నెల్లూరు పార్లమెంటుకు బెజవాడ రామచంద్రారెడ్డిని, నెల్లూరు టౌన్‌ అసెంబ్లీ స్థానానికి పొన్నలూరు వీరరాఘవరెడ్డిని సమర్థించింది. సోమయ్యగారి నేతృత్వంలో స్వయంసేవకులు ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్థానంలో బల పరిచిన అభ్యర్థి ఓడిపోయినా, బెజవాడ రామచంద్రా రెడ్డి లోక్‌సభకు గెలిచారు. జాతీయ శక్తులు ఆంధ్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది నెల్లూరులోనే. లోక్‌సభలో డాక్టర్‌ ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ ఏర్పరచిన నేషనల్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌కు బెజవాడ రామచంద్రా రెడ్డి ఉపనాయకుడుగా వ్యవహరించారు.

1955 మధ్యంతర ఎన్నికలు: 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1952లో మద్రాసు శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర జిల్లాల్లో కాంగ్రెసుకు మెజారిటీ రాలేదు. కమ్యూనిస్టులు గణనీయంగా గెలిచారు. 1953లో, గౌతు లచ్చన్న కృషికార్‌లోక్‌ ‌పార్టీ మద్దతుతో టంగుటూరు ప్రకాశం ముఖ్యమంత్రిగా కర్నూలులో మొదటి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరింది. ఏడాది తిరగకముందే లచ్చన్న మద్దతు ఉపసంహరించి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాడు. 1955లో మధ్యంతర ఎన్నికలు అవసరమైనాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మధ్యంతర ఎన్నికలవి. కాంగ్రెసు, కమ్యూనిస్టుల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ నడిచింది. భారతీయ జనసంఘ్‌ ‌తొలిసారి ఆంధ్రలో ఎన్నికల బరిలో దిగింది. అయిదుచోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. వాటిలో నెల్లూరు ఒకటి. అభ్యర్థి హిందూమహాసభ మాజీ నాయకుడు, వ్యాపారవేత్త పైడా సుబ్బరామయ్య.

ప్రచారానికి నీలం సంజీవరెడ్డి నెల్లూరు వచ్చి బహిరంగ సభలో ‘‘మహాత్మా గాంధీని చంపి, ఆ చితిలో నుంచి ఈ దీపాన్ని వెలిగించారని’’ విషం కక్కాడు. జనసంఘ్‌ ఎన్నికల గుర్తు ‘దీపం’. ఈ ఎన్నికలలోనే మొదటిసారి పండిట్‌ ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ, దత్తోపంత్‌ ‌ఠేంగ్డే నెల్లూరు వచ్చారు. ఎన్నికల ప్రచారం పూర్తిగా సోమయ్యగారి నేతృత్వంలో నడిచింది. ప్రచారకులతో సహా నెల్లూరు పిలిపించారు. పకడ్బందీ వ్యూహం అమలైంది. గెలవకపోయినా జనసంఘ్‌కు గణనీయంగా ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్టులను అధికారంలోకి రానియ్యకూడదనే ఉద్దేశంతో ఓటర్లు కాంగ్రెసు వైపు మొగ్గుచూపారు.

వాడరేవు సమావేశాలు: 1954లో సంఘ వ్యవస్థలో తెలంగాణ జిల్లాలు, ఆంధ్ర కలిపి ఒకే ప్రాంతమైంది. అంతకుముందు హైదరాబాదు రాష్ట్రం కర్ణాటకతో కలిసి ఉండేది. 1954లో బందరులో అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌మొదటి ఒటిసి జరిగింది. ఈ మార్పుల కారణంగా ఆంధ్ర నుంచి ప్రచారకులను తెలంగాణకు పంపడం ప్రారంభమైంది. నెల్లూరు నుంచి కొచ్చి కృష్ణమూర్తి వరంగల్‌కు ప్రచారక్‌గా వెళ్లారు. కొచ్చి కృష్ణమూర్తి నా క్లాసుమేట్‌. ‌దేశ్‌పాండేగారికి ఖమ్మం జిల్లా కూడా అప్పగించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలు కమ్యూ నిస్టుల కంచుకోటలు. ఖమ్మం శాఖపై కమ్యూనిస్టులు దాడిచేశారు. దేశ్‌పాండే గారికి కూడా దెబ్బలు తగిలాయి.

1957లో సోమయ్యగారి క్షేత్రాన్ని విస్తరించారు. నెల్లూరుతో పాటు గుంటూరు కూడా అప్పగించారు.
అవిభక్త ఆంధప్రదేశ్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌చరిత్రలో 1958 అక్టోబరులో చీరాల దగ్గరి వాడరేవులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. 10 రోజలపాటు జరిగాయి. 100-120 మంది పాల్గొని ఉంటారు. సర్‌కార్యవాహ (జనరల్‌ ‌సెక్రటరీ) ఏకనాథ్‌ ‌రానడే 10 రోజులు ఉండి మార్గదర్శనం చేశారు. కాకినాడ కార్యవాహగా నేను కూడా పాల్గొన్నాను. ఎవరెవరు ఏమి మాట్లాడారో మినిట్స్ ‌తయారు చేసేపని నాకప్పగించారు.
1959 వేసవిలో బందరులో జరిగిన ఒటిసి నిర్వహణను సోమయ్యగారే పర్యవేక్షించారు. ఆ ఒటిసిలో నేను బౌద్ధిక్‌ ‌విభాగ్‌లో ప్రబంధక్‌గా ఉన్నాను. 1959 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో సోమయ్యగారిని ప్రాంత ప్రచారక్‌గా ప్రకటించారు. ఆ తర్వాత జాగృతి సంపాదక విభాగంలో పనిచేసేందుకు నేను విజయవాడలోనే ఉండిపోయాను.

సోమయ్యగారికి ప్రాంత ప్రచారక్‌ ‌బాధ్యత అప్పగించడం వెనుక వారి ప్రజ్ఞాపాటవాలు, సామర్థ్యం ప్రధాన కారణం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మరొక కోణాన్ని గుర్తించాలి. ఆర్‌.ఎస్‌.ఎస్‌.‌లో ఒక వర్గానిదే ఆధిపత్యమని ఒక అపవాదు ఉంది. ఆ అపవాదును తొలగించడం మంచిదని కేంద్ర నాయకత్వం భావించి ఉండవచ్చు.

గోదావరిలో లాంచీ ప్రయాణం: సోమయ్యగారూ నేనూ కలిసి రోజంతా గడిపిన సందర్భాల్లో రెండవది ముందే ప్రస్తావించాను. అది వారు ప్రాంత ప్రచారక్‌ ‌బాధ్యత నుంచి తప్పుకొంటున్న సంవత్సరం – 1989. మొదట సందర్భం సరిగ్గా 30 ఏండ్ల ముందు. వారు ప్రాంత ప్రచారక్‌గా బాధ్యతలు స్వీకరించిన సంవత్సరం – 1959. ఇలా కాకతాళీయంగానే జరిగింది. అప్పుడు నేను కాకినాడలో లెక్చరర్‌గా ఉన్నాను. పాపికొండల మధ్య గోదావరి ఎంతో రమణీయంగా ఉంటుందని, ఆ దృశ్యం చూడాలనే కోరిక నాకు హైస్కూలు రోజులనుంచి ఉండేది. సోమయ్యగారిని కూడా పురమాయించాను. 1959 మార్చిలో రైళ్లులో ఇద్దరం భద్రాచలం చేరుకున్నాం. సాయంకాలమైంది. భదాద్రి దేవాలయం సత్రంలో ఆ రాత్రి గడిపాం. మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకొన్నాం. వారు ఎక్కువగా గుళ్లకు వెళ్లేవారుకాదు. పూజ్య గురూజీ కూడా అంతే. మార్చి నెల అయినా ఆ రోజుల్లో గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండేది. ఎగువన ప్రాజెక్టులేవీ అప్పటికి నిర్మాణం కాలేదు. ఉదయం 11 గంటలకు లాంచీలో బయలుదేరాం. సాయం కాలానికి రాజమండ్రి చేరగలమనుకొన్నాం. కాని పోలవరం చేరేసరికే బాగా చీకటిపడింది. లాంచీ ఆపేశారు. ఆ రాత్రి గోదావరి ఇసుక దిబ్బలమీద పడుకున్నాం. అదొక మధురానుభూతి. ఈ రెండు రోజుల్లోను ఎన్నో విషయాలు మాట్లాడుకొంటూ వచ్చాం. నేను పోస్టుగ్రాడ్యూయేషన్‌ ‌పూర్తిచేసిన మొదటి సంవత్సరం అది. మాథమాటిక్స్‌లో రిసెర్చి చెయ్యాలనే కోరిక నాకు బలంగా ఉండేది. జీవితం యాంత్రికంగా గడపాలని లేదు. జర్నలిజం వైపు వెళ్లితే ఎలా ఉంటుందని కూడా ఉండేది. ఈ మానసిక సంఘర్షణను వారి ముందు ప్రస్తావించాను. ‘‘మనం జీవితం ఎలా గడపాలో సంఘం చెప్పింది కదా! నీలో ఈ సంఘర్షణ ఎందుకు వచ్చింది?’’ అంటూ ‘‘జీవితంలో ఏదో పెద్దగా సాధించాలనుకోవడం అహంకారమౌతుంది’’ అన్నారు. నాకా వ్యాఖ్య నచ్చలేదు. మౌనంగా ఉండిపోయాను. ఇద్దరిదీ చిన్న వయసే. ఏది అహంకారమో కాదో నిర్ణయించే వయసులు కావు.

ఇద్దరం కలిసి ప్రయాణం చేసిన ఒకటి రెండు సందర్భాలు ప్రస్తావిస్తాను. నేను విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తున్నాను. పగటి పూట ప్రయాణం. రైలు పేరు జ్ఞాపకం లేదు. అదే బోగీలో ఖమ్మంలో సోమయ్యగారు ఎక్కారు. ఖమ్మం స్టేషన్‌ ‌నుంచి రైలు బయలుదేరగానే వారు జేబు తడుముకొని ‘‘అరె, టికెట్‌ ఇవ్వడం మర్చిపోయారు’’ అన్నారు. అది స్లీపర్‌ ‌కోచ్‌. ‌రైలు స్టేషన్‌కు వారి వెంబడి వచ్చిన స్థానిక ప్రచారక్‌ ‌టికెట్‌ ఇవ్వడం మర్చిపోయాడు. అది ఎస్‌టిడిలు సెల్‌ఫోన్‌లు లేని రోజులు. ‘‘టిటిఇతో మాట్లాడతాను. అవసరమైతే పెనాల్టీ కడతాను లెండి’’ అని చెప్పి ప్రక్కబోగీలో ఉన్న టిటిఇ దగ్గరకు వెళ్లి జరిగిన పొరపాటును గురించి, వారిని గురించి చెప్పాను. పెనాల్టీ కట్టమంటే కడుతానన్నాను. అందుకు ఆ టిటిఇ ఇచ్చిన సమాధానం ఒకవైపు ఆశ్చర్యాన్ని, మరొకవైపు ఆనందాన్ని కలిగించాయి. ‘‘ఏం సార్‌, ‌నీతి నిజాయితీకి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌మారుపేరు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌వారు అబద్ధం చెపుతారా? మీరెళ్లి కూర్చోండి. నేను వస్తాను’’ అన్నాడు. కాసేపటికి మా దగ్గరకు వచ్చి సోమయ్యగారికి నమస్కారం పెట్టాడు. తనను పరిచయం చేసుకొన్నాడు. ‘‘నేనూ కొన్నాళ్లు శాఖకు వచ్చానని’’ చెప్పాడు. వారిస్తున్నా వినకుండా స్నాక్స్, ‌కాఫీ తెప్పించాడు. సికిందరాబాదు చేరిన తర్వాత, వెంట ఉండి, వారి బ్రీఫ్‌కేసు తానే మోస్తూ, ‘ఎక్జిట్‌’ ‌ద్వారంవరకు వచ్చి సాగనంపారు. సమాజంలో సర్వేసర్వత్రా అంతటి అభిమానాన్ని, గౌరవాన్ని, విశ్వాసాన్ని నిర్మించుకోడానికి ఎంత తపస్సు చేసి ఉండాలి?

‌డాక్టర్జీ శతజయంతి ఉత్సవాల్లో సోమయ్యగారు (ఎడమ నుంచి మొదటి వ్యక్తి)

1973 జూన్‌ 6‌న పూజ్య గురూజీ తుదిశ్వాస విడిచారు. సర్‌కార్యవాహ బాలాసాహెబ్‌ ‌దేవరస్‌ అప్పు‌డు హైదరాబాదులో ఉన్నారు. 7వ తేదీ ఉదయం 7గంటలకు ఫ్లైట్‌లో వారు, సోమయ్యగారు నాగపూర్‌ ‌వెళ్లారు. వారితోపాటు ఏడెనిమిది మంది స్వయంసేవకులు కూడా వెళ్లారు. నేనూ వెళ్లాను. విమానాశ్రయంలో, విమానంలో ఎవ్వరు ఏమి మాట్లాడుకోలేదు. అందరి గుండెలు బరువెక్కి పోయాయి. మహాద్రష్ట అస్తమించారు. అందరం కలిసే హెడ్గేవార్‌ ‌భవన్‌కు వెళ్లాం. పూజ్యగురూజీ పార్థివ దేహం చూచేసరికి అందరి కండ్లు చెమ్మగిల్లాయి. సమాజాన్ని తట్టిలేపిన ఒక చైతన్యమూర్తి అచేతనంగా ఉన్నాడు. భారత చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేపిన మహానేత ఇక లేడనే వాస్తవాన్ని స్వయంసేవకులు జీర్ణించుకోలేని క్షణాలవి. సోమయ్యగారు ప్రాంత ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరంలో ఒక రకమైన సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తే, తర్వాతి సంవత్సరాలలో మరొక రకమైన సమస్యలు ఎదురైనాయి.

1959లో మొట్టమొదటగా వారికి ఎదురైన సమస్య సంఘ ఆర్థిక పరిస్థితి. ఏమీ బాగాలేదు. దయనీయంగా ఉండేది. సంస్థను నడుపుకోడానికి కనీసపు ఆర్థిక వనరులు కూడా లేవు. గురుదక్షిణ ఎంతమాత్రం సరిపోయేది కాదు. అప్పులు చెయ్యవలసి వచ్చేది. వారు ముందుగా చిన్న చిన్న ‘‘చేబదుళ్ల’’ను తీర్చి వేయదలచుకొన్నారు. మద్రాసు వెళ్లారు. కావలి స్వయంసేవక్‌ ‌రామరాఘవరెడ్డి మద్రాసులో స్ధిరపడ్డాడు. ఆయనది మైకా గనులున్న ఒక సంపన్న కుటుంబం. అతని వద్ద రూ. 10,000 అప్పుగా తీసుకొని, చిన్న చిన్న బాకీలు తీర్చేశారు. కొన్నాళ్ల తర్వాత రామరాఘవరెడ్డి అప్పుకూడా తీర్చేశారు. రాష్ట్రశాఖ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది, గాడినపెట్టడం వారు ఎదుర్కొన్న మొదటి సవాలు.

ప్రాంత ప్రచారక్‌గా సోమయ్యగారి ముందుకొచ్చిన మరొక సమస్య తెలంగాణలో సంఘ విస్తరణ. పోలీసు చర్య తర్వాతే పాత హైదరాబాదు సంస్థానంలో శాఖలు ప్రారంభమైన్నాయి. కోస్తా జిల్లాలనుంచి చాలామంది ప్రచారకులను వారు తెలంగాణాకు జిల్లా ప్రచారకులుగా పంపారు. మెదక్‌కు భాన్‌సింగ్‌, ‌మహబూబ్‌నగర్‌కు పి.సి. రమణయ్య, నల్లగొండకు మొదట నందిగాం రామ్మూర్తి, తర్వాత ఇ.సి. రామ్మూర్తి ఆవిధంగా పంపించిన వారిలో కొందరు. ప్రచారకులు కాని కొందరు కార్యకర్తలను కూడా తెలంగాణాకు వెళ్లి సెటిల్‌ ‌కావలసిందిగా ప్రోత్స హించారు. నేను పోస్టుగ్రాడ్యుయేషన్‌ ‌చెయ్యడానికి ఉస్మానియా యూనివర్సిటీలో చేరడానికి వారి ప్రోత్సాహమే కారణం.

ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉండేవి. శాఖలు ప్రారంభించడం ఎంతో కష్టంగా ఉండేది. కమ్యూనిస్టు గుండాలు స్వయంసేవకులపై భౌతిక దాడులు జరిపేవారు. కాంగ్రెసు ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరించేది. అలాంటి భౌతిక దాడి సోమయ్య గారిపై కూడా జరిగింది. నల్లగొండ జిల్లా తిరుమల గిరిలో శాఖ ప్రారంభమైంది. స్వయంసేవకుల సంఖ్య వృద్ధి చెందింది. 1963లో తొండగ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి సోమయ్యగారు వెళ్లారు. సోమయ్యగారు వస్తున్నారని ముందే తెలుసుకున్న కమ్యూనిస్టులు ఒక జిల్లా స్థాయి నాయకుడి ఆధ్వర్యంలో శాఖపై కర్రలతో, ఇనుపరాడ్స్‌తో దాడిచేశారు. సంఘస్థాన్‌లో సోమయ్యగారు ఒక్కరే మిగిలిపోయారు. క్రిందపడిపోయారు. చేతులతో తలను కాపాడుకొంటున్నా విపరీతంగా కొట్టారు. చనిపోయాడని భావించి వదిలేసి వెళ్లిపోయారు. ఆ సందర్భంలో తను అనుభవించిన వేదనను గురించి సోమయ్యగారు ఎన్నడూ ఎక్కడా ప్రస్తావించలేదు.

‘‘విశాఖ ఉక్కు’’ ఉద్యమం సంఘాన్ని ఇబ్బంది పెట్టలేదు. 1969 తెలంగాణ ఉద్యమం కూడా అంత పెద్దగా సంఘానికి నష్టం కలిగించలేదు. కాని 1971-72 జై ఆంధ్ర ఉద్యమం సంఘాన్ని ఇర కాటంలో పెట్టింది. సమర్ధుడైన భోగాది దుర్గాప్రసాద్‌ (‌విభాగ్‌ ‌ప్రచారక్‌) ‌లాంటి వారిని కోల్పోయింది. 1967లో నాకు సోమయ్యగారు విద్యార్థి పరిషత్‌ ‌బాధ్యత అప్పగించారు. అప్పటికి నా పిహెచ్‌డి పూర్తయింది. ఐఐటి నుంచి వెనక్కు వచ్చేశాను. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ఇంజనీరింగ్‌, ‌మెడికల్‌ ‌కాలేజీల్లో నక్సలైటు ఉద్యమం కూడా ప్రారంభమైంది. దాదాపు 25 సంవత్సరాల పాటు విద్యార్థి పరిషత్‌, ‌రాడికల్స్‌తో నిత్యసంఘర్షణ చేయవలసి వచ్చింది. నేనెంతో ఒత్తిడికి గురౌతుండే వాడిని. వ్యక్తిగతంగా నాకేమైన అవుతుందేమోననే భయం వారికి ఉండేది. వ్యక్తిగత భద్రతపై నేను దృష్టి పెట్టలేదు. అలాంటి భావం వస్తే సంస్థను నడపడం సాధ్యం కాదు. విద్యార్థి పరిషత్‌కు సంబంధించినంత వరకు నిర్ణయం పూర్తి బాధ్యత నాదే. కాని వారికి విషయాలు తెలియజేస్తుండే వాడిని. 1975 జనవరిలో ఉస్మానియా మెడికల్‌ ‌కాలేజి హాస్టల్‌లో ఎబివిపి కార్యకర్త యం. పుల్లారెడ్డిపై ఒక దళం కాల్పులు జరిపింది. గురి తప్పి బుల్లెట్‌ ‌చెవి ప్రక్క భాగాన్ని తాకుతూ వెళ్లింది. అంతకుముందు ఒకసారి పుల్లారెడ్డిపై హాకీస్టిక్స్‌తో దాడి చేశారు. గాయాలైనాయి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు కార్యకర్తల్లో మనోనిబ్బరానికి భంగం కలుగకుండా చూడటం సామాన్యమైన విషయం కాదు. క్రమంగా వారికి సమస్య తీవ్రత అర్థమౌతూ వచ్చింది. 1981 నుంచి విద్యార్థి పరిషత్‌ ‌కార్యకర్తలు బలైపోవడం ప్రారంభమైంది. 1987లో ప్రాంత కార్యవాహ ముదుగంటి మల్లారెడ్డిగారి కుమారుడు జితేందర్‌ను నక్సల్స్ ‌జగిత్యాల సమీపంలో కాల్చి చంపారు. జగిత్యాలలో జరిగిన సంతాపసభలో సోమయ్యగారు ఉత్తేజపూరిత ప్రసంగం ద్వారా కార్యకర్తలలో మనోధైర్యాన్ని నింపారు.

తల్లి అంత్యక్రియలు: సోమయ్యగారు తల్లిని చూడటానికి సంవత్సరాని కొకసారి కూడా వెళ్లేవారు కాదు. తల్లిని గురించి నాతో ఒక్కసారి కూడా ఏమీ చెప్పలేదు. ఆమె చనిపోయిన తర్వాత తెనాలి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెది రూ. 40,000 నగదు ఉంది. ఆమె బాగోగులు చూసిన కార్యకర్తకు ఆ డబ్బు నుంచి పంచలు కొనిచ్చానని చెప్పారు. మిగిలినది నూతక్కి స్కూలుకు విరాళంగా ఇచ్చేశారు.

‘‘మంచాన పడకుండా వెళ్లిపోవాలని ఉంది శేషూ!’’ అని నాతో అంటుండేవారు. ‘‘ఏమిటండి ఆ మాటలు’’ అని వారిస్తుండేవాడిని. చివరి సంవత్స రాలలో వారిలో ఏదో ఆవేదన. నాతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడేవారు. వారితో నేను గడిపిన క్షణాలు ఎన్నెన్నో!
ఏం పాపం చేశాడని ఆ మహానుభావుడి జీవితాన్ని విధి అకస్మాత్తుగా తీసుకెళ్లింది? ఆ సమయంలో ఆత్మీయులెవరూ లేకుండా ఎందుకలా జరిగింది?

1995 జూలై 25 మద్రాసు నుంచి కేరళకు రైళ్లలో ప్రయాణం చేస్తూ ప్రమాదవస్తూ మరణించారు. జూలై 26 ఉదయం కేరళ పత్రికలు గుర్తు తెలియని వ్యక్తి శవం ఆల్వాయ్‌ ‌స్టేషన్‌ ‌ప్లాట్‌ఫారం మీద పడి ఉందని ఒక ఫోటో ప్రచురించాయి. అది సోమయ్యగారిదని గుర్తుపట్టిన స్వయంసేవకులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 27వ తేది రాత్రికి విమానంలో వారి పార్థివదేహం హైదరాబాద్‌కు చేరింది. అంబరుపేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. మేరుశిఖరమంత ఎత్తు ఎదిగిన త్యాగమూర్తికి, తపోధనుడికి, ధన్యజీవికి ఏమి నివాళినర్పించగలం?

‌ప్రొఫెసర్‌ ‌యస్‌.‌వి.శేషగిరిరావు : విశ్రాంత ఆచార్యులు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యార్థి పరిషత్‌ ‌ప్రారంభకుల్లో ఒకరు. ఏబీవీపీ జాతీయ ఉపాధ్యక్షులు,
రచయిత, ప్రస్తుతం కేరళ సెంట్రల్‌ ‌యూనివర్సిటి చాన్స్‌లర్.

సేకరణ: జాగృతి వారపత్రిక

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. మహనీయులు మాననీయ సోమయ్య గారికి అశ్రుతంజాలి.

    ReplyDelete