యూరప్ అంతటా ఇస్లాం ప్రభావం వేగంగా విస్తరిస్తోందని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు సమర్పించిన తాజా నివేదిక పెద్ద చర్చకు దారితీసింది. “ఇస్లాం ఎక్కడికక్కడ చొరబడుతోంది” అంటూ ప్రారంభమైన ఈ నివేదిక ఇప్పుడు యూరప్ రాజకీయ వేదికలన్నింటినీ కుదిపేస్తోంది.
ఈ నివేదిక ప్రకారం, ముస్లిం బ్రదర్‌హుడ్ అనే సంస్థ యూరప్‌లోని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యా వ్యవస్థల్లో ఎంట్రీజం (Entryism) అనే వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. అంటే, వ్యవస్థలో భాగమై దానిని లోపల నుంచే మార్చే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ నివేదికను సీరియస్‌గా తీసుకున్నారు. భద్రతా మంత్రివర్గ సమావేశం అనంతరం, దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ఆయన సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. నివేదికలో ఎంట్రీజం అనే భావనను ఇలా వివరించారు “ప్రభుత్వ వ్యవస్థల్లో చొరబడి, సామాజిక విలువలను మెల్లగా మార్చడం, బయటికి సాంఘిక, సామాజిక సేవల వేషంలో కనిపించడం.” అంటే ఇది ఒక రకమైన సాఫ్ట్ పవర్ వ్యూహం, మతపరమైన దిశగా మార్పు తెచ్చే చర్య.
ఈ ప్రక్రియ సాధారణంగా స్థానిక అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. క్రమంగా బురఖా, ఉపవాసం వంటి ముస్లిం సామాజిక లక్షణాలు ప్రాధాన్యం పొందుతాయి. చివరికి సమాజంలో మతాచారాలు మెల్లగా ఆధిపత్యం సాధిస్తాయి.
కొన్ని ప్రాంతాల్లో చిన్నారుల్లోనే మతపరమైన దుస్తులు ధరించే సంప్రదాయం పెరుగుతోందని నివేదిక చెబుతోంది. ఐదేళ్ల వయసు నుంచే హిజాబ్ లేదా అబాయా ధరించే అమ్మాయిల సంఖ్య పెరగడం, సమాజంలో పెరుగుతున్న మత కట్టుబాట్లకు సంకేతమని అధికారులు పేర్కొన్నారు.
ఫ్రాన్స్ కొత్త అంతర్గత మంత్రి బ్రునో రీటైల్యూ ఈ నివేదికను ఉటంకిస్తూ “ఇస్లామిక్ సిద్ధాంతవాదులు వ్యవస్థలలో చొరబడి, భవిష్యత్తులో ఫ్రాన్స్‌ను షరియా చట్టాల వైపు మలచే ప్రయత్నం చేస్తున్నారు” అని బహిరంగంగా హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లోని 10 ప్రాంతాలతో పాటు యూరప్‌లోని 4 దేశాలను సందర్శించి పరిశీలనలు చేశారు. వారి మాటల్లో ముస్లిం బ్రదర్‌హుడ్ మధ్యప్రాచ్యంలో తన ప్రభావం కోల్పోయింది; అందుకే ఇప్పుడు యూరప్‌పై దృష్టి సారించింది. ఈ ప్రయత్నాలకు టర్కీ, ఖతార్ వంటి దేశాల మద్దతు ఉందని నివేదిక పేర్కొంది.
“యూరప్‌లో నిలబడటానికి బ్రదర్‌హుడ్ పాశ్చాత్య ముసుగు ధరించింది. కానీ అంతర్గతంగా మాత్రం మౌలిక సిద్ధాంతాలతోనే కొనసాగుతోంది,” అని నివేదిక రచయితలు వ్యాఖ్యానించారు. అంటే బాహ్యంగా సహనం చూపిస్తూ, లోపల నుండి సమాజాన్ని మార్చే దీర్ఘకాల వ్యూహం అని వారు సూచించారు.
మొత్తంగా యూరప్‌లో మతపరమైన ప్రభావం ఎంత లోతుగా ప్రవేశించిందో తెలుస్తోంది. యూరప్ విలువలను కాపాడుకునే క్రమంలో మతస్వేచ్ఛతో పాటు చట్ట పరిపాలనను సమతుల్యంగా కొనసాగించడం యూరప్ ప్రభుత్వాలకు కొత్త సవాలుగా మారింది. భవిష్యత్తులో ఈ సమతుల్యతే యూరప్ భవిష్యత్ దిశను నిర్ణయించనుంది. - రాజశేఖర్ నన్నపనేని. MegaMinds


