మధ్య ప్రదేశ్ లో గల ఇండోర్ విమానాశ్రయం లో ప్రతిష్ఠించిన పుణ్యశ్లోకి అహల్యాబాయి విగ్రహం. ఇందోర్ సంస్థాన పరిపాలకురాలు అహల్యాబాయి (క్రీ.శ...
ఇందోర్ సంస్థాన పరిపాలకురాలు అహల్యాబాయి (క్రీ.శ.1725-95). మరాఠా చరిత్రను అక్షరబద్ధం చేసినవారిలో సుప్రసిద్ధులైన సర్ జాన్ మాల్కమ్ మాటల్లో చెప్పాలంటే ‘అత్యంత స్వచ్ఛమైన, ఆదర్శప్రాయమైన పరిపాలకుల్లో ఆమె ఒకరు’. ఆమె ఔరంగాబాద్‌కు చెందిన మనకోజీ షిండే కుమార్తె, మల్హరరావ్ హోల్కర్ ఏకైక కుమారుడైన ఖండూజీతో ఆమె వివాహమైంది. పీష్వా సైన్యంలో మల్హరరావ్ సహాయ సైన్యాధికారి. కాగా ఓ శతఘ్ని దాడిలో అహల్యాబాయి భర్త మరణించాడు. దాంతో ఆమె జీవితంలో విషాదం అలముకుంది. అప్పటికి ఆమెకు నిండా 20 ఏళ్ళు కూడా లేవు. ఆ రోజుల్లోని ఆచారం ప్రకారం ఆమె తన భర్త చితిపై పడి, సతీ సహగమనం చేయాలనుకుంది.
అయితే అంతపని చేయవద్దని మామగారైన మల్హరరావు ఆమెకు నచ్చజెప్పారు.
పరమ సోమరి, ధ్యతారహితుడూ, కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీసేవాడూ అయిన కుమారుడితో ఆయన విసిగిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడు కూడా మరణించడంతో తన జీవితంలో మిగిలిన కాస్తంత సాంత్వన కోడలు, మనుమలేనని ఆమెకు హితబోధ చేశాడు. దాంతో అహల్యాబాయి సతీ సహగమన ఆలోచనను విరమించుకుంది. అహల్యాబాయికి ఇద్దరు పిల్లలు. కుమారుడి పేరు మాలేరావు, కుమార్తె పేరు ముక్తాబాయి. అహల్యాబాయి ఎంతో తెలివైనదిగా, ధైర్యవంతు రాలిగా పేరు తెచ్చుకుంది. ఆమె మామగారు ఆమెకు పాలనా వ్యవహారాల్లో శిక్షణనిచ్చారు. అలాగే రాజ్య వార్షికాదాయం వసూళ్ళలో తర్ఫీదునిచ్చారు. సైన్య నిర్వహణను కూడా నేర్పించారు. ప్రజాసంక్షేమం కోసం కృషి చేసే మంచి పరిపాలకుల లక్షణాలను, ధార్మిక గుణాలను ఆమె తనలో మేళవించుకుంది.
ప్రతిరోజూ ధర్మశాస్త్రాల అధ్యయనం, ధ్యానం, మననం చేస్తూ ఆమె ఎన్నో గంటలు గడిపేది. మల్హరరావు మరణం తరువాత అహల్యాబాయి కుమారుడైన మాలేరావును హోల్కర్ రాజ్య పాలకుణ్ణి చేశారు. అయితే మాలేరావుకు అప్పటికింకా అంత సమర్థత లేకపోవడంతో అహల్యాబాయే అన్నీ చూసుకొంటూ తెరవెనుక అసలు పాలకురాలిగా వ్యవహరించేది. రాజీ పరిష్కారం, దయ కలిగి ఉండటమనేవి ఆమె ఆచరణ సూత్రాలు. అయితే సందర్భానుసారం అవసరమైతే ఆమె కొంత కఠినంగా ఉండటానికి కూడా వెనుకాడేది కాదు. మామగారు మరణించిన తరువాత రాజపుత్ర వంశీకుల్లో ఒకరైన చంద్రావత్‌లు ఆమెపై తిరుగుబాటు చేశారు. అప్పుడు సమయానికి అహల్యాబాయి వద్ద సైన్యాధ్యక్షుడు కూడా లేడు. అయినప్పటికీ అహల్యాబాయి వెనుకడుగు వేయలేదు. సమకూర్చుకోగలిగినంత బలగాన్ని సమ కూర్చుకొని ఆమే స్వయంగా ఆ సైన్యానికి నాయకత్వం వహించింది. చంద్రావత్‌ల తిరుగుబాటును అణచివేసింది. అలాగే ఒకసారి ఆమె పరిపాలనలోని సాత్పురాలో కొందరు భిల్ల జాతివారు సమస్యలు సృష్టిస్తూ తలనొప్పిగా తయారయ్యారు. అప్పుడు అహల్యాబాయి ఆ భిల్ల జాతి వారి నాయకుణ్ణి నిర్బంధంలోకి తీసుకొని మరణశిక్ష విధించింది. అలాంటి కఠినమైన చర్యలు చేపట్టడంతో ఆమె రాజ్యంలో అసాంఘిక శక్తులు శాశ్వతంగా కనుమరుగయ్యాయి.
అయితే అహల్యాబాయిని ఒక విషయంలో దురదృష్టం వెంటాడింది. ఆమె కుమారుడు దుర్భల మనస్కుడు. కాలక్రమంలో అది పిచ్చిగా మారి దానితోనే మరణించాడు. కాగా ఈ రాజ్యానికి వారసుడు లేడనే విషయం గమనించి పాలక పీష్వాకు సన్నిహిత బంధువైన రఘోబా దాడి చేయాలని భావించాడు. కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ అహల్యాబాయి తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. అవసరమైతే యుద్దభూమిలో కలుసుకోవడానికి తాను సిద్దమంటూ ఆమె రఘోబాకు కబురు పంపింది. అలాగే ఆమె మరో మాట కూడా చెప్పింది. తాను మహిళను గనక యుద్దంలో మరణిస్తే అతని కీర్తి పెరిగేదేమీ లేదని పేర్కొంది. ఒకవేళ అలా కాక తానే గెలిచి అతనికి ఏదైనా జరిగితే దాని పర్యవసానం అతని విషయంలో ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోమని హెచ్చరించింది.
ఆ మాటలతో ఆమె సూచించదలిచిన సందేశం ఏమిటన్నది సుస్పష్టమవడంతో రఘోబా తన మనసు మార్చు కున్నాడు. ఆ తరువాత పీష్వాలు అహల్యాబాయి పాలనకు లాంఛనప్రాయమైన గుర్తింపునిచ్చారు. ఫలితంగా సంస్థానాన్ని నడిపే మొత్తం బాధ్యతను ఆమె స్వీకరించింది. అయితే వ్యక్తిగత జీవితంలో అహల్యాబాయి ఎదుర్కొన్న విషాదాలకు అంతం లేదు. కుమారుడి మరణం తరువాత ఆమె కళ్ళెదుటే మనుమడు మరణించాడు. అల్లుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్లుడి చితి మీద పడి కుమార్తె సైతం సహగమనానికి పాల్పడటం అహల్యాబాయిని మరింత కుంగదీసింది.
అహల్యాబాయి తన భక్తికీ, రాజ్యంలోని ప్రజల సంక్షేమానికీ చిహ్నాలుగా ఎన్నెన్నో పనులు చేసింది. ఎన్నో రహదారులు వేయించింది. బావులు తవ్వించింది. స్నానఘట్టాలు కట్టించింది. విశ్రాంతి గృహాలు నిర్మించింది. దేవాలయాలు నెలకొల్పింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి కొన్ని ఉన్నాయి. కలకత్తా నుంచి వారణాసికి వేయించిన రహదారి వాటిలో ఒకటి. అలాగే సౌరాష్ట్రలో సోమనాథ దేవాలయం, గయలో విష్ణు ఆలయం, వారణాసిలో విశ్వేశ్వర ఆలయం అహల్యాబాయి చలవే! పరిపాలనలోనూ, ధార్మికతలోనూ ఇంతటి ఉత్కృష్ట స్థాయిని అందుకున్న ఈ మహిళ నేటి తరానికి ఆదర్శప్రాయురాలు.
No comments