Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వాళ్ళను చంపడానికి ముందు నన్ను కాల్చండి- అచ్చమ్మ చెరియన్ - About Accamma Cherian in telugu - megaminds

నేను వీళ్ళందరికీ నాయకురాలిని. వాళ్ళను చంపడానికి ముందు మొదట నన్ను కాల్చండి. అంటూ బ్రిటీష్ సైనికులకు సవాల్ చేసిన వీరనారి అచ్చమ్మ చెరియన్. ...

నేను వీళ్ళందరికీ నాయకురాలిని. వాళ్ళను చంపడానికి ముందు మొదట నన్ను కాల్చండి. అంటూ బ్రిటీష్ సైనికులకు సవాల్ చేసిన వీరనారి అచ్చమ్మ చెరియన్.

ఫిబ్రవరి 14, 1909వ సంవత్సరంలో అప్పటి ట్రావెన్ కోర్ లోని కంజీర పల్లికి చెందిన థమ్మన్ చెరియన్, అన్నమ్మ కరిప్పపరంబిల్ దంపతులకు అచ్చమ్మ జన్మించారు. చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత, ఆమె ఎడక్కరలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించారు. అనతికాలంలోనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్నతిని సాధించి వృత్తిగత జీవితంలో తగిన గౌరవాన్ని అందుకున్నప్పటికీ, ఆమె తన మాతృభూమిని స్వేచ్ఛా దేశంగా చూడాలని ఆశించారు. వలస పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.

1938లో అచ్చమ్మ చెరియన్ తన గౌరవనీయమైన బోధనా వృత్తిని వదలిపెట్టి, స్వరాజ్య ఉద్యమంలోకి అడుగు పెట్టారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థలో ఆమె క్రియాశీల సభ్యులయ్యారు. ట్రావెన్ కోర్ ప్రాంతంలో అప్పటి పాలకుల పనితీరు మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలకు ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఈ ఆందోళనలను అణచివేసేందుకు నిర్ణయించుకున్న ట్రావెన్ కోర్ దివాన్ అతడి విస్తృత అధికారాలను ఉపయోగించి, 1938 ఆగస్టులో ట్రావెన్ కోర్ రాష్ట్ర కాంగ్రెస్ మీద నిషేధం విధించారు.

ఈ సంఘటన కేరళలో మొదటి శాసనొల్లంఘనోద్యమానికి జన్మనిచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టోమ్ ఎ.తనూ పిళ్ళై సహా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులందరినీ జైళ్ళకు పంపించారు. అనంతరం వారు తమ ఆందోళన విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. వర్కింగ్ కమిటీని రద్దు చేసిన అనంతరం తర్వాతి నాయకుణ్ని ఎన్నుకునేందుకు అధ్యక్షుడికి విశేష అధికారాలు ఇవ్వబడ్డాయి. అలా ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన 11 మంది అధ్యక్షులను వరుసగా అరెస్టు చేయడం ప్రారంభించారు. ఫలితంగా నాయకత్వ లేమి కారణంగా ఉద్యమ బలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ తరుణంలో పదకొండవ అధ్యక్షుడు కుట్టనాడ్ రామకృష్ణ పిళ్ళై తన వారసురాలిగా అచ్చమ్మ చెరియన్ పేరు ప్రతిపాదించారు. ఫలితంగా ఓ నూతన పోరాట బలం ముందుకొచ్చింది. ధైర్యం, తెగువతో పాటు తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించగల ఆమె రూపంలో రాష్ట్ర కాంగ్రెస్ నూతన నాయకురాలిని పొందగలిగింది.

జైలు శిక్ష అనుభవిస్తున్న నాయకులను విడుదల చేయాలని, ట్రావెన్ కోర్ లో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నినాదాలతో దివాన్ మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆమె భారీ ర్యాలీని నిర్వహించారు. సుమారు 20 వేల మంది ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం వహిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ మీద నిషేధాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు కౌడియార్ ప్యాలెస్ వైపు కవాతు ప్రారంభించారు. ఈ ఉద్యమకారులకు అచ్చమ్మ దైర్యంగా నాయకత్వం వహించారు.

ప్యాలెస్ వైపు దూసుకొస్తున్న ఉద్యమకారుల నిరసన కవాతును ఆపేందుకు కాల్పులు జరపాల్సిందిగా బ్రిటీష్ పోలీసు ఉన్నతాధికారి అక్కడి పోలీసులను అదేశించాడు. ఆ ఆదేశాలు విన్న అచ్చమ్మ, ఆ అధికారితో ‘నేను వీళ్ళందరి నాయకురాలిని. వాళ్ళను చంపడానికి ముందు మొదట నన్ను కాల్చండి’ అంటూ బిగ్గరగా అరిచారు. ఆమె ధైర్యం ముందు పోలీసు అధికారి అదేశాలు పనిచేయలేదు. వెంటనే ఆయన తన అదేశాలు విరమించుకోవలసి వచ్చింది. ఫలితంగా పెద్ద స్థాయిలో ఊచకోత తప్పిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సాక్షాత్తు గాంధీ మహాత్ముడు ఆమెకు ట్రావెన్ కోర్ ఝాన్సీరాణి అనే బిరుదును ఇచ్చారు.

ఆ సమయంలోనే అచ్చమ్మ దేశ సేవా సంఘ్ అనే మహిళా వాలంటీర్ బృందాన్ని ఏర్పాటు చేసి, స్వాతంత్ర్య ఉద్యమంలో చేరేందుకు మహిళలను ఉత్తేజితుల్ని చేయడం ప్రారంభించారు. ఆమె ముందుకు సాగుతున్న తీరు వల్ల తమ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని గ్రహించిన బ్రిటీష్ అధికారులు అచ్చమ్మను, ఆమె సోదరి రోసమ్మ పున్నోస్ (ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు)తో కలిపి 1939 డిసెంబర్ 24న అరెస్టు చేసి, ఏడాది పాటు జైలులో ఉంచారు.

ఆమె ధైర్యాన్ని జైలు గోడలు అడ్డుకోలేకపోయాయి. విడుదలైన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దేశ స్వేచ్ఛ కోసం మరింత బలంగా పోరాడటం ప్రారంభించారు. బ్రిటీష్ దళాలకు సవాలు విసురుతూ క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు మళ్ళీ అరెస్టు కావలసి వచ్చింది. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంగా 1947లో భారతదేశం స్వరాజ్యాన్ని సముపార్జించుకుంది. కానీ అచ్చమ్మ విషయంలో మాత్రం సమరం ఇంకా ముగియలేదు. ట్రావెన్ కోర్ ప్రాంతం భారత్ లో భాగం కాకుండా స్వతంత్ర రాజ్యం కావాలని అక్కడి దివాన్ కలలు గన్నాడు. దరిమిలా ట్రావెన్ కోర్ ను ఇండియన్ యూనియన్ లో కలుపుకోవాలని అచ్చమ్మ తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ నిరసనల సమయంలో కూడా ఆమె అనేక అరెస్టులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె దేశభక్తి, పోరాట పటిమ కారణంగా అక్కడి ప్రజలు ఆమెను ఎంతగానో గౌరవించే వారు. ఫలితంగా ట్రావెన్ కోర్ శాసనసభకు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు కూడా. తిరువునంతపురంలో 1982 మే 5 న స్వర్గస్తురాలయ్యింది.

అచ్చమ్మ చెరియన్ ధైర్యసాహసాలు కలిగిన స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు, అక్షరాలు నేర్చుకున్న సమాజమే అభివృద్ధిని సాధించగలదని నమ్మిన ఉపాధ్యాయురాలు. సమాజాభివృద్ధికి అడ్డుపడే కట్టుబాట్లకు వ్యతిరేకంగా గళమెత్తి మహిళా విద్య కోసం నడుం బిగించి, అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతికి పాటుపడిన సామాజిక సంస్కర్త.

దేశ కోసం పోరాడిన ఎంతో మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధుల్లో అచ్చమ్మ చెరియన్ ఒకరు. అద్భుతమైన వీరి వీరోచిత గాధ చరిత్ర పుటల్లో మనకు కనిపించకుండా పోయింది. వారి లాంటి ఎంతో మంది ఆదర్శ మహిళా మూర్తులు మాతృభూమి కోసం పోరాడటంలో భాగంగా సమాజంలో ఎదురైన అసమానతలను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎన్నో త్యాగాలకు సైతం వెనుకాడలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారి పోరాటం వెనుక ధైర్యమే కాదు, త్యాగాలు కూడా దాగి ఉన్నాయి. ఇలాంటి ఉద్యమ వీరాంగిణి ఆదర్శంగా తీసుకుని దేశం అభివృద్దికోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments