సావర్కర్ ఆలోచనా సరళి - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 28

megaminds
0
సావర్కర్ ఆలోచనా సరళి

సావర్కర్  ఏమతం పైనా, ఏ జాతిపైనా, చివరకు బ్రిటీషువారిపైన కూడా ఏలాటి ద్వేషమూ లేదు. అత్యంత మానవతా వాది ఆయన కానీ, హిందూ జాతికి చెందిన తాను హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. పతన మార్గంలో పయనిస్తున్న హిందూజాతిని మేల్కొలిపి, పటిష్టమైన జాతిగా రూపొందించి, విశ్వ మానవ కల్యాణానికి తన జాతి ప్రముఖమైన పాత్ర వహించాలని కలలు కన్నారు. కానీ హిందూజాతిని నిర్మూలించి, ప్రపంచంలో తుదకు భారతదేశంలో కూడా హిందూ నాగరికతను హిందూ జీవన పథాన్ని నిశ్శేషం చేయదలచిన హిందూజాతి శత్రువులు ఆయనను  మతోన్మాదిగా, పరమత ద్వేషిగా చిత్రించి దేశ విభజనకు, దేశంలో మతోన్మాద రాజకీయాలకు కారకులైనారు. దేవుడు, మతం, మత గ్రంథాలు ఇంకా అనేక విషయాలపై సావర్కరు భావాలు అత్యంత ఆధునికములు, శాస్త్రీయములు, హేతుబద్ధములు అని లోకజ్ఞానం, నిష్పక్షపాత వైఖరి గల వారెవరైనా గమనించగలరు. తన రచనలలో వెలువరించిన ఆయన భావాలను చదవండి.

మూఢ విశ్వాసాలు: 'ఒకనాటి రాత్రి నేను చరిత్ర, సమన్వయ సాంఘిక శాస్త్రములను చదువుతుండగా, మానవులలోని మూఢ విశ్వాసాలను గూర్చిన ఆలోచనలు నా మనస్సంతా ఆక్రమించాయి. అనేక అంధ విశ్వాసాలు వాటి కాలం తీరిన తర్వాత అదృశ్యమైపోయాయి, కానీ కొన్ని గ్రంథాలు దేవునిచే వేరుగా ప్రసాదింపబడినవి అనే గుడ్డి నమ్మకం మాత్రం సడలకపోగా, మానవ పురోగతికే అడ్డంగా ఉంది. ఈ గ్రంథాలలోని ప్రతిపదమూ దేవుని సత్యము వలె పరిశుద్ధమైనదనే మూఢనమ్మకం, తెలివి మాలిన ద్వేషాలను, అజ్ఞానాన్ని చిరస్థాయిగా ఉంచడానికి బాధ్యత వహించడమే గాకుండా, విజ్ఞాన శాస్త్ర, సాంఘిక, ఐకమత్య, పురోగతినే కాకుండా, మత ధర్మములందు కూడా మానవ జాతి హేతువాద పురోగతిని నిలిపివేసి మానవునికి వ్యతిరేకంగా, మానవుని విశ్వాసానికి వ్యతిరేకంగా విశ్వాసానికి అంతంలేని వైరాన్ని, ద్వేషాన్ని కల్పించింది. నిజంగా మానవ చరిత్రలో దేవుని పేరుతోను, మత ప్రవచనాల వల్లను జరిగినంత మానవ మారణ హోమం, వినాశనం విశ్వాప రాహిత్యం వల్ల, ధన పిపాస వల్ల జరుగలేదు.

పవిత్ర గ్రంథాలు మానవ నిర్మితాలు: ఈ పవిత్ర గ్రంథాలను మానవ హేతువాదం ఆధారంగా, దేవుడు రచించిన పుస్తకాలుగా కాకుండా మానవుడు రచించిన గ్రంథాలుగా భావించి, వాటి విలువను మదింపు చేసినట్లయితే అవి వివేకవంతులైన మానవుల నుండి మరింత శ్రద్ధా గౌరవాలను పొందుతాయి. ఈ అమూల్యమైన పుస్తకములు మతోన్మాదులచే దురుపయోగం చేయబడకుండా చూస్తే సమస్త మానవాళికీ లాభం కలుగుతుంది.

ఈ విధమైన తార్కిక ధోరణిని మనస్సులో వుంచుకొని వేదాలకు, బైబిలుకు, కోరానే షరీఫ్ కు మన విశ్వాసాలను అంకితం చేసే ముందు వానికి మానవ నైజమైన వివేకం అనే వెలుగులో పరిశీలించటానికి పూనుకొనవలసి వున్నది. (“దైవ దత్త గ్రంథములు, వానిని మానవుడు ఏ విధంగా చదవాలి” అనే వ్యాసం ముండి).

బైబిలు - ఖురాన్ - యోగ వాశిష్ఠ పఠనం: జీససు క్రైస్తు జీవితము, పర్వతాగ్రంపై ఆయన ప్రవచనాలు నాకు చాలా నచ్చాయి. ఆ రెంటిని నేను ఎల్లప్పుడు అత్యంత గౌరవంతో తలచుకొంటూ ఉంటాను. ఫ్రాన్సులో వుండగా నూతన నిబంధలను చాలా శ్రద్ధగా చదివాను. వానిని నేను ప్రతిదినమూ చదివి మననం చేస్తూ వుండేవాడివి. (జైలులో) అప్పుడే గురుగోవిందు సింగ్ పై పద్యములు పూర్తి చేశాను. సప్తర్షి పూర్తి కావస్తోంది. ఆ సమయంలో ఒక గేయం వ్రాయటానికి జీససు క్రైస్తు జీవితం తగిన వస్తువుగా నాకు తోచింది. నేను బైబిలులోని పాత నిబంధనలు చదువుతున్నప్పుడు యూదుల చరిత్ర, ముఖ్యంగా వారి దురదృష్టకరమైన బానిసత్వపు చరిత్ర, బానిసత్వము నుండి విముక్తికై ఆజాతి, దాని జాతీయ వీరులు సాగించిన భీషణ సమరం, నా కధా వస్తువుకు నేపథ్యాన్ని చేకూర్చింది. వారి (యూదుల) అసహాయతావేదన, తమ జాతి దాస్య విముక్తికి వారు చేసిన ప్రయత్నాలు చదివి నా హృదయం సానుభూతితో ప్రచలించింది. థామస్ కేంపిస్ వ్రాసిన “క్రైస్తు అనుకరణ” నాకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. ఇంగ్లండులో నేను ఖురాన్ చదువ ప్రారంభించినపుడు మొదట ఇంగ్లీషు అనువాదాన్ని చదివాను. తరువాత బెంగాలీ భాషలో కూడా చదివాను. భారతదేశానికి వచ్చిన తర్వాత మరాఠీలో కూడా చదివాను. దాని సరియైన భావం ఏ భాషలో అది చెప్పబడిందో ఆ భాషలో చదివితేనే తెలుస్తుంది అని ఒక మహమ్మదీయ మిత్రుడు పదే పదే చెప్పగా అతనితో కలసి మూలాన్నీ చదివాను. చేతులు కాళ్లు కడుక్కుని ఒక్క ప్రక్కగా కూర్చొని శ్రద్ధతో మనస్సును కేంద్రీకరించి ప్రతి పుటనూ చదివాను. ప్రతి రోజూ నిర్ధారిత సమయంలో పటిస్తూ, ప్రతి “సూరా” కు హిందీలో అర్థము చెప్పించుకొన్నాను. దాని తర్వాత మహమ్మదాలి ఇంగ్లీషులో వ్రాసిన అనువాదాన్ని కూడా చదివాను.

అప్పటికే నేను ముఖ్యమైన పది ఉపనిషత్తులను నెలకు ఒక్కొక్కటి చొప్పున సుమారు ఒక సంవత్సరంలో పూర్తి చేశాను. వాటిని చదివి ప్రతి రాత్రి ఒకే లక్ష్యంతో మననం చేసేవాడివి. ఉన్నట్టుండి. నాకు ‘యోగ వాశిష్ఠం' పై శ్రద్ధ కలిగింది. అప్పటి నుంచి వేదాంత శాస్త్రములలో యోగ వాశిష్టమే ప్రధానమైన గ్రంధంగా భావించసాగాను. నేను వేదాంత తత్త్వ శాస్త్రమును అధ్యయనం చేసే కొద్దీ ఒకే ఒక భావ అనుభూతిని పొందసాగాను. ఈ పుస్తక పఠనం నా మెదడులోని ప్రతి అణువును విశ్రాంతిపరచి నన్ను అఖండ విశ్వాంతరాళం గూర్చిన ధ్యానంలో పూర్తిగా ముంచివేసింది. ఇది ఎంతవరకు పోయిందంటే మానవ ప్రపంచంలోని విష్ప్రయోజనమైన కర్మణ్యతకు విముఖుడనైనాను.

క్రియాశక్తి నిచ్చే స్వసంకల్ప శక్తిని, కర్మాచరణ స్వశక్తిని నిర్మూలించి వేసింది. "అకర్మణ్యతలో అత్యంత ఉన్నతస్థితి సాధింపబడింది" ఈ స్థితిలో “దేశ సేన, నిస్వార్థ సేవ " అనే పదాలు అర్థం లేని కలవరింతలుగా మనస్సు నుండి మాసిపోసాగినవి. వేదాంతంలో మానవుడు అధికారి, తన అస్తిత్వానికి కారకుడు దివ్యత్వం నుండి ఒక అగ్నికణం, జీవన జల మూలం నుండి లేచిన జీవన  ధార.. కానీ విజ్ఞాన శాస్త్రమున మానవుడు ప్రకృతిచే సృష్టింపబడినవాడు. అది చేసే మార్పులకు లోబడినవాడు. కాలం, విశ్వాంతరాలాలనే విశాల శూన్యంలో కలసి పోవడానికి ఈ ప్రపంచంతో పయనిస్తున్నవాడు. యోగ వాశిష్ఠం చదువుతూ ఇటువంటి భావ వీచికల లోనికి జారి పోయినప్పుడు నేను పేనుతున్న దారం దానంతట అదే చేతులలో నుండి జారిపోయేది. గంటల కొద్దీ ఈదైహిక స్మృతి, దేహం నాదనే భావం, దేహానికి సంబంధించి అన్ని భావాలు విస్కృతింపబడేవి. నా కాలు కదిలేదికాదు. చేయి నిశ్చలమైపోయేది. పూర్తి ఆత్మసమర్పణం చేసుకోవలెననే తీవ్రవెమైన వాంచను అనుభవించే వాడిని. ప్రచారం, కార్యాచరణ వట్టి పనికి మాలినవిగాను, జీవితాన్ని వృథాచేసేవిగాను తోచేవి. కానీ చివరకు మనస్సు బాహ్య ప్రపంచం, దేహంపై తన ఆధిపత్యాన్ని మరల సంపాదించుకొని దానిని కర్మం వైపు ఊపి లేపగల్గినవి.” (నా యావజ్జీవ ద్వీపాంతర వాస శిక్ష నుండి).

ఆత్మానుభవ సిధ్ధాలైన భావంలో సావర్కర్ యోగారూఢుడు! వేదాంత శాస్త్రంతో గతంలోనికి గాక విజ్ఞాన శాస్త్రంతో భవిష్యత్తులోనికి పదండి. అమెరికా వారికి వేదాంత తత్త్వశాస్త్రం అవసరమై ఉంది. అదే విధంగా ఇంగ్లీషు వారికి కూడా. ఎందువల్లనంటే వారి జీవితాన్ని వారు అంత పూర్ణత్వానికి, సంపన్నతకు, మగసిరికి, క్షత్రియత్వానికి, పెంపొందించుకొని బ్రహ్మత్వం తెలుసుకుని బ్రాహ్మణత్వం ముంగిట నిలబడి ఉన్నారు. అలాంటి స్థితిలోనే వేదాంతం చదివి అనుభవానికి తెచ్చుకోగల మేధాశక్తి కలసి మనగలదు. కాని భారతదేశం ఆ స్థితిలో లేదు. మనం ఇప్పుడు శూద్ర స్థితిలో వుండి, వేద వేదాంతాల దరికి చేరడానికి అనర్హులమై వున్నాము. శూద్రులు వేదాలు చదవడానికి అనర్హులుగా నిర్ణయించటానికి నిజమైన కారణం ఇది. క్రూరత్వంతో గానీ, స్వార్థశక్తుల స్వార్థానికి గానీ ఆ విధంగా నిర్ణయించలేదు. అలాగైతే అదే వేదాంతాన్ని అందరికి మరింత సరళంగా అర్థమయేట్లు పురాణాలుగా వ్రాసి ఉండేవారు గాదు. ఒక జాతిగా మనం ఉన్నతమైన వేదాంత సాత్విక చింతనకు తగము. ఎందువల్లనంటే రెండవ బాజీరావు పీష్వా గొప్ప వేదాంతి అని అందరికి తెలుసు. అందువల్లనే కాబోలు ఆయన రాజ్యానికి బ్రిటీషు వారిచ్చిన ఉపకార వేతనానికి నడుమ ఉన్న వ్యత్యాసం గమనించలేక పోయాడు. మనం ముఖ్యంగా చరిత్ర, రాజకీయ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం చదివి, ప్రపంచంలో యోగ్యతతో జీవించి, గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించవలసి ఉంది. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం, వేదాంత జ్ఞానోదయం కలుగవచ్చును. అంతవరకు ఈ వేదాంత గ్రంథాలు ఎందుకొరకు వున్నప్పటికిని వాటిని, భరహీములు వృద్దులు, పని నుండి విరమించి ఉపకార వేతనములు పొందువారు చదువుతూ కూర్చోమనండి. ఎందువల్లనంటే వారు పాత గ్రంథాలు, దేవుడు, ఆత్మ, మానవుడు వంటి విషయాలపై గతంలో జీవిస్తారు. ఇక యువత భవిష్యత్తులో ఎందుకు నివసించరాదు? వేదాంతానికి స్థానంగా వుండిన  వారణాశి ఒక త్యాగధనుణ్ణి కూడా ఉద్భవింపచేయలేదు. అంతేకాదు ఆ వారణాసి వారు ఈ పిత్సభూమికై ఒక గడ్డిపోచనైన ఒక చిల్లి గవ్వనైన త్యాగం చేయలేదు. (అండమాను ప్రతి ధ్వనుల నుండి)

ఆత్మహత్య తగని పని: “ఒక దినం నేను అత్యంత నిస్పృహ చెందాను. నా రెండవ ఆలోచన నా రక్షణకు రాలేదు. ఈ జీవితాన్ని ఎంత కాలం సహించేది? ఈ విధంగా యాతనలు పడుతూ వుండడం వల్ల లాభం లేదు. ఇలాంటి  మానసిక స్థితిలో ఉన్నట్లుండి లేచి నిల్చున్నాను. ఆ జైలు గది పై భాగంలో కిటికీ ఉన్నది. అప్పుడు నా ఆలోచనంతా ఏ విధంగా ఆ కిటికి చేరుకొని, ఏ విధంగా ఆ కమ్మీలకు బిగించి ఉరి పోసుకొని మరణించడమా అని మాత్రమే!

ఈ ఉద్రేకమైన ఆలోచన పగలు కలిగింది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రాత్రి వరకు ఆగవలసి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పటి వలె నా చిన్న మనస్సు ప్రశాంత స్థితిలోకి వచ్చింది. నాలో నేను తర్కించుకొన్నాను. "అండమానులో వుండగా నీవు ఇప్పుడు అనుభవిస్తున్న వ్యధలను మించిన వ్యధలను పొందిన ఇందు భూషణ్ మొదలుకొని ప్రొఫెసర్ పరమానంద్ వరకు అనేక మంది బెంగాలి. పంజాబి, సిక్కు రాజకీయ ఖైదిలను ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాను. అదే కారణాల వల్ల నీవు ఇప్పుడు నీ ప్రాణాన్ని అంతం చేసుకొనే ప్రయత్నం నుండి విరమించుకోవాలి. నీ సిద్ధాంతం ప్రకారం అలాంటి తీవ్రమైన చర్య తీసుకొన్నపుడు నూటికి నూరుపాళ్ళు ప్రతిఫలం పొందవలసివుంది. నీ ప్రాణాన్ని వదలుకొనేందుకు పరిహారంగా ఒక్క శత్రువునైనా చంపాలి. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం చేయటానికి ఇప్పుడు అవకాశ మున్నదా? ” " అప్పుడు నా విధ్యుక్త ధర్మాన్ని చూడగలిగాను. ఆ ధర్మ నిర్వహణలో నేను నిర్వర్తించవలసిన పద్ధతిని నిర్ణయించుకొన్నాను. ఒక అత్యంత ఉన్నతమైన జాతీయ ధర్మంగా కష్టాలను అనుభవించి భరించటానికి నిర్ణయించుకొన్నాను".  ( నా యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష నుండి)

ఆత్మహత్య - ఆత్మార్పణం: ఒక మానవుడు రోగం, ప్రమాదం, లేక అటువంటి మరేదైన తప్పించుకోరాని కారణం వల్ల గాక తన జీవితం పై విరక్తి కల్గి తనకుగా తాను జీవితాన్ని అంతం చేసుకొన్నప్పుడు అతడు ఆత్మహత్య చేసుకొన్నట్లు చెబుతారు. చాలా సమాజాలు ఇట్టి ప్రాణ త్యాగాన్ని శిక్షింపదగిన నేరంగా భావిస్తున్నాయి. అయినప్పటికి కొంతమంది జీవితాలను స్వయంగా సమర్పణ చేసుకొన్నప్పుడు, అనాదిగా వాటిని ఆత్మార్పణలుగా భావించి వారిని గౌరవించి పూజించారు. కుమారిల భట్టు చితిపేర్చి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేయగా, దానిని ఆత్మహత్యగా కాక ఆత్మార్పణగా శ్లాఘించారు. శంకరుడు కొండగుహలోనికి ప్రవేశించడం ఆత్మహత్యగా కాక, ఆత్మార్పణగా భావించబడింది. చైతన్య ప్రభువు కృష్ణ నామోచ్చరణ చేస్తూ దేహస్పృహ కోల్పోయి పముద్రంలోకి దూకి మరణించడం ఆత్మహత్య కాకుండా ఆత్మార్పణకు మరొక అపూర్వమైన ఉదాహరణ. ఇక మహారాష్ట్రలో జ్ఞానేశ్వరుని గాథ అందరికి తెలిసినదే!

అందువలన ఎవరైతే సాధించవలసిన దానివల్ల సాధించి, జీవన ధ్యేయం సంపూర్ణమైందన్న తృప్తితో ఆనందంతో తనువును వదలి వేస్తారో వారు తమ ఆత్మను భగవంతునికి అర్పణచేశారని నమ్ముతున్నాను. వారు తమ జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేస్తారు. యోగవాశిష్టం చెప్పినట్లు "లోన శూన్యం, బయట శూన్యం ఆకాశములోని కుంభం వలె; లోన పూర్ణము, బయట పూర్ణము సముద్రం లోని కుంభం వలె!”

జీవిత ధ్యేయాన్ని పరిపూర్ణంగా సాధించి, ఆనందమయమైన ప్రశాంతతను పొందిన తర్వాత కూడా దేహాన్ని వదిలిపోక వృద్ధాప్యంతో రోగాలతో తనకు ఇతరులకు భారంగా ఊగులాడుతూ వుంటారో వారు అట్టి స్థితిలో గుహాప్రవేశం తో గానీ, ఉపవాపాలతో గానీ, అగ్నిలో దహనమై పోయిగానీ, వీటిలో మునిగిగానీ, యోగసమాధి ద్వారా గానీ తమ జీవితాలను అంతం చేసుకొంటే, వారి బహిర్గత చర్య ఆత్మహత్యను పోలివున్నప్పటికీ వారు తమను తాము భగవంతునికి అర్పణ చేసుకొన్నారని చెప్పాల్సిందే.

ఈ విధంగా ఆత్మానుభవ సిద్ధి కల్గి, స్థిత ప్రజ్ఞుడుగా జీవించి తన ధ్యేయం సాధించిన తర్వాత స్వసంకల్పముతో దేహ త్యాగం చేసిన మహాపురుషుడు స్వాతంత్ర్య వీర వినాయక్ దామోదర సావర్కర్. (సావర్కర్ ఆఖరు వ్యాసము 1964 అక్టోబరు).

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top