Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఎలుకలు...ఎక్కడపడితే అక్కడ ఎలుకలు1

ఎలుకలు...ఎక్కడపడితే అక్కడ ఎలుకలు.... పంటల్ని నాశనం చేస్తున్నాయి...ధాన్యాన్ని తినేస్తున్నాయి...నేలను తవ్వేస్తున్నాయి...కొండల్ని కరిగించేస్...

ఎలుకలు...ఎక్కడపడితే అక్కడ ఎలుకలు....



పంటల్ని నాశనం చేస్తున్నాయి...ధాన్యాన్ని తినేస్తున్నాయి...నేలను తవ్వేస్తున్నాయి...కొండల్ని కరిగించేస్తున్నాయి.
ఈ ఎలుకలన్నిటికీ ఓ లీడర్...ఆయన పేరు మూషికాసురుడు....మూషికాసురుడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది.

ఈ మూషికాసురుడు మామూలుగా పుట్టలేదు. ఉత్తాంక ఋషికి ఓ అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు మాలతి. ఆ మాలతి అందాన్ని చూసి రావణాసురుడు మోహించాడు. ఆమెను బలవంతంగా అనుభవించి, గోదావరిలో పారేశాడు. గోదావరి దయతలిచి ఆమెను ఒడ్డుకు చేర్చింది. అక్కడనుంచి ఇందురుడనే రాక్షసుడు ఆమెను సురక్షిత స్థలానికి చేర్చాడు. తాను చేసిన సేవకు ఇందురుడు లంచం అడిగాడు. ఇంతకూ లంచమేమిటంటే మాలతి తనతో సంభోగించాలి. ఈ అపవిత్ర సంభోగాల నుంచే పుట్టాడు మూషికాసురుడు. వాడికి బలం డబుల్ డోసులో పడింది. వాడు లోకకంటకుడయ్యాడు.

చివరికి జనం అంతా జనార్దనుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు....దేవుడికి దయ కలిగింది. "భయపడకండి. మూషికాసురుడి పని పట్టేందుకు ఒక పెద్ద పిల్లి రూపంలో వస్తాను." అన్నాడు. 

దేవుడు రాజకీయనాయకుడు కాదు కదా ఇచ్చిన మాట తప్పడానికి! భీకరమైన మూషికాసురుడి పనిపట్టేందుకు అంతకన్నా భీకరమైన పిల్లి బయలుదేరింది. పిల్లిని చూడగానే మూషికాసురుడి పై ప్రాణాలు పైకే పోయాయి. భయంతో పరుగులు పెట్టాడు. ఎక్కడికి వెళ్లినా పిల్లి వెంటాడుతూనే ఉంది. వేటాడుతూనే ఉంది. చివరికి గంధమాదన పర్వతం మీదకు ఎలుక పరుగుతీసింది. పిల్లి వెనకాలే తరుముతూ వచ్చింది. గజగజవణుకుతూ ఎలుక కొండలోని ఒక కలుగులోకి దూరిపోయింది. ఆ కలుగు ముందే పిల్లి విగ్రహమై నిలిచిపోయింది. ఎలుక కలుగునుంచి బయటకు వద్దామని చూసినప్పుడల్లా కలుగు ముఖద్వారం ముందు తన కోసం ఎదురుచూస్తున్న పిల్లి విగ్రహం కనిపించేంది. ఎలుక తోకముడిచి కలుగులోనే ఉండిపోయేది.

దేవుడు పిల్లి రూపం ఎత్తిన చోటే మార్జాల కేసరి మందిరం తయారైంది. దాన్నే బిడాల కేసరి మందిరం అంటారు. మార్జాలం అన్నా బిడాలం అన్నా పిల్లి అని అర్థం. దీన్ని నృసింఘనాథ్ మందిరం అని కూడా అంటారు. పశ్చిమ ఒడీశా (ఒరిస్సా) లోని బరగఢ్ జిల్లాలో గంధమాదన పర్వతం ఉంది. దానిపై ఉంటుంది ఈ మార్జాల కేసరి మందిరం. 

మార్జాల కేసరి దయతో గంధమాదన పర్వతం ఒక అద్భుతమైన, అందమైన పచ్చని అడవి నిండిన ప్రదేశం అయింది. నేలపై 50 వేల రకాల ఔషధీ మొక్కలు ఉన్నాయి. అరుదైన జీవ జంతువులు నిర్భయంగా బతుకుతున్నాయి. నేల అడుగున అపురూప ఖనిజాలు, లోహాలు, మినరల్స్ అంతులేనంతగా ఉన్నాయి. రామాయణ, భారతాల్లోనూ గంధమాదనం ప్రస్తావన ఉంది. అంత పాత కొండ ఇది.

కొన్నేళ్ల క్రితం అనూహ్యంగా మార్జాల కేసరి విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. ఎంత వెతికినా దొరకలేదు.

అంతే....కొండ కలుగులోంచి ఎలుకలు బయటకొచ్చేశాయి. అసలు సమస్య అప్పుడే మొదలైంది. 

మూషికుడు, వాడి సైన్యం 21వ శతాబ్దపు రూపంలో వచ్చారు. రాజకీయ రావణుడు, కార్పొరేట్ మాఫియా అనే ఇందురుడు కలిసి పుట్టించిన మైనింగ్ మూషికులు వాళ్లు. ఒక ఎలుక ఓ బడా కంపెనీ రూపంలో బాక్సైట్ తవ్వకం మొదలుపెట్టింది. కొండను కరిగించేయడం మొదలుపెట్టింది. నేలలోతుల్లోని ఈ అపురూప సంపద కోసం ఇంకా ఎన్నో బడాబడా మూషికాలు వచ్చేశాయి. కొండను ఫలహారం చేసేయడం మొదలుపెట్టాయి. 

ఇంతలో సంభల్ పూర్ రైల్వేస్టేషన్ లో ఒక మూట పడిఉందని వార్తలు గుప్పుమన్నాయి. అదేదో బాంబు అని ముందు భయపడ్డారు. నెమ్మదిగా విప్పి చూస్తే లోపల మార్జాల కేసరి విగ్రహం ఉంది. విగ్రహాన్ని దొంగిలించిన వాడికి ధైర్యం చాలక వదిలేసి వెళ్లాడు. 

ఇప్పుడు మళ్లీ మార్జాల కేసరి గంధమాదన పర్వతం పైకి వచ్చేశాడు. ఏం జరిగిందో ఏమో...మైనింగ్ మాఫియా లైసెన్సు క్యాన్సలైంది. ఇంకో కంపెనీ ప్రయత్నిస్తే పర్మిషన్ రాలేదు. మరో రెండు మూడు కంపెనీలూ తవ్వుకుపోయేందుకు ప్రయత్నించాయి. మార్జాల కేసరి అడ్డంపడ్డాడు. అనుమతులు రాలేదు. ఇప్పుడు మళ్లీ కలుగు ముఖద్వారంలో మార్జాల కేసరి నిలుచున్నాడు. "కథ పిల్లి వచ్చె...ఎలక గప్ చుప్" అయిపోయింది.

నీతి: వనరులనే గంధమాదనాన్ని కార్పొరేట్ మాఫియా, కరప్ట్ బ్యూరోక్రసీ, పనికిమాలిన పాలిటీషియన్ల అక్రమ సంబంధం నుంచి పుట్టిన మూషికాసురుళ్లు ఫలహారం చేయకుండా పని పట్టాలంటే జనతా జనార్దనుడు మార్జాల కేసరి అవాల్సిందే మరి!!

No comments