Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దళిత జనోద్ధారక వైతాళికుడు శ్రీ రాంజీరావు పంతులుగారు - About Ramji Rao pantulu in Telugu

 శ్రీ రాంజీరావు పంతులుగారు -  Ramji Rao pantulu కీ ॥ శే. శ్రీ వేమూరి రాంజీరావు పంతులుగారు, పుణ్యదంపతులైన శ్రీ పద్మనాభరావు గారు, రమమ్మల గర్భమ...

శ్రీ రాంజీరావు పంతులుగారు - About Ramji Rao pantulu
 శ్రీ రాంజీరావు పంతులుగారు -  Ramji Rao pantulu
కీ॥ శే. శ్రీ వేమూరి రాంజీరావు పంతులుగారు, పుణ్యదంపతులైన శ్రీ పద్మనాభరావు గారు, రమమ్మల గర్భముక్తా ఫలముగా - కృష్ణాజిల్లా బందరులో 3-5-1891 సం॥రమున కడపట్టి ఐదవ కుమారునిగా జన్మించారు. వారిది చాల పురాతమైన వైదిక బ్రాహ్మణ కుంటుంబము అయిననూ మానవతా దృక్పధంలో మహనీయుడుగా జన్మించి దళితుల పాలిట దేవుడై బాపూజీ హరిజనోద్ధరణకు నడుంకట్టక మునుపే సంఘ సంస్కర్తగా సాంఘిక దురాచారాల్ని ఖండించి, వారి సముద్ధరణకు "అక్షరజ్ఞానం" ప్రధానమని గ్రహించి మన స్వాతంత్యానికి పూర్వమే, నిశ్వార్థ సేవలో, తన జీవిత సర్వశ్వాన్ని అర్పించిన అమరజీవి. త్యాగనిరతి గల్గిన కర్మయోగి! "మంచియన్నది మాలయయితె ఆమాల నేనగుదున్" అనే గురజాడ వారి గేయాన్ని నిర్మాణాత్మకంగా ఆచరించి, నిరూపించిన ధీశాలి!


హరిజన బాలురకు అక్షరజ్ఞానం కల్పించటానికె 1914 సం॥బందరు ముస్తాఖాన్ పేటలో మున్ముందుగా రాత్రిపూట పాఠశాలను నిర్వహించారు. ఆ తర్వాత రాంజీ పంతులుగారు వసతి గృహాన్ని కూడా నిర్మించి — ఉచితభోజన సదుపాయాల్ని కూడ కల్పించి, సమర్థవంతంగా సంప్రోషించారు. అయితే వారిని వెలివేశారు. అయినా వెరవకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ధృఢ సంకల్పంతో సంఘసేవకు నడుంకట్టి, ఎన్నో కష్టనష్టాలకోర్చి, తన సర్వశ్వం ధారపోసి, నిమ్నజాతుల, ఆర్ధిక, సామాజిక, మానసిక పరిస్థితుల్ని మెరుగు పర్చటానికై "విద్యల్ ఉపాది కల్పనల్" అని ఆనాడే పంతులు గారు గ్రహించి, జీవితాన్ని త్యాగం చేశారు.

బందరుకు 5 మైళ్ళ దూరంలోనున్న నడికుర్రు గ్రామానికి ఉదయాన్నే నడిచి వెళ్ళి 1911-13 సం॥రాల కాలంలో హరిజనవాడలో పాఠశాలను ప్రారంభించి ఎంతో శ్రమకులోనై వారికి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో వారిని చైత్యన వంతులుగా తీర్చిదిద్దారు. వారు నిర్వహించిన పూర్వపు రాత్రి పాఠశాలయే దినదిన ప్రవర్థమానమై ప్రాథమిక పాఠశాలగా ది 4-12-1916 సం॥లో రూపుదిద్దుకొంది. అనాటి పరిస్థితులకు వ్యతిరేకంగా, జాతీయ భావాలతో, అభ్యుదయ భావాలతో, నమసమాజ నిర్మాణ ధ్యేయంతో ధైర్యంగా నిలిచి, ఆచరణలో అక్షరసత్యం గావించిన మహా పురుషుడు పంతులుగారు గాబట్టి, వారి పాఠశాల పేరు ప్రఖ్యాతులు గడించుకొని, 1947-1948 సం॥రానికల్లా హైయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలగాను, అటుపిమ్మట మిడిల్ స్కూల్ ను ఆ తదుపరి అంటే 1961-62 నం॥రంలో హైయ్యర్ సెకండరీ పాఠశాలగా వృద్ధిగాంచినది. ఆటల్లో, పాటల్లో వాగ్ధాటిలో, చదువులో, అన్నింటిలోనూ పంతులుగారు నిర్మించిన పాఠశాల ఫష్టు రాంక్లో వుండేది ఆ పాఠశాలకు "సేవా సదనం " అని తొలుత పేరు పెట్టారు ఎందుకంటే, సేవతో అంకితభావం కావాలనే తపనతో అది స్థాపించిన సంస్థ రాంజీరావు పంతులుగారు, స్థాపించిన ఈ పాఠశాల వసతి గృహము ఎందరెందరో దళితులు, మంత్రులుగా, ఇంజనీర్లుగా, ప్లీడర్లుగా, ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. ఆఫీనర్లుగా తయ్యారు కావటానికి పునాదిరాళ్ళై - పుడమితల్లి పులకించునట్లు పంతులుగారు కృషిచేసి ధన్యులైనారు. ఇటీవలి కాలంలో ఈ పాఠశాల, వసతి గృహము; విద్యాశాఖవారి ఆధీనంలోనికి వచ్చి ప్రభుత్యపరముగా నిర్వహింపబడుచున్నాయి.

ఈ సంస్థలను నిర్వహించటానికి, ఆ రోజుల్లో వంతులుగారు పడినపాట్లు వర్ణనాతీతం. కన్యాకుమారి నుండి బర్మా వరకు జోలి పట్టుకొని విరాళాలు సేకరించి, హరిజన దళిత, బడుగు వర్గాల విద్యార్థుల కోసం చేసిన సేవలు యుద్ధరంగం లో సైనికునితో పోల్చినా చాలదేమో! ఆయన చదివింది ఐదో ఫారం అయినా ఆ  రోజుల్లో ఆయన పేరు చెప్పితే, కలక్టర్లకు కూడ భయమే! ఆయన సంకల్పం పట్టుదల అలాంటివి; అనాడే అంటే 1911-22 స॥లో పాఠశాలనందు, వృత్తి విద్యాకోర్సులు పంతులుగారు ప్రారంభించి, విద్యార్థులకు, పేపరు తయారుచేయుట, కుట్టుపనులు, తోలుతో వస్తువులు తయారు చేయుట, వడ్రంగం, వీవింగ్, కమ్మరం, వెల్డింగ్ ఇంజనీరింగ్, మొదలగు విషయాలనెన్నో భోధించారు. హరిజనోద్ధరణ ప్రత్యేక విషయంగా స్వీకరించి, "దీనబంధు" అనే పత్రికను నడిపి, దక్షిణ భారత దేశంలో ఆదర్శమూర్తియని, అభ్యుదయశాలియని, పేరును సముపార్జించి, భారత దేశానికెల్లా ఆదర్శమార్గాన్ని చూసిన మహోన్నత వ్యక్తి శ్రీ రాంజీరావు పంతులుగారు.

1929-30 ॥లో గాంధీజీ ఆంధ్ర దేశం వచ్చినపుడు బందరు వచ్చారు. రాంజీ సేవల గురించి విని పంతులుగార్ని పిలిపించుకొన్నారు. కౌగలించుకొన్నారు. ఆశీర్వదించారు; వారి పాఠశాలను సందర్శించారు. బాలికల కొరకు అంజనాదేవి హాస్టల్ను ప్రారంభించారు. 1928లోపంతులు గారిని మద్రాసు శాసనమండలి సభ్యునిగా నామినేట్ చేశారు. నాటి బ్రిటీషు ప్రభుత్వం పంతులుగారికి, కైనర్ హిందూ గోల్డు మెడల్ అవార్డును బహూకరించింది. కాని గాంధీగారి స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకొని వాటన్నిటినీ తానంతట తానుగా విసర్జించారు. తన జాతీయతా భావాన్ని నిరూపించుకొన్నారు. ఇవిగాక వయోజన విద్యావ్యాప్తికి, గ్రంధాలయోధ్యమానికి ఎంతో కృషి చేశారు. పంతులుగారికి తాను స్థాపించిన పాఠశాలే ఊపిరి. దళితలందరూ ఆయన బిడ్డలే క్రమశిక్షణ ఆయన ధ్యేయం. సమతా మమత ఆయన మతం. కాని, కొందరి స్వార్ధపరశక్తుల కుట్రలవల్ల పాఠశాల నుండి పంతులుగారు వైదొలగారు. మనస్సు విరిగింది. వేదన ఎక్కువైయ్యింది. హరిజనులూ, నా పాఠశాల, నా విద్యార్థులంటూనే చివరి రోజుల వరకు చింతించారు. ఆనారోగ్యంతో 1963లో జూన్ 3న స్వర్గస్తులైనారు. ఆనాటి మద్రాస్ గవర్నమెంట్ వారు. ప్రత్యేకమైన ప్రభుత్వ గజిట్ నోటిఫికేషన్ కూడ ప్రచురించి. నివాళులర్పించారు. " రావు బహదుర్ " బిరుదమును ఉభయ సభల్లోనూ, తిరస్కరించిన మహా దేశభక్తుడు. వేలు, ఎకరాలకోసం, ఆయన ఎగబడలేదు తరతరాలుగా, సాంఘిక న్యాయానికి దూరమైన దళితుల ఆశాజ్యోతియై, హరిజన వైతాళికుడై, ఎనలేని సేవచేసిన ఆ మహా త్యాగశీలి చరిత్ర, మన తెలుగువారి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడవసిన అవుసరం ఎంతో వుంది, కాని దుష్టరాజకీయ స్వార్ధపర శక్తుల మూలంగానేమో వారి చరిత్ర మురుగున పడిపోవటం విచారకరం.

రాంజీరావు పంతులుగారి పాఠశాలలోను, వసతి గృహంలోను చదివి, ప్రయోజకులైన వారెందరెందరో వున్నారు. వారిలో ముఖ్యులు, శ్రీ వేముల కూరయ్య, గోవాడ నిరీక్షణ రావు, గంజి రామారావు, గుంటూరు బాపనయ్య, ముత్యాల వేంకటేశ్వరావు, శ్రీ జె. రాజా రావు, గోవా వెంకటేశ్వర రావు, శ్రీ కె. మాధవరావు, దమ్ము రామ కృష్ణయ్య, శ్రీ కమలేశ్వరరావు, శ్రీ మంగళగిరి గోపాలకృష్ణ, శ్రీ యమ్. సి. దాస్ లాంటి మహా మహులెందరో వున్నారు. శ్రీ రాంజీరావు పంతులుగారి శిలా విగ్రహమును స్థాపించుట కొరకై పై నుదహరించిన పూర్వపు విద్యార్థులు, అధికార్లు, అనధికార్లు పూనుకొనుట ముదావహము సంతోషదాయకం ఈ పాఠశాల అభివృద్ధికి కూడ కృషి చేయగలరని ఆశిద్దాం. NSK చక్రవర్తి. సామాజిక కార్యకర్త.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments