నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిషర్నైనా చంపుతాను -రాజమణి - About Saraswathi Rajamani - megaminds

1

మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను.. అన్న నేతాజీ పిలుపుకు ముందొకొచ్చిన వీర కిషోరి పదహారేళ్ళ సరస్వతి రాజమణి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ బానిసత్వంలో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. స్వాతంత్య్రం కోసం మనసు తపిస్తుంటే ఆ బాధేమిటో పర పీడనలో ఉన్నవారికే అర్థమవుతుంది. అలాంటి బ్రిటిష్‌ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాలని సాహసించిన వారు ఎందరో... ఇప్పుడు వాళ్లందరినీ మనం మర్చిపోయి ఉండవచ్చుగాక... కానీ మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వారి భిక్ష అన్న విషయాన్ని చరిత్ర గుర్తుచేస్తూనే ఉంటుంది. అలాంటి గొప్ప వీర కిషోరి అనాడు సరస్వతి రాజమణి.

రాజమణి కుటుంబంవారు బర్మాలో స్థిరపడిన తమిళులు. రాజమణి తండ్రికి ఓ బంగారు గని ఉండేది. కానీ అతని మనసు మాత్రం భారతదేశంలో అప్పుడు సాగుతున్న స్వాతంత్య్ర పోరాటం మీదే ఉండేది. 1927లో ఆ కుటుంబంలో పుట్టిన రాజమణి, ఊహ తెలిసినప్పటి నుంచే తండ్రి బాటే పట్టింది. భారత స్వాతంత్రానికి సంబంధించి ఎలాంటి ఉద్యమం జరిగినా, ఏ సమావేశం జరిగినా తండ్రితో కలిసి వెళ్లేవారు. అలా ఓసారి బర్మాకు వచ్చిన గాంధీజీని కూడా కలిశారు. 'నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిషర్నైనా చంపుతాను' అని రాజమణి ఆయనతో అన్నారట. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. అయితే అహింసావాది అయిన గాంధీజీకి రాజమణి దృక్పథం నచ్చలేదు. రాజమణికేమో అహింస రుచించలేదు.

రాజమణికి 16 ఏళ్ల వయసుండగా నేతాజీ బర్మాకు వచ్చారు. అప్పటికే ఆయన ''ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ'' సంస్థను స్థాపించి సాయుధ పోరుని మొదలుపెట్టారు. సహజం గానే ఆయన బాట రాజమణికి నచ్చింది. 'మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను,' అంటూ ఆయన అందించిన పిలుపు ఆమెలో స్ఫూర్తి నిపింది. వెంటనే తన ఒంటి మీద ఉన్న నగలన్నీ ఆ సంస్థకు విరాళంగా ఇచ్చేసిందట. ఓ 16 ఏళ్ల పిల్ల తమకు నగలిచ్చిందని తెలుసుకున్న నేతాజీ వాటిని తిరిగి ఇచ్చేయడానికి రాజమణి ఇంటికి వెళ్లారట. అక్కడ ఆమె తన నగలను తిరిగి తీసుకోనంటే తీసుకోనని మొండికేసింది. ఆమె పట్టుదలకు మెచ్చిన నేతాజీ సంపద నీ దగ్గర ఎప్పుడూ నిలకడగా ఉండకపోవచ్చు. కానీ నీలోని జ్ఞానం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నీకు సరస్వతి అని పేరు పెడుతున్నాను' అని చెప్పారట. అప్పటి నుంచీ రాజమణి పేరు సరస్వతి రాజమణిగా మారింది.

నేతాజీతో పరిచయం అయిన ఆ రోజునే ఇండి యన్‌ నేషనల్‌ ఆర్మిలో చేరి తీరతానంటూ సరస్వతి పట్టుపట్టింది. దాంతో ఆమెను తన దగ్గర ఉన్న నలుగురు గూఢచారులలో ఒకరుగా నియమించారు నేతాజీ. బ్రిటిష్‌ అధికారుల ఇళ్లలో పని వారుగా పనిచేస్తూ అక్కడి రహస్యాలను చేరవేయడమే వీరి పని. ఆ పనిలో సరస్వతి ఆరితేరిపోయింది. వారిన ఉంచి విలువైన సమాచారాన్నెంతో నేతాజీకి అందజేసేది. అలా చేస్తున్న సమయంలో ఓసారి తన తోటి గూఢచారిని కాపాడే ప్రయత్నంలో సరస్వతి కాలికి బుల్లెట్‌ గాయమయ్యింది. అంతటి గాయంతో కూడా మూడురోజుల పాటు బ్రిటిష్‌ వారికి చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. సరస్వతి చూపిన ఈ తెగువకు ఆమెకు బ్రిటిష్‌ చక్రవర్తి చేతుల మీదుగా పతకాన్ని ఇప్పించారు నేతాజీ.

ఇండియన్‌ నేషనల్‌ ఆర్మి పోరు ఉధృతంగా సాగుతుండగా నేతాజీ హఠాత్తుగా అదృశ్యం కావడం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి దేశానికి స్వాతంత్య్రం రావడం జరిగిపోయాయి. సరస్వతీ రాజమణి ఆవిడ పరివారము ఉన్నదంతా వదులుకొని భారత దేశానికి తరలి వచ్చారు. బాధాకరమైన విషయమేమిటంటే స్వతంత్ర పొరాటం కోసం సర్వస్వం అర్పించిన పరివారం భారత దేశం వచ్చాక కడు పేదరికం అనుభవించాల్సి వచ్చింది.

చాలాకాలం ఈ ప్రముఖ స్వతంత్ర సేనాని చెన్నైలో ఇరుకైన పాడుపడ్డ నేతాజీ గారి ఫొటోలు తప్ప ఏమీ లేని ఒక గది అపార్టమెంట్ లో గడిపారు. ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వము పాతదే ఐనా ఒక ఇల్లు కేటాయించారు. దేశానికి సేవ చెయాలనే రాజమణి గారి స్పూర్తికి ధ్రుఢ సంకల్పానికి వయసు అడ్డం కాలేదు. 2006లో వచ్చిన సునామి వచ్చినప్పుడు ఆవిడ తన చాలీ చాలని పెన్షన్ని కూడా సేవా కార్యక్రమాలకు ఇచ్చేశారు. టైలర్ షాపులకు వెళ్ళి బట్టల ముక్కలు, పనికిరాని వస్త్రాలు సేకరించి వాటిని దుస్తులుగా మార్చి అనాధ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పంపిణీ చేసేది. 2018 లో జనవరి 13 న గుండెపోటుతో స్వర్గస్తురాలయ్యింది. ఇలాంటి మనదేశ సమర జ్వాలామణుల‌ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై వుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఇలాంటి చరిత్రలు మనం తెలుసుకోవడం తో పాటు వారి బాటలో వారి అడుగుజాడల్లో నడవల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది ������

    ReplyDelete
Post a Comment
To Top