sankardev assamese story - శంకరదేవ్

megaminds
0
శంకరదేవ్: అస్సామీ రామాయణాన్ని రచించిన ప్రసిద్ధ కవి. గొప్ప ధర్మోద్దారకుడు. వైష్ణవ మత యోగి, వీరు క్రీ.శ. 1449లో అస్సాంలో కామరూప్ జిల్లాలో వరదోవా (వటద్రవ) అనే గ్రామంలో జన్మించారు. తల్లి పేరు సత్యసంధ, తండ్రి కుసుంబర్ శిరోమణి. శంకరదేవుడు జన్మించిన ఆరు నెలలకే తల్లి పరమపదించింది. ఈయన 12వ ఏట మాధవ కందలి పాఠశాలలో చేరి అయిదు సంవత్సరాల అనేక శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు.
విద్యార్థి దశలో ఉన్నప్పుడే వీరి శరీరకశక్తికి, ఆరోగ్యానికి సంబంధించిన అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన కొలది కాలానికి భార్య మరణించింది. సంసార పాశాన్ని వదిలించుకుని శంకర దేవుడు తీర్థ యాత్రలకు బయలుదేరి వెళ్లాడు. యాత్రా సమయంలో దేశంలోని ధార్మిక జీవనం పతన మవుతున్నట్లు స్వయంగా చూసి గ్రహించాడు.
అస్సాం తిరిగి వెళ్లిన తర్వాత వైష్ణవ ధర్మ ప్రచారం ప్రారంభించాడు. ఈయన గొప్ప కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తి పై అనేక నాటకాలు, కీర్తనలు, భజనలు వ్రాసి మధురంగా పాడుతూ ఉపాసన మార్గాన్ని ప్రచారం చేశాడు. శంకర్ దేవ్ రచనలలో అధిక భాగం భాగవత పురాణ ఆధారితమైనవి. వారు రాసిన కీర్తనలు “కీర్తన ఘోష" అనే కృతి మకుటాయమానమైనది. భాగవత పురాణం సారాన్ని శంకర దేవుడు “గుణమేల" అనే పేరుతో చిన్న కావ్యంగా రచించాడు.
భాగవత మందలి దశమ ద్వాదశ స్కంధము నుంచి కథల నేరుకుని చక్కని కావ్యం వ్రాశాడు. అతని కావ్యాలన్నింటికీ అస్సాంలో నేటికీ జనాదరణ ఎక్కువ ఉంది. అస్సామీ సాహిత్యంలో ప్రసిద్ధ నాట్యరూపాలు గ్రంథం “అంకీయ నాటకం" యొక్క ప్రారంభ కర్త కూడా శంకర దేవుడు, ఈ శంకర దేవుడు నిండు జీవితాన్ని గడిపాడు. 119 యేండ్ల ఆరు నెలలు పదమూడు రోజులు జీవించి తరువాత యోగమార్గాన శరీరాన్ని విడిచిపెట్టారు. అస్సాం ప్రాంతపు ప్రజల సాంస్కృతిక, ధార్మిక జీవనం మీద వైష్ణవ భక్తి మరియు భాగవత ధర్మము యొక్క ముద్ర వేసిన ఘనత శంకరదేవునకే దక్కుతుంది.
అందరిలో భగవంతుడు భక్తి పెంచాలనేది అతడి ధ్యేయం. అందుకోసం చాలా చోట్ల భజనమందిరాలు నిర్మింప జేసాడు. వాటిని “నామ్ఘర్" అని అనేవారు. కుల మతాలను పట్టించుకోకుండా అందరినీ అక్కడికి ఆహ్వానించేవారు. ఆయా మందిరం వద్ద తన శిష్యులనేర్పాటు చేసి వారికి సంపూర్ణాధికారాన్నిచ్చేవాడు. అతని ఉపాసన మార్గాన్ని “ఏకాశరణ ధర్మం" అంటారు. శంకర దేవుడు మిక్కిలి భూత దయ గలవాడు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top