Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నీళ్లపై ఫుట్‌బాల్‌ ఆడుకుందాం రా?

ఆయన రథానికి ఒకటే చక్రం,  అది చాలదన్నట్టు ఏడు గుర్రాలు, ఏడు వైపులకు లాగుతూ ఉంటాయి,  పైగా గుర్రాలకు పగ్గాలుగా ఉన్నవి విషం విరజిమ్మే పాములు,  ...

ఆయన రథానికి ఒకటే చక్రం, అది చాలదన్నట్టు ఏడు గుర్రాలు, ఏడు వైపులకు లాగుతూ ఉంటాయి, పైగా గుర్రాలకు పగ్గాలుగా ఉన్నవి విషం విరజిమ్మే పాములు, అంతేనా అంటే ఇంకా ఉందండీ, ఆయన రథసారధి గుడ్డివాడు, అవిటివాడు, ఇక చాలు బాబూ ఈ కష్టాల లిస్టు అనకండి, ఇది సశేషమే, ఈ ఒంటి చక్రపు రథంపై, ఎవరి మాటా వినని ఏడు గుర్రాలకు పాములే పగ్గాలుగా బిగించుకుని, గుడ్డి, అవిటి సారథితో ఆయన వెళ్లాల్సిన దారికి ఆధారం లేదు,అంటే శూన్యంలో ప్రయాణించినట్టే, అయినా పగలూ రాత్రీ ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అస్సలు విశ్రాంతి అన్నదే లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు,సగలు పొగలు, రాత్రి వగలు, ఆయన పుణ్యమేనన్నట్టుగా పనిచేస్తాడు. ఆయనెవరో ఈ పాటికే తెలియకపోతే "ది ఎండ్‌" కార్డు పడేటప్పుడు చెబుతాను... ఓపిక పట్టండి......

Image result for KOH PANYI                         ఆ ఊరు నీళ్ల మీద తేలాడే ఊరు. ఇదేదో అతిశయోక్తి కాదు. అక్షరాలా నిజం. నీళ్ల పైనే గుంజలు పాతి, మంచెలు కట్టి దానిపై చెక్క ఇళ్లను కట్టుకుని కొన్ని వందల కుటుంబాలు తరతరాలుగా బతికేస్తున్నాయి. ఎటు చూసినా నీళ్లు, నీరు చుట్టూ వారి జీవనం సాగుతుంది. కాదు కాదు. నీట్లోనే వారి జీవితం సాగుతుంది. పడవ తప్ప మరో ప్రయాణ సాధనం లేదు, అలాంటి ఊళ్లోని పిల్లలకి ఫుట్‌బాల్‌ ఆడాలని అనిపించింది. దానికి ఒక కారణం ఉంది. అప్పుడే ఆ ఊళ్లో డైనమోతో నడిచే టీవీ వచ్చింది. అందులో ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలను పిల్లలు భలే ఆసక్తిగా చూశారు. వాళ్లకి ఆట బాగా నచ్చేసింది. “మనమూ ఫుట్‌ బాల్‌ ఆడదాం...” అనుకున్నారు. 
ఆ సంగతి వినగానే ఊరు ఊరంతా భళ్లున నవ్వింది. కొందరు వెక్కిరించారు, కొందరు వేళాకోళం చేశారు. ఇంకొందరు వెక్కిరింతలకు వెటకారం మసాలా దట్టించారు. తిట్లు, విమర్శల తాళింపు వేశారు. “ ఈ నీళ్లపైనా.... ఫుట్‌బాలా... మీకేమైనా పిచ్చి పట్టిందా?” అన్నారు. 
బుడ్డోళ్లకు మాత్రం కళ్లలో స్టేడియం, గోల్‌పోస్టు, ఫుట్‌బాల్‌, జనం కేరింతలు తప్ప మరేమీ కనిపించలేదు. అన్నిటికన్నా సులభమైన పని బంతి కొనుక్కోవడం. ఆ పని చేసేశారు. ఆటగాళ్లు ఉండనే ఉన్నారు. ఇక కావలసింది ఒక్కటే... గ్రౌండ్‌...... 
                         వాళ్లింట్లో మిగిలిన చెక్క, వీళ్లింట్లో ఉండిపోయిన తలుపు ముక్క, వెనకింట్లోని వెదురు బద్ద, పక్కింట్లో పనికిరాని కిటికీ వీటన్నిటినీ పోగు చేశారు. మేకులతో, తాళ్లతో వాటిని ఒకదాని పక్కన మరొకటి పెట్టి అమర్చుకున్నారు. నెమ్మదిగా కొన్ని నెలలకి నీళ్లపై ఒక పెద్ద మంచెని కట్టేశారు. నీళ్లపై తేలాడే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ తయారైంది. 
ఎగుళ్లూ దిగుళ్లూ, కొయ్య ముక్కలు, గుచ్చుకుపోయే మేకులు,
దీని మీదే ఫుట్‌బాల్‌ ఆడారు. రక్తాలు కారాయి. దెబ్బలు తాకాయి. పదే పదే బాల్‌ నీళ్లలో పడింది... తడి వల్ల పలు సార్లు జారిపడ్డారు... కానీ మొత్తం మీద ప్రపంచకప్‌ ఆడినంత పరమానందం కలిగింది. 

                        ఊళ్లో పెద్దలు తిట్టిపోశారు, “ఏమిటీ ఆటలు... ఏమిటీ అల్లరి....నీట్లో చేపలకి డిస్టర్బ్‌ అవుతుంది. “ “మధ్యాహ్నం నిద్రపోనీయరా ఏమిటి? ఆట ఆపండి ముందు" “ఎందుకురా ఆ నీళ్లలో ఆటలు... ప్రపంచ కప్‌ ఆడాలా... పెట్టాలా?” కానీ బుడ్డోళ్లు మాత్రం వానలొచ్చినా, ఎందలొచ్చినా ప్రపంచంలోనే అతి వింత గ్రౌండ్‌పై ఫుట్‌బాల్‌ ఆడటం మానలేదు.  ఇంతలో ఒకాయన న్యూస్‌ పేపర్‌ తెచ్చి ఇచ్చాడు. అందులో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ వార్త పడింది. ఆ టోర్నమెంట్‌లో ఆడాలని పిల్లలు నిర్ణయించుకున్నారు. టోర్నమెంట్‌కి ముందు రోజు పడవలో బయలుదేరుతూంటే. తిట్టిపోసే పెద్దలంతా పెద్ద షాకిచ్చారు. స్పోర్ట్స్‌ షూస్‌, టీ షర్టులు, షార్టులు గిఫ్టుగా ఇచ్చారు. “గెలిచి రావాలి" అని ఆర్డర్‌ కూడా పాస్‌ చేసేశారు. పిల్లలకు కప్పు తెచ్చేసినంత సంతోషం కలిగింది 
తీరా టోర్నమెంటుకు వెళ్లాక పిల్లలకు భయం వేసింది. ఆ జనం... ఆ కేరింతలు... ఆ గ్రౌండు బయపెట్టాయి... ప్రత్యర్థి టీముల పటాటోపమూ భయపెట్టింది. కానీ "పోరాడితే పోయేదేమీ లేదు … బెరుకుదనం తప్ప" అనుకున్నారు. ఆడేశారు.

                         ఆశ్చర్యం ఏంటంటే మ్యాచ్‌ మనవాళ్లే గెలిచారు. ఊరూ పేరూ లేని, ముక్కూ మొహం తెలియని ఆ టీమ్‌ అంచెలంచెలుగా గెలుపు నిచ్చెనను ఎక్కుతూనే ఉంది. మేకులు, కర్రపేళ్లు, ఊగే మైదానం, కదిలే గోల్‌పోస్టులపైనే ఆడేసిన వాళ్లకు ఇవన్నీ ఒక లెక్కా వాన పడితే మిగతా టీములు లబలబలాడేవి. మనోళ్లు నీళ్లలో చేపల్లాంటి వాళ్లు  ఫీల్డు ఫీల్డంతా ఈదిపారేసినట్టు ప్రత్యర్థులను ఊదిపారేశారు. సెమీఫైనల్‌కి వచ్చేశారు. అక్కడ మాత్రం ఓడిపోయారు. కానీ విజేతల్లా ఊరికి తిరిగొచ్చారు. దేశం దేశమంతా వాళ్లకు బ్రహ్మరథం పట్టేసింది. నెత్తిన పెట్టుకుంది. అసలు ఫుట్‌బాలే ఆడలేని చోట నుంచి ఫుట్‌బాల్‌ టీమ్‌ తయారు కావడమేమిటి? నీళ్లపైన ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ తయారు చేసుకోవడమేమిటి? దేశం దేశమంతా వాళ్ల కథను కథలుకథలుగా చెప్పుకుంది. అసలు విజేతలు మీరేనంది. ఆ పిల్లలు రాత్రికి రాత్రి హీరోలు అయిపోయారు. నీళ్లపై తేలాడే ఊరు, నీళ్లపై ఫుట్‌బాల్‌ ఆడే తీరు చూసేందుకు దేశమంతటి నుంచీ ప్రజలు వచ్చేశారు. ఒక సంస్థ కొత్త హీరోలకు నీటిపై తేలాడే సింథెటిక్‌ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ కట్టించి ఇచ్చింది. ఆ ఊరికి ఫుట్‌బాల్‌ ఒక మతం అయిపోయింది. ప్రతి బుడ్డోడూ ఫుట్‌బాల్‌ ఆటగాడే. 
                        (బుడ్డోళ్లు బడికెళ్లాక పెద్దోళ్లూ సిగ్గుపడుతూనే (చేపల డిస్టర్బెన్సును , మధ్యాహ్నం నిద్రను పక్కన బెట్టి మరీ) ఆటలాడే వాళ్లు, నేల లేని నీళ్ల ఊరులో తయారైన ఫుట్‌బాల్‌ టీమ్‌ గత పదిహేడేళ్లుగా వరుస తప్పకుండా సౌత్‌ థాయిలాండ్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో చాంపియన్లుగా ఉంటున్నారు.

Image result for KOH PANYI
                         ఆ ఊరి పేరు కోహ్‌ పాన్యి (KOH PAANYI). కోహ్‌ పాన్యి ఫుట్‌బాల్‌ టీమ్‌ ఒక గొప్ప సత్యాన్ని నిరూపించింది.
ఫుట్‌బాల్‌ ఆడాలంటే గ్రౌండ్‌ అక్కర్లేదు. పట్టుదల ఉంటే చాలు … అన్నీ వాటంతట అవే వస్తాయి. ఒంటి చక్రపు రథంపై, ఎవరి మాటా వినని ఏడు గుర్రాలకు పాములే పగ్గాలుగా బిగించుకుని, గుడ్డి, అవిటి సారథితో , ఆధారం లేని దారిలో కూడా పట్టుదల ఉంటే వెళ్లొచ్చు.
బతుకు పోరులోనూ గెలవాలంటే ధనం, సాధనం అక్కర్లేదు. పట్టుదల ఉంటే చాలు c. అన్నీ వాటంతట అవే వస్తాయి.
                        (కోహ్‌ పాన్యి టీమ్‌ కథను ఒక సంస్థ అయిదు నిమిషాల అడ్వర్టయిజ్‌మెంట్‌గా తయారు చేసింది. ఇంటర్నెట్‌లో KOH PAANYI అని టైప్‌ చేయండి. చూడండి.... ఆ తరువాత ఇలాంటి రచన మీరూ చేసేస్తారు... గ్రౌండ్‌ లేకుండానే కోహ్‌ పాన్యి కుర్రాళ్లు ఫుట్ బాల్‌ ఆడినట్టు మీరూ రాసేయగలరు. c అన్నట్టు c ఒంటి చక్రపు రథంపై, ఎవరి మాటా వినని ఏడు గుర్రాలకు పాములే పగ్గాలుగా బిగించుకుని, గుడ్డి, అవిటి సారథితో , ఆధారం లేని దారిలో వెళ్లే ఆయన ఎవరో తెలిసిందా? ఆయనే సూర్యభగవానుడు. ఆయన రథానికి ఒకే చక్రం. గుర్రాలు ఏడు. రజ్జువులు పాములు. సారధి అనూరుడు అవిటి, గుడ్డి.. ఆయన వెళ్లే దారి ఆకాశం.)

No comments