Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జై భీమ్ జై మీమ్ అని మొదట బలయ్యింది జోగేంద్రనాథ్ మండల్

భారతదేశం లో ఈ మద్య కాలంలో జై భీం జై మీం నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ నినాదాలకి సాక్షాత్తు భారత రాజ్యాంగ సృష్టికర్త గౌరవ అంబేద్కర...


భారతదేశం లో ఈ మద్య కాలంలో జై భీం జై మీం నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ నినాదాలకి సాక్షాత్తు భారత రాజ్యాంగ సృష్టికర్త గౌరవ అంబేద్కర్ గారు పూర్తిగా వ్యతిరేకం. ఈ దేశంలో అంటరానితనం పెరిగి పెచ్చుమీరుతున్నప్పుడు అనేకమంది ఈ దేశం కోసం పనిచేశారు వారిలో ముఖ్యులు అంబేద్కర్. బ్రిటీష్ వాళ్ళని ప్రారదోలడం ఎంతముఖ్యమే ఈ దేశంలో అంటరానితనం దూరంచేయడం అంతే ముఖ్యమని నమ్మిన వారెందరో, అలాంటి వారిలో ముఖ్యులు శ్రీ జోగేంద్రనాథ్ మండల్ ఒకరు.

జోగేంద్ర నాథ్ మండల్ అవిభక్త బెంగాల్‌లోని బారిసాల్ జిల్లా మైస్తర్‌కండి గ్రామంలో పేద నామశూద్ర (దళిత) కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904న జన్మించారు. తల్లిదండ్రులు పేదవారు అయినప్పటికీ విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. తర్వాత 2 కి.మీ దూరంలో ఉన్న బార్తితారా ఇన్‌స్టిట్యూట్‌లోని మిడిల్ స్కూల్‌లో చదివించారు. మండల్ బారిసాల్‌లోని బ్రజ్‌మోహన్ కళాశాల నుండి సంస్కృతం మరియు గణితం సబ్జెక్టులుగా తన బి.ఎ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.

1926లో బారిసల్ ఖజ్‌బడి గ్రామానికి చెందిన ప్రహ్లాదచంద్ర కుమార్తె కమలా దేవిని వివాహం చేసుకున్నాడు. మండల్ 1934లో తన ఎల్‌ఎల్‌బి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, కలకత్తాలో న్యాయవాద వృత్తిని కొనసాగించాడు. కానీ కలకత్తాలో సామాన్యులకు సేవ చేయాలనే కోరిక తీరలేదు తిరిగి బారిసాల్‌కి వెళ్లి జిల్లా సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఈ కాలంలో తన సమాజాన్ని పీడిస్తున్న వివిధ సమస్యలను నిశితంగా పరిశీలించే అవకాశం లభించింది. అంటరానివారు, వెనుకబడినవారు ఎలా దోపిడీకి గురవుతున్నారో చూశాడు. వారికి అండగా నిలిచేందుకు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం మండల్ మకద్‌గంజ్ ఈశాన్య నియోజకవర్గం నుండి కౌన్సిల్‌కి ఎన్నికలకు తన నామినేషన్‌ను దాఖలు చేశాడు. 6 జనవరి 1936న 1,416 ఓట్ల తేడాతో విజేతగా ప్రకటించబడ్డాడు. నామశూద్ర అభ్యర్థి అన్‌రిజర్వ్‌డ్ స్థానం నుండి గెలుపొందడం అతి పెద్ద విజయం గా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా మండల్ ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు అతన్ని పేద ప్రజల్లో గొప్ప నాయకుణ్ణి చేశాయి. దళితుల కోసం పాఠశాలలు, పోలీసు శాఖలో నియామకాలు, దళిత అధికారుల నియామకం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌లు మరియు రైతులకు కాలువల నిర్మాణాలు చేపట్టారు.

ఆ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మండల్ ప్రజానుకూల కార్యక్రమాలతో నేతాజీని ఎంతో ఆకట్టుకున్నారు. 1940లో నేతాజీ కాంగ్రెస్‌ను వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ని స్థాపించారు. కొత్త పార్టీ అధినేతగా నేతాజీ కూడా బారిసల్‌ను సందర్శించారు. మండల్ ని ఆయన అభినందించారు. ఇరువురి మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయి.

1940లో ముస్లిం లీగ్ పాకిస్థాన్ దేశ ఏర్పాటు కోసం తీర్మానాన్ని ఆమోదించింది. మొదట్లో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, కొన్నాళ్ల తర్వాత అది వాస్తవంగా మారింది. 1942లో అంబేద్కర్ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను స్థాపించారు. అంబేద్కర్ ఎప్పుడూ హిందువులు, ముస్లింలు వేర్వేరు అని, కలిసి ఉండలేరని చెప్తుండేవారు. "ముస్లింల సోదరభావం ముస్లింలకు మాత్రమే" అని బాబాసాహెబ్ విశ్వసించారు. అయితే జోగేంద్రనాథ్ మండల్ మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దళితులు, ముస్లింలు బలహీనంగా ఉన్నారని, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఆయన భావించారు చూడటానికి ఇది నిజం కూడా. దళితులు మరియు ముస్లింల కూటమి బలీయమైన శక్తిగా ఉంటుందని భావించారు . కానీ మండల్ తన జీవితంలో చలా పెద్ద తప్పుచేశాడు. సామాజిక-సాంస్కృతిక అంశాలను విస్మరించాడు.

1943లో ముస్లింల లీగ్ మండల్ ని తమ కూటమిలో చేరమని కోరింది. మండల్ కి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది మరియు ముస్లింల లీగ్ లో  చేరాడు. జిన్నా మరియు ముస్లింలు లౌకిక పాకిస్తాన్ గురించి హామీ ఇచ్చారు. ఆ ముస్లిం నాయకుల వాగ్దానాలను విశ్వసించాడు మండల్. 

ఆ తర్వాత, 1946లో డైరెక్ట్ యాక్షన్ డే వచ్చింది. ముస్లింలు హిందువులను ఊచకోత కోయడం ప్రారంభించారు. కోల్‌కతాలో జరిగిన సమ్మెలు గ్రేటర్ కలకత్తాలో హిందూ జనాభా హత్యలుగా మారాయి. ఆ తర్వాత నోఖాలీ అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో హిందూ నాయకులు మండల్ మీద చాలా కోపంగా ఉన్నారు. ముస్లిం లీగ్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరాలని జోగేంద్రను కోరారు. కానీ మండల్ అయిష్టంగా ఉన్నాడు. మైనారిటీలకు పాకిస్తాన్ మంచి ప్రదేశం అని నమ్మాడు.

మండల్ దళితులను అల్లర్లకు దూరంగా ఉండాలని కోరాడు. ఇది హిందువులను బలహీనపరిచింది, వారి ఊచకోతను చాలా సులభం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లో ముస్లింలు హిందువులను ఊచకోత కోశారు. హిందువులను చంపడం మరియు బలవంతంగా మతం మార్చడం ద్వారా హిందూ మెజారిటీ సిల్హెట్ ముస్లింలు మెజారిటీ ప్రాంతంగా మారింది. వేలాది మంది హిందువులు చంపబడ్డారు, బలవంతంగా మతం మార్చబడ్డారు, మహిళలపై అత్యాచారం చేశారు. కానీ, మండల్ ముస్లిం లీగ్‌కు మద్దతు ఇవ్వడం కొనసాగించాడు. పాకిస్తాన్ సెక్యులర్‌గా ఉంటుందని మళ్ళీ నమ్మాడు. ముస్లిం లీగ్‌కు మద్దతుగా ప్రావిన్షియల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా కూడా ఓటు వేశారు. హిందువులు చంపబడ్డారు, కానీ మండల్ ముస్లిం లీగ్‌కు మద్దతునిస్తూనే ఉన్నాడు. ముస్లింలను, పాకిస్తాన్‌ను నమ్మాలని దళితులను కోరాడు.

4 జూలై 1947న, బ్రిటీష్ పార్లమెంట్‌లో భారత స్వాతంత్ర్య బిల్లును సమర్పించారు. ఇది 15 జూలై 1947న ఆమోదించబడింది. విభజన తర్వాత దళితుల ప్రశ్న మళ్లీ తలెత్తింది. మండల్ పాకిస్తాన్‌లోని కరాచీకి బయలుదేరే ముందు అంబేద్కర్‌కు టెలిగ్రామ్ పంపాడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వంలో భాగం కావాలనుకుంటున్నాను అని అడిగాడు. అంబేద్కర్ ఈ విధంగా సమాదనం ఇచ్చారు.. “మండల్ ముస్లిం లీగ్ మంత్రివర్గంలో చేరకూడదు. ముస్లింలు దళితులను ప్రేమించేవారు కారు.“ 

అలాగే "ఈనాడు పాకిస్తాన్ లో చిక్కబడిపోయిఉన్న షెడ్యూల్డుకులాలవారికి నేను చెప్పేది ఒకటే మీకు ఏ సాధనం లభిస్తే ఆ సాధనం ఉపయోగించుకొని, ఏమార్గం అందుబాటులో ఉంటే ఆమార్గంద్వారా భారతదేశానికి వచ్చేయండి. పాకిస్తాన్ లోఉన్న వారైనా, హైదరాబాద్ లో ఉన్న వారైనా వారు మహమ్మదీయులను, ముస్లిం లీగునూ నమ్ముకోవటమంటే మృత్యువును కౌగిలించు కోవటమే. హిందువులపై అయిష్టం కారణంగా ముస్లింలను తమ హితులుగా భావించుకోవటం షెడ్యూల్డు కులాల వారికి అలవాటయి పోయింది. ఈ దృష్టి సరైనది కాదు." అని స్పష్టీకరించారు డా౹౹ అంబేడ్కర్.

మండల్ 5 ఆగస్టు 1947న పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి కరాచీకి బయలుదేరి మరుసటి రోజు కరాచీకి చేరుకున్నారు. అయితే, అతను జిన్నా ప్రభుత్వంలో చేరాలా అని అంబేద్కర్‌ను అడిగాడనే వాస్తవం, అతను పాకిస్తాన్‌కు వెళ్లడంపై సందిగ్ధతతో ఉన్నట్లు చూపిస్తుంది. జిన్నా చురుకైన పరిణతి చెందిన రాజకీయవేత్త. 9 ఆగస్టు 1947న కరాచీలోని ఒక హోటల్‌లో తన మంత్రులకు విందు ఇచ్చాడు. జిన్నా పక్కన కూర్చున్న లియాఖత్ అలీ ఖాన్, మండల్‌ను అడిగాడు, "రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి మీరు అధ్యక్షత వహిస్తారా?" మండల్ స్పందించలేదు. విందు ముగింపులో, లియాఖత్ అలీ జిన్నా కోరికకు అనుగుణంగా పాకిస్తాన్ రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తానని మండల్‌తో చెప్పారు. మరుసటి రోజు, ఆగస్టు 10న, పాకిస్థాన్ రాజ్యాంగ సభకు ప్రొటెం అధ్యక్షునిగా ఎంపికైనందుకు మండల్ తన కృతజ్ఞతలు తెలిపారు. జిన్నా కేవలం పాకిస్తాన్ ఒక దళితుడిని న్యాయ మంత్రిగా నియమించిందని భారతదేశానికి చూపించాలనుకున్నాడు. ఇది రాజకీయ ప్రదర్శన తప్ప మరొకటి కాదు. న్యాయశాఖ మంత్రిగా మండల్ పనిచేసిన దాఖలాలు ఏవీ అందుబాటులో లేకపోవడం దురదృష్టం.

కార్మిక మంత్రిగా ఆయన జెనీవాలో జరిగే 33వ అంతర్జాతీయ కార్మిక మండలి సమావేశానికి హాజరుకానున్నారు. కానీ అతనికి బదులుగా, మహ్మద్ అన్వర్‌ను పాకిస్తాన్ ప్రతినిధిగా జెనీవాకు పంపారు. పాకిస్తాన్ నాయకత్వం మండల్ ని విస్మరించడం మొదలుపెట్టింది. జిన్నా మరణం తరువాత, లియాఖత్ అలీ మండల్‌ను పూర్తిగా పక్కన పెట్టాడు.

మండల్ పాకిస్తాన్‌లో షెడ్యూల్డ్ కులాల సమాఖ్యను స్థాపించారు. ఇక్కడ కూడా దళితులు దారుణంగా అణచివేయబడ్డారు. వారిని పారిశుధ్య కార్మికులుగా కుదించారు. భారతదేశానికి వారి వలసలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయబడింది. దళితులు దేశం విడిచి వెళ్లిపోతే పారిశుధ్య పనులు చేసే వారు ఎవరూ ఉండకపోవడమే అందుకు కారణం. అదే సమయంలో అల్లర్లు లేదా హింస చెలరేగినప్పుడు హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు, అగ్రవర్ణ హిందువులు మరియు దళితుల మధ్య గొడవలు జరిగినప్పుడు ముస్లింలు స్పందించలేదు. వారికి హిందువు లైన దళితులు అగ్రవర్ణాల వారు కొట్టుకోవడం లాభంగా భావించారు. తూర్పు మరియు పశ్చిమ పాకిస్తాన్‌లలో అల్లర్లు చెలరేగాయి మరియు హిందువులు బాధితులయ్యారు. మండల్ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించడం ప్రారంభించారు. ఢాకాలో మతపరమైన అల్లర్లలో 100000 (ఒక లక్ష) మంది హిందువులు మరణించారు. వారిలో చాలా మంది దళితులు ఉన్నారు. దళితులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. హిందూ మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వారి ఆస్తులను, పశువులను దోచుకున్నారు. 19 జనవరి 1950న, ఈ అల్లకల్లోలం మరియు హింసను తక్షణమే ఆపాలని మండల్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీకి లేఖ రాశారు. 

మండల్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసే మంత్రులకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని ప్రతిపాదించింది. దానికి సెన్సార్ యాక్ట్ అని పేరు పెట్టారు. బిల్లు ఆమోదానికి ముందే పాకిస్థాన్‌ను విడిచిపెట్టాలని మండల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 1950 ఫిబ్రవరి 10న, కొంతమంది హిందువు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినందుకు 10000 మంది హిందువులు చంపబడ్డారు. ఇది ఇస్లామిక్ పాకిస్థాన్ వాస్తవికత. మండల్ పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ వాస్తవికతను చూడటంలో పూర్తిగా విఫలమయ్యాడు. 8 అక్టోబర్ 1950న, మండల్ తన ఘోరమైన తప్పులను గ్రహించాడు. అతని తప్పులు సిల్హెట్‌లోని హిందువులకు వినాశనాన్ని తెచ్చిపెట్టాయి. న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. కానీ పాకిస్తాన్‌లో అతని వెనుకవున్న లక్షలాది మంది హిందువులను ముస్లింలు చంపేశారు. అంబేద్కర్ మహాశయుడు నన్ను ముస్లిం లీగ్ తో జతకట్టవద్దు అని హెచ్చరించాడు అయినా నేను వారిని నమ్మి నా దళిత హిందూ సమాజాన్ని నాశనం చేసుకున్నాను అని బాధపడ్డారు జోగేంద్రనాథ్ మండల్.

మండల్ 1968లో బెంగాలీ హిందూ వలస/శరణార్థిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరణించాడు. భారతదేశంలో శరణార్థిగా ఉన్న పాకిస్తాన్ యొక్క మొదటి న్యాయ మంత్రి మరణం పాకిస్తాన్ వైఫల్యానికి నిదర్శనం. మండల్ భారత్ లో శరణార్దిగానే మరణించాడు. అలాగే పాకిస్తాన్ దేశం నుండి బాంగ్లాదేశ్ విడిపోయినప్పుడు కూడా అనేకమంది దళిత హిందువులను పొట్టనపెట్టుకున్నారు కొంతమంది భారత్ పారిపోయి వచ్చారు అలా పశ్చిమ బెంగాల్ సుందర్ బన్స్ వనాల్లో సుమారు 40 వేల మంది దళిత హిందూ శరణార్దులు మరీచ్ జాపి దీవుల్లో ఉంటే 1979 లో కమ్యునిష్ట్ ప్రభుత్వం భారంగా బావించి మూడు వేల మందిని అతి కిరాతకంగా అంతమొందించారు. అందుకే ఈ దేశం లో ఇప్పుడు NRC, CAA అమలుకావల్సి వుంది వారిని ఈ దేశ పౌరులుగా గుర్తించి ఈ సమాజంలో గౌరవంగా జీవించే హక్కు ప్రసాదించాలని కోరుకుంటూ, జై భీం జై మీం సిద్దాంతాలకు దూరంగా వుండి అంబేద్కర్ కలలు కన్న ఆశయాలను సాదిద్దాం సమరసత ను పాటిద్దాం. జై హింద్. - మీ రాజశేఖర్ నన్నపనేని

#జై #భీమ్ #జై #మీమ్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments