Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

Rss వేదిక పై ప్రణబ్ జి - megaminds

నాగ్‌పూర్ : జాతీయవాదం, దేశభక్తి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్...

నాగ్‌పూర్ : జాతీయవాదం, దేశభక్తి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ భారతదేశం నేపథ్యంలో జాతీయవాదం గురించి తనకున్న అవగాహనను పంచుకుంటానని చెప్పారు. దక్షిణాసియావ్యాప్తంగా హిందూయిజం ప్రభావం ఉందన్నారు. భారతదేశం మహనీయులకు పుట్టినిల్లని పేర్కొన్నారు.
Image may contain: 2 people, people standing

జాతీయవాదమంటే ఓ వ్యక్తి తన స్వంత దేశంతో గుర్తింపు పొందడమని, ఇది తన దేశం పట్ల అంకితభావం ప్రదర్శించడమని తెలిపారు. భారతదేశం తెరచి ఉంచిన సమాజమని చెప్పారు. మన దేశం అంతర్జాతీయంగా సిల్క్ రూట్ ద్వారా అనుసంధానమైందన్నారు. భారతదేశానికి వ్యాపారులు, ఆక్రమణదారులు వచ్చారన్నారు. శతాబ్దాల క్రితం మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు మన దేశంలో సమర్థవంతమైన పరిపాలన, గొప్ప విద్యా వ్యవస్థ ఉన్నాయని చెప్పారన్నారు.

మన దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు దాదాపు 1,800 సంవత్సరాలపాటు ప్రపంచంలోని నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షించాయన్నారు. సార్వత్రికవాదం నుంచి జాతీయవాదం ఉద్భవించిందని, ప్రపంచమంతటినీ మనం ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. సహనమే భారతదేశానికి బలమని తెలిపారు. ఆలోచనల భాగస్వామ్యాన్ని మనం శతాబ్దాల నుంచి విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అసహనం వల్ల మన జాతీయ గుర్తింపు నిర్వీర్యమవుతుందని హెచ్చరించారు. మన వైవిద్ధ్యాన్ని మనం సంతోషంగా స్వీకరిస్తామని చెప్పారు. మతం, అసహనం వంటివాటి ద్వారా మన దేశాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తే మన ఉనికి దెబ్బతింటుందని హెచ్చరించారు.

విద్వేషం వల్ల జాతీయవాదం నిర్వీర్యమవుతుందన్నారు. అసహనం వల్ల మన జాతీయ గుర్తింపు నిర్వీర్యమవడం తప్ప వేరొక ప్రయోజనం ఉండదని తెలిపారు. మన దేశంలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను చాలా రాజవంశాలు పరిపాలించాయన్నారు. ఆలోచనల సంగమం, అవగాహన సుదీర్ఘంగా జరిగిన అనంతరం మన దేశం ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. బహుళ సంస్కృతులు, విశ్వాసాలు మనల్ని ప్రత్యేకమైనవారిగా, సహనం కలవారిగా మార్చాయన్నారు.

తాను కళ్ళు మూసుకుని, భారత దేశం గురించి కలలు కంటున్నపుడు, త్రిపుర నుంచి ద్వారక వరకు, కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అనేక అంశాలను గుర్తు చేసుకుంటానన్నారు. లెక్కలేనన్ని మతాలు, వేర్వేరు భాషలు, మాండలికాలు, జాతులు, కులాలు ఒకే రాజ్యాంగం క్రింద సహజీవనం చేస్తూ ఉండటాన్ని తాను అద్భుతంగా భావిస్తున్నానని అన్నారు. మన దేశంలో 122 భాషలు, 1,600 మాండలికాలు, 7 ప్రధాన మతాలు, మూడు ప్రధాన ప్రాదేశిక వర్గాలు ఉన్నాయని, ఇవన్నీ ఒకే వ్యవస్థ క్రింద సహజీవనం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని వైవిద్ధ్యభరితం చేస్తున్న అంశం ఇదేనన్నారు. ప్రజా సంబంధాల్లో చర్చలు అవసరమని తెలిపారు. అభిప్రాయాల్లో బహుళత్వాన్ని నిరాకరించకూడదన్నారు. చర్చల ద్వారా మాత్రమే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు.,అవి చెప్పేందుకే వచ్చా: ప్రణబ్‌
నాగ్‌పూర్‌: దేశం అంటే ఏమిటీ , జాతీయత, దేశభక్తి అనే అంశాలను దేశ దృక్కోణంలో ఏమిటో వివరించడానికి వచ్చాను అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షా వర్గ్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనేక మంది విదేశీ యాత్రికులు భారతీయత గురించి స్పష్టతను ఇచ్చారన్నారు. తక్షశిల నలంద, విక్రమశిల భారతీయ విద్యావ్యాప్తికి నిదర్శనమన్నారు. బౌద్ధమతం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకు విస్తరించిందని వివరించారు. జాతి, జాతీయత అన్న భావన ఐరోపా కంటే ముందే భారత్‌లో ఏర్పడిందని తెలిపారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే భావనలు విశాల తాత్వికతకు నిదర్శనమన్నారు. బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవన విధానంలోనే ఉందని తెలిపారు. అసహనం, ఆందోళన అన్నవి మన జాతీయ భావనను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1857 తర్వాత భారత్‌లో తొలిసారి కేబినెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. తొలిసారి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ను నియమించారని తెలిపారు. ఈ దేశం, జాతీయత ఒక కులం, మతం, వర్గానిది కాదన్నారు. జాతీయ భావన అనేది మతాలకు అతీతంగా వస్తుందని అన్నారు. భారత రాజ్యాంగం నిర్వహణకు గైడ్‌ కాదని.. వంద కోట్ల మంది ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. విభిన్నమైన సంస్కృతులు భారత్‌ను ఏకం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి విషయంలో ప్రజల పాత్ర ఉండాలన్నారు. ఇటీవల కాలంలో హింస పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. మనం శాంతి సామరస్యాల కో్సం పనిచేయాలన్నారు. మన మాతృదేశం ఇదే కోరుకుంటోందన్నారు. కౌటిల్యుడి మాటల ప్రకారం ప్రజల సంతోషమే పాలకులకు సంతోషమన్నారు. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమమన్నారు.
ఆ అంశంపై చర్చ అనవసరం..: భగవత్‌
‘ఆయన్ను ఎందుకు పిలిచారు’ అనే అంశం పై చర్చ నిరర్ధకమని మోహన్‌ భగవత్‌ అన్నారు. సమాజం మొత్తాన్ని ఏకం చేయడానికి సంఘ్‌ ఉందని తెలిపారు. భారత పౌరులు అయితే చాలన్నారు. ఇక్కడ పుట్టిన వారు దేశాన్ని ప్రేమించాలన్నారు. దేశం మనకు వ్యక్తిత్వాన్ని కూడా ఇచ్చిందన్నారు. మన దేశానికి ప్రకృతి పరమైన రక్షణ ఉందని పేర్కొన్నారు. ఇతరులు దేశంలోకి వచ్చిపోవడం తేలిక కాదని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్‌లో ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. సంఘ్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ ఆలోచనలు ఎప్పుడూ దేశవిముక్తి చుట్టూ తిరిగేవన్నారు. ఒకే లక్ష్యం కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించేవారిని ఆయా మార్గాల్లోనే వెళ్లనివ్వాలన్నారు. రాజకీయ సిద్ధాంతాల్లో వైరుధ్యం ఉందని తెలిపారు. అందరి తల్లి భారత మాతే అని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలపై భారత సమాజ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందోన్నారు. సమాజంలో వర్గాలను పెంచడానికి కాదు సమాజం మొత్తాన్ని ఒకే వర్గంగా తీర్చిదిద్దటానికి సంఘ్‌ ఉందని తెలిపారు. సమాజంలో ఉన్నత వ్యక్తులను అనుసరించి సామాన్యులు ప్రవర్తిస్తుంటారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో మంచి ఆలోచనలకు లోటు లేదని తెలిపారు. విద్యను సమాజంలో జ్ఞానాన్ని పెంచడానికి, ధనాన్ని మంచిపనులకు, శక్తిని బలహీనుల రక్షణకు వినియోగించాలన్నారు. అందరి కోసం సంఘ్‌ పనిచేస్తుందన్నారు. అందరి మంచి కోసం పనిచేస్తున్నామని భావిస్తే ఎవరైన రావచ్చని ఆహ్వానించారు. తాము ఎలా ఉంటామో అలానే కనిపిస్తామన్నారు. అందరినీ కలుపుకొని పోతామన్నారు. నచ్చినవారు మాతో కలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు రామ్‌ హర్కరే, రాజేష్‌ లోయా తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు కవాతు నిర్వహించారు.
ఆరెస్సెస్ భారతీయులందరి కోసం : మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కేవలం హిందువుల కోసం కాదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్తు సమాజానికి ఆరెస్సెస్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. ఇది భారతీయులందరి కోసం పని చేసే సంస్థ అని పేర్కొన్నారు. భారతీయుడికి మరో భారతీయుడు పరాయివాడు కాదన్నారు. భారతదేశం అనేక వేల సంవత్సరాల నుంచి భిన్నత్వాన్ని కొనసాగిస్తోందన్నారు. భారతదేశానికి సహనం, సంయమనంతో వ్యవహరించే చరిత్ర ఉందని తెలిపారు. యావత్తు సమాజాన్ని సమైక్యపరచాలన్నదే ఆరెస్సెస్ లక్ష్యమని చెప్పారు. ఆ సంస్థ కార్యకర్తలనుద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గొప్ప విజ్ఞానవంతుడని, ఆయన ఎప్పటికీ ఆయనలాగే ఉంటారని అన్నారు. ఆయన వంటి విజ్ఞానులను ఆహ్వానించి, వారి సందేశాన్ని అందుకోవడం ఆరెస్సెస్‌కు సాధారణ విషయమేనని చెప్పారు. ప్రణబ్‌ను ఆహ్వానించడంపైనా, ఆయన ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనడంపైనా వస్తున్న విమర్శలను భగవత్ తిప్పికొట్టారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రణబ్ మారిపోరని స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు చాలా పనులను చేయగలిగినా, అన్ని పనులను ప్రభుత్వాలే చేయజాలవన్నారు. భిన్నమైన ఆలోచనలు, సిద్ధాంతాలు సహజీవనం చేయడం సాధ్యమేనని చెప్పారు. తమ సంస్థతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పని చేశారన్నారు. బిన్నత్వమే మన బలమని పేర్కొన్నారు. హెడ్గేవార్ ఓ కాంగ్రెస్ కార్యకర్తగానే జైలుకెళ్ళారని గుర్తు చేశారు. ప్రతి భారతీయుడు దేశాన్ని పూజించాలన్నారు. ప్రతివారికీ పూర్వీకులు ఉంటారని, హిందువులు భారతదేశ వారసులని వ్యాఖ్యానించారు. అందరికీ తల్లి భారత మాత అని పేర్కొన్నారు. అందరూ దేశం కోసం సంఘటితమవ్వాలని పిలుపునిచ్చారు. సహనమనేది భారతదేశ సంప్రదాయంలోనే ఉందన్నారు.

ఆరెస్సెస్ ప్రజాస్వామిక ఆలోచనా విధానంతో నడుస్తోందని తెలిపారు. మార్పు కోసం ప్రజలంతా సంఘటితమవ్వాలన్నారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..