Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మూడవ కూటమి-KCR

జాతీయ రాజకీయాల్లో ‘మూడవ కూటమి’ ముచ్చట్లు మళ్లీ ప్రారంభం కావడానికి తక్షణ నేపథ్యం ఈశాన్య ప్రాంతంలోని మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ స...


జాతీయ రాజకీయాల్లో ‘మూడవ కూటమి’ ముచ్చట్లు మళ్లీ ప్రారంభం కావడానికి తక్షణ నేపథ్యం ఈశాన్య ప్రాంతంలోని మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన ఎన్నికల విజయం. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో భాజపా కూటమి ప్రభుత్వాలు ఏర్పడడానికి రంగం సిద్ధమైన సమయంలోనే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడవ కూటమికి మరోసారి అంకురార్పణ జరపడం విచిత్రమైన పరిణామం! గతంలో ఏర్పడిన ‘మూడవ కూటము’లు అవకాశవాదానికి పరాకాష్ఠగా పరిణమించిన సంగతికి చరిత్ర సాక్ష్యం! ఈ ‘అవకాశవాదం’లో సైద్ధాంతిక సాంకర్యం నిహితమై ఉంది. సైద్ధాంతిక సమానత్వం లేని వివిధ రాజకీయ పక్షాలు గతంలో ఏర్పాటు చేసిన ‘తృతీయ ప్రత్యామ్నాయాలు’ ఎన్నికలలో విజయం సాధించిన చరిత్ర కాని, ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కాని లేదు. ఎన్నికల తరువాత మూడు, నాలుగు సార్లు కేంద్రంలో తాత్కాలికంగా అవతరించిన ‘మూడవ కూటమి’కి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ‘బలం’ లోక్‌సభలో ఏర్పడిన చరిత్ర లేదు. ప్రతిసారి కూడ భారతీయ జనతా పార్టీకి లేదా దాని పూర్వరూపమైన ‘భారతీయ జనసంఘా’నికి వ్యతిరేకంగా మాత్రమే ఎన్నికలకు, ఎన్నికలకు మధ్యలో ఈ అవకాశవాదాల ‘తృతీయకూటమి’ పుట్టుకొచ్చింది. 1979లో మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రిత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేయగలిగిన చరణ్‌సింగ్ జనతా పార్టీని కూడా చీల్చివేశాడు. చరణ్‌సింగ్ వర్గం వారు జనతా పార్టీకి అప్పటి జాతీయ ప్రతిపక్షాలైన రెండు కాంగ్రెస్‌లకు భిన్నంగా మరో ‘కూటమి’ని ఏర్పాటు చేశారు. కొత్త పార్టీని చరణ్‌సింగ్ ఏర్పాటు చేశాడు. రెండు కాంగ్రెస్‌లలో ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన పని చేసిన పార్టీ. వైబి చవాన్ ఈ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో నాయకుడు. మరో కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అధ్యక్షతన కొనసాగింది. 1977లో కాంగ్రెస్ చీలిపోవడం వల్ల ఇలా రెండు కాంగ్రెస్‌లు ఏర్పడినాయి! కాంగ్రెస్ చీలిపోవడం అది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు! పరాజయ భావంతో పతనమైన ‘బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్’ నాయకులు 1980 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలోను, ఆ తరువాత ఇందిరాగాంధీ కాంగ్రెస్‌లో కలిసి పోవడం వేరే కథ! కాని 1979లో చరణ్‌సింగ్ జనతా పార్టీని చీల్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తరువాత అతని నాయకత్వంలోని ‘మూడవ కూటమి’ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఉభయ కాంగ్రెస్‌ల మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. నెల రోజులు తిరగక ముందే ఇందిరాగాంధీ తమ మద్దతును ఉపసంహరించింది. ఏర్పడిన తరువాత ఇరవై తొమ్మిది రోజులలోనే చరణ్‌సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. జాతీయ రాజకీయాలలో మూడవ కూటమి ‘ముచ్చట’ అలా మొదలైంది. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’- తెరాస అధినేతకు ఈ చరిత్ర తెలుసు..
జనతా పార్టీని 1979లో చీల్చి మురార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూలకొట్టిన చరణ్‌సింగ్ వర్గీయులు, అప్పుడు జనతా పార్టీలో ఉండిన ‘భారతీయ జనసంఘాన్ని’ దుయ్యపట్టడం చరిత్ర. ‘జనసంఘం’ వారు ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’లో కూడా సభ్యులని ఇలాంటి ‘ద్వంద్వ సభ్యత్వం’ తగదని చరణ్‌సింగ్ సిద్ధాంతీకరించాడు! రెండు రాజకీయ పక్షాలలో ఒకరికి సభ్యత్వం ఉండడం ద్వంద్వ సభ్యత్వం కాగలదు. కానీ ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ రాజకీయ సంస్థ కాదు! అయినప్పటికీ 1979లో చరణ్‌సింగ్, 1980 నాటి ఎన్నికల తరువాత బాబూ జగ్జీవన్‌రామ్ లాంటి వారు ఈ విచిత్రమైన ‘ద్వంద్వ సభ్యత్వాన్ని’ ప్రచారం చేశారు. జగ్జీవన్‌రామ్ నాయకత్వంలోని జనతా పార్టీ నుంచి, 1980 ఎన్నికల తరువాత, జాతీయతా నిష్ఠకల ‘జనసంఘం’ వారు బయటికి వచ్చి ‘్భరతీయ జనతా పార్టీ’గా అవతరించడానికి ఈ తథాకథిత ‘ద్వంద్వ సభ్యత్వం’ కారణం! జాతీయ రాజకీయాలలో మూడవ కూటమి ‘ముచ్చట’ ఇలా జాతీయతా భావ వ్యతిరేక భూమికపై అంకురించడం 1979 నాటి కథ! అప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశవాద రాజకీయాలకు జాతీయతాభావ వ్యతిరేకత కేంద్ర బిందువైపోయింది. జాతీయ తత్త్వాన్ని ‘మతతత్త్వం’గా చిత్రీకరించడం, వాస్తవాన్ని వక్రీకరించడం ‘మూడవ కూటమి’ పేరుతో నడిచిన అవకాశవాద రాజకీయానికి ఇతివృత్తం! ఈ ‘మూడవ కూటమి’తో జట్టుకట్టిన సందర్భాలలో తెలుగుదేశం పార్టీ వారు ‘భాజపా’ను మతోన్మాదిగా చిత్రీకరించడం చరిత్ర ప్రసిద్ధం... కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈ చరిత్ర కూడా తెలుసు...
విశ్వనాథ ప్రతాప్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని ప్రభుత్వం 1990లో కూలిపోయిన తరువాత అధికార ‘జనతాదళ్’ను చీల్చుకొని బయటికి వచ్చిన చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడం మూడవ కూటమికి చెందిన మరో ముచ్చట! ఆ ‘కూటమి’ కూడా ‘స్వతంత్ర బలం’ ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ మద్దతుపై తమ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉందని చంద్రశేఖర్ స్వయంగా లోక్‌సభలో చెప్పుకున్నాడు. కొన్ని నెలలు మాత్రమే కొనసాగిన చంద్రశేఖర్ ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించు కొనడంతో కూలిపోయింది. అవకాశవాదంతో రాజకీయంగా దివాలా తీసిన ఆ ‘మూడవ కూటమి’ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా కూడా దివాలా తీయించింది. కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని విదేశాలలోని బ్యాంకులలో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పాలనా వ్యయాన్ని భరించడం ఆర్థిక సంక్షోభాలకు పరాకాష్ఠ! అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌టి దేవగౌడ 1996లో ప్రధానమంత్రి కావడం ‘మూడవ కూటమి’ వారి మూడవ ముచ్చట! ఈ మూడవది కూడా ఎన్నికల ముందు సమగ్రంగా ఏర్పడలేదు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ 1996 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఓడిన తరువాత, అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘భాజపా’కు అధికారం దక్కకుండా నిరోధించడం లక్ష్యంగా మూడవ కూటమి ఏర్పడింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ‘భాజపా’ ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం పద మూడు రోజులలో కూలిపోవడానికి కారణం ‘మూడవ కూటమి’తో కాంగ్రెస్ కలవటం. దేవగౌడ ప్రభుత్వం, ఆ తరువాత ఇంద్రకుమార గుజ్రాల్ ప్రధానమంత్రిత్వంలోని ‘మూడవ కూటమి’ ప్రభుత్వం 1998 ఆరంభం వరకు కొనసాగడానికి, అర్ధాంతరంగా కూలిపోవడానికి ‘కాంగ్రెస్ మద్దతు’ కారణం! కాంగ్రెస్ వారు దేవగౌడను గద్దె దింపి ఇంద్రకుమార్ గుజ్రాల్‌ను ప్రధాన మంత్రిగా ప్రతిష్ఠించారు. కొన్ని నెలల తరువాత ఆయననూ గద్దె దింపారు! ఈ చరిత్ర ‘తెరాస’ అధినేతకు తెలియనిది కాదు...
అందువల్ల భాజపాకు, కాంగ్రెస్‌కు భిన్నమైన మూడవ కూటమి ఏర్పడితే గత చరిత్రకు అది సర్వసమగ్ర పునరావృత్తి కాగలదు. ఇందిరా గాందీ ‘శకం’ ముగిసేవరకు కాంగ్రెస్‌కు దీటైన మరో ‘జాతీయ’ పార్టీ ఏర్పడక పోవడం చరిత్ర! ‘్భజపా’కు దీటైన మరో జాతీయ పార్టీ లేకపోవడం వర్తమాన వాస్తవం! కాంగ్రెస్‌ను కలుపుకుని పోటీ చేసినప్పటికీ ఈ ‘మూడవ కూటమి’ వారు 2019 నాటి లోక్‌సభ ఎన్నికలలో ‘్భజపా’ను ఓడించడం అసాధ్యం. కాంగ్రెస్ లేకుండా ఈ ‘మూడవ కూటమి’ లోక్‌సభలో 273 స్థానాలు సాధించడం పగటి కల! తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రశేఖరరావు ‘సంకీర్ణ సిద్ధాంత’ ప్రాంతీయ పక్షాల కూటమిని ఏర్పాటు చేయడానికి పూనుకోవడం విచిత్రం! ఎందుకంటే ఈ ‘తృతీయ కూటమి’ చరిత్ర అవకాశవాదం.

No comments