Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిండెన్ బర్గ్ – అనైతిక వ్యాపారవ్యూహం - Hindenburg Hidden Agenda Explained by Malepati Venkata Ramanaiah

హిండెన్ బర్గ్ – అనైతిక వ్యాపారవ్యూహం: “దున్నపోతు ఈనింది అంటే గాటికి కట్టేయండి” అన్న చందంగా ఉంది భారత స్టాక్ మార్కెట్ పై హిండెన్...

హిండెన్ బర్గ్ – అనైతిక వ్యాపారవ్యూహం: “దున్నపోతు ఈనింది అంటే గాటికి కట్టేయండి” అన్న చందంగా ఉంది భారత స్టాక్ మార్కెట్ పై హిండెన్ బర్గ్ నివేదిక విషయంలో ప్రతిపక్షాల అసంబద్ధ ఆరోపణలు. హిండెన్ బర్గ్ అనేది ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ, అంటే మార్కెట్ కదలికలను ఉద్దేశ పూర్వకంగా ప్రభావితం చేయడం ద్వారా తమ పెట్టుబడుల నుండి స్వల్పకాలంలోనే గరిష్ఠమైన లాభాలను పోగేసుకునే ఒక అనైతిక మార్కెట్ వ్యూహ్యం. కేవలం ఏడుమంది ఉద్యోగులు మాత్రమే ఉన్న ఈ కంపెనీ 2017 లో పురుడుపోసుకుంది.

సహజంగా కంపెనీ అంటే ఏదైనా ఉత్పాదక రంగంలోనో లేక సేవల రంగంలోనో తమ ఉత్పత్తులను లేదా సేవలను వినియోగదారులకు అందించడం ద్వారా లాభాలను అర్జిస్తూ మనుగడ సాగిస్తోంది. కానీ ఈ ఘనత వహించిన కంపెనీ పరిశోధన పేరుతో కొంత గాలి పోగేసి కొన్ని పరిశోధనా పత్రాలను, నివేదికలను జనంలోకి వదులుతుంది. ఇంతకీ ఈ సమాచారం తాను ఎక్కడి నుండి రాబట్టింది? ఎక్కడి నుండో కాదు! అది పబ్లిక్ డొమైన్ లో ఆయా కంపెనీలు ప్రచురించిన వార్షిక నివేదికలు నుండి తీసుకున్నదే! ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును మదింపు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇవి కేవలం స్టాక్ మార్కెట్ల పనితీరును మాత్రమే కాకుండా ఒక దేశం యొక్క ఆర్థిక స్తోమతను కూడా నిర్ణయిస్తాయి. దాని కోసం విభిన్నమైన పరిశోధన పద్ధతులను అవలింబిస్తాయి కూడా. ఇవి ఇచ్చిన క్రెడిట్ రేటింగ్‌ల ఆధారంగా ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కొన్ని దేశాలకు ఆర్థిక సహాయం కూడా చేస్తాయి. వీటన్నిటినీ కాదని కేవలం లాభాపేక్షతో అది కూడా అనైతిక మార్గాల్లో లాభాలు పొందాలి అని భావించే ఒక చిట్టిపొట్టి కంపెనీ చెప్పే కబుర్లు ఆధారంగా చేసుకుని భారత స్టాక్ మార్కెట్ పనితీరును అంచనా వేయడం ముమ్మాటికీ క్షమించరాని నేరం.

మొదట అదానీ గ్రూప్ కంపెనీలు మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది ఈ కంపెనీ (బహుశా ఇందులో రాహుల్ అండ్ కంపెనీ యొక్క పరోక్ష హస్తం ఉండవచ్చు నేమో. ఎందుకంటే అది తనకి రాజకీయ లబ్ధి కూడా కలిగిస్తుంది కాబట్టి.) దాన్ని అందిపుచ్చుకున్న రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పెద్ద ఎత్తున అపోహలను సృష్టించడానికి ప్రయత్నించింది, కొంత మేరకు ఆ దిశగా విజయం కూడా సాధించింది.

దీని ఫలితంగా భారత స్టాక్ మార్కెట్ క్రాస్ అయింది. ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉన్నపుడు సంతోషంగా తమ పెట్టుబడులను అమ్ముకుని హిండెన్ బర్గ్ వాడు కొన్ని వేల కోట్లు కొన్ని నెలలు వ్యవధిలోనే ఎగరేసుకుపోయాడు. మొదటి పది స్థానాల్లో ఉన్న అదానీ గ్రూప్ ఆ స్థానం కోల్పోయింది. కొందరి కళ్ళు చల్ల బడ్డాయి. అనేక ఎంక్వైరీ వేయడం అక్కడ అనుమానించడానికి ఏమి లేదు అని తేలడం జరిగింది. తదనంతరం భారత స్టాక్ మార్కెట్‌తో పాటు అదానీ గ్రూప్ కూడా పెరిగింది . అయితే ఈ ఎపిసోడ్‌లో బలి అయింది ఎవరు? అదానీ గ్రూప్ నా ?? లేక రాహుల్ లాంటి బడా ఇన్వెస్టర్లా? కానే కాదు. రూపాయి రూపాయి పోగేసుకుని స్టాక్ మార్కెట్ అనే కలల ప్రపంచంలో విహరించిన అతి సామాన్య పెట్టుబడిదారులు. మార్కెట్‌లో ఉద్దేశపూర్వకంగా, రాజకీయ లబ్దిని ఆశించి రేపిన పుకార్లు ఫలితంగా కొన్ని గంటల్లోనే తమ సర్వస్వాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ విధంగా చేసినందుకు గాను రాహుల్ లాంటి వాళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలి. కానీ అది అత్యాశే! ఎందుకంటే శవాలను రాబందులు ఇష్టపడుతాయి. టూల్ కిట్ లో భాగంగా బయటికి తీసి ప్రయోగించిన అనేక అస్త్రాలలో సింహభాగం రాహుల్ అండ్ కంపెనీకి తరువాత జరిగిన ఎన్నికల్లో తాను అనుకున్న విధంగా లబ్ది చేకూర్చ లేకపోయాయి. దేశంలో సాధారణ ఎన్నికలు పూర్తి అయ్యి ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మరుసటి రోజునుండే సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. ప్రజా తీర్పును గౌరవించాలి అనే కనీస స్పృహ లేకుండా ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బహిరంగంగా ప్రకటించడం మొదలు పెట్టారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరపతి పెరగడం, భారత్ ఒక బలీయమైన శక్తిగా రూపొందడం ఏ విధంగానూ ఇష్టం లేని అంతర్జాతీయ స్థాయిలో భారత వ్యతిరేక శక్తులు యొక్క శక్తి యుక్తులు వీరికి తోడయ్యాయి. ఇప్పుడు తాజాగా భారత్ స్టాక్ మార్కెట్ మీద వీరి కన్ను పడింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌ను చాలా సులభంగా (సాఫ్ట్ టార్గెట్) తమ టూల్ కిట్ ఉపకరణాలు ద్వారా ప్రభావితం చేయవచ్చు గనుక. అలా స్టాక్ మార్కెట్‌ని ప్రభావితం చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ యొక్క పరపతిని మసక బారే విధంగా చేయడం, తద్ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపర్చడం. దాని ద్వారా సామాన్య ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కొల్పోయేటట్లు చేయడం. ఇది నిజమే అన్నట్లుగా ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన విదేశీ శక్తుల ప్రాయోజిత తిరుగుబాటు తరహాలోనే భారత్‌లో కూడా త్వరలోనే ఒక తిరుగుబాటు జరగనున్నది అని కాంగ్రెస్ లోని ముఖ్యులు భవిష్యవాణిని వినిపించడం గమనార్హం. ఇది భారత ప్రజలు అత్యంత జాగరూకతో వ్యవహరించాల్సిన సమయం. ఈ అమృతకాల సంధి దశలో, 140 కోట్ల ఆశలతో పేదరికం నుండి, మానసిక బానిసత్వం నుండి బయటకి రావాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో మనం చేసే ఏ చిన్న తప్పు అయిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ వెయ్యి రెట్లు ప్రమాదం అని విజ్ఞుల ఉవాచ!

హిండెన్ బర్గ్ నివేదిక అంశం భారతదేశంలో ఒక రాజకీయ అస్త్రంగా మారడం చాలా విచారకరం. ఒక చిన్న షార్ట్ సెల్లింగ్ కంపెనీ చేసిన విమర్శలను నమ్మి, ప్రజలను భయపెట్టడం ద్వారా సాధారణ పెట్టుబడిదారులను నష్టపరచడం రాజకీయ నాయకుల బాధ్యతా రాహిత్యాన్ని చూపుతుంది. ఈ ఘటన మరొకసారి ఆర్థిక వ్యవస్థపై రాజకీయ ప్రభావం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలిపింది. భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఒక సంస్థ చేసే దాడి, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాల వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇలాంటి సందర్భాల్లో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. నమ్మకానికి, ఆర్థిక స్థిరత్వానికి విఘాతం కలిగించాలనుకున్న శక్తుల పట్ల అవగాహన పెంచుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రజలు తమ పెట్టుబడులు, నమ్మకాన్ని పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. అందుకే ప్రజలు ఈ ప్రమాదకర పరిస్థితిని అర్థం చేసుకుని, ఆర్థిక వ్యవస్థను సుదృడంగా నిలబెట్టేందుకు రాజకీయ ఆటల నుండి దూరంగా ఉండాలి. హిండెన్ బర్గ్ నివేదిక అనేది ఒక పాఠంగా ఉండాలి, పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వం తమ నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. హిండెన్ బర్గ్ కాదు అతను హిడెన్ బర్గ్. ఇదే సమయంలో, ప్రభుత్వాలు కూడా ఈ ఘటనల నుండి పాఠాలు నేర్చుకొని, భారత మార్కెట్‌ను విదేశీ దాడుల నుండి రక్షించేందుకు మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయాలి. ఈ విధంగా, భారత ఆర్థిక వ్యవస్థను మరింత సుస్థిరంగా, సమర్థంగా ఉంచడం మనందరి బాధ్యత. 

డాక్టర్. మాలేపాటి వెంకటరమణయ్య,
వాణిజ్య శాస్త్ర ఆద్యాపకులు,
ఎస్.జి. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, పీలేరు,
ఆంధ్రప్రదేశ్.
7702673676

No comments