Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గులాబ్ కౌర్ జీవిత విశేషాలు - About Gulab Kaur in Telugu - azadi ka amrut mahotsav

పంజాబ్ నేల అంటే వీరోచిత సంప్రదాయాలకు నెలవు. ధైర్యం, త్యాగం చేసిన పురుషులే కాదు, ధైర్యవంతులైన మహిళలను కూడా ఈ భూమికి ముద్దు బిడ్డలుగా జన్మించ...


పంజాబ్ నేల అంటే వీరోచిత సంప్రదాయాలకు నెలవు. ధైర్యం, త్యాగం చేసిన పురుషులే కాదు, ధైర్యవంతులైన మహిళలను కూడా ఈ భూమికి ముద్దు బిడ్డలుగా జన్మించారు. గురు కాలం నుంచి, అంటే 15వ శతాబ్ధం నుంచి పంజాబ్ మహిళామణులు సత్యం, సమానత్వం, మానవ గౌరవం మరియు స్వేచ్ఛ కోసం నిలబడటంలో గొప్ప పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనలో సైతం వారి పోరాటం కొనసాగింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో గదర్ ఉద్యమం 1913 - 14 ఓ విలక్షణమైన గుర్తింపును కలిగి ఉంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా అమెరికా, కెనడాతో పాటు తూర్పు ఆసియా దేశాలైన ఫిలిఫ్పిన్స్, హాంకాంగ్, సింగపూర్ లోని పంజాబీ-సిక్కు ప్రవాస భారతీయలు ఉండేవారు.

బీబీ గులాబ్ కౌర్ ఈ ఉద్యమంలో అత్యంత కీలకమైన మహిళా నేతగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రవాస భారతీయుల్లో స్ఫూర్తిని నింపి, ఉద్యమం దిశగా విజయవంతంగా సమీకరించారు. 1890లో పంజాబ్ సంగ్రూర్ జిల్లాలోని బక్షివాలా గ్రామంలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన ఆమె, సమీప గ్రామానికి చెందిన మన్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. గులాబ్ కౌర్ మరియ ఆమె భర్త అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ పరిమిత వనరుల కారణంగా, ఈ జంట ముందుగా మనీలా (ఫిలిఫ్పిన్స్) వెళ్లి తగినంత డబ్బు సంపాదించిన తర్వాత ఆమెరికా వెళ్ళాలని అనుకున్నారు.

వారు మనీలాలో ఉన్న సమయంలోనే గులాబ్ కౌర్ కి గదర్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులతో పరిచయం ఏర్పడింది. ఆమె వారి జీవితాల నుంచి ప్రేరణ పొంది గదర్ పార్టీలో చేరారు. ఆ సమయంలో గదర్ పార్టీకి చెందిన మనీలా యూనిట్ హఫీజ్ అబ్దుల్లా నాయకత్వంలో చాలా చురుగ్గా ఉండేది. ఆయన చాలా కష్టపడి పనిచేసే దేశభక్తి గల నాయకుడు. ఎప్పటికప్పుడు ముఖ్యమైన పార్టీ పనులను నిర్వహించడానికి నియమితులైన గులాబ్ కౌర్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అనతికాలంలోనే ఓ జర్నలిస్ట్ వేషంలో పార్టీ ప్రింటింగ్ ప్రెస్ వద్ద జాగరూకతతో వ్యవహరించే ముఖ్యమైన పనిని ఆమెకు అప్పగించారు. ఆమె ప్రింటింగ్ ప్రెస్ ను జాగ్రత్తగా చూసుకోవడమే గాక, గదర్ పార్టీ సభ్యుల కోసం ఆయుధాలను తీసుకువెళ్లేందుకు కూడా ఆమె తన ప్రెస్ పాస్ ను వినియోంచుకునే వారు. ఇది నిజానికి ఓ ప్రమాదకరమైన కత్తిమీద సాములాంటి పని.

అదే సమయంలో పార్టీ విస్తరణ కోసం కూడా ఆమె కృషి చేస్తూ, ప్రజలను దానిలో చేరమని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. గదర్ పార్టీకి చెందిన మనీలా యూనిట్ పరిమాణం మరింత విస్తృతమైంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుడి ఉన్న ఉద్యమకారులను భారతదేశానికి పంపి, అక్కడ స్వరాజ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించింది.

గులాబ్ కౌర్ మరియు ఆమె భర్త తమ అమెరికా కలలను వదిలుకున్నారు. వారి మాతృభూమి స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు తిరిగి భారత్ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తిరుగు ప్రయాణాన్ని చివరి నిముషంలో విరమించుకున్నారు. భర్తను ఒప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు బీబీ గులాబ్ కౌర్ ముందు రెండు కఠినమైన మార్గాలు ఉన్నాయి. మాతృభూమి కోసం పోరాటం చేయడం మొదటిదైతే, తన భర్తతో కలిసి అమెరికాలో సౌకర్యవంతమైన జీవితాన్ని సాగించడం రెండోది. చివరికి ‘పతి భక్తి’ మీద ‘దేశ భక్తి’ విజయం సాధించింది. గులాబ్ కౌర్ ఇతర గదర్ బృందంతో కలిసి ఓడలో భారతదేశానికి తిరిగి పయనమయ్యారు.

ఈ నౌక మొదట హాంగ్ కాంగ్ చేరుకుంది. అక్కడ ప్రపంచ వ్యాప్తంగా గదర్ బృంద సభ్యులు తమ తర్వాతి ప్రయాణం కోసం సమావేశమయ్యారు. వారు తరచూ హాంగ్ కాంగ్ లో సమావేశాలను నిర్వహిస్తూ, ప్రవాస భారతీయులను దేశ స్వరాజ్య పోరాటంలో పాల్గొనేందుకు ప్రేరేపించేవారు. అది 1914వ సంవత్సరం, హాంకాంగ్ లో ఓ చల్లని సాయంత్రం వేళ. గదర్ పార్టీ నాయకుల స్ఫూర్తిదాయక ప్రసంగాల మధ్య ప్రవాస భారతీయుల సమావేశం జరుగుతోంది. దేశ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం తమతో కలిసి ముందుకు రావాలని విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు వారు విజ్ఞప్తి చేశారు.

సమావేశం ముగింపులో గులాబ్ కౌర్ లేచి నిలబడి ‘గదర్-కి-గుంజ్’ దేశభక్తి కవితలోని పంక్తులను శ్రావ్యమైన, భావోద్వేగ స్వరంతో పాడటం ప్రారంభించారు. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, ప్రేరణాత్మక కవిత్వం వెరసి వారు ఆశించిన ప్రభావాన్ని చూపించాయి. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రజలంతా తమ పేర్లను నమోదు చేసుకోవడం ప్రారంభించారు. అయితే కొంత మంది మనసుల్లో ఇంకా కొంత సంకోచాన్ని గమనించిన గులాబ్ కౌర్, వెంటనే ఆమె ఎడమచేతి గాజులను తీసి “మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచేందుకు పోరాడే ఈ అరుదైన అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోలేము అనుకుంటే ఈ గాజులను ధరించి పక్కన కూర్చోవాలి. వారి స్థానంలో మనం పోరాడుదాము” అంటూ ఉద్యమ ఆవశ్యకతను తెలియజెప్పారు. ఆమె మాటలు ఎంతటి ప్రభావాన్ని కలిగించాయంటే, అందరూ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారి తదుపరి లక్ష్యం దేశాన్ని అణగదొక్కుతున్న బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు భారతదేశానికి తిరిగి రావడం. ఇది భారతీయుల మీద గట్టి ప్రభావాన్ని చూపించి, దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ఉద్యమించే దిశగా ఎంతో మందిలో ప్రేరణ కలిగించింది.

ఆమె ప్రయాణిస్తున్న ఓడ (తోసామారు) భారతదేశానికి చేరుకున్న తర్వాత చాలా మంది గదర్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ గులాబ్ కౌర్ చాకచక్యంగా అక్కడ నుంచి జారుకుని పంజాబ్ చేరుకున్నారు. అక్కడ హోషియార్పూర్, జలంధర్, కపుర్తలా జిల్లాల్లో విప్లవాత్మక కార్యకలాపాల కోసం ప్రజలను సమీకరించడం ప్రారంభించారు. ఆమె చివరి లక్ష్యం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ విప్లవం దిశగా ప్రజా సమీకరణ చేయడం.


ఈ కాలంలో ఆమె పార్టీ కోసం అనేక ఇతర కార్యకలాపాలను నిర్వర్తించడం ప్రారంభించారు. స్వరాజ్య ఉద్యమం మీద సాహిత్యాన్ని ముద్రించి, స్వాతంత్ర్య సమరయోధులకు వాటిని పంపిణీ చేసేవారు. ఆమె ఉద్యమకారుల కోసం ఆయుధాలను కూడా సమీకరించేవారు. ఆమె ఉత్తేజకరమైన వ్యక్తిత్వం, నిరంత ప్రయత్నాలు మరియు సాటిలేని కృషి ఫలితంగా పంజాబ్ లో ఉద్యమం మరింత బలపడింది.

ఆమె తరచూ పోలీసుల నుంచి జారుకునేందుకు, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చాలా తెలివిగా వ్యవహరించేవారు. తమ పార్టీ సభ్యులను కూడా అనేక సమయాల్లో పోలీసుల నుంచి తప్పించేవారు. ఒకసారి సంఘ్వాల్ గ్రామంలో రహస్య సమావేశం జరుగుతున్న తరుణంలో, ఆకస్మికంగా పోలీసు ఆ ప్రాంతం మీద దాడి చేశారు. గదర్ పార్టీ సభ్యులు తప్పించుకోగలిగినప్పటికీ, వారు ఆయుధాలను మరియు సాహిత్యాన్ని విడిచిపెట్టారు. ఆ సమయంలో గులాబ్ కౌర్ తన చురుకైన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఆయుధాలను, సాహిత్యాన్ని ఓ బుట్టలో పెట్టుకుని బావి వైపు సాగిపోయారు. పోలీసులకు కనీసం అనుమానం కూడా రాలేదు.

కానీ తర్వాత బ్రిటీష్ వారు ఆమె ఆచూకీ కనిపెట్టారు. ఎట్టకేలకు ఆమె వారికి పట్టుబడ్డారు. ఆమె మీద దేశద్రోహ చర్య కేసు నమోదైంది. ఫలితంగా ఆమెకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించి, లాహోర్ లో ఖైదు చేశారు. జైలులో సైతం సహచరులతో కలిసి న్యాయం కోసం తమ గళాన్ని గట్టిగా వినిపించారు. ఫలితంగా జైలు అధికారులు కోపానికి గురై, వారి చేతుల్లో చిత్రహింసలు అనుభవించారు. చివరకు బాగా క్షీణించిన ఆరోగ్యంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. అయినప్పటికీ మాతృభూమి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడాలన్న ఆమె స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేందుకు ప్రజలను ప్రేరేపించడం ప్రారంభించారు. చివరకు తీవ్ర అనారోగ్యానికి గురై 1931లో పరమపదించారు.
azadi ka amrut mahotsav

No comments