నారాయణ గురు జీవిత చరిత్ర - Narayana Guru Life in Telugu

0
నారాయణగురు : సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పురుషుడు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒక్కటే ధర్మం, ఒకే దేవుడు అతడే అందరినీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని సమాజానికి అందించిన మహాత్ముడు. 
నారాయణగురు క్రీ.శ. 1854 ఆగస్టు 20న కేరళలోని 'చెంపాజండీ' గ్రామంలో ఈళవ అనే హరిజన కులంలో మదన్ ఆశాన్, కుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు. అందరూ ఆయనను 'నానూ' అని పిలిచేవారు. చట్టాంబీ స్వామి అనబడే కుంజన్ పిల్లె వద్ద సంస్కృత అధ్యయనం చేశాడు. తిక్కాడ్ అయ్యబూ వద్ద యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. నారాయణగురు అరవీపురం అడవుల్లో ధ్యానంలో ఉండి చాలాకాలం తపస్సు చేశాడు. ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందనే జీవన రహస్యాన్ని తెలుసుకున్నాడు. అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు.


రోగులకు సేవచేస్తూ బీదలైన గిరిజనులకు, హరిజనులకు సేవా సహాయ కార్యక్రమాలు ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు ప్రాంతాలలో పర్యటించినప్పుడు క్రైస్తవ ఫాదరీలు హిందూధర్మంమీద, సమాజంమీద చేస్తున్న దాడులను చూచి దానిని ప్రతిఘటించాలని నిశ్చయించుకున్నాడు. తన ఆశ్రమం వద్ద శివాలయాన్ని నిర్మించాడు. కేరళ ప్రాంతంలో ఆనాడు కులతత్వము, అంటరానితనం అనే భూతాలు విలయతాండవం చేస్తున్నాయి. అందుకే వివేకానందుడు కేరళను పిచ్చాసుపత్రిగా వర్ణించాడు. ఈ భూతాన్ని అంతం చేయాలని నడుం కట్టాడు నారాయణగురు. తన ఆశ్రమంలో శివాలయాన్ని కట్టిం చాడు. దేవునిముందు అందరూ సమానులే. ఉచ్ఛనీచ భావాలకు ఆయన అతీతుడు అని నారాయణగురు ప్రజలకు సందేశాన్నిచ్చాడు. నారాయణ గురు అనేకచోట్ల గుడులు కట్టించి అక్కడ హరిజనులకు ప్రవేశాన్ని కల్పించాడు. ఆ దేవాలయాలు హిందూ సంఘటనకు కేంద్రాలైనాయి. ఈవిధంగా సమాజానికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపించాడు. ప్రజలలోని మూఢ నమ్మకాలను తొలగించడానికి ఉద్యమించాడు. ఆయన పశుహింసను సహించలేకపోయేవాడు జంతుబలిని ఆపించడంలో ఆయన విజయం సాధించాడు. ప్రజలకు పారిశుద్ధ్య ప్రాముఖ్యతను, నిరడంబర జీవన మహిమను తెలియజేశాడు. హిందూధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవులలో చేరినవారిని తిరిగి స్వధర్మం వైపు తిప్పాడు.
1913లో నారాయణగురు అలువాయిలో అద్వైతాశ్రమాన్ని స్థాపించి ఓం సహోదర్యం సర్వం అనే సందేశంతో మానవులంతా సమానమే అనే లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతుండేవి. మంగుళూరు నుండి సింహళం వరకు తీరప్రాంతాలలో సర్వత్రబంధుత్వ సమ్మేళనాలు జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీజీలు నారాయణగురును సందర్శించుకున్నారు. నారాయణగురు 'జాతిమి మాంస' అనే గ్రంథాన్ని వ్రాశారు. దేశంలోని ప్రతివ్యక్తి ఉద్యమిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే సందేశమిచ్చిన నారాయణగురు 1928 సెప్టెంబరు 20న పరమప దించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top