Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వామి వివేకానంద జీవితం - Swami Vivekananda life in telugu

విదేశాలలో హిందూధర్మ కీర్తిపతాకను రెపరెపలాడించి, స్వదేశంలో యుగధర్మానుగుణంగా వేదాంతభేరీని మ్రోగించి, ఆత్మవిస్మృతిగ్రస్తమై నిస్తేజమై ఉ...


విదేశాలలో హిందూధర్మ కీర్తిపతాకను రెపరెపలాడించి, స్వదేశంలో యుగధర్మానుగుణంగా వేదాంతభేరీని మ్రోగించి, ఆత్మవిస్మృతిగ్రస్తమై నిస్తేజమై ఉన్న సమాజంలో ఉత్సాహాన్ని నింపి స్ఫూర్తిని ప్రసాదించి శక్తిని కలిగించారు వివేకానందులు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక తత్త్వాలను వ్యావహారిక స్థితిలోకి తెచ్చిన వివేకానందునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాధ దత్తు. నరేన్ అని ముద్దుగా పిలిచేవారు. తల్లి భువనేశ్వరీదేవి. తండ్రి విశ్వనాథదత్తు. 1863 జనవరి 12న కోల్కతాలో జన్మించాడు. బాలనరేంద్రుడు ఆటలలోను, చదువులోను కూడ మంచి ప్రవీణుడు. భగవంతుణ్ణి చూడాలనే జిజ్ఞాస అధికంగా ఉండేది. రామకృష్ణ పరమహంస దర్శనము ఆశీర్వాదం వల్ల వివేకానందునికి భగవద్దర్శనం కలిగింది. మనసులోని సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి. కర్తవ్యం కూడ బోధపడింది. పరమహంస శిష్యుడై ప్రాపంచిక సుఖాలను పరిత్యజించి సన్న్యాసదీక్షను స్వీకరించాడు. నరేంద్రుడు వివేకానందుడయ్యాడు.
1893 సెప్టెంబరు 11న అమెరికాలోని చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూధర్మ ప్రతినిధిగా పాల్గొని సనాతన ధర్మం గురించి ఓజోవంతము తేజోవంతము నైన ప్రసంగంచేసి సభికులను ముగ్ధమనోహరులను చేశాడు. వేదాంతంతో తనకున్న అనుపమానమైన జ్ఞానసంపదచేత పాశ్చాత్యుల మనస్సులు హిందూధర్మంవైపు ఆకర్షి తమై అభిమానించేలా చేశాడు. భారతదేశమంతటా తిరిగి మానవసేవయే మాధవ సేవ అని ప్రచారమొనర్చినాడు. ఆశ్రమంలోని ఇతర శిష్యులనందరితో కలిసి ధర్మజాగరణ మరియు మానవ సేవ అనేవి ప్రధాన లక్ష్యములుగ “రామకృష్ణ మిషన్” అనే సంస్థను ప్రారంభించారు. 1899లో బేలూరులో రామకృష్ణ మఠాన్ని నిర్మించారు. 39. సంవత్సరాల స్వల్ప వయస్సులోనే (1902 జులై 4) నిర్యాణం చెందిన వివేకానందుడు హిందుత్వాన్ని నవోత్తేజంగా వర్ధిల్లజేసే మహత్తర కార్యాన్ని సాధించాడు. 
వివేకానందుడు సంస్కృతాంగ్ల బెంగాలీ భాషలలో గొప్ప ప్రావీణ్యం గల మంచివక్త, గొప్ప నాయకుడు. విశేషించి ప్రఖ్యాత కవి కూడ. తన మధురమైన కంఠస్వరంతో భజనగీతాలు పాడి ఎందరో హృదయాలను చూరగొన్నాడు. కుశాగ్ర బుద్ధి. పుస్తకంలోని పుటలలో పై పంక్తిని చివరిపంక్తిని చదివితే మధ్యలో వ్రాసి ఉన్న సారాంశాన్ని గ్రహించగలిగిన మేధావి. ఆయన మేధాసంపత్తిని చూసి పాశ్చాత్యులే అబ్బురపడ్డారు. అఖండ వాక్పటిమ, పాండిత్యము, ఉదాత్తశీలము నే త్రిపుటితో ప్రపంచాన్ని జయించిన ధీశాలి వివేకానందుడు. బాల్యం నుంచి ధ్యాసం, ఏకాగ్రత వంటి లక్షణాలతో సమాధిస్థితిని సాధించినవాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ దివ్యకాంతి వలయం ఏర్పడుతుండేది. పరమహంస నిర్యాణానికి రెండురోజుల పూర్వం తన ఆధ్యాత్మికమైన సర్వశక్తులను వివేకానందునకు ధారవోస్ బికారి అయ్యాడు. వివేకానందుని ప్రపంచ పర్యటనలో అనేకమంది ఆయనకు శిష్యులై నారు. వారిలో భగినీ నివేదితగా గౌరవాన్ని పొందుతున్న మార్గరేట్ నోబుల్ ఒకరు.
వివేకానందుడు తాను కలలు కన్న నవీన భారతదేశం రూపొందాలంటే ఉక్కునరాలు, ఇనుపకండరాలు, వజ్రతుల్యమైన మేధస్సు కలిగిన యువతీయువకులు. నూరుమంది లభిస్తే చాలు సాధిస్తానని యువతకు పిలుపునిచ్చాడు. పేదల కడుపులు నింపి ఆపై గీతను బోధించమని చెప్పాడు. హిందూ సమాజంలో కనిపించే దోషాలను నిర్మూలించడంలో ముఖ్యంగా అంటరానితనాన్ని పోగొట్టడంలో మిక్కిలిగా కృషి చేశాడు. స్వయంగా వారి గుడిసెలలోకి వెళ్ళి వారితోపాటే ఆహారాన్ని పంచుకు తినేవారు. వాళ్లు పీలుస్తున్న హుక్కాను పీల్చేవారు. హిందూ దేవతలందరూ వంట | ఇళ్ళల్లో నివసిస్తున్నారు. ప్రజలంతా 'నన్ను ముట్టుకోకు' అని గగ్గోలు పెడుతున్నారు. ఇది హిందూ ధర్మానికి పెద్ద ప్రమాదకారియని హెచ్చరించారు. భారతదేశ భవిష్యత్తు భారతీయుల చేతుల్లోనే ఉంటుంది. 'నేను బలహీనుణ్ణి' అని మూర్ఖులు మాత్రమే శోకిస్తుంటారు. కాబట్టి శక్తివంతులు కావాలని, లేవండి, మేల్కొండి గమ్యం చేరేవరకు విశ్రమించకండి అని పిలుపునిచ్చారు. రాబోయే వంద సంవత్సరాలలో సమస్త దేవతలను పక్కన పెట్టి ఒకే ఒక్క దేవత 'భారతమాత'ను మాత్రమే ఆరాధించండి. దేశం పురోభివృద్ధి చెందుతుందని చెప్పారు.
భారతదేశ పరిభ్రమణం చేసి దేశంలోని దీనహీన పీడిత శోషిత జనులను చూసి పరితపించి వారినందరిని ఉద్దరించడానికి నడుంకట్టాడు. నా దేశంలోని కుక్క గూడ ఆకలితో అలమటిస్తున్నంతకాలం నా జీవితానికానందం లేదని చెప్పాడు. “దరిద్ర దేవోభవ" అని ఎలుగెత్తి చాటి, వారి సేవకు తన తోటివారిని ఉద్యుక్తులను చేశాడు.
నరేంద్రుడు పేదరికంలో మగ్గిపోతూ, తిండిలేక పస్తులుంటూ దుస్తులు చీలికలు, పీలికలైనా గూడ భగవంతుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా పరమహంస వాణితో ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడ్డాడు. మూర్తీభవించిన త్యాగమే తానై, తన జీవన పుష్పాన్ని దేశమాత చరణాలకే అర్పించి నిర్భాగ్యుల, నిస్సహాయుల అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పరితపించాడు. మహోన్నత ఆలోచనాశీలుడు, మహత్తర కార్యతత్పరుడైన వివేకానందుని శంఖారావం నిద్రాణమైన భారతజాతిని మేల్కొలిపింది. కాబట్టి యుగయుగాలకు ఆయనొక ప్రేరణాఫ్రోతస్సు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments