వ్యాస పూర్ణిమ విశిష్టత - మన బాధ్యత - vyasa purnima in telugu

గురుర్బ్రహ్మ గురుర్విష్ణ్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల అంశే గురువు. పరబ్రహ్మ స్వరూపమైన గురుదేవులను భక్తితో సేవించి తరించమని బోధించినది మన సంస్కృతి. భగవంతుని సేవించి ముక్తిని పొందగల దారి చూపగలిగేది గురువు మాత్రమే. కనుక భగవంతుడు, గురువు ఒకేసారి ఎదురైతే, గురువుకే ప్రథమ నమస్కారం సమర్పిస్తామన్నారు సాధు పురుషులు. అనాదిగా భారతజాతి వ్యాస భగవానుని జయంతి ‘ఆషాఢశుద్ధ పూర్ణిమ’ను ‘గురుపౌర్ణమి’ పర్వదినంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సంప్రదాయాన్ని అలవర్చుకొన్నది.
అనంత జ్ఞానరాశిని లోకహితార్థమై క్రమపద్ధతిలో నాలుగు వేదములుగా కూర్చి మానవాళికి ప్రసాదించినది కృష్ణద్వైపాయనుడే. పంచమవేదంగా పేరొందిన మహాభారతం, 18 పురాణాలు, శ్రీ మద్భాగవతము వారు ప్రసాదించినవే. విశ్వమానవాళికి ఇహ, పర సుఖప్రదాయిని ‘శ్రీమద్భగవద్గీత’ ‘విష్ణు సహస్రనామావళి’ మహాభారతం ద్వారా వారందించినవే. మానవాళి ఆధ్యాత్మికత, భౌతిక ప్రగతికి బంగారు బాట చూపిన లెక్కింపనలవిగాని మహోన్నత గురుపరంపర కలిగి ఉండడం మనకు గర్వకారణం.
పురాణకాలంలో..
లోక కల్యాణార్థం అన్ని లోకాలు సంచరించిన నారదమహర్షి, కరకు బోయవానికి కర్తవ్య ముపదేశించి ‘రామ’ తారక మంత్రమిచ్చి వాల్మీకి మహర్షిగా మార్చి, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జీవనయానాన్ని ‘రామాయణ’ కావ్యంగా జగతికి ప్రసాదింపజేశారు. తపోసాధనకు అడవుల బాట పట్టిన చిన్నారి ధ్రువునికి మంత్రదీక్ష ఇచ్చి, వాసుదేవుని కృపకు పాత్రుని జేసి ఇహలోక సుఖాలతోపాటు నక్షత్ర మండలంలో వెలుగొందే భాగ్యాన్ని కలిగించినదీ నారదుడే. తల్లి లీలావతీ గర్భవాసిగా ఉన్నప్పుడే ప్రహ్లాదునికి విష్ణులీలలను తెలియజేసి, ‘నారాయణ మంత్రోపదేశం’ చేసి నారసింహ రూప నారాయణుని అంకసీమ నలంకరింపజేసి చిరయశస్సును ప్రసాదించినదీ నారదమహర్షే.
త్రిమూర్తుల అంశతో అత్రి, అనసూయా తనయునిగా అవతరించిన ‘దత్తాత్రేయుడు’ చరాచర సృష్టిని గురువుగా భావించి, నేర్చుకోవలసిన జ్ఞానముందని లోకాలకు తెలిపారు. ‘గురుదత్తుని’గా మహాత్ములందరికీ ఆరాధనీయుడై తన అంశతో లెక్కకు మిక్కిలిగా గురుపుంగవులను లోకానికి అందించారు.
– రఘువంశ కులగురువుగా భాసించిన బ్రహ్మర్షి వసిష్టుల వారితో బాల రాముని సద్గోష్ఠియే ‘యోగవాశిష్ఠం’గా యోగులకు సైతం మార్గదర్శకంగా నిలిచింది.
– పుట్టుకతో క్షత్రియుడైనా ప్రచండ తపస్సుతో బ్రహ్మర్షియైన విశ్వామిత్ర మహర్షి గాయత్రి మహామంత్రాన్ని మానవజాతికి వరంగా ప్రసాదించాడు.
చారిత్రక యుగంలో..
– తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థిగా, ఆచార్యునిగా వెలుగొందిన చాణక్యుడు దేశ, ధర్మ రక్షణకోసం చంద్రగుప్తుడిని దీక్షా కంకణధారిగా మలిచి, గణరాజ్యాలను సమైక్యపరచి గ్రీకు దండయాత్రను తిప్పికొట్టి, మగధ సామ్రాజ్యశక్తిని సుస్థిరమొనర్చాడు. నేటికీ ప్రపంచమంతా ప్రామాణిక గ్రంథంగా నిలిచిన ‘అర్థశాస్త్రము’ చాణక్య (కౌటిల్య) విరచితమే.
– గౌతమ బుద్ధుని బోధనలను సరిగా అర్థం చేసుకోక, విదేశీ దురాక్రమణదారులను స్వాగతిస్తున్న వేళ తన శిష్యగణంతో సమాజంలో క్షాత్రశక్తిని పునరుజ్జీవింపజేసి, పుష్యమిత్రునికి అండగా నిలిచి దేశరక్షణకు దారి చూపిన మహనీయుడు పతంజలి మహర్షి.
సాటి మానవుల కష్టాలకు చలించి, తరుణోపాయానికై తపమాచరించి, జ్ఞానియైన సిద్దార్ధుడే గౌతమబుద్ధుడు. ‘కర్మ-జన్మ-మరణ’మనే చక్రాన్ని దాటాలంటే ‘అష్టాంగమార్గం’ ద్వారా ‘నిర్వాణ’ స్థితిని పొందగలరని బోధించారు. మానవులంతా సమానులే, హెచ్చుతగ్గులు లేవు. సోదరులై మెలగండి. ‘అహింసా పరమోధర్మం’ అని చెప్పి విశ్వమానవ ప్రేమను మరోసారి ప్రకటించారు.
– జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు శాంతం, అహింస, ప్రేమ, సత్యం, సేవ, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం’ వంటి అమూల్య గుణాల ప్రాధాన్యాన్ని విశేషంగా ప్రకటించి లోకకల్యాణ కారకుడైనారు.
– బౌద్ధ మతావలంబులు పెడదారి పట్టిన వేళ, సనాతన హిందూధర్మంలో వికృతులు పెరిగినపుడు – అతి చిన్న వయసులో దేశమంతా కాలినడకన తిరిగి, శాస్త్ర చర్చలతో ఆధ్యాత్మిక వేత్తలను మెప్పించి, ఒప్పించి ధార్మిక జీవన జ్యోతిని జ్వలింపచేసినవారు జగద్గురు ఆదిశంకరులు. దేశం నలుచెరగులా పీఠాలను నెలకొల్పి, యోగ్యులకు బాధ్యతనప్పగించి ‘ధర్మప్రచార, ప్రసార, సంరక్షణ కేంద్రాలు’గా నిలిపారు.
– వేయి ఏండ్లకు పూర్వమే అందరిలో గోవిందుని దర్శించమని బోధించి, అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం గావించి, దాస సంప్రదాయాన్ని ఏర్పరచి సామాన్యులను సైతం మోక్షగాములుగా తీర్చిదిద్దిన సమతామూర్తి భగవద్రామానుజులు.
జాతి పరీక్షా సమయం..
తురుష్కుల నెదురొడ్డి పోరు సలుపుతున్నవేళ లక్షలాదిమంది బలవంతంగా మతమార్పిడికి, అత్యాచారాలకు, హత్యాకాండకు గురవుతున్నవేళ హరిహర, బుక్కరాయలను శుద్ధితో తిరిగి హిందువులుగా నిలబెట్టి, విజయనగర సామ్రాజ్య స్థాపనకు పునాది నేర్పరచినవారు విద్యారణ్యస్వామి.
– హిందూ ధర్మగ్లానిని సహింపలేక ధర్మరక్షా కంకణబద్ధుడై దేశాటన చేసి హిందూ యువత ముందు ఆదర్శంగా ధీశాలి హనుమంతుని ఆదర్శంగా నిలిపి రామ రాజ్యస్థాపనకై పరిశ్రమించారు సమర్థ రామదాసస్వామి. హిందూ సామ్రాజ్య స్థాపనకై ధీరోదాత్తంగా పోరు సలుపుతున్న ఛత్రపతి శివాజీకి అండగా సమాజాన్ని నిలిపి, శివరాయననికి గురువై దారి చూపి హిందూ ధర్మధ్వజాన్ని వినువీధులలో రెపరెపలాడించారు.
– హింధూ ధర్మరక్షణ కోసం సింహాలై దూకండి, అని చాటిన ‘ఖాల్సా’ సంప్రదాయాన్ని ప్రారంభించి, అన్ని కులాలవారినీ తరతమ భేదాలు మరచేలా చేసి ముందుకు నడిపినాడు సిక్కుల పదవ గురువు గురుగోవిందసింహుడు.
‘అగ్రేచ చతురో వేద్ణా పృష్టతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి’
ముందుకు సాగుతున్న ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు వెనుక రక్షణా ధనుర్బాణాలతో క్షాత్రశక్తి నిలవాలని శాసించినవారు. బ్రాహ్మ, క్షాత్ర శక్తులతో శపించడానికి శరపంథానికైనా సిద్ధపడాలని సూచించిన ధీరుడు.
ఆధునిక కాలంలో..
అక్షర జ్ఞానం కంటే ఆత్మసాధన ప్రధానమని రుజువు చేసి గృహస్థులను, సన్యాసులను ఆధ్యాత్మిక పథంలో నడిపించినవారు శ్రీరామకృష్ణపరమహంస. సకల జీవరాశిలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడని, సమాజ సేవ అంటే సర్వేశ్వరుని సేవించడమనే స్పృహ కలిగించారు. తాను మాత్రమే మోక్షపథంలో సాగడం కాక, కోట్లాది మందికి మోక్షమార్గం చూపమని వివేకుని ఆదేశించిన మహాత్ములు.
– ‘మానవసేవయే మాధవసేవ’, ‘జగత్తుకు హితం చేకూరుస్తూ స్వీయమోక్షాన్ని సాధించవచ్చు, త్యాగం, సేవ, భారతజాతికి పరమాదర్శాలు, దేశం వేరు, ధర్మం వేరు కాదు’. వివేకానందుని సందేశమిది.
‘మరల వేదాలవైపు మరలుదాం’ అంటూ సమాజ ఐక్యతకు అడ్డుగోడలుగా నిలిచిన కులరీతులను నిరసించి ‘ఆర్యసమాజ’ స్థాపన ద్వారా విదేశీ మతాల కుట్రలకు అడ్డుకట్టవేసిన వారు స్వామి దయానంద సరస్వతి. మతం మారిన హిందువులను వెనుకకు తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘శుద్ధి’ ఉద్యమ ప్రదాత.
– కుల వివక్షతో విసిగి, క్రైస్తవం వైపు చూస్తున్న సోదర హిందువులను సముదాయించి, మతం మారటం పరిష్కారంకాదని – మనం మారటం అవసరం అని బోధించి, శిక్షణనిచ్చిన పుణ్యాత్ములు శ్రీ నారాయణగురు. శూద్రులు సైతం జ్ఞానార్జనతో బ్రాహ్మణులై వెలుగొందగలరని మరల గుర్తుచేసి, ఆ దారిలో సాధన చేయించినవారు.
– హిందూధార్మిక జీవనాన్ని సుసంపన్నం గావించటానికి దేశమంతా తమ పాదయాత్రతో పునీతం గావించి ‘నడిచేదేవుడు’గా పూజలందు కున్నవారు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి.
అరుణాచలాన వెలుగు దివ్వెగా నిలిచి, పశుపక్ష్యాదులలో సైతం భగవంతుని దర్శించి, ప్రేమను పంచినవారు శ్రీరమణమహర్షి. ‘నేను ఎవరు?’ అనేది తెలిస్తే ఆత్మజ్ఞానం లభించినట్లేనని చెప్పినవారు.
విశ్వమానవ శాంతికై పూజ్యగురువుల సందేశా లను అర్థం చేసుకొని మనలను మనం ఉద్ధరంచుకొని ధర్మపథంలో ముందుకు సాగడమే మన విధి.
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
అసత్యం నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుతురు వైపుకు, మృతప్రాయం నుండి అమృత స్థితి ప్రాప్తి కోసం మన పయనం సాగుగాక. కృష్ణం వందే జగద్గురుమ్‌. – పుట్ట శేషు Jagruti

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments