Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం - rabindranath tagore biography in telugu

రవీంద్రనాథ్ ఠాగూర్: విదేశీ పరిపాలనలో మగ్గుతున్న భారతీయులు సగర్వంగా తలయెత్తుకొనే రీతిలో భారత సాహిత్యపతాకాన్ని విశ్వవీధులలో విహరింపజేసి...


రవీంద్రనాథ్ ఠాగూర్: విదేశీ పరిపాలనలో మగ్గుతున్న భారతీయులు సగర్వంగా తలయెత్తుకొనే రీతిలో భారత సాహిత్యపతాకాన్ని విశ్వవీధులలో విహరింపజేసి తాను రాసిన గీతాంజలి కావ్యానికి 1913వ సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాకరమైన నోబుల్ బహుమానాన్ని సంపాదించి పెట్టాడు రవీంద్రుడు. ఇతడు కేవలం సాహిత్యంలోనేగాక సంగీతంలో కూడ తనదైన రవీంద్ర సంగీతాన్ని సృష్టించిన మంచి వాగ్గేయకారుడు.
బంకించంద్రుడు వ్రాసిన వందేమాతర గీతానికి స్వరకల్పన చేసి గానం చేశాడు. విశేషించి అంతర్జాతీయ కళాకేంద్రాలలో తాను గీసిన చిత్రాలను ప్రదర్శించిన కళాకారుడు. ఒక్క మాటలో చెప్పాలంటే లలిత నైపుణ్యానికి కాణాచి వంటివాడు. జనగణమన అనే మన జాతీయగీత రచయిత. విశ్వజనీనుడైన మానవుడు. ఈశ్వర తత్త్వాన్ని అనుభూతిపొందిన మహరుల కోవకు చెందినవాడు. ఉపనిషద్భావాలను రసమయం చేసి మనకందించిన ఆధునిక ఋషిపుంగవుడు. మానవుడు విశ్వప్రేమను అలవరచుకొని భగవంతుణ్ణి విశ్వరూపంలో పొందడమనే భారతీయతత్త్వమే రవీంద్రుని తత్త్వం. అది మానవునకు గమ్యం కావాలనేది రవీంద్రుని బాట.
రవీంద్రుడు తన ఆలోచనలను ఆచరణకు తెచ్చే సంస్థలను స్థాపించిన కార్యశూరుడు. తన భావాలకనుగుణంగా విద్యాబోధన ఉండేలా 1901లో బోల్పురంలో శాంతినికేతన్ అనే విద్యాలయాన్ని స్థాపించి జాతీయ విద్యారంగంలో కొత్తపుంతలు తొక్కాడు. ధార్మిక సమానతను, సాంస్కృతిక సమైక్యతను నెలకొల్పడానికి 1921లో విశ్వభారతి ని నెలకొల్పాడు. భారతీయ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు. పల్లెలే భారతదేశానికి వెన్నెముక. అందుకోసం కర్షక, కూలి ప్రజల వికాసం కోసం క్రీ.శ. 1922లో విశ్వభారతికి అనుబంధంగా శ్రీనికేతన్ అనే సంస్థను నెలకొల్పాడు.
తన ఏడవయేటనే రచనలు చేయడం ప్రారంభించిన రవీంద్రుడు రమారమి మూడువేల కవితాఖండికలు, 50 వ్యాసాలు, 38 నాటకాలు, 35 రాజకీయ గ్రంథాలు, వరకు కథాసంపుటాలు ప్రచురించి వంగ సాహిత్యంలోనే కాక భారతదేశంలోనే ఒక యుగానికి ప్రవక్త అయినాడు. ఆయన రచనల్లో చాలావరకు అనేక ప్రపంచ భాషల్లోకి అనువదింపబడ్డాయి. భారతీయ సంస్కృతీ సాహిత్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో రవీంద్రులొకరు. రవీంద్రుని రచనలలో ఉపనిషద్బావాలు కోకొల్లలుగా గోచరిస్తాయి. భక్తితత్త్వమూ, మానవతా విలువలు వీరి రచనలలో నిండి ఉంటాయి. బావుల్ సంప్రదాయిక కవుల ప్రభావం రవీంద్రునిపై మిక్కుటంగా ఉంది. వీరు దేహాన్ని దేవుని మందిరంగా భావిస్తారు.
అలాగే బుద్ధుని బోధనలలోని అమూల్య విషయాలను గ్రహించి వాటిని తాత్త్విక భావాలతో మేళవించాడు. రవీంద్రుని శైశవ, బాల్య, కౌమార, యౌవన దశలన్నీ బ్రహ్మసమాజమతంలోనే గడిచాయి. తరువాతికాలంలో బ్రహ్మసమాజం హిందుత్వంలో అంతర్భాగమేనని, విశ్వసించాడు. నేను భగవంతునికి సమర్పించేదేదైనా దానిని మానవునకు కూడా అర్పిస్తాను. అలాగే మానవునకు నివేదించే దానిని దేవునకు కూడ సమర్పిస్తాను అంటాడు రవీంద్రుడు. అంటే మానవసేవ, మాధవసేవ రెంటినీ కాంక్షించినవాడు.
రవీంద్రుడు అనేక సందర్భాలలో జాతీయ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రపంచ పర్యటనచేసి వచ్చినతరువాత ఫాసిజాన్ని సామ్రాజ్యవాదాన్ని దుయ్యబట్టాడు. బెంగాల్లో క్రీ.శ. 1861 మే 7వ తేదీన శారదాదేవి, దేవేంద్రనాథ్ ఠాకూర్ దంపతులకు పదునాల్గవ సంతానంగా జన్మించాడు రవీంద్రుడు. ఇతని తండ్రి మహర్షి అని బిరుదుపొందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. రవీంద్రుడు 1941లో అస్తమించాడు. బంకించంద్రుని సారస్వత విప్లవాన్ని వీరు కొనసాగించారు. వీరి చేతిలో వంగభాష వినూత్న శక్తిని,సౌందర్యాన్ని సంతరించుకొని అతిశక్తిమంతమైన ఆయుధంగా రూపొందింది.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..