Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

indian-scientific-glory-from-kanadu-to-kalam - కణాదుడి నుంచి కలాం దాకా భారతీయ వైజ్ఞానిక వైభవం

‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పట...

indian-scientific-glory-from-kanadu-to-kalam


‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’

(పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే!

బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్‌ ‌కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక భారతదేశానికి ప్రపంచం యావత్తూ ‘వందే భారతం’ అంటూ నినదిస్తోంది. సమస్యలెన్నో? సమాధానం ఒక్కటే- అది భారతదేశమే అంటూ ఆశగా ఇటే చూస్తోంది!

పది ఆయుధాల సమాహారం: 1. ఇండియన్‌ ‌స్పేస్‌ ‌రిసెర్చీ ఆర్గనైజేషన్‌ (ఇ‌స్రో) ద్వారా జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ రాకెట్ల తయారీ 2. బాబా అటామిక్‌ ‌రిసెర్చీ సెంటర్‌ (‌బీఏఆర్‌సీ) ద్వారా రేడియో ఐసోటేప్‌ల తయారీ 3. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ (ఐఏఎఫ్‌•)‌కు అవసరమైన సూపర్‌ ‌సోనిక్‌ ‌క్రూయిజ్‌ ‌క్షిపణి బ్రహ్మోస్‌ ‌తయారీ 4. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ (‌హెచ్‌ఏఎల్‌) ‌ద్వారా తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్‌ల తయారీ 5. ఫోఖ్రాన్‌ ‌టెస్ట్ ‌రేంజ్‌ (‌పీటీఆర్‌) ‌శక్తి, స్మైలింగ్‌ ‌బుద్ధ పేర్లతో అణుబాంబుల విస్ఫోటన ప్రయోగం 6. డిఫెన్స్ ‌రిసెర్చీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌ (‌డీఆర్‌డీఓ) ద్వారా అగ్ని, నాగ్‌, ఆకాశ్‌, ‌త్రిశూల్‌, ‌పృధ్వీ లాంటి క్షిపణి ప్రయోగాలు 7. ఇండియన్‌ ‌నావల్‌ ‌సర్వీస్‌ (ఐఎన్‌ఎస్‌) ‌ద్వారా అరిహంత్‌ ‌సబ్‌మెరైన్‌ ‌తయారీ 8. ఇండియన్‌ ఆర్మీ (ఐఏ) మైన్‌ ‌బాటిల్‌ ‌ట్యాంక్‌ అర్జున్‌ 9. ‌డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) ద్వారా ఎటామిక్‌ ‌పవర్‌ప్లాంట్ల తయారీ 10. కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సైంటిఫిక్‌ అం‌డ్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌రిసెర్చీ (సీఎస్‌ఐఆర్‌) ‌ద్వారా 40 అధునాత ప్రయోగశాలలతో, నిర్మాణాత్మక ఆయుధాలతో ‘విజ్ఞాన భారతం’ ప్రపంచానికి దిక్సూచిగా మారింది.

ఫిబ్రవరి 28 ‘జాతీయ విజ్ఞాన దినోత్సవం’ సందర్భంగా వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు వైజ్ఞానిక భారత్‌ ‌నిర్మాణంలో యోగదానం చేసిన విజ్ఞాన సేనానులను స్మరించుకోవడం మన కర్తవ్యం.

‘పరిప్రశ్నేన సేవయా’ ఏ విజ్ఞాన శాస్త్రానికైనా ప్రశ్నే పునాది. ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ అణువు నుంచి అంతరిక్షం దాకా ప్రకృతిలోని ప్రతి విషయాన్ని ప్రశ్నించిన సనాతన ధర్మం మనది. అసత్తు (ఏమీ లేదు), నుంచి సత్తు (ఈ జగత్తు) ఎలా వచ్చింది? సృష్టికర్త ఎవరు? (రుగ్వేదం-నాసదీయ సూక్తం) అతనిని తప్ప ఇంకెవరిని సేవించాలి (రుగ్వేద హిరణ్యగర్భ సూక్తం)? ‘దేనిచేత ప్రేరేపితమైన మనసు తాను ఆలోచించే విషయాల మీద ప్రసరిస్తున్నది (కేనోపనిషత్తు)? మానవుని మరణం తరువాత జీవితం ఉంటుందా (కఠోపనిషత్తు)? ప్రపంచంలో వింతైన వార్త ఏది (యక్ష ప్రశ్నలు)? అంటూ శరపరంపరగా ప్రశ్నలతో గురుకుల విద్యావిధానం ద్వారా వేద రుషులు ప్రకృతిని అర్థం చేసుకున్నారు.

‘వైజ్ఞానికాశ్చ కపిలః కణాదః శుశ్రుత స్తథా

చరకో భాస్కరాచార్యో వరాహమిహరసుధీః

నాగార్జునో భరద్వాజః ఆర్యభట్టో బసుర్బుధః

 ధ్యేయో వేంకట రామశ్చ విజ్ఞాన రామానుజాదయః’ అంటూ ప్రతి నిత్యం ప్రగతికి కారకులైన శాస్త్రవేత్తలను స్మరించుకోవడం మన సంప్రదాయం.

కణాదుడు (అణుసిద్ధాంతకర్త)

 ‘విభజించడానికి వీలుకాని పరమాణువు(Atom)లతో జగత్తంతా ఏర్పడిందని, పరమాణువుల కలయిక వలన అణువులు (Molecules) ఏర్పడతాయని జాన్‌ ‌డాల్టన్‌ ‌కంటే ముందే కణాదుడు చెప్పాడు. భారతీయ షడ్దర్శనాలలో విశేషంగా చెప్పిన అంశాలతో కూడిన వైశేషిక దర్శన గ్రంథం ద్వారా భౌతికశాస్త్ర సూత్రాలను, ముఖ్యంగా కార్యకారణ (Cause & effect) సంబంధాలను, గమన సూత్రాలను న్యూటన్‌ ‌కంటే ముందుగానే ప్రపంచానికి తెలియపరిచారు.

మహర్షి భరద్వాజుడు (విమానశాస్త్రం)

‘యంత్ర సర్వస్వ’ విమాన సంహిత, బృహత్‌ ‌విమాన శాస్త్ర గ్రంథాల ద్వారా విమానాలలో వాడే మూలకాలు, ఆకృతి, ఒక గ్రహం నుంచి వేరొక గ్రహానికి వెళ్లే విమానాల నమూనాలతో ప్రపంచలోనే మొట్టమొదటిసారిగా ఏరోనాటికల్‌ ఇం‌జనీరింగ్‌పై పరిశోధన చేసిన గ్రంథంగా ప్రసిద్ధి పొందింది. రైట్‌ ‌బ్రదర్స్ ‌కంటే ముందే విమానాల ప్రస్తావన తెచ్చిన మహర్షిగా ప్రసిద్ధి పొందారు.

నాగార్జున (రసాయనశాస్త్రం, లోహ సంగ్రహణశాస్త్రం)

రసరత్నాకరం, రసోదయ, రశ్రూదయ, రసేంద్ర మంగళ్‌ ‌గ్రంథాల ద్వారా బేస్‌ ‌మెటల్స్ (‌సీసం, రాగి)ను వెండి, బంగారంగా మార్చే రసాయన పక్రియను, ఆరోగ్య మంజరి, యోగసర్‌ ‌గ్రంథాల ద్వారా రోగనివారణ ఔషధాల తయారీ విధానాన్ని వివరించారు.

బౌద్ధాయన (గణితశాస్త్రం)

బౌద్ధాయన శుల్బ సూత్ర గ్రంథం ద్వారా జామెట్రి, వర్గమూలాలు, చతురస్రాలు, త్రికోణ ధర్మాలు వివరించారు. ఏ వృత్తానికైనా చుట్టుకొలతను వ్యాసంతో భాగహారిస్తే 22/7=3.14గా విలువ వస్తుందని పైగాథరస్‌ ‌కంటే ముందే చెప్పిన గణితజ్ఞుడు.

వరాహమిహిర (ఖగోళశాస్త్రం, జియోగ్రఫీ)

అవంతి (ఉజ్జయిని) చక్రవర్తి విక్రమాదిత్యుని కొలువులోని నవరత్నాలలో ఒకరిగా ఖ్యాతి గడించి ‘పంచసిద్ధాంత’, ‘బృహద్‌ ‌సంహిత’, ‘బృహద్‌జాతక’ గ్రంథాల ద్వారా ఎన్నో ఖగోళ విషయాలను తెలిపారు. చంద్రుడు, గ్రహాలు అస్వయం ప్రకాశకాలని, సూర్యకాంతి పడి, పరావర్తనం చెందడం వలన మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయని కెప్లెర్‌ ‌కంటే ముందుగా నిర్ధారించారు.

ఆచార్య శుశ్రుత (వైద్యశాస్త్రం, ప్లాస్టిక్‌ ‌సర్జరీ)

శుశ్రుత సంహిత గ్రంథం ద్వారా 125 రకాల శస్త్రచికిత్స పరికరాల రూపకర్తగా రైనో ప్లాస్టీ (గాయ పడిన ముక్కును సరిచేసే పక్రియ), అనెస్థీషియా విధానాన్ని వివరించి మొట్టమొదటి ప్లాస్టిక్‌ ‌సర్జన్‌గా ఖ్యాతి గడించారు.

ఆచార్య చరక (వైద్యశాస్త్రం)

ఆయుర్వేద విజ్ఞాన సరస్వంగా వినుతికెక్కిన ‘చరకసంహిత’ గ్రంథం ద్వారా ఎనాటమీ, ఎంబ్రియో లజీ, ఫార్మకాలజీ, రక్తప్రసరణ, హృద్రోగ నివారణ, క్షయ వ్యాధి చికిత్స, ఇంకా ఎన్నో రకాల మొక్కల ఔషధ గుణాలను వివరించారు. వైద్య వృత్తిని అవలంబించేవారు తీసుకోవలసిన నైతిక ప్రమాణా లను హిప్పోక్రాటిక్‌ ఓత్‌ ‌కంటే ముందుగానే నిర్దేశించారు.

భాస్కరాచార్య (గణిత, భౌతిక శాస్త్రాలు)

ఆర్ధమేటిక్‌, ‌త్రికోణమితి, ఆల్‌జీబ్రా, జ్యామెతి లాంటి అంశాలను లీలావతి, బీజగణితం గ్రంథాల ద్వారా తెలిపారు. ‘సూర్యసిద్ధాంతం’ గ్రంథంలో భూమి, గ్రహాలు, నక్షత్రగుచ్ఛాలు, చంద్రుడు నిర్దిష్టమైన కక్ష్యాలలో గురుత్వాకర్షణ కారణంగా తిరుగుతున్నాయని ఐజాక్‌ ‌న్యూటన్‌ ‌కంటే ముందే వివరించిన మేధావి.

ఆర్యభట్ట (ఖగోళ, గణిత శాస్త్రాలు)

‘ఆర్యభట్టీయం’ గ్రంథం ద్వారా సూర్యచంద్ర గ్రహణాలను, భూమి గుండ్రంగా ఉందని, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని కచ్చితమైన లెక్కలతో కోపర్నికస్‌ ‌కంటే ముందుగా వివరించిన శాస్త్రవేత్త.

మహేంద్రలాల్‌ ‌సర్కార్‌ (ఐఏసీఎస్‌)

1876‌లో తానే స్వయంగా నిధులను సేకరించి ఇండియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌ది కల్టివేషన్‌ ఆఫ్‌ ‌సైన్స్ (ఐఏసీఎస్‌) అనే ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఐఏసీఎస్‌ ‌ద్వారానే సీవీ రామన్‌ ‌కాంతిపై ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎంతోమంది శాస్త్ర వేత్తలకు ఈ ప్రయోగశాల వేదిక అయ్యింది. నీల్‌ ‌రతన్‌ ‌సర్కార్‌, ‌శ్యాంప్రసాద్‌ ‌ముఖర్జీ, జ్ఞాన్‌ ‌చంద్ర ఘోష్‌, ‌సత్యేంద్రనాథ్‌ ‌బోస్‌, ఎం.ఎన్‌. ‌సాహా, కేఎన్‌ ‌కృష్ణన్‌ ‌లాంటి ఎంతోమందికి స్వాతంత్య్ర సంగ్రామంలో పరిశోధనలకు ఐఏసీఎస్‌ ‌వేదికైంది.

అశుతోష్‌ ‌ముఖర్జీ (గణితశాస్త్రం)

బెంగాల్‌ ‌టైగర్‌గా, ఆధునిక భారతీయ గణిత వేత్తగా ప్రసిద్ధి పొందారు. 1908లో కలకత్తా మేథమెటికల్‌ ‌సొసైటీని స్థాపించారు.

ప్రమథనాథ్‌ ‌బోస్‌ (‌జియాలజిస్ట్)

‌జియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియాను బలోపేతం చేసిన శాస్త్రవేత్త. రాయల్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌మైన్స్ ‌నుంచి డిప్లొమా పూర్తిచేసిన ఘనుడు. ఒరిస్సాలోని మయూర్‌ ‌భంజ్‌లో ఇనుప ధాతువును కనిపెట్టి జేఎన్‌ ‌టాటాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి టాటా ఐరన్‌ అం‌డ్‌ ‌స్టీల్‌ ‌కంపెనీ (1904) స్థాపనలో ప్రధాన భూమిక వహించారు.

జగదీష్‌ ‌చంద్రబోస్‌ (‌విద్యుదయస్కాంత తరంగాలు, వృక్షశాస్త్రం)

మార్కొని కంటే ముందుగా విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే విధానాన్ని పసిగట్టే క్రిస్టల్‌ ‌రేడియో, క్రిస్టల్‌ ‌డిటెక్టర్‌లను తయారు చేసి ఈనాటి వైర్‌లెస్‌ ‌కమ్యూనికేషన్‌కు ఆద్యుడిగా నిలిచారు. బ్రిటిషర్స్‌తో సమానంగా వేతనాలు ఇచ్చే వరకు తానసలు నెల జీతమే తీసుకోనని సత్యాగ్రహం చేశారు.

చంద్రశేఖర వెంకటరామన్‌ (‌భౌతికశాస్త్రం- కాంతి, ధ్వని)

పార్వతీ అమ్మాళ్‌, ‌చంద్రశేఖర్‌ ‌దంపతులకు తమిళనాడులోని తిరువనైక్కా వల్‌లో సీవీ రామన్‌ ‌నవంబర్‌ 17‌న జన్మించారు. విశాఖపట్నంలోని సెయింట్‌ అలోసియస్‌ ఆం‌గ్లో ఇండియన్‌ ‌పాఠశా లలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ప్రకృతిని తదేకంగా పరిశీలించడం, విపరీతంగా పుస్తకాలను చదవడం ఇష్టమైన కాలక్షేపాలు. 1902లో మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ కళాశాలలో బీఎస్సీ (ఫిజిక్స్),ఎమ్మెస్సీ (ఫిజిక్స్)‌లో అగ్రగామిగా నిలిచారు. ఐసీఎస్‌ (‌నేటి ఐఏఎస్‌) ‌సాధించి కలకత్తా ఫైనాన్స్ ‌డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా చేరారు.

రామన్‌ ఎఫెక్ట్

ఒక ద్రవపదార్థంపై కాంతికిరణాలు పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం (scattering) చెందుతుంది. కాంతి కిరణాల్లోని ఫోటాన్లు (శక్తి కణాలు) ద్రవ పదార్థాల అణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చెదిరిన ఫోటాన్‌లలో ఎక్కువ భాగం వాటి పూర్వపు తరచుదనాన్ని (Frequency) కోల్పోవు. కొన్ని కొంత తక్కువ పౌనఃపుణ్యంతో పరిక్షేపం చెందుతాయి. పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఇదే రామన్‌ ఎఫెక్ట్. 1928 ‌ఫిబ్రవరి 28న ‘ఎ న్యూ రేడియేషన్‌’ ‌పేరుతో ‘ఇండియన్‌ ‌జర్నల్‌ ఆఫ్‌ ‌ఫిజిక్స్’‌లో రామన్‌ ఎఫెక్ట్ ‌ముద్రితమైంది. తక్కువ వనరులతో చేసిన ప్రయోగ పరికరాలతో నోబెల్‌ ‌బహుమతి పొందడం, అందునా బ్రిటిషర్ల పాలనాకాలంలో వర్ణ వివక్షతో మేధోదోపిడీ జరుగుతున్న రోజుల్లో భారతీయ వైజ్ఞానిక కీర్తి పతాకాన్ని ఎగుర వేయడం శాస్త్రవేత్తల ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

నోబెల్‌ ‌బహుమతి ప్రదానోత్సవ సభ(1930)లో విదేశీ సంప్రదాయమైన సూటూ బాటూను కాదని తలపాగా, కుర్తాతో హాజరై భారతీయ సంప్రదాయ సౌరభాలను వెదజల్లారు. 1933లో రామన్‌ ఇం‌డియన్‌ ఇనిస్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మైసూర్‌ ‌మహారాజా కృష్ణరాజ వడయార్‌ 1949‌లో ఆ సంస్థకు స్థలాన్ని కేటాయించారు. రామన్‌ ‌డైరెక్టర్‌గా ఉన్న కాలంలో వోపీ జహంగీర్‌ ‌బాబా, విక్రం సారాభాయ్‌ ‌లాంటి వారికి మార్గదర్శిగా నిలిచారు. స్వంతంత్రంగా ఆలోచించడం, కఠోర పరిశ్రమలతో పరిశోధన చేయడం తదితర అంశాలలో సీవీ రామన్‌ ‌యువతలో స్ఫూర్తిని నింపారు.

 అబ్దుల్‌ ‌కలాం (క్షిపణి శాస్త్రవేత్త)

ప్రొఫెసర్‌గా, రచయితగా, శాస్త్రవేత్తగా, భారతీయతత్త్వ చింతనను అర్థం చేసుకున్న వ్యక్తిగా, దేశాధ్యక్షుడిగా సేవలు అందించిన అబ్దుల్‌ ‌కలాం భారతదేశపు మిస్సైల్‌ ‌మ్యాన్‌. ‌ఫోఖ్రాన్‌-2 అణుపరీక్షలో కీలక శాస్త్రవేత్త. ఇండియా-2020 పేరుతో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రణాళికలు సూచించారు. 1998లో డాక్టర్‌ ‌సోమరాజుతో కలసి స్టెంట్‌ (‌గుండె చికిత్సలో ఉపయోగించే పరికరం) కలాం-రాజు స్టెంట్‌ను, కలాం-రాజు ట్యాబ్లెట్‌ (‌కంప్యూ టర్‌)‌ను తయారు చేశారు. తన ప్రసంగాలలో భగవద్గీత లేదా తిరుక్కురల్‌ ‌పాశురాలను ప్రస్తావిస్తూ ఆధునిక సాంకేతిక విద్యతో పాటు నైతిక, ఆధ్యాత్మిక విద్య ఆవశ్యకత గురించి యువతరానికి చెబుతూండే వారు. డీఆర్‌డీఓ, ఇస్రోలలో పనిచేసి రాకెట్లు, క్షిపణుల తయారీలో ప్రధాన భూమిక పోషించారు.

శాస్త్రం అంటే?

సంస్కృత శబ్దం ‘శాస్త్రం’లో రెండు పదా లున్నాయి. శాస్‌+‌త్ర. శాస్‌ అం‌టే శాసించటం. త్ర అంటే రక్షించుట. ఈనాటి ఆధునిక విజ్ఞానశాస్త్రం శాసించడం (శాస్‌)‌పై శ్రద్ధ వహిస్తోంది. రెండవ భాగం రక్షించటం (త్ర) గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి.

విజ్ఞాన శాస్త్రం మానవ మారణ హోమానికి (రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం) కాక మానవ కల్యాణానికి (టర్కీ భూకంప బాధితుల సేవలో భారత్‌), ‌మానవ నైతిక అభివృద్ధికి కృషి చేసే దిశగా ఉండాలి. విజ్ఞానశాస్త్రం మానవ కల్యాణానికే (లోకాః సమస్తాః సుఖినోభవంతు।) అని ఆచరణాత్మకంగా చూపే మన విజ్ఞాన భారతదేశం వైపే ప్రపంచం యావత్తు ఆశగా ఎదురుచూస్తోంది.

ఇన్‌వెంటర్స్ + ఇన్నోవేటర్స్ = ‌యువత

వేదరుషులు అందించిన వైజ్ఞానిక దృష్టికోణాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేటి యువత కొనసాగిస్తూ తరువాతి తరాలకు అందించాలి. ప్రకృతి ప్రయోగ శాలగా ఆకాశమే సరిహద్దుగా పరిశోధనలతో ముందుకు సాగాలి. జీవన సమరంలో సామాన్యులకు ఎదురయ్యే ప్రతి సవాలుకు అధునాతన సాంకేతిక విజ్ఞానం ద్వారా పరిష్కారం చూపే దిశగా భారతీయ యువత ఆవిష్కర్తలు (ఇన్‌వెంటర్స్)‌గా, వినూత్న పరికరాల సృష్టికర్తలు (ఇన్నోవేటర్స్)‌గా మారి నాటి కణాద నుంచి నేటి కలాం వరకు కొనసాగుతున్న విజ్ఞానశాస్త్ర అభివృద్ధి యజ్ఞంలో భాగం కావాలి.

విజ్ఞాన దేవోభవః స్వాధ్యాయన్మ ప్రమద!

– ఉపద్రష్ట లక్ష్మణసూరి, భారతీయ విజ్ఞాన మండలి సభ్యులు, ఏపీ

Source : Jagriti Weekly


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments