Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ సామ్రాజ్య దినోత్సవo ఎందుకు జరుపుకోవలి? - megamindsindia

మూడు వందల నలభై మూడు సంవత్సరాల క్రితం 1674 లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి పుణ్యతిథి రోజున మహారాష్ట్రలోని రాయిగఢ్‌ దుర్గంలో అంగరంగ వైభవంగా జరిగిన...

మూడు వందల నలభై మూడు సంవత్సరాల క్రితం 1674 లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి పుణ్యతిథి రోజున మహారాష్ట్రలోని రాయిగఢ్‌ దుర్గంలో అంగరంగ వైభవంగా జరిగిన శివాజీ భోంస్లే పట్టాభిషేక సందర్భం భారతదేశ చరిత్రలో ఒక అతిముఖ్యమైన పరిణామం. అప్పటికి సుమారు 150 సంవత్సరాలకు ముందు సంభవించిన విజయనగర సామ్రాజ్య పతనం తరువాత ఏ హిందూ పరిపాలకుడు శాస్త్రోక్తమైన పద్ధతిలో ఛత్రపతిగా కిరీటధారణ చేయలేని పరిస్థితి ఏర్పడింది. హిందూ సమాజపు ఆత్మవిశ్వాసం అత్యంత హీనస్థితికి దిగజారిన కాలఖండమది. అతిశక్తి శాలియైన మొగలాయి పాదుషా ఔరంగజేబు ఉత్తరాది నుండి, దక్షిణభారతంలోని అసఫ్‌షాహీలు, కుతుబ్‌షాహీలు అడుగడుగునా అవరోధాలుగా నిలిచి ఉన్నపటికీ, పరిమిత వనరులతో అతిసామాన్య వ్యక్తులతో అట్టడుగు సామాజిక వర్గాల ప్రజల భాగస్వామ్యంతో, బలిదానాలతో నిర్మితమైన ప్రబల హైందవీ సామ్రాజ్యం శివాజీది.

భక్తతుకారాం భక్తితత్త్వానికి తోడు సమర్థ రామదాసస్వామి ధార్మిక ప్రబోధాలతో ప్రభావితమైన మరాఠా హిందూ సమాజాన్ని సంఘటితపరచి, చైతన్యపరచి, కార్యోన్ముఖం చేసి కేవలం మరఠ్వాడ ప్రాంతంలోని హిందువులకే కాక యావద్భారత దేశంలోని హిందూ సమాజానికి ఆశాజ్యోతిలా నిలిచిన శివాజీ పట్టాభిషేకానికి చరిత్రలో ఎనలేని ప్రాధాన్యం ఉన్నదని చెప్పక తప్పదు.

శక్తివంతులు, క్రూరస్వభావులైన విదేశీ, విధర్మీయ పరిపాలకులను నిలువరించి స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాక ఆ సామ్రాజ్యాధిపతి తన వ్యక్తిగత శీలప్రకటీకరణ ద్వారా, పరిపాలనా పద్ధతి ద్వారా శతాబ్దాలకు సరిపడ ఆదర్శాలు పొందుపర్చబడిన సందర్భంగా దీనిని అభివర్ణించవచ్చు. ఛత్రపతిగా అభిషిక్తుడైన శివాజీ నిస్సందేహంగా మహాయోధుడు. ఎలాంటి విపత్కర పరిస్థితులలోను తొణకక, బెణకక సరియైన నిర్ణయాలను తీసుకోగలిగిన ధీశాలి. అది యుద్ధ భూమి కావచ్చు లేదా పరిపాలనారంగం కావచ్చు. రెండింటిలోనూ ఆయన సవ్యసాచి లాంటివాడు.

పరిస్థితుల ప్రభావం వలన దూరమైన ఆత్మీయులను ఆదరించడంలో, క్షమించడంలో, అక్కున చేర్చుకోవడంలో ఆయన సాక్షాత్తు భోళాశంకరుడే. అపార్థాల మూలంగా తనను వదలి వెళ్లిన మహాయోధుడు నేతాజీ ఫాల్కర్‌ అనివార్య పరిస్థితులలో మహ్మదీయుడిగా మారినప్పటికీ ఆ తరువాత కాలంలో పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న అతనిని మన్నించి ధార్మిక పునరాగమన ప్రక్రియ ద్వారా మరల హిందువుగా మార్చి తన సమీప బంధువైన అమ్మాయితో వివాహం జరిపించి అక్కున చేర్చుకున్న సంఘటన హిందూ సమాజానికి అపురూపమైన మార్గదర్శక సూత్రమని చెప్పక తప్పదు. దౌర్జన్యపు మతమార్పిడులతో దేశం అతలాకుతలమవుతున్నప్పడు పునరాగమన ప్రక్రియ ద్వారా దానిని నిలువరించాలని అమలుచేసి చూపినవాడు శివాజీ – అంగీకరించి వెన్నంటి నిలిచి నది అతని ప్రభుత్వ యంత్రాంగం, సహచరగణం.

అదే సమయంలో స్వార్థప్రయోజనాల కొరకు, స్వరాజ్య స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతాన్ని కలిగించే వ్యక్తులు రక్తసంబంధీకు లైనప్పటికీ వారిని శిక్షించవలసివచ్చినప్పుడు ఎంత కఠినంగా ప్రవర్తించాడంటే ఆ సమయంలో ఆయన ఆ ‘ముక్కంటి’ని జ్ఞాపకం చేస్తాడు. తన తండ్రికి అత్యంత ఆత్మీయుడైన ‘ఖండోజీ’ స్వరాజ్య ప్రయత్నా లకు ద్రోహం తలపెట్టినప్పడు అతని ఎడమ కాలును, కుడి చేతిని నరికించిన సందర్భం అలాంటిదే. స్వరాజ్య ప్రభుత్వం దేశద్రోహులను, ధర్మద్రోహులను ఏ విధంగానూ క్షమించదని స్పష్టంగా ప్రకటించడం ఈ ప్రవర్తన ముఖ్య ఉద్దేశ్యం. ఈ సూత్రానికి రక్తసంబంధం ఏ విధంగానూ అవరోధం కాదని స్పష్టీకరించడం ప్రధానమైన ఆలోచన.

అదేవిధంగా చక్రవర్తి బంధువులకు మాత్రమే లేదా రక్తసంబంధీకులకు మాత్రమే కీలకమైన పదవులు లభిస్తాయనే అపప్రథ ఆ సమయంలో తొలగిపోయింది. సమర్థత ఆధారంగా మాత్రమే వ్యక్తులకు ప్రాధాన్యత లభించింది. ఆయన ఆధీనంలోని మూడు వందల పైచిలుకు కోటలకు అధిపతులుగా నియమించిన వారిలో ఒక్కరు కూడా ఆయన బంధువు కాదు. అత్యంత కీలక సమయంలో ఆయన ప్రధాన రక్షకుడిగా కర్తవ్య నిర్వహణ చేసిన ‘జీవోబా మహాలా’ వంటి వారు కనీసం ఆయన రక్తసంబంధీకులు కూడా కాదు. స్వరాజ్య నిష్ఠ పట్ల వారికి గల అపారమైన నిబద్ధత ఆధారంగానే వారు ఎంపికయ్యేవారు.

ప్రాచీన హిందూ సామ్రాజ్యాల నిర్మాణంలో మిత్రరాజ్యాల పాత్ర చాలా కీలకమైనది. ఒక రాజ్యాన్ని గెలుచుకున్న తరువాత కూడా, ఆ రాజ్యం నుండి కొద్దిపాటి మొత్తాన్ని మాత్రమే పరిహారంగా స్వీకరించి, ఆ రాజ్యాన్ని పరాజితుడైన పరిపాలకునికి గాని లేదా అతని సంతానానికి గాని అప్పజెప్పి పరాజితమైన రాజ్యాన్ని కూడా మిత్రరాజ్యంగా మలుచుకోవాలనే రాజనీతి సూత్రం అత్యంత ప్రధానమైనది. శివాజీ దీనిని ఆచరించి చూపాడు. బుందేల్‌ఖండ్‌ పాలకుడైన ఛత్రసాలను తన సామంతుడిగానో లేదా సేనాపతిగానో కాక, స్వతంత్రుడైన మిత్రరాజుగా వికసింపజేయడంలో శివాజీ పరిణతి హిందూ సామ్రాజ్యాధిపతికి ఉండవలసిన ముఖ్య లక్షణాలుగా మహాభారతంలో చెప్పిన రాజనీతి సూత్రాలకు అనుగుణంగా ఉంది.

ప్రాచీన సామ్రాజ్యాధిపతులు ఎంత వ్యక్తిగత శీలాన్ని కలిగి ఉండేవారో అదేస్థాయిని శివాజీ ఆవిష్కరించిన తీరు అత్యద్భుతం. తమ సేనానులు మహ్మదీయుల ఆక్రమణలో ఉన్న కల్యాణదుర్గాన్ని జయించినపుడు యవ్వనవతి, అత్యంత సౌందర్యవతి అయిన ఆ దుర్గపు సుబేదార్‌ కోడలు తన వారికి బందీగా చిక్కి తనకు బహుమతిగా సమర్పించ బడినపుడు, ఆమెను తల్లిగా భావించి సగౌరవంగా ఆమె తండ్రి వద్దకు పంపినపుడు కాముని జయించిన కామభావ విజేత పరమశివునిగా శివాజీ గోచరిస్తాడు. ఈ సంఘటన మూలంగానే మొగలాయి సేనాధిపతి ‘దిలేర్‌ఖాన్‌’ శివాజీ యెడల అత్యంత గౌరవభావాన్ని పెంపొందించుకోవడం గొప్ప విశేషం.

అనుచరులలోను, సామాన్య ప్రజలలోను శివాజీ నిర్మాణం చేసిన ధార్మిక భావనలు, ధార్మిక నిష్ఠలు, స్వరాజ్య కాంక్షల ఫలితం సామ్రాజ్య నిర్వహణలో ప్రతిఫలించడం ఒక గొప్ప పరిణామం. కొన్ని వందల సామాన్య వ్యక్తులు అసామాన్యులుగా మారి దీపస్తంభాలుగా మారిన వైనం అధ్యయనానికి పనికి వచ్చే అంశం. తానాజీ మాల్‌ సురే, యస్సాజీకంక్‌, బాజీప్రభుదేశ్‌పాండే, ఖండోభల్లాల్‌ వంటి త్యాగ ధనులు సామాన్యులైనప్పటికీ చరిత్ర స ష్టించారు. కాబట్టే శివాజీ స్వరాజ్యానికి దూరంగా ఎక్కడో ఆగ్రాలో మొగలాయిల నిర్బంధంలో ఉన్నప్పటికీ హిందూ సమాజం నిబ్బరాన్ని కోల్పోలేదు. సామ్రాజ్య వ్యవస్థ విచ్ఛిన్నం కాలేదు. విదేశీ విధర్మీయులతో సంఘర్షణ కొనసాగించింది. అంతిమంగా విజయాన్ని సాధించింది.

నెదర్లాండ్‌ పాలకులతో శివాజీ సామ్రాజ్యం ఒప్పందాన్ని చేసుకున్నపుడు ఆయన ఏలుబడిలో ఉన్న భూభాగాల్లోంచి వ్యక్తులను బంధించి విదేశాలలో బానిసలుగా అమ్మకం సాగించడానికి వీలులేదనే నిబంధన విధించాడు. అంతేకాదు దానికి అను గుణమైన రాజశాసనం చేశాడు. 350 సంవత్సరాల నాటి హిందూ సామ్రాజ్య పరిపాలనా వ్యవహారంలో ఇలాంటి ఆధునిక భావన చోటుచేసుకొని ఉండడం ఎంత అపురూపమైన విషయమో మనకు అవగత మవుతుంది గదా !

పరిపాలకుల వైభవాల కోసం, విలాసాల కోసం కాక శివాజీ సామ్రాజ్యపు సంపద ప్రజల ఆర్థిక వికాసం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం, రహదారుల నిర్మాణం కోసం, రక్షణకు అత్యంత ఆవశ్యకమైన కోట ఆధునీకరణ కోసం వెచ్చించాడు. ఆ విధంగా తాను సాధించిన సర్వసంపదలను తన కోసం కాకుండా, తన ప్రజల కోసమే ఉపయోగించే ప్రాచీన ప్రభువుల జాబితాలో ఆయన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బ్రిటీష్‌ వారు తమ నాణేల ముద్రణశాలలో శివాజీ సామ్రాజ్య నాణాలను కూడా ముద్రించడానికి అనుమతిని కోరారు. కానీ శివాజీ ఆ ప్రతిపాదనను తిరస్కరించి, సామ్రాజ్యపు నాణాల ముద్రణ విషయంలో స్వదేశీ సూత్రానికి ఉన్న ప్రాధాన్యతకు పెద్దపీటవేశాడు.

ప్రభువుగా తన విచక్షణకే పెద్దపీట పడాలని, సర్వాధికారాలు తన వద్దనే ఉండాలని భావించకుండా ప్రాచీన హిందూ పద్ధతిలో అష్టప్రధానులను ఏర్పరచి సామ్రాజ్య నిర్వహణ వ్యవహారాలను వారికి అప్పజెప్పడంలో సాంప్రదాయ హిందూ ప్రభువుల వ్యవహారశైలిని ఆయన అక్షరాల పుణికి పుచ్చుకున్నాడు. గురుదేవులైన సమర్థ రామదాసుని, ఆయన మార్గదర్శనాన్ని చివరివరకు అనుసరించడం ద్వారా ధార్మికనేతలకు తన సామ్రాజ్యంలో ఎంతటి ప్రాధాన్యం ఉందో స్పష్టీకరించాడు. రాజదండాని కన్నా ధర్మదండానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలన్న విషయాన్ని ఆచరణాత్మకంగా చూపించాడు.

1680 సంవత్సరంలో శివాజీ స్వర్గస్తుడైన తరువాత కూడా ఆయన నిర్మించిన హిందూ సామ్రాజ్యం విచ్ఛిన్నం కాలేదు సరికదా శతాబ్దకాలం పాటు భారతదేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన, వాస్తవం మన కనుల ముందు ఉంది. అది శివాజీ సామ్రాజ్యమని, దాని వైభవ పతనాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సాధారణ హిందువులు భావించి ఉంటే శివాజీ సామ్రాజ్యం అంతకాలం నిలిచి ఉండేదే కాదు.


మహారాష్ట్ర భూభాగం ఆధారంగా శివాజీ నిర్మించిన హిందూ సామ్రాజ్య ప్రభావం పొరుగు రాజ్యాల ప్రభువుల మీద కూడా పడిందన్నది చారిత్రక వాస్తవం. శక్తివంతమైన హిందూ సామ్రాజ్యం పొరుగున విలసిల్లుచుండగా మహ్మదీయ పరిపాలకులు తమ దురాగతాలను అదుపుచేసుకోక తప్పదుగదా! సరిహద్దు రాజ్యాలైన బీజాపూర్‌, గోల్కొండలలో భక్తరామదాసు విడుదల, గోవద నిషేధచట్టం అమలులోకి రావడానికి శివాజీ హైందవ సామ్రాజ్య ప్రాభవం ఒక ప్రధాన కారణం.

అల్పసంఖ్యాక మత వర్గాల విషయంలో శివాజీ సామ్రాజ్యం వ్యవహరించిన తీరు అత్యంత ఆదర్శనీయం. నిజమైన హిందూ సామ్రాజ్య లక్షణాన్ని ఆ ప్రభుత్వం వ్యక్తపరిచిన తీరు అద్భుతం. శివాజీ సామ్రాజ్యంలో ఏనాడూ అల్పసంఖ్యాక సమూహాల స్త్రీల గౌరవానికి భంగం కలుగలేదు. వారి ఆరాధనా స్థలాల భద్రతకు ప్రమాదం ఏర్పడలేదు. వారి మతవిశ్వాసాల ఆచరణకు ఆటంకం ఏర్పడలేదు. ఏ అల్పసంఖ్యాక మతవర్గాల వారికైనా అదే రకమైన రక్షణ కల్పించేవారు. ఇతరుల మతభావాలను గౌరవంతో ఆదరించే హిందుత్వ ధార్మిక నిష్ఠ అత్యంత శ్రేష్ఠంగా అమలు చేసిన ఆదర్శనీయ రాజ్యవ్యవస్థ శివాజీ సామ్రాజ్యంలో విలసిల్లింది.

కాబట్టే శివాజీ పట్టాభిషేకం ఒక ప్రభువు సింహాసనాధిపత్య కార్యక్రమంలా కాక హిందూ సామాజిక, ధార్మిక, రాజనీతి విలువల పట్టాభిషేక ఉత్సవంగా పరిగణించాల్సి ఉంది. శివాజీ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ‘హిందూ సామ్రాజ్య ప్రాభవ దినం’గా పరిగణిస్తారు. యావత్తు హిందూ సమాజం ఈ విషయాన్ని స్వీకరించవలసి ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments