భక్త మార్కండేయుడు - భక్త మార్కండేయ చరిత్ర - bhakta markandeyudu - megafans

megaminds
0
markandeya-megaminds


పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా.. వారికి బిడ్డలు కలుగలేదు.

ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు.

అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది.

అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు. నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి. వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు.

కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు పెట్టారు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో.. ఆ శంకరుడు వీడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు. సమయం ఆసన్నమయింది.

అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు.

అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా.. నేను యమధర్మరాజుని.. నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు.

పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు. మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు.

మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకుంటాడో.. అప్పటి వరకు చిరంజీవివై ఉండి.. మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం. ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే.. వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు.

కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో.. వింటున్నారో... వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు. ఓం నమః శివాయ..!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top