యుద్ధంలో పోరాడిన పీష్వా సైన్యంలోని దాదాపు 500 మంది సైనికులు ప్రాణాలతో బయటపడి హర్యానా అడవుల్లో చెల్లాచెదురయ్యారు. వారు నేడు రాడ్ (లేదా రోర్) మరాఠాలు అని పిలువబడుతున్నారు. 7 లక్షల నుండి 10 లక్షల మధ్య జనాభాతో, కర్నాల్, రోహ్‌తక్, భివానీ మొదలైన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బలమైన స్థానిక సంఘం. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్ననీరజ్ చోప్రా ఆ వర్గానికి సంబంధించినవాడే.
అలా పారిపోయిన 500 మంది కాకుండా ఇంకా దాదాపు 22,000 మంది పురుషులు, మహిళలు బానిసలుగా పట్టుబడ్డారు. అబ్దాలీ సైన్యంతో కలిసి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లవలసి వచ్చింది. ఆఫ్ఘన్ సైన్యం పంజాబ్ గుండా వెళుతున్నప్పుడు సిక్కు యోధులు చాలా మంది మహిళలను పిల్లలను చెర నుండి రక్షించారు. సైన్యం భారత సరిహద్దును విడిచిపెట్టిన తర్వాత, వారు బలూచిస్థాన్‌లోని డేరా బుగ్తీ ప్రావిన్స్‌లో ఉన్నారు. బలూచ్ పాలకుడి సైనికుల్లో కొద్దిమంది పానిపట్ యుద్ధంలో అబ్దాలీతో కలిసి పోరాడారు. అబ్దాలీ సహాయం కోసం కొంత పరిహారం అందించాల్సి వచ్చింది. అబ్దాలీ బానిసలందరినీ (యుద్ధ ఖైదీలు) బలూచ్ పాలకుడికి బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుండి బలూచ్ లో నివసిస్తున్నారు. అబ్దాలీ బానిసలను విడిచిపెట్టడానికి అసలు కారణం మరాఠా ఖైదీలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయారు. అందుకే బహుమతి సాకుతో వారిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మీర్ నాసిర్ ఖాన్ నూరి 22000 మంది ఖైదీలను వివిధ సమూహాలుగా విభజించారు. ఈ విభజన కారణంగా బుగ్తీ, మర్రి, గుర్చాని, మజారి మరియు రాయసాని తెగలుగా మారారు. ప్రాంతమంతా ఎండిపోయినందున పొలాలు లేని ప్రాంతంలో వారిని వదిలేశారు. మొదట్లో అక్కడ సరైన వాతావరణం లేక అనేక ఇబ్బందులకి గురయ్యారు. వారు నీటి వనరులను కనుగొని కొంత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మెల్లగా వారి జీవితం పైకి కనిపించడం మొదలైంది.
బలూచ్ మరాఠాలకు పేష్వాల పేరుతో పేష్వానీ అనే ఇంటిపేరు కూడా ఉంది. షాహూ మరాఠాలు ఇస్లాంలోకి మారి ఉండవచ్చు, కానీ వారి వివాహాల్లో మరాఠీ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. బుగ్తీ మరాఠాలు హల్దీ వేడుకను నిర్వహిస్తారు, ముడి కట్టి (సప్తపది వలె) మరియు బియ్యం గిన్నె దాటి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారు. సంప్రదాయాలు మరియు సంస్కృతితో పాటు, బలూచి భాష మరాఠీతో వంశాన్ని కలిగి ఉంది. షాహు మరాఠాలు తమ తల్లిని ఆయి (आई) అని సంబోధిస్తారు. మొత్తం బుగ్తీ తెగ కూడా దానిని అంగీకరించింది. స్త్రీలను గోడి (गोदी), కమోల్ (कमोल) అని పిలుస్తారు, ఇది గతంలో సాధారణ మరాఠీ పేర్లు.
బలూచిస్తాన్‌లోని మరాఠా కమ్యూనిటీకి చెందిన అతిపెద్ద సంస్థ The Marhtta Qaumi Itehad (పాకిస్థాన్). ఒక సందేశంలో, దాని చీఫ్ వదేరా దిన్ ముహమ్మద్ మరాఠా బుగ్తీ మరియు ఇతర సభ్యులు వజీర్ ఖాన్ మరాఠా, జాఫర్ మరాఠా బుగ్తీ మరియు నస్రుల్లా మరాఠా బుగ్తీ ప్రత్యేక దేశాన్ని కాంక్షిస్తూ ఈ క్రింది విధంగా వ్యక్తపరిచారు.
మా మూలాలను మేము మరచిపోలేదు. మేము నిత్య జీవితంలో శతాబ్దాల నాటి సంప్రదాయాలను కాపాడుకున్నాం. మేము పుట్టుకతో యోధులం. మేము ఇక్కడ సైన్యం, విద్య, రాజకీయాలు, వ్యవసాయం, టెలికాం మొదలైన అన్ని ప్రధాన రంగాలలో స్థిరపడ్డాము. అనేక మరాఠీ పదాలు మరియు వంటకాలు ఇప్పటికీ మన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. మతపరమైన ఆంక్షల కారణంగా, మేము ఛత్రపతి శివాజీ జయంతిని జరుపుకోలేపోతున్నాము, కానీ మేము శివాజీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకున్నాము. మా పూర్వీకులు మరాఠాలు అని చెప్పుకునేందుకు మేము గర్వపడతాము అంటారు.