ప్రపంచ కుటుంబ దినోత్సవం - world family day in telugu

ప్రపంచ కుటుంబ దినోత్సవం (15-May) సందర్బంగా భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ప్రాధాన్యత అలాగే తీసుకోవల్సిన జాగ్రతలు. సమాజంలో మానవత్వపు మనుగడ, సాధనలో భారతీయ కుటుంబ వ్యవస్థదే ప్రధాన పాత్ర. భారతీయ కుటుంబాలలో జరిగే కుటుంబ ఉత్సవాలు, పండుగల యొక్క సార్వజనీనత కారణంగా భారతీయ కుటుంబాలు వ్యక్తిని జాతికి అనుసంధానించి, వ్యక్తిలో వసుధైవ కుటుంబకం అన్న భావనను నిర్మాణం చెయ్యడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నేటి నవతరానికి సామాజిక, ఆర్ధిక సంరక్షణకు, క్రమశిక్షణకు అవసరమైన సంస్కారాలను, విలువలను అందించటానికి కుటుంబమే ప్రధాన సాధనం. వైవిధ్యంగా కనిపించే హిందూ సమాజం యొక్క శాశ్వతమైన ఉనికికి కుటుంబ వ్యవస్థే ప్రభావవంతమైన, ప్రధానమైన కారణం.
ఐతే నేడు మన పవిత్రమైన సాంస్కృతిక పునాదుల నుండి కుటుంబాలు దూరమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుండడానికి వ్యక్తులలో పెరుగుతున్న భౌతిక వాదం, స్వార్ధ పూరిత మనస్తత్వం కారణాలు. భౌతిక వాదం ప్రబలిన కారణంగా మనుషులలో ‘నేను’ అనే భావన పెరగడం, విశృంఖలమైన కోరికలు, దురాశ, వత్తిడి వంటివి పెరిగి విడాకుల వంటి వాటికి దారితీస్తున్నాయి.
మునుపటి మన వుమ్మడి కుటుంబాలు నేడు చిన్న కుటుంబాలుగా రూపాంతరం చెందుతున్నాయి. పిల్లల్ని చిన్న వయస్సులోనే హాస్టళ్ళలో చేర్చడం పరిపాటిగా మారింది. పిల్లలకు కుటుంబంతో ఉండవలసిన భావాత్మకమైన అనుబంధం, సురక్షిత భావన లోపించిన కారణంగా పిల్లలలో ఒంటరితనం పెరుగుతోంది. ఫలితంగా యువతలో మాదక ద్రవ్యాల వినియోగం, హింసాత్మక, నేర ప్రవృత్తి పెరగడం, ఒక్కొక్కసారి అది ఆత్మహత్యలకు కూడా దారితీయడం జరుగుతోంది. వృద్దులకు కుటుంబాలలో రక్షణ, పోషణ కరువై అది వృద్దాశ్రమాల పెరుగుదలకు కారణమవుతుండడం అత్యంత ఆందోళనకరం.
ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో సజీవమైన విలువలతో కూడిన మన కుటుంబ వ్యవస్థను రక్షించుకోవటానికి సమగ్రమైన, తీవ్రమైన ప్రయత్నాలు జరగాలి. మన దైనందిన జీవితంలో మన విలువలతో కూడిన ప్రవర్తన, స్వభావం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. తద్వారా కుటుంబ బాంధవ్యాలు బలోపేతమవుతాయి. కుటుంబం అంతా కలసి భుజించటం, పూజలు, పండుగలు, యాత్రలు చెయ్యటం, మాతృ భాషను వినియోగించటం, స్వదేశీ వస్తు వినిమయం, సాంప్రదాయాలను ఆచరించడం, ద్వారా కుటుంబ జీవనాన్ని ఆనందదాయకం చేసుకోవాలి. కుటుంబము, సమాజము పరస్పర పూరకాలు. కుటుంబ సభ్యులకు సామాజిక బాధ్యతను అలవరచటం కోసం దానధర్మాలను అలవాటు చేసుకోవాలి. సామాజిక, ధార్మిక, విద్యా సంబంధమైన అవసరాల కోసం అవసరమైన వారికి శక్తిమేరకు సాయం చేసే ప్రవృత్తిని అలవరచుకోవాలి.
మన కుటుంబ వ్యవస్థలో తల్లిదే ప్రముఖ స్థానం. తల్లిని గౌరవించడం ద్వారా మాతృ శక్తిని గౌరవించడం, ఆరాధించడం ప్రతి కుటుంబ సభ్యుడికి అలవాటు అవుతుంది. కలసి నిర్ణయాలు తీసుకోవడం మన కుటుంబాలలో సహజమైన విషయం. ఎవరి కర్తవ్యాలను వారు సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ఇతరైతర కుటుంబ సభ్యుల హక్కులను పరిరక్షించడం మన కుటుంబాలలో సర్వ సాధారణం.
కాల గమనంలో మన సమాజంలో కొన్ని వికృతులు చోటు చేసుకున్నాయి. వరకట్నం, అంటరానితనం, కుల వివక్ష, ఆర్భాటాల కోసం వృధా ఖర్చులు చెయ్యడం, మూఢ నమ్మకాలు వంటివి సామాజిక ప్రగతికి అవరోధాలుగా మారుతున్నాయి. మన మన కుటుంబాలతో ప్రారంభించి ఇలాంటి వికృతులను ఛేదించటం ద్వారా విలువలతో కూడిన సుఖవంతమైన సమాజ నిర్మాణానికి అందరం దోహదపడాలి.
సాధుసంతులు, సామాజిక, ధార్మిక, విద్యా రంగాలలోని మేధావులు, వివిధ సంస్థలు సమాజ అభ్యున్నతిలో నిరంతరం పాలుపంచుకుంటూనే వున్నాయి. కుటుంబ వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి అవసరమైన, సాధ్యమైన అన్ని చర్యలను తీసుకోవలలి. పత్రికా రంగం ద్వారా సమాజంలో విలువల నిర్మాణానికి ప్రయత్నం జరగాలి. కుటుంబ విలువలను తెలియజెప్పే చలన చిత్రాలను, కార్యక్రమాలను రూపొందించటం ద్వారా భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందించాలి. కుటుంబ వ్యవస్థను శక్తివంతం చెయ్యడానికి అవసరమైన విద్యా వ్యవస్థను, చట్టాలను రూపొందించాలి.
పరిస్థితుల నేపధ్యంలో తప్పనిసరిగా చిన్న కుటుంబాలుగా జీవిస్తున్నవారు మిగతా కుటుంబ సభ్యులతో సజీవ సంబంధాలను కొనసాగిస్తూ నిర్ణీత సమయాలలో కలుస్తూ ఉండటానికి ప్రయత్నించాలి. అలా కలుసుకున్న సందర్భాలు, ప్రదేశాలు మన మూలాలను జ్ఞప్తికి తెచ్చేవిగా వుండాలి. కుటుంబమంతా కలిసేలా ఏవైనా సేవా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. పిల్లల ప్రాధమిక విద్య స్థానికంగానే జరగాలి. ఆ విద్య కౌటుంబిక, సామాజిక అనుబంధాలను పెంపొందింపజేసేదిగా వుండాలి. మన ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, పండుగలలో పాల్గొనడం ద్వారా అందరం ఒకే కుటుంబ సభ్యులం అన్న భావన నిర్మాణం చేసుకోవచ్చు.

Post a Comment

2 Comments

Thank You