Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆత్మహత్యలకు కారకులెవరు? - about suicide in telugu

టివి ఛానెళ్ళు తమ రేటింగ్‌లు పెంచుకుందుకు చూపిస్తున్నారో లేక నిజంగానే ఎక్కువయ్యాయో తెలియదు కానీ యువతలో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా కన...


టివి ఛానెళ్ళు తమ రేటింగ్‌లు పెంచుకుందుకు చూపిస్తున్నారో లేక నిజంగానే ఎక్కువయ్యాయో తెలియదు కానీ యువతలో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా కనిపిస్తున్నది. ఆత్మహత్యల కారణాలను విశ్లేషిస్తే ముఖ్యంగా కన్పించేవి రెండు. అపజయం లేదా ఫెయిల్యూర్‌ని తట్టుకోలేకపోవడం ఒకటయితే, అనుకున్న కోరిక తీరకపోవడం రెండవది. అవమానాన్ని తట్టుకోలేక మరణించిన వారూ ఉన్నారు. ఇరవై, ముఫ్పై ఏళ్ళనాడు యువతీ యువకులు అపజయాన్ని, అసంతృప్తినీ, అవమానాన్నీ ఎదుర్కోలేదా? అవి ఎదురైనా వారు తట్టుకోలేదా?
ఒక కుటుంబంలో కూతురికి మెరిట్‌ మీద ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. కొడుకుని కూతురిలాగే చదివించాలనుకున్న తల్లిదండ్రులు అబ్బాయిని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజిలో చేర్చారు. కారణమేమైతేనేమి అతనికి మంచి మార్కులు రాలేదు. శలవులలో ఇంటికి వచ్చిన కుర్రవాణ్ణి అమ్మా, నాన్నా పరుషంగా మాటలన్నారు. హాస్టల్‌కి తిరిగి వెళ్ళిన అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముఫ్పైఏళ్ళనాడు ఒక పిల్లవాడికి సెవెంత్‌ ఫారం (నేటి సీనియర్‌ ఇంటర్‌) లో తక్కువ మార్కులు వచ్చాయి. చదువురాని తండ్రికి తాను పరీక్ష పాసయ్యానని చెప్పాడు. ఇతరత్రా విషయం తెలిసిన తండ్రి కొడుకుని పలుపు తాడుతో బాదేశాడు. తండ్రి చేసిన పని రైటా తప్పా అన్నది పక్కన పెడదాం. పిల్లవాడు పారిపోయి పొలాల్లో దాక్కున్నాడు. తండ్రికి కోపం తగ్గాక ఇంటికి వచ్చాడు. ప్రాణం తీసుకుందా మని అనుకోలేదు.
ఇంట్లో తల్లిదండ్రులే కాదు, బడిలో టీచర్లూ పిల్లలని కొడుతూనే ఉండేవారు. చెయ్యని తప్పులకి పనిష్‌మెంట్లు కూడా ఉండేవి. కానీ అప్పట్లో పిల్లలు చనిపోయిన సంఘటనలు అంతగా లేవు.
ఇక ఇప్పుడు తల్లిదండ్రులు తాను కోరిన మోడల్‌ సెల్‌ఫోన్‌ కొనివ్వలేదనో, ఖరీదైన మోటార్‌ సైకిల్‌ ఇవ్వలేదనో, తానడిగిన రిసార్ట్‌లో పార్టీ చేసుకోడానికి అంగీకరించలేదనో ప్రాణాలు తీసుకునే యువతీ యువకులు తయారవుతున్నారు. ఒక్క క్షణం ఆగి, అమ్మానాన్నా తామడిగిన కోరిక తీర్చలేక పోతున్నారేమోనన్న ఆలోచన యువతలో ఎందుకు రావడం లేదు? ఆ ఆలోచన వచ్చేలా పిల్లల పెంపకం ఉండడం లేదా?
కొంత వెనక్క వెళితే గతంలో కుటుంబ నియంత్రణ అన్నమాట లేదు. ఎక్కువ మందిని కనిపెంచడం కష్టసాధ్యమైనది. మధ్యతరగతి కుటుంబాలలో నెలాఖరు వస్తే కటకటలాడే పరిస్థితి. తల్లిదండ్రులకు అన్న వస్త్రాలు సమకూర్చడమే కష్టంగా ఉండేది. ఉప్పు, ఊరగాయతోనే సరిపెట్టుకునే దిగువ మధ్యతరగతి ఇళ్ళుండేవి. ఇక సినిమాలకీ, షికార్లకీ ఆస్కారమెక్కడ ? చదువుకునేది ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూలు. పిల్లలు చాలా మటుకు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మసలుకునేవారు.
ఉదాహరణగా చెప్పాలంటే పల్లెటూళ్ళో నేల టికెట్టు కొనుక్కుని సినిమా చూసే తాహతు కూడా లేదు. స్నేహితులందరూ సినిమా గురించి మాట్లాడు కుంటుంటే తీసిపోయినట్లుండకూడదు. ఇంట్లో ఒకళ్ళు సినిమా చూసి మిగిలిన వారికి కథ చెప్పేవారు. అందరూ చూసినట్లుగానే మాట్లాడేవారు. నేటి పిల్లలు ఆ పరిస్థితికి అంగీకరిస్తారా? ఇంట్లో టివి రిమోట్‌ ఎవరి కంట్రోల్‌లో ఉండాలన్న దాని మీదనే హత్యలూ, ఆత్మహత్యలూ జరుగుతున్నాయి. ఇందుకు కారణమేమిటి?
ఒక్క కారణం ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది. ఇదివరలో వలె కాకుండా ఇప్పుడు ఏ ఇంట్లోనైనా ఇద్దరు పిల్లలకు మించి ఉండడం లేదు. తల్లిదండ్రులకి పిల్లలు కోరినవన్నీ సమకూర్చడం సులభంగా ఉంది. ఆ కారణంగా పసి వయస్సు నుంచీ పిల్లలకు అనుకున్నవన్నీ సమకూరడమే కానీ అనుకున్నది జరగకపోవడమన్నది తెలియదు. సుఖదుఃఖాలనేవి రెండుంటాయన్నది నేటి పిల్లల ఊహకి అందని విషయం. అందుకే అతి చిన్న విషయానికే చలించి పోతున్నారు.
పిల్లలు తమ ఆశలు తీరక చనిపోవడం ఒక కోణమైతే, పిల్లల మీద తల్లి తండ్రులు అతిగా ఆశలు పెంచుకోవడం మరొక కోణం. పదిమంది పిల్లలున్నప్పుడు అమ్మానాన్నలు చదువు చెప్పించాలనుకునేవారే తప్ప ఫలానా చదువే చదవాలనో, గొప్ప ఉద్యోగం చెయ్యాలనో అంతగా అనుకునేవారు కాదు. నేడు బిడ్డ పుట్టిననాడే కెరీర్‌ నిర్ణయించేస్తున్నారు. అక్షరాభ్యాసం నాడే కోచింగ్‌ మొదలు. ప్రతిరోజూ అప్‌డేటింగ్‌ తంటాలు. తల్లిదండ్రులు పెట్టే టెన్షన్‌ పిల్లలకు భరించడం కష్టమైపోతున్నది. పిల్లల ప్రతిభ ఎంత ? వారికున్న ఆశయాలేమిటి ? వారి అభిరుచులకి విలువనివ్వాలి వంటి ఊహలు అమ్మా నాన్నల మనస్సులలో రావడం లేదు. తల్లిదండ్రులు నిర్ణయించిన లక్ష్యాలు సాధించలేక, వారి పరువును నిలబెట్టలేకపోయామన్న బెంగతో కొంతమంది యువత ప్రాణ త్యాగం చేస్తున్నది.
మనం జనాభా నియంత్రణ కోసం పిల్లల సంఖ్యను నియంత్రిస్తున్నాం. పిల్లల సంఖ్యను నియంత్రించినట్లే వారిని గారాబం చెయ్యడమూ, వారిపై మన కోరికలు రుద్దడమూ నియంత్రించాలి. ఎక్కువ సంతానం లేకపోవడం వల్ల ఉన్న ఇద్దరు పిల్లలకు నిత్యావసరాలూ, విద్యా, చిన్న చిన్న విలాసాలూ సమకూర్చడం సులభమౌతోంది. అందుకని వారు కోరితే కొండమీద కోతినైనా తెచ్చిపెట్టాలనీ అనుకోకూడదు, సంతానం అన్ని ఉన్నత శిఖరాలనూ అధిరోహించాలనీ అనుకోకూడదు. తల్లిదండ్రులు నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమిదే.
అయితే ఈ పాఠాన్ని నేర్చుకోడానికీ, అమలు పరచడానికీ అనువైన పరిస్థితులు నేడున్నాయా? అటు సినీ, వ్యాపార రంగాలు కానీ, ఇటు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్‌ సెంటర్లు కానీ ప్రకటనలతో ఊదరగొట్టేస్తూంటే తల్లిదండ్రులు ప్రలోభంలో పడకుండా, పిల్లలను ప్రలోభపడ నీయకుండా ఉండడం సాధ్యమా? ఇది ఒక్కరి వల్ల అయ్యే పనికాదు. పెద్దలందరూ సమష్టిగా ఎదుర్కోవలసిన సమస్య.

No comments