Type Here to Get Search Results !

గొప్ప శివ భక్తుడు పూసలార్ - The Story of Poosalar Nayanar - megaminds


పూసలార్ అనే సాధువు ఎంతో పేదరికంలో ఉండేవాడు. కానీ ఈయన శివునికి ఒక అద్భుతమైన గుడి కట్టాలని కోరుకునేవాడు. ఈయన ప్రతిరోజూ తన మనసులో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ, ఈ ఆలయ నిర్మాణం కొనసాగించాడు. ఇది ఒక అంతర్ముఖమైన చర్య. కొన్నాళ్ళ తరువాత, ఆ ప్రదేశంలోని రాజు కూడా అక్కడ ఒక పెద్ద శివాలయం కట్టాలని సంకల్పించాడు. ఏ రోజైతే రాజు ఆ శివాలయానికి ప్రారంభోత్సవం చేయాలని అనుకున్నాడో; ఆ క్రితం రోజున శివుడు రాజుకి కలలో కనబడి, “నేను రేపు నీ ఆలయానికి రాలేను. ఎందుకంటే పూసలార్ కూడా ఒక ఆలయం కట్టుకున్నాడు...ఇదే ప్రాంతంలో. నేను ఆ ఆలయానికి వెళ్ళాలి. అతను కూడా రేపే దానిని ఆవిష్కరిస్తున్నాడు” అని చెప్పాడు.

రాజు ఎంతో భయంతో నిద్రలేచాడు. ఈయన ఈ ఆలయ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలుగానో ఎంతో కష్టపడ్డాడు. ఎంతో డబ్బు వెచ్చించాడు. ఎంతో శ్రమ పడ్డాడు. కానీ, శివుడు ఇప్పుడు మరో ఆలయానికి వెళ్తానని చెప్తున్నాడు. అదే నగరంలో అనీ, ఆ ఆలయం పూసలార్ కట్టిందని చెప్తున్నాడు. ఎవరీ పూసలార్..? నాకు తెలియని ఈ ఆలయం ఏమిటి..? అని ఆయన ఆశ్చర్యపోయాడు. పూసలార్ ఎవరో కనుక్కురమ్మని ఆయన తన సైన్యాన్ని పంపించారు. వారు ఒక పేద గుడిసలో పూసలార్ ని చూశారు. ఆ రాజు “నీ ఆలయం ఏది ?” అని పూసలార్ ని బెదిరించాడు. నేను కట్టుకున్న ఆలయం నా హృదయంలోనే” అని పూసలార్ దానికి సమాధానం చెప్పాడు.

దక్షిణ భారత దేశంలోని ఈ కథ, మనకి ఒక విశిష్టమైన సత్యాన్ని చెప్తుంది. అదేమిటంటే, భక్తి పారవశ్యంగా పొంగి పొరలినప్పుడు, దివ్యత్వం అనేది తానుగా వచ్చి మీకు సహకరిస్తుంది. మానవత్వం, దివ్యత్వం అనేవి రెండూ వేర్వేరు కాదు. ఇక్కడ, కవి బసవన్న ఒక అద్భుతమైన వాక్యాన్ని రాస్తారు "కదిలే ఆలయాలే ఎప్పటికీ ఉండేవి " అని.
దైవంతో మమేకమవ్వడమే భారతీయ సంస్కృతి.

మన భారత సంస్కృతిలోని విభిన్న సంప్రదాయం ఏమిటంటే, మనం భగవంతుడికి ప్రార్థన చేయాలనుకోము. మనం మనలోనే ఈ పవిత్రత తెచ్చుకోవాలి అనుకుంటాం. మనం దివ్యత్వాన్ని ఆరాధించాలి అనుకోం, మనం దివ్యత్వంతో ఒక్కటైపోవాలి అనుకుంటాం. బహుశా ఇటువంటి ఆధ్యాత్మిక సంప్రదాయం మన దేశంలోనే ఉందేమో..! భగవంతుడే అంతిమ లక్ష్యం అని చెప్పని ఆధ్యాత్మికత – ఇది మనం ప్రపంచానికి అందించిన ఎనలేని కానుక. ఎందుకంటే, ఈ రోజున ప్రపంచమంతా కూడా భగవంతుడికి వాళ్ళు ఇచ్చుకున్న నిర్వచనాలని బట్టి, ఎంతో సంఘర్షణలో వుంది.

నాకు ఒకసారి ఎవరో చెప్పారు, “నేను భగవంతుడిని నమ్మను “ అని. “నిజంగానా...? నేను ఆ విషయాన్ని కూడా నమ్మను” అని చెప్పాను. మనకి ఈ సంస్కృతి ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చింది. మనం భగవంతుడిని నమ్మాలనుకుంటే.. నమ్మవచ్చు. అక్కర్లేదనుకుంటే..నమ్మక్కర్లేదు. మీకు ఇప్పుడున్న భగవంతుడు రుచించకపోతే మీరు మీకు కావలసిన భగవంతుడిని సృష్టించుకోవచ్చు. మనం చివరిసారిగా లెక్కబెట్టినప్పుడు, ముప్ఫైమూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు. మనం ఒక చెట్టులోనో, ఒక రాయిలోనో, ఏనుగులోనో – ఎందులో భగవంతుడిని చూసినా సరే ... అదేమీ విచిత్రం కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి అణువు, ప్రతి రేణువు కూడా దివ్యత్వం కలిగిందే. భగవంతుడు అంటే ఏదో మనం ఊహాజనితంగా తయారు చేసుకున్న బొమ్మలు కాదు. దీన్ని మనం ప్రాణప్రతిష్టకు సంబంధించిన శాస్త్రంగా; దివ్యత్వాన్ని తయారు చేసే శాస్త్రంగా పరిణమింపచేశాం. మన దేవుళ్ళు, దేవతల విగ్రహాలను మనం సాధారణంగా యంత్రాలు అంటాం.

యంత్రాలు మన జీవితాన్ని పెంపొందించడానికి ఎన్నో విధాలుగా ఉపకరిస్తాయి. భగవంతుడిని నేను యంత్రం అన్నప్పుడు భక్తులకి ఒక్కొక్కసారి అది నచ్చదు. కానీ, నిజానికి ఈ సంప్రదాయంలోని అంతః సత్యం ఇదే. అది కేవలం భక్తిని ఒక సాంకేతికతగా మాత్రమే కాదు, భగవంతుడిని ఒక యంత్రంగా చూడగల ధైర్యం కలది. భగవంతుడు మీ అంతిమ లక్ష్యానికి, ముక్తికి ఒక సోపానం మాత్రమే. మీ ముక్తిని మీరు ఎలా చేరుకుంటారు - దేవుడితోనా..? దేవుడు లేకుండానా..? - అన్నది మీ ఇష్టం. కానీ మీ అంతిమ లక్ష్యం - ముక్తి. స్వేచ్ఛ. ఇది మీ నమ్మకాల నుంచి, మీ సిద్ధాంతాల నుంచి స్వేచ్ఛ. -సద్గురు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.