మహారాణా కుంభ: 1433లో రాణా మోకల్ మరణించాడు. మహారాణా కుంభా మేవాడు రాజ్యపాలకుడయ్యాడు. ఈ సమయంలో మేవాడు రాజ్యప్రతిష్ఠ మరింత పెరిగింది. అయితే అదే స్థాయిలో మేవాడుపై ముస్లిములు దాడులు కూడా బాగా ఎక్కువైనవి. మాళ్వా, నాగోర్ మరియు గుజరాతు సుల్తానులు మేవాడులో హిందూ రాజ్యాన్ని సహించలేకపోయారు. ముగ్గురు ముస్లిం సుల్తానుల మనస్తత్వం ఒక్కటే. ముస్లిం మతఛాందస మనస్తత్వమే. మందిరాల విధ్వంసం, విగ్రహాల విధ్వంసం, దోపిడి, హిందువుల మూకుమ్మడి హత్యలు, గోవధ వంటివి తమ స్వాధీన ప్రాంతాలలో కొనసాగడం మామూలే. 'గాజీ'లు (మతభక్తులు) అనిపించుకోవాలనే ప్రవృత్తి వారిది. పరమతాలను నశింపజేస్తూ స్వమతం (ఇస్లాం)ను విస్తరించుటకు పూనుకున్న వారిని 'గాజీ'లు అంటారు. 1454లో నాగోర్ సుల్తాన్ ఫిరోజ్ ఖాన్ మరణించాడు. అతని కొడుకుల మధ్య రాజ్యాధికార వారసత్వ కలహం ప్రారంభమయింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు మహారాణా కుంభా. నాగోర్ పై దండెత్తినాడు. శమ్సఖాన్ అను రాజకుమారున్ని నాగోర్ సింహసనంపై కూర్చోబెట్టినాడు, మేవాడు రాజ్యానికి విధేయతతో ఉండే షరతుపై! కొద్దికాలం విధేయుడుగా ఉన్నాడు. తర్వాత తిరగబడ్డాడు. ఆగ్రహించిన కుంభా మళ్లీ నాగోర్ పై దాడి చేశాడు. భయంతో శంస్ ఖాన్ పారిపోయాడు. మహారాణా ఆగ్రహంతో నాగోర్ కోటను ధ్వంసం చేశాడు. కోటముఖద్వారం దానిపై చెక్కిన చక్కని హనుమంతుని విగ్రహాన్ని భద్రంగా తీసికెళ్ళినాడు. తాను స్వయంగా నిర్మించిన కుంభల్ గడ్ కోట ముఖద్వారంలో ప్రతిష్ఠించాడు.
పారిపోయిన శంస్ ఖాన్ గుజరాత్ సుల్తాన్ కుతుబుద్దీన్ శరణుజొచ్చినాడు. అతడి అల్లుడే ఇతడు మామ సాయంతో శమ్స్ ఖాన్ రాణాకుంభాపై దండెత్తినాడు. యుద్ధం ఫలితం ఒక్కటే. శంస్ ఖాన్ పరాజితుడైనాడు. ప్రాణాలు దక్కించుకుని పారిపోయాడు. దానితో కుతుబుద్దీన్ స్వయంగా యుద్ధానికి దిగినాడు. తాను స్వయంగా కుంభల్ గడ్ కోటలపైకి దాడి చేశాడు. రెండవవైపు అబూ పర్వతం (కోట) పైకి తన సేనాపతి, మలిక్బన్ ఉమాదుల్ ముల్క్ నేతృత్వంలో భారీ సైన్యాన్ని పంపినాడు. మహారాణా కుంభా సుల్తాన్ యుద్ధవ్యూహాన్ని గమనించాడు. అత్యంత వేగంగా విద్యుత్తరంగంలా అబూ పర్వతంపైకి వచ్చి ఉమాదుల్ పైకి దాడిచేసి భయంకంపితుని గావించి పారద్రోలినాడు. అబూ పర్వతాలు ముస్లింసేనలపాటి వల్లకాడులయ్యాయి. ఈ వార్త కుతుబుద్దీన్ కు చేరకముందే మహారాణా కుంభా కుంభల్గఢ్ కోట దారిలోకి చేరినాడు. కుతుబుద్దీన్ సైన్యాలను సమాధి చేయుటకు స్వాగతించాడు. ఈ హఠాత్ పరిణామానికి కుతుబుద్దీన్ బిత్తరపోయాడు. మహారాణా పౌరుషాన్ని చవిచూడకుండానే తన రాజ్యానికి పారిపోయాడు.
మరోవైపు మాళ్వా సుల్తాన్ మొహమ్మద్ ఖిల్జీ మేవాడు హిందూరాజ్యపతనానికి పగటి కలలుకంటున్నాడు. మేవాడుపైకి మళ్లీ మళ్లీ దాడులు చేయపూనుకున్నాడు. 1443లో మొదటిసారి కుంభల్గఢ్ కోటపైకి దాడిచేశాడు. మహారాణా కుంభ కోటకు దూరంగా హరవతి అను ప్రదేశానికి వెళ్లాడు. స్వయంగా కుంభల్గఢ్ కోటను గెలవడం సుల్తాన్ కు సాధ్యంకాదు. కోట బయట ఉన్న బన్మాత (వనమాత) మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడనుండి చిత్తోడ్ వైపు వెళ్ళిపోయాడు. రాణా కుంభా ఈ విషయం తెలియగానే వెంటనే సైన్యంతో వెళ్లి మాండలగఢ్ కోటవద్ద మొహమ్మద్ ఖిల్జీ సేనల్ని చుట్టుముట్టినాడు. కొద్ది సేపటికే ఖిల్జీ సేనలు పారిపోయినవి. ఖిల్జీ మాండు ప్రాంతంవైపు పారిపోయినాడు. మూడేళ్లవరకు మేవాడువైపు కన్నెత్తి చూడలేదు. ద్వేషం వదలక మళ్లీ దాడికి ఉపక్రమించాడు. రాణా కుంభా బనాస్ నది ఒడ్డున ఖిల్జీ సైన్యాలను అడ్డగించినాడు. ఇక్కడ జరిగిన యుద్ధంలో మొహమ్మద్ ఖిల్జీ ఘోరంగా నష్టపోయి ఓడిపోయినాడు. వేల సంఖ్యలో ఖిల్జీ సైనికులు చనిపోయారు. భారీ యుద్ధసామగ్రిని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. దీనితో ఎనిమిదేళ్ల వరకు మొహమ్మద్ ఖిల్జీ తలెత్తుకోలేకపోయాడు.
నాగోర్ పాలకుడు శంస్ ఖాన్ కూడా మేవాడుపై దాడికి పూనుకున్నాడు. అప్పుడు ఖిల్జీ కూడా మళ్లీ యుద్ధానికి దిగినాడు. పూర్తి సంసిద్ధతతో దాడిచేసి అజ్మేర్ కోటను ముట్టడించాడు. కోటను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత మాండలగఢ్ కోటవైపు సాగిపోయినాడు. వెంటనే రాణాకుంభా ఖిల్జీ సైన్యాలను బనాస్ నదీతీరంలోనే అడ్డగించినాడు. ఫలితం షరామామూలే. ఖిల్జీ సైన్యాలు యుద్ధం ఆరంభంకాగానే యుద్ధభూమి వదిలి పారిపోయినవి. రాణా కుంభా పౌరుషం వారికి బాగా పరిచితం. ఈ ఓటమి తర్వాత కూడా ఖిల్జీ మళ్లీ రెండేళ్లకు మాండలగఢ్ కోటపైకి దాడికి వెళ్ళి ఓడిపోయాడు.
మేవాడు హిందూరాజ్యంపట్ల గుజరాతు, మాళ్వా సుల్తాన్లకు ఒకరకమైన శత్రుత్వముంది. అయితే ఈ సుల్తాన్ ల మధ్య సఖ్యత లేదు. ఎలాగైనా హిందూ రాజ్యాన్ని పతనం గావించాలని ఉభయులు ఒక్కటై ఒప్పందం చేసుకున్నారు. చంపానేర్ అనేచోట ఇద్దరు సుల్తానులు కలుసుకున్నారు. మేవాడును జయించి పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. మేవాడు దక్షిణ భాగాన్ని గుజరాతు సుల్తాన్, అజ్మేరు, చిత్తోడ్ ప్రాంతాన్ని మాళ్వా సుల్తాన్ తీసుకోవాలనుకున్నారు.
మహారాణా కుంభా మహాపరాక్రమ సంపన్నుడు. కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు. యుద్ధ విశారదుడు. యుద్ధవ్యూహ నిపుణుడు. శత్రువుల బలహీనతలను పసిగట్టి దెబ్బతీసేవాడు. యుద్ధవ్యూహానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలు అతని సొత్తు. శత్రువు బలహీనతలను పసిగట్టుట, శత్రుసైన్యాలను కీలక ప్రాంతాలకు రప్పించుట, హఠాత్తుగా శత్రువుపై కీలక ప్రదేశంలో దాడి చేయుట, శత్రుసైన్యానికి భారీనష్టం, తన సైన్యానికి అతి తక్కువ నష్టం కలిగేలా వ్యూహం పన్నటం-ఇలా అనేక యుద్ధవ్యూహ ప్రత్యేకతలతో మహారాణా కుంభా విశ్వవిఖ్యాతుడైనాడు. ఇప్పుడు ఇరువురు బలమైన సుల్తానులను ఎదిరించి మేవాడును రక్షించాలి. అది చాలా కష్టతరమైనది. ఇది నిర్ణాయక యుద్ధం. ఇందులో ఎలాగైనా విజయం సాధించడం మహారాణా లక్ష్యం!
మాళ్వా సుల్తాన్ మొహమ్మద్ ఖిల్జీ చిత్తోడ్ వైపు భారీ సైన్యంతో మందసౌర్ వరకు ముందుకు వచ్చాడు. గుజరాతు సుల్తాన్ కుతుబుద్దీన్ కుంభల్ గడ్ వైపు భారీ సైన్యంతో సాగిపోతున్నాడు. ఉభయ సేనల్ని ఎదిరించే వ్యూహరచన చేశాడు మహారాణా కుంభా. కుతుబుద్దీన్ వలన తనకు ముందు ఎక్కువ ప్రమాదముంది. సరిగ్గా కుతుబుద్దీన్ సేనాశిబిరం కూడా రాణా సైన్యాలకు అనుకూలమైన కీలక ప్రాంతమందున్నది. రాజా తన సేనల్ని దారి మళ్లించాడు. చుట్టూరా అటవీ ప్రాంతమున్న చోటికి చేరినాడు. చాలా వేగంగా, రాణా సేనల కదలికలు ముస్లింసేనలు ఎంతమాత్రం పసిగట్టలేకపోయినవి. శత్రువును నమ్మించి దెబ్బతీసే యుద్ధవ్యూహం. దీన్ని వంచిక (స్ట్రాటజిక్ రిట్రీట్) అంటారు. తమ సమీపానికి చేరుకున్న శత్రుసైన్యంపైకి కుతుబుద్దీన్ సైన్యం ఉత్సాహంతో విరుచుకు పడింది. రోజంతా భయంకరమైన యుద్ధం జరిగింది. రెండువైపులా వేలాది సైనికులు చనిపోయారు. సూర్యాస్తమయం కాగానే యుద్ధం ఆపివేసి తమ స్థావరాలకు చేరుకున్నవి. రాత్రిపూట చనిపోయినవారి శవాలను ఏకత్రితంచేసి అగ్ని సంస్కారం చేయటం సాధారణంగా జరుగుతుంటుంది. రాణా సైన్య శిబిరంవైపు అగ్నిమంటలు కనిపించలేదు. హిందూసేనల శిబిరాలవద్ద కూడా వెలుగులు కనిపించలేదు. దీనితో హిందూసేనలు రాత్రికి రాత్రే యుద్ధభూమిని విడిచి పారిపోయినట్లు ముస్లిం సైన్యం భావించింది. విజయోత్సాహంతో విశ్రమించింది.
తెల్లవారుజామున చీకటిలోనే రాణా సేనలు గుంపులు గుంపులుగా అడవినుండి బయటికి వచ్చినవి. ముస్లిం సైన్య శిబిరాన్ని ముట్టడించినవి. యుద్ధమైదానంలో నలువైపులనుండి రాణా సైన్యాలు ముట్టడించేటప్పటికి ముస్లిం సైన్యాలు యుద్ధసిద్ధతలో లేవు. హిందూసేనలు ముస్లిం సేనల్ని ముల్లంగి గడ్డల్ని తరిగినట్లు తరిగి చంపివేసినవి. రాణా సైన్యాలు ఒకచోట స్థిరంగా ఉండి యుద్ధం చేయటంలేదు. గుంపులు గుంపులుగా నలువైపులా పరుగులు తీస్తూ ముస్లింసేనల్ని వధించి మాయమయ్యేవారు. ముస్లిం సేనలు భయంతో కకావికలై ప్రాణభయంతో పరుగులు తీసినవి. కుతుబుద్దీన్ స్వయంగా నాయకత్వం వహించినాకూడా ముస్లిం సైన్యం నిలబడలేదు. ప్రాణభయంతో కుతుబుద్దీన్ కూడా పారిపోయాడు.
చిత్తోడైవైపునుండి మొహమ్మద్ ఖిల్జీ సేనలుకూడా మందసౌరు దాటి ముందుకు రాలేకపోయినవి. అక్కడ అప్పటికే రాణా సైన్యాలు సిద్ధంగా ఉన్నవి. ఖిల్జీ సేనలకు రాణా సైన్య దృశ్యం ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించింది. కుతుబుద్దీన్ ఘోరంగా ఓడిపోయి పారిపోయిన సమాచారం కూడా వారికి చేరింది. ఖిల్జీతోసహా సైనికులందరి ధైర్యం సన్నగిల్లింది. రాణా కుంభా సైన్యాలను ఎదుర్కోవటం అంటే చావుని కోరుకోవటమేనని భావించారు. యుద్ధం ఆరంభంకాకముందే ఖిల్జీ సేనలు వెనుదిరిగినవి. ప్రాణభయంతో అస్తవ్యస్తంగా పరుగులు తీసినవి. రాణా సైన్యాల - లక్ష్యమైన మొహమ్మద్ ఖిల్జీ కూడా ప్రాణభయంతో పారిపోయినాడు మాండూవైపు.
రాణా కుంభా కీర్తిపరాక్రమాలు దశదిశలా వ్యాపించినవి. రాజపూరు అఖిలేఖా గారంలో లభించిన దస్తావేజులలో మహారాణాకుంభా కీర్తిప్రశస్తి ఇలా వర్ణించబడింది. మహారాణా కుంభా రాజగురువు (రాజులకు రాజు); దానగురువు (దాతలకు దాత), చాపగురువు (విలువిద్యాశ్రేష్ఠుడు); శైలగురువు (పర్వతాలన్నింటికి రాజు) వీరయోధ గురువు (వీరయోధులకు యోధుడు); పరమ గురువు (శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు) మహారాణా కుంభా మేవాడు రాజ్య భద్రతకు సంబంధించి పటిష్టమైన యోజనను అమలుచేశాడు. అనేకమంది రాజపుత్ర రాజులు మేవాడు రాజ్యంలో అనేక కోటలు నిర్మించారు. వందల సంవత్సరాల రాజపుత్ర చరిత్రకు సాక్ష్యంగా 74 కోటలు ఇప్పుడు శిథిలరూపంలో చెక్కుచెదరకుండా ఉన్నవి. వీటిలో 32 కోటలు మహారాణాకుంభా కాలంలోనే నిర్మించారు. అప్పటి కోటలన్నీ ఏడేసి ప్రాకారాలతో, ప్రవేశద్వారాలతో శత్రు దుర్భేద్యంగా ఉండినవి. చిత్తోడు, కుంభల్గఢ్, అచలగఢ్, రణథంభోర్ వంటి అనేక కోటల నిర్మాణ కళాకౌశలం కళ్లు చెదిరిపోయేలా ఉంది. ఆనాటి నిర్మాణ కళ అత్యద్భుతమని ప్రపంచ చరిత్రకారులు ప్రశంసించారు. ఈ కోటల పరంపర భవిష్యత్తులో కూడా మేవాడును సురక్షితం గావించింది. దేశమంతా మొగలులకు తలవంచినా మేవాడు రాజపుత్రస్థానం మాత్రం మొగలు దురాక్రమణల నెదిరించి స్వతంత్రాన్ని నిలబెట్టుకున్నది. మొగలులు, ముఖ్యంగా అక్బరు-ఔరంగజేబులు దురాక్రమణలను మేవాడు రాజపుత్రవీరులు విజయవంతంగా త్రిప్పికొట్టినారు. వారికి ప్రేరణా కేంద్రం మహారాణా కుంభా!... (శరత్ హెబాల్కర్ గారు వ్రాసిన హిందూదేశంపై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర)...
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.