Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చెప్పులు కుట్టేవాడి ముని ముని ముని మనవడొచ్చాడురోయ్ - raka sudhakar

ఆయన పేరు థామస్ కియర్నే. ఆయన బూట్లు తయారుచేసేవాడు. కష్టపడిపనిచేసేవాడు. ఆదాయమూ అలాగే వచ్చేది. కుటుంబం సాఫీగా గడిచిపోయేది. ఆయన కొడుకు ఫాల్ మ...

ఆయన పేరు థామస్ కియర్నే. ఆయన బూట్లు తయారుచేసేవాడు. కష్టపడిపనిచేసేవాడు. ఆదాయమూ అలాగే వచ్చేది. కుటుంబం సాఫీగా గడిచిపోయేది. ఆయన కొడుకు ఫాల్ మౌత్ కియార్నే పొరుగూరిలో వ్యాపారం బాగుంటుందని ఉన్న ఊరు వదిలేశాడు. పొరుగూరి పేరు మనీగాల్. పొరుగూరిలో ఆయన చెప్పులు కుట్టేవాడి కొడుకుగానే పేరొందాడు.
అంతలో ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు తాండవించింది. బతుకే దుర్భరమైంది. ఆహారంలో వాళ్లకి ఆలుగడ్డలే (బంగాళాదుంపలే) ప్రధానం. వాటికి పురుగుపట్టింది. పంటంతా పాడైపోయింది. దేశంలోనే తిండి కరువైంది.
చివరికి అక్కడ ఉంటే ఆకలితో చావడం ఖాయం అనుకున్నాడు. సొంతూరు నుంచి లివర్ పూల్ రేవుకు వచ్చి మార్మియన్ అనే పడవ ఎక్కి ఆశల దేశం అమెరికాలో ఆశ్రయం కోసం తరలివెళ్లాడు. ఆయనతో పాటు మరో 289 మంది బయలుదేరారు. మార్చి 20, 1850 నాడు న్యూయార్క్ తీరానికి చేరారు.
అక్కడ నుంచి ఓహాయోకి వెళ్లి పొలం పనులు చేయడం మొదలుపెట్టాడు. ఆయన అక్కడే పెళ్లిచేసుకుని, ఎంచక్కా పది మంది పిల్లల్ని కన్నాడు. అందులో ఒక కూతురు పేరు మేరీ యాన్ కియర్నే. ఆమె జేకబ్ విలియం డున్హం అనే యువకుడిని పెళ్లాడింది. వాళ్లకి ఒకే ఒక్క సంతానం. పేరు స్టాన్లీ డున్హం. ఆయన మొదట్లో చమురు బావుల్లో పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేరాడు. ఆయనకు ఒకే కూతురు. ఆమె పేరు యాన్ డున్హం.
ఈ యాన్ డున్హంకి పుట్టాడు మన హీరో. ఇప్పుడాయన చాలా పెద్దవాడు. ప్రపంచ చరిత్రనే కాదు, ప్రపంచ పటాన్ని మార్చేసేంత శక్తివంతుడు.
ఇప్పుడాయన తన బంధువులెవరైనా ఉన్నారా అంటూ అమెరికా నుంచి మనీగాల్ గ్రామానికి వచ్చాడు. అయిదు తరాలు, 161 సంవత్సరాల తరువాత మనీగాల్ ఉండే దేశం అయిన ఐర్లండ్ కి వచ్చాడు. తన పూర్వీకుల ఇల్లును చూశాడు. ఆనందంతో మురిసిపోయాడు. సంతోషంతో కేరింతలు కొట్టాడు. ఆ ఇంటి ముందు తాను వచ్చినట్టు ఓ శిలాఫలకం ఏర్పాటు చేశాడు. పసిఫిక్ సముద్రానికి అటూ ఇటూ అయిపోయిన తన కుటుంబంలో ఓ 28 మంది బంధువులనూ గుర్తించాడు. వాళ్లని కౌగలించుకుని మహోద్వేగానికి గురయ్యాడు.
ఇంతా చేస్తే ఆ మనవడి ఒంట్లో ఐరిష్ దనం ఎంతనుకున్నారు? శాస్త్రవేత్తలు, వంశవృక్షాల రీసెర్చర్లు లెక్కగట్టి చెప్పినదాని ప్రకారం మనవడిలో ఐరిష్ దనం కేవలం 3.1 శాతం. 3.1 శాతం కోసం ఖండాంతరాలు దాటి, దేశాంతరాలు దాటి, సముద్రాలు దాటి వచ్చాడు ఆ మనవడు.
ఐర్లండ్ నుంచి అమెరికాకి వచ్చిన 3,59,75,855 మంది ఐరిష్ సంతతిలో ఆయన ఒకడు. ఈ 3.1 శాతం ఆయన్ని అయిదు తరాల వెనక్కి తవ్వుకుపోయేలా చేసింది. అమెరికా నుంచి ఐర్లండ్ కి రప్పించింది.
మనం మన చరిత్రను, పరంపరను, వారసత్వాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంటిపేరును, పేరు వెనక తోకల్ని తెంచేసుకునేందుకు తెగ హడావిడిపడిపోతున్నాం. అదేదో ప్రగతిశీలమని భ్రమపడుతున్నాం. మనదైనవన్నీ మనకు నచ్చవు. పరాయివంటే తెగ ప్రీతి. 3.1 శాతం ఐరిష్ దనం తోనే చెప్పులు కుట్టేవాడి ముని ముని ముని మనవడినని చెప్పుకుని మురిసిపోతున్న ఆ మనవడిని చూసైనా వేల యేళ్ల చరిత్ర ఉన్న భారతీయులం మనం ఏదైనా నేర్చుకోవచ్చంటారా?
ఇంతకీ ఆ మునిముని ముని మనవడి పేరేమిటో చెప్పలేదు కదూ! ఆయన పేరు బరాక్ హుసేన్ ఒబామా. ఆయన మే, 24, 2011 న ఐర్లండ్ లోని తన పూర్వీకుల ఊరును సందర్శించాడు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments