తిరుమల స్వామి వారి ద్వజస్థంభ ప్రతిష్ట - శ్రీ PVRK ప్రసాద్ IAS అనుభవం - MegaMinds

megaminds
0
tirumala


జూన్ 10 ..1982 శ్రీ PVRK ప్రసాద్ IAS: తిరుమల కొండమీద వేంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది!
శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం.
అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.
"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."
... మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే, ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది. మరి ఎలా నిలబడింది ?
ధ్వజస్థంభంపై నున్న బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...
పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.
నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ...
రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు...
మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ...
50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని సంపాదించి ప్రతిష్టించాలి.
ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు.
కొమ్మలు ఉండకూడదు.
ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.
దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి.
... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?

అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు.

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది. ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !!
ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’

అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....……..

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి.

ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.

అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?

విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది.

వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?).......

ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది.

అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.

‘‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.

మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు. ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది.

ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!

ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?)

- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం.

మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్ద్లయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ?

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’

ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను.

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’

బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు.

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది.

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?

అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి.

ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు.

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను.

ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...!

అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు :

‘‘నాహం కర్తా హరిః కర్తా
తత్పూజా కర్మ చాఖిలం
తదాపి మత్కృతా పూజా
తత్ప్రసాదేన నా అన్యథా’’

“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.” - PVRK PRASAD

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top