శిశువులు మూడునెలలు వచ్చేవరకు రోజులో కనీసం 18-20 గంటలైనా విడతలవారిగా నిద్ర పోతారు. మధ్యమధ్యలో పాలు తాగటానికి లేవటం, మళ్లీ పడుకోవటం.. ఇలా ఉంటుంది వాళ్ల నిద్రశైలి. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అవసరం తగ్గుతుంది. మూడు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు రోజులో 14-15 గంటలు నిద్రపోతారు. 2-4 ఏళ్ల వయసు పిల్లలు రోజులో సుమారు 12 గంటలు నిద్రపోతారు. స్కూలుకెళ్లే వయసు (5-9 ఏళ్లు) పిల్లలు కనీసం 10-12 గంటలైనా నిద్రపోవాలి. యుక్తవయసు వచ్చేసరికి పిల్లల్లో నిద్ర అవసరం తగ్గినా, కనీసం 9 గంటలైనా పడుకోవాలి. ఇక యుక్తవయసు దాటిన పెద్దవాళ్లు రోజులో 6-8 గంటలు పడుకున్నా సరిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో పగటినిద్ర తగ్గినా ఏడాది వయసు పిల్లలు పగటివేళ కనీసం మూడు గంటలైనా నిద్రపోతారు. మిగతా పదీ పదకొండు గంటలు రాత్రివేళలో పడుకుంటారు.
కానీ, ఈ రోజుల్లో పసి వయస్సు నుంచే ప్లే స్కూలు, కె.జి.తరగతులకు వెళ్ళే పిల్లలకు నిద్ర చాలు తోందా అని ఆలోచించాలి. ఎందుకంటే, పిల్లలను చేర్పించిన పాఠశాల దూరంగా ఉండటం, పిల్లలను స్కూలుకు తీసుకెళ్ళే వాహనం త్వరగా రావడం లాంటి కారణాలవల్ల పిల్లలు ఉదయం చాలా తొందరగా నిద్ర లేవవలసి వస్తోంది. అందు వల్ల, వారి నిద్రా సమయం తగ్గుతోంది. అంత చిన్న వయస్సులో సుఖంగా నిద్రపోకుండా, బలవంతాన లేచి పాఠశాలలకు వెళ్ళే పిల్లలను చూస్తూంటే, ఈ వయస్సు నుంచే పిల్లలకు చదువు అవసరమా అనిపిస్తుంది. మధురమయిన బాల్యానికి పిల్లలు దూరమయి పోతున్నారని ఎంతో ఆవేదన కలుగుతుంది.
పూర్వం పిల్లలు రాత్రి 8 గంటలకల్లా నిద్రపోయి, ఉదయం 7 గంటలకు లేచేవారు. వారు ఎంతో చురుకుగా, హుషారుగా, ఆరోగ్యంగా ఉండేవారు. అయితే, ఈ రోజుల్లో చిన్నారులు కూడా పెద్దలతో సమానంగా, పది పదకొండు గంటలవరకూ పడక చేరటంలేదు. ఉదయమే పాఠశాలకు వెళుతుండటంతో నిద్ర చాలక, పిల్లలలో నిద్రలేమి ఏర్పడు తోంది. నిద్రలేమి ప్రభావం పిల్లల శారీరక ఆరోగ్యం మీద, మేధాశక్తి మీద కూడా ప్రసరిస్తోంది.
నిద్రలేమికి గురయ్యే పిల్లలు చురుకుగా, ఉత్సా హంగా ఉండలేరు. మెదడు పాఠాలను అర్థం చేసుకోలేదు. ఉపాధ్యాయులు చెప్పే విషయం నిద్రలేమికి గురయిన పిల్లల బుర్రకు ఎక్కదు. నిద్రలేమివల్ల బద్ధకంగా ఉంటుంది. ఏకాగ్రత లోపించి పోతుంది. చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతుంది. వారిలో ఉండే సహజ తెలివి తేటలు కుంటుపడుతాయి. అంతేకాదు, నిద్రలేమికి గురయిన పిల్లలలో స్థూలకాయం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలుపు తున్నారు.
పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా, కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలు మధ్యలో నిద్రలేస్తున్నారా? లేస్తే మళ్లీ పడుకోబెట్టటానికి కష్టమవుతోందా? పొద్దున్నే వేళకు లేవటం లేదా? అనేవి ముఖ్యం. సరిగా నిద్రపోని పిల్లల్లో చికాకు కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ నాణ్యమైన నిద్ర లేకపోతే, పొద్దున లేవటానికి కూడా ఇబ్బందులుంటాయి. పదిపన్నెండేళ్ల వయసు పిల్లలు త్వరగా పడుకోరు. రాత్రి పన్నెండు గంటలదాకా కంప్యూటర్ గేమ్స్, టీవీలు, సినిమాలు చూడటం వంటివాటిలో గడిపేస్తారు. ఇవన్నీ నిద్ర నాణ్యతను దెబ్బతీసేవే. కొంతమంది నిద్ర మధ్యలో తరచూ లేచి ఏడు స్తుంటారు. ఇలాంటివారిలో నాణ్యమైన నిద్ర లేకపోవటం వల్ల పగలు నిద్రపోవాల్సిన అవసరం తలెత్తుతుంది. ఫలితంగా తరగతి గదిలో కునికిపాట్లు, పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవటం, నేర్చుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి, విషయగ్రాహ్య శక్తీ తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్లో కోపం, అతిగా ప్రవర్తించటం వంటివి ఎక్కువవుతాయి. ఇవన్నీ ప్రవర్తన సంబంధ సమస్యలు.
టి.వి.ని చూడనివ్వకూడదు. వీడియో గేమ్‌లు ఆడవద్దని హెచ్చరించాలి. అంతేకాదు, టివిలో హారర్ సినిమాలు, భయానక దృశ్యాలు చూస్తే, ఆ ప్రభావం మెదడు మీద ప్రసరించి, ఆ భయం పిల్లలను నిశ్చింతగా నిద్రపోనివ్వదు. అందువల్ల, పెద్దలు పిల్లల నిద్ర విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం ఎంతయినా అవసరం.
తమ పిల్లలు నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నారంటూ తల్లిదండ్రులు వైద్యుల్ని సంప్రదించి నప్పుడు పిల్లల నిద్ర అలవాట్లకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటారు. రాత్రివేళ మధ్యలో నిద్ర లేస్తున్నారా? స్కూల్లో మార్కులెలా వస్తున్నాయి? పగటి వేళల్లో నిద్రపోతున్నారా? అలర్జీలేమైనా ఉన్నాయా? ఏవైనా దీర్ఘకాలిక జబ్బులున్నాయా? మెదడు ఎదుగుదల ఎలా ఉంది? వంటివన్నీ పరిశీలిస్తారు. రాత్రివేళ నోరు తెరిచి పడుకుంటు న్నారా? గురక శబ్దాలు వస్తున్నాయా? వంటివీ గమనించాలి. ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయను కుంటే.. ఇవన్నీ కొద్దిరోజులు ఉండి తగ్గేవేనా, దీర్ఘకాలం వేధిస్తాయా? అనేది విశ్లేషిస్తారు. ఆయా కారణాలను బట్టి వారిచ్చే సలహాలు, జీవనశైలిలో చిన్నచిన్న మార్పుల ద్వారా సమస్యను అధిగమించ వచ్చు. ఏవైనా జబ్బులు ఉంటే వాటికి చికిత్స చేస్తే, చాలా వరకు నిద్ర సమస్యలు సర్దుకుంటాయి.
పిల్లలు రాత్రి సమయం ఎక్కువసేపు మెలకువగా ఉండకుండా, ఎనిమిది, తొమ్మిది గంటల లోపుగా పడుకోబెట్టాలి. పిల్లలకు ఆసక్తికరమయిన విషయాలను కథలుగా చెప్తూ, వారి మనస్సును రంజింపచేసే కబుర్లు చెప్తూ వారిని తొందరగా నిద్రపుచ్చాలి. పాఠశాల యాజ మాన్యంకూడా పిల్లలమీద చదువు భారాన్ని అతిగా మోపకూడదు. పిల్లల ఆటలకూ, నిద్రకూ, విశ్రాంతికీ సమయం లభించేలా చూడాలి. పిల్లలు సుఖంగా నిద్ర పోయేందుకు చదువు అవరోధం కాకూడదు. – అనూరాధ, జాగృతి వారపత్రిక.