బాల్యంలో నరేంద్రనాథ్ దత్త హ్రదయంలో ఎప్పుడూ ఒకటే ద్యాస – “భగవంతున్ని దర్శించాలి”. ఆ తపన ఆయనను రామకృష్ణ పరమహంస సన్నిధికి చేర్చింది. అక్కడ ఆయనకు తెలిసింది “మానవ సేవే మాధవ సేవ”. సజీవంగా భగవంతుడు మనుషులలోనే ఉన్నాడని, పేదవాడు, ఆకలిగొన్నవాడు, అణగారినవాడు వీరందరినీ సేవించడం అంటేనే దేవుణ్ణి సేవించడం అని రామకృష్ణ బోధనలతో తెలుసుకున్నాడు. ఇదే తత్వం ఆయన జీవితానికి మార్గదర్శకమైంది.
చికాగో మహాసభకు ముందు వివేకానంద స్వామి ఒక సాధారణ యాత్రికుడిగా భారతదేశాన్ని కలియ తిరిగాడు. దారిద్య్రం, దాస్య భావన, ఆత్మవిశ్వాసం లేమి ఆయన మనసును కలిసివేశాయి. కన్యాకుమారిలో మూడు రోజులు పాటు సముద్ర మధ్యలో ఒక పెద్ద రాయి మీద కూర్చొని ధ్యానించాడు. ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాడు “ఈ జాతిని మళ్ళీ గౌరవనీయ స్థానంలో నిలబెట్టాలి. ఆ మార్గం ఆధ్యాత్మికత ద్వారానే సాధ్యమవుతుంది.” అని భావించాడు.
1893లో అనేక ఇబ్బందులకు ఎదురొడ్డి సర్వమత సభలకు చికాగో చేరాడు. అమెరికా చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో పాల్గొన్న యువసన్యాసి వివేకానంద స్వామిని మొదట అనుమానంతో చూశారు, చివరికి ఆశ్చర్యంతో హర్షధ్వనులు చేశారు. కేవలం రెండు నిమిషాలే సమయం ఇచ్చినా, ఆయన చేసిన ఉపన్యాస సింహ గర్జన ప్రపంచాన్ని కుదిపేసింది. “సర్వ మత సమానత్వం, విశ్వ సోదరభావం” ఈ రెండు వాక్యాలు ఆయన ఉపన్యాసానికి ఉపిరినిచ్చాయి. పాశ్చాత్యులు హిందూమతాన్ని మూఢనమ్మకాల సమూహంగా చూశారు. కానీ స్వామి ఒకే ప్రసంగంతో ఆ అపోహలను తొలగించాడు వివేకానంద స్వామి.
ఆ సభలో స్వామి మొదటి మాటలు “నా అమెరికా సోదర సోదరీమణులారా” అన్నప్పుడు సభ మొత్తం ఉలిక్కిపడింది. శతాబ్దాలుగా మిషనరీల ప్రభావంతో హిందూమతంపై ఏర్పడిన అపార్థం క్షణాల్లో తొలగిపోయింది. ఆ సభ అనంతరం న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక ఇలా రాసింది – “ఈ ప్రపంచ మత మహాసభలో అత్యున్నతమైన ప్రభావం చూపినవాడు స్వామి వివేకానంద. ఇంత గొప్ప మహనీయుడిని కన్న భారతదేశానికి మేము మిషనరీలను పంపుతున్నామంటే దానికంటే అజ్ఞానం ఇంకేముంటుంది?”
చికాగో ఉపన్యాసం తరువాత స్వామి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. రాక్‌ఫెల్లర్ వంటి బిలియనీర్లు ఆయన వద్దకు వచ్చి ధనం, దానం, సేవ గురించి నేర్చుకున్నారు. “మా దేశంలో దానం ఇచ్చినవాడే కృతజ్ఞతలు చెప్పాలి” అన్న స్వామి మాటలు అమెరికా సంస్కృతికి పాఠమయ్యాయి. ఒక యోగి ప్రభావం కేవలం మతపరంగా కాక, ఆర్థిక సామాజిక రంగాలపై కూడా ఎంత దూరం వెళ్ళగలదో ఆయన చూపించాడు.
దేశాన్ని తల్లిగా చూసిన స్వామి, విదేశాల నుంచి వచ్చిన వెంటనే మాతృభూమి మట్టిని తన శరీరంపై రాసుకొని నమస్కరించాడు. తరువాత దేశమంతా విస్తృతంగా తిరిగారు. ఆయన ఇలా అన్నారు ‘మనలో ఒకడు ఎదగాలని ప్రయత్నిస్తే మిగతావారు అతనికి అడ్డంకులు కల్పిస్తుంటారు. అలా ఎప్పుడూ మనలో మనం కలహించుకుంటుంటాం. కాని ఒక విదేశీయుడు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు అందరం కలిసిపోతాం. అంటే సమస్య వచ్చినప్పుడు మాత్రం కలిసి పనిచేస్తాం. లేదంటే కొట్టుకుంటుంటాం. అది బానిస బుద్ధి. మనం అలాంటిదానికి అలవాటు పడి ఉన్నాము. బానిసలు ఎప్పుడైనా గొప్ప నాయకులు కాగలరా ? కాబట్టి బానిసలు కావటం మానుకోండి. రానున్న యాభై సంవత్సరాల వరకు మన దివ్య భారతమాతే మన అధిష్టాన దేవతగా ఉండుగాక. అంతవరకు ఇతర దేవతలందరూ మన మనస్సుల నుండి అదృశ్యమగుదురు గాక. ఈమె ఒక్కతే జాగృదావస్థలో ఉండవలసిన ప్రధాన దేవత. మూర్తీభవించిన మన జాతి స్వరూపం’. ఈ విధంగా స్వామి వివేకానంద దేశీయులలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఆ తరువాత స్వాతంత్య్ర పోరాటానికి ఒక ఊపునిచ్చింది. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా పనులు వేగవంతంగా ప్రారంభమైనారు.
“లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” ఈ ఒక వాక్యం యువత రక్తంలో జ్వాలల్ని రగిలించింది. బానిసత్వంలో కృంగిపోయిన వారికి ఇది ఒక కొత్త జీవన మంత్రంలా మారింది. ఆయన చూపించిన మార్గం విద్య, స్వాభిమానం, ఆధ్యాత్మిక శక్తి. ఇదే తరువాతి దశల్లో స్వాతంత్య్ర పోరాటానికి మూల బలంని ఇచ్చింది.
‘నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది. ఆ గుడిసె వాసుల నుండే జాతి జాగృత మవుతుంది’ అని స్వామి వివేకానంద చెప్పారు. అది ఈ రోజున మనకు కనిపిస్తున్నది. ఇప్పుడున్న అనేక సమస్యలను, ఆటంకాలను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నది వాళ్ళే.
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ద్వారా స్వామి తన బోధనలకు శాశ్వత రూపం ఇచ్చాడు. సేవ, విద్య, వైద్య రంగాల్లో చేసిన పనులు భారతదేశ పునరుజ్జీవనానికి పునాది వేశాయి. టాటా వంటి పారిశ్రామికవేత్తలకు శాస్త్రీయ పరిశోధనల ప్రాముఖ్యతను గుర్తు చేసి, ఆధునిక భారత ఆర్థిక నిర్మాణానికి కూడా మార్గదర్శకత్వం ఇచ్చాడు.
స్వామి వివేకానంద జీవితమే ఒక ప్రేరణ “బలంగా ఉండండి, స్వాభిమానంతో నిలబడండి, ఆధ్యాత్మిక శక్తితో ముందుకు సాగండి.” ఆయన చూపిన దారి స్వాతంత్ర్యోద్యమానికి దిక్సూచి, స్వేచ్ఛానంతర భారతానికి పునాది. నేడు కూడా ఆయన స్ఫూర్తి యువతలో జ్వాలల్లా రగులుతోంది. భారతం తల్లిగా పూజించబడుతుంది, ప్రపంచం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితమవుతుంది. ఈ మార్గాన్ని వెలిగించిన దీపస్తంభం స్వామి వివేకానందే.
స్వాతంత్య్రం అనంతరం స్వామి వివేకానంద గౌరవార్ధం వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారు. కన్యాకుమారిలో దక్షిణ దిశలో ఇదొక ప్రసిద్ధ స్మారక చిహ్నం. దీనిని నిర్మించడానికి తీసుకున్న సమయం 6 సంవత్సరాలు 1964 లో ప్రారంభిస్తే 1970 లో పూర్తయ్యింది. ప్రఖ్యాత సామాజిక, సాంఘిక మరియు ఆధ్యాత్మిక సంస్కర్త మరియు స్వామీజీ బోధనల వలన తీవ్రంగా ప్రభావితం అయినా ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం’ (ఆర్‌ఎస్‌ఎస్) యొక్క సీనియర్ ప్రచారక్ ఏక నాథ్ రణడే స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అతను వివేకానంద రాక్ మెమోరియల్ ఆర్గనైజింగ్ కమిటీ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడది శాకోపశాఖలు గా విస్తరించి స్వామీ జీ బోధనలు ప్రచారం చేస్తూ జాతిని జాగృత పరుస్తుంది. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds

