
లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం అసాధ్యమన్నది "భారత న్యాయ వ్యవహారాల మండలి’ వారి విచిత్ర ప్రతిపాదనల సారాంశం! మధ్యంతరంగా ఎన్నికలను జరపడాన్ని నిరోధించడానికి వీలుగా ఈ ‘మండలి’ చేసిన ప్రతిపాదనలు మరిన్ని మధ్యంతర విన్యాసాలకు దారితీయగలవు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను ‘మండలి’ వారు రూపొందించడం మరో విచిత్రం! ‘మండలి’ వారు బహుశా గమనించని మరో విచిత్రం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ, శాసనసభల పదవీ వ్యవధి ఐదేళ్లు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని యాబయి రెండవ నిబంధన ప్రకారం ఆ ‘రాష్ట్రం’ శాసనసభ పదవీ వ్యవధి ఆరు సంవత్సరాలు. అందువల్ల మొదట ఈ అంతరాన్ని పరిష్కరించడం కోసం జమ్మూ కశ్మీర్ రాజ్యాంగానికి సవరణ జరగాలి! జమ్మూ కశ్మీర్‌ను ఈ ‘సమాంతర వరణ ప్రక్రియ’ నుంచి మినహాయించినప్పటికీ, భారత రాజ్యాంగంలో కీలకమైన సవరణలు జరిగితే తప్ప చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలన్నది ‘్భరత న్యాయ వ్యవహారాల మండలి’- లాకమిషన్ ఆఫ్ ఇండియా- వారు చేసిన ప్రతిపాదన. మంగళవారం ‘లా కమిషన్’ వారు విడుదల చేసిన ముసాయిదా నివేదిక- డ్రాఫ్ట్ వైట్ పేపర్-లో కనీసం 2024వ సంవత్సరం నాటికి ఈ ‘జమిలి’ ఎన్నికలు వ్యవస్థీకృతం కావాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. ఎన్నికల తరువాత ఏర్పడుతున్న చట్టసభలలో ఏ రాజకీయ పక్షానికి కాని ‘పక్షాల కూటమి’కి కాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘బలం’- మెజారిటీ- లభించకపోవడం తరచూ ‘మధ్యంతరపు’ ఎన్నికలకు దారితీసిన దశాబ్దుల విపరిణామం. ఎన్నికల తరువాత శాసనసభలో కాని, లోక్‌సభలో కాని ‘మెజారిటీ’ని సాధించిన ‘పార్టీ’ లేదా ‘పార్టీ’ల కూటమి మధ్యలో ‘మెజారిటీ’కోల్పోవడం గడువుకంటె ముందే ఎన్నికలకు దోహదం చేస్తున్న విపరిణామాలు. ఈ విపరిణామాలు లోక్‌సభలోను, శాసనసభలోనూ ఏకకాలంలో సంభవించవు, సంభవించక పోవడం చరిత్ర! కలియుగం 5052- క్రీస్తుశకం 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మొదటిసారి మాత్రమే దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత జరిగిన చరిత్రలేదు. క్రీస్తుశకం 1955లోనే ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు మధ్యంతరంగా ఎన్నికలు జరుపవలసి వచ్చింది! 1962లోను, 1967లోను లోక్‌సభ ఎన్నికలతోపాటు అత్యధిక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 1977 నుంచి దాదాపు ప్రతి ఏడు ఏదో ఒక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి.
ఇలాంటి పద్ధతిని తొలగించి అన్ని శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలన్నది ఏళ్ల తరబడి రాజకీయవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆకాంక్ష! 2024 నుంచి ఇలా సమాంతర ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలన్నది ‘కమిషన్’ చేస్తున్న ప్రతిపాదన. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఈ సమాంతర ప్రక్రియను ఆరంభించడం అసంభవం కాబట్టి! 2019లో జరిగే ఎన్నికల తరువాత ఏర్పడే లోక్‌సభ 2024 వరకు కొనసాగ గలదన్న ఆశాభావం ‘కమిషన్’ ముసాయిదా నివేదికలో వ్యక్తమైంది. 2024లో కాని, ఆ తరువాత కాని త్రిశంకుసభలు ఏర్పడవచ్చు! ఈ ‘హంగ్’సభలు ఐదేళ్లు కొనసాగ గలవా? శాసనసభ సభ్యులందరూ ముఖ్యమంత్రిని, లోక్‌సభ సభ్యులందరూ ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్టయితే ‘హంగ్’ బెడద తొలగిపోతుందన్నది ‘కమిషన్’ ప్రతిపాదన! ఎలా ఎన్నుకుంటారు? ఇద్దరి కంటె ఎక్కువమంది ముఖ్యమంత్రి పదవికి లేదాప్రధాని పదవికి పోటీచేస్తే ఏమవుతుంది? మొదటి ‘వర్తులం’-్ఫస్ట్‌రౌండ్-లో ఏ అభ్యర్థికి కాని యాబయి శాతం కంటె ఎక్కువ వోట్లు రాకపోతే ఏం చేయాలి? ‘రెండవ వర్తులం’ ఎన్నిక జరపాలా? ఈ విషయమై ‘్భరత న్యాయ వ్యవహారాల మండలి’ ఎలాంటి ప్రతిపాదనను కాని చేయలేదు. ఇలా ఎన్నికయిన ప్రధాని, ముఖ్యమంత్రి ఐదేళ్లులోపే ‘మెజారిటీ’ని- సభలలో- కోల్పోతే?? మధ్యంతర ఎన్నికలు అనివార్యం కాదా?
దీనికి ‘మండలి’ విచిత్రమైన పరిష్కారం సూచించింది. ఉదాహరణకు 2024లో అన్ని చట్టసభల- లోక్‌సభ, శాసనసభల-కు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 2025లో ఒక రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ‘మెజారిటీ’ కోల్పోతుంది, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు వీలుకలుగదు. అప్పుడు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి! కానీ అలా 2025లో ఎన్నికయ్యే శాసనసభ కాలవ్యవధి 2029వరకు నాలుగేళ్లు మాత్రమే ఉండాలట! 2029లో జరిగే ‘సమాంతర ప్రక్రియ’లో భాగంగా అలాంటి శాసనసభలకు నాలుగేళ్లకే ఎన్నికలు మళ్లీ జరగాలట! లోక్‌సభకు కూడా ఇదే పద్ధతిని వర్తింపచేయాలట! ఒకవేళ 2028లో మధ్యంతర ఎన్నికలు ఏ సభకైనా జరిగితే అలా ఎన్నికయిన ‘సభ’ సంవత్సరం కాల వ్యవధిలోనే- ప్రధానికి లేదా ముఖ్యమంత్రికి సభలో మెజారిటీ ఉన్నప్పటికీ- రద్దయిపోవలసిందేనట! ఎందుకంటె 2024 తరువాత, 2029లో లోక్‌సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి కాబట్టి. ఇది విచిత్రమైన ప్రతిపాదన! ‘ఐదేళ్లకొకసారి మాత్రమే లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. మధ్యలో ఎన్నికలు జరుగరాదు!’ అన్న స్ఫూర్తికి ఈ ప్రతిపాదన భంగకరం! మధ్యంతర సమయంలో ఎన్నికలు ఎలాగూ జరుగుతాయికదా!! ఇలా మధ్యంతర ప్రక్రియకు పరిష్కారాన్ని సూచించిన ‘లా కమిషన్’ వారు ఈ పరిష్కార స్ఫూర్తిని నీరుకార్చగల మరో ప్రతిపాదనను కూడ ముసాయిదా నివేదికలో పొందుపరిచారు!
ప్రభుత్వానికి- మంత్రివర్గానికి వ్యతిరేకంగా లోక్‌సభలో కాని, శాసనసభలలో కాని ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టేవారు అది ఆమోదం పొందిన తరువాత ‘విశ్వాస తీర్మానాన్ని’కూడ ఆమోదించాలనటం అంటే ఉన్న మంత్రివర్గాన్ని- ప్రభుత్వాన్ని- ఊడగొట్టడానికై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేవారు, కొత్త ‘మంత్రివర్గాన్ని’ ఎన్నుకుంటూ సమాంతరంగా విశ్వాస తీర్మానాన్ని కూడ ఆమోదించాలట! ఇలాంటి ప్రక్రియ రాజ్యాంగ సవరణ ద్వారా వ్యవస్థీకృతం అయినట్టయితే ఒక ప్రభుత్వం పడిపోగానే మరో ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అందువల్ల ఐదేళ్లపాటు ఏదోఒక ప్రభుత్వం పనిచేస్తూనే ఉంటుంది. మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు, రాష్ట్రాలలో రాష్టప్రతి పాలనలు ఏర్పడే అవకాశం- సమాఖ్య స్ఫూర్తివాదుల దృష్టిలో ప్రమాదం- లేదు. ఇలాంటి ప్రతిపాదనను చేసిన ‘లా కమిషన్’ మళ్లీ మధ్యంతరపుటెన్నికలు జరిగే శాసనసభల కాల వ్యవధిని సాపేక్షంగా- కుదిచి పారేయాలన్న ప్రతిపాదనను ఎందుకు చేసినట్టు? అవిశ్వాస తీర్మానాన్ని ఇలా మరో విశ్వాస తీర్మానంతో ముడిపెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం! అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత విశ్వాస తీర్మానం తీర్మానం కోసం తగినంత మంది కలసి రావాలి కదా. ‘చిక్కేది చెప్పండి..!’ ‘చిక్కినంతవరకు’ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించరాదా? ‘మెజారిటీ’ లేని మంత్రివర్గాన్ని కొనసాగనివ్వాలా??
‘త్రిశంకు’సభ- హంగ్ హౌస్- ఏర్పడిన సమయంలో సంక్షోభాన్ని నివారించడానికి వీలుగా ‘్ఫరాయింపులను నిరోధించే చట్టంలోని జటిల నిబంధనలను సడలించాల’ని కూడ ‘కమిషన్’ వారు ప్రతిపాదించారు. దీనికి వీలుగా రాజ్యాంగంలో పదవ అనుబంధాన్ని సవరించాలట! అంటే సభ్యులు ఒక ‘పార్టీ’నుంచి మరో ‘పార్టీ’కి ఫిరాయించి- ఏదో ఒక ‘పార్టీ’కి కాని లేదా ‘కూటమి’కి కాని ‘సభ’లో ‘మెజారిటీ’ని కల్పించడానికి ‘బేరసారాల’ను సాగించడానికి వెసులుబాటు కల్పించాలా? చట్టసభలకు సమాంతరంగా ఎన్నికలు జరిపించడం సాధ్యమే! కాని ఈ ‘కమిషన్’ చెప్పిన రీతిలో మాత్రంకాదు. సమాంతర ప్రక్రియకు వౌలిక ప్రాతిపదిక చట్టసభలకు నిర్ణీత కాలవ్యవధి- ఫిక్స్‌డ్ టర్మ్-ని నిర్ణయించడం! ఆ ఐదేళ్ల లేదా నాలుగేళ్ల వ్యవధిలోగా అవి రద్దు కారాదు- మధ్యంతరంగా-!! అది ఎలా..?