Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కొంత విషాదాన్ని మిగిల్చి, కొంత కనువిప్పును కలిగించి తెరమరుగవుతున్న 2020 - MegaMinds

కొంత విషాదాన్ని మిగిల్చి, కొంత కనువిప్పును కలిగించి తెరమరుగవుతున్న 2020 - ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి - ప్రచ్ఛన్న సవాళ్లు విస...


కొంత విషాదాన్ని మిగిల్చి, కొంత కనువిప్పును కలిగించి తెరమరుగవుతున్న 2020

- ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి
- ప్రచ్ఛన్న సవాళ్లు విసిరిన కోవిడ్-19
- సరఫరా గొలుసుల విచ్ఛిన్నంతో ప్రపంచవ్యాప్తంగా మార్పు
- అనివార్యంగా మారిన జీవన విధానం
- అనూహ్య సంఘటనల పరంపర
- జీవితాలను మేలిమలుపులు కూడా తిప్పిన కరోనా

ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబర్ 31 గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత 2020 వ సంవత్సరం కాలప్రవాహంలో కలిసిపోయి 2021 తెరపైకి వస్తుంది. మన పంచాంగం ప్రకారం శ్రీ శార్వరి నామ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన ముగిసిపోయి,  ఏప్రిల్ 13వ తేదీ నాడు ప్లవ నామ సంవత్సరం మొదలవుతుంది. 2020 సంవత్సరం వస్తూ వస్తూ కోవిడ్ మహమ్మారిని వెంటబెట్టుకుని వచ్చింది. అది వెళ్ళిపోతూ కోవిడ్ను ఇక్కడే వదిలి ఒంటరిగా వెళ్ళి పోతున్నది. covid 19 మహమ్మారి మానవజాతి చెరిపేసుకున్నా అనేక హద్దుల రేఖలను యూటర్న్ చేసింది. ఆరోగ్యం కోసం కొన్ని పరిమితుల హద్దులు ఉండాలని గుర్తు చేసింది. ప్రజలు దానిని అర్థం చేసుకునే లోపే అది తన ప్రతాపం ఏమిటో ప్రపంచానికి చూపించింది.  ప్రజల మనుగడను భయాల మధ్యకు నెట్టివేసింది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. అనేక లక్షల మందిని కబళించింది.  కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది. ఈ పరిస్థితుల నుంచి బయట పడటానికి ప్రపంచ మానవాళి  పెనుగులాటలలో ఉంది. దీనికి సరైన ఔషధం ఇంతవరకూ కనుక్కోలేదు. ఆ ప్రయత్నాలలో ప్రపంచంలోని అనేక దేశాల వైద్య శాస్త్రజ్ఞులు మునిగిపోయారు.

ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి: గడచిన వందేళ్లలో 2020 లాంటి సంవత్సరాన్ని ఎరుగం. మానవాళి ఇలా ఓ మహమ్మారి బారిన పడింది. 1914-18 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1918-20 కాలంలో.. అప్పట్లో స్పానిష్‌ ఫ్లూ దాదాపు 50 కోట్ల మందికి సోకింది. ప్రపంచ జనాభాలో అది మూడో వంతు. అయిదు కోట్ల నుంచి పది కోట్ల మంది ఆ అంటువ్యాధికి బలయ్యారు. ఒక్క భారతదేశంలోనే ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల మంది దాకా మృతులైనట్లు అంచనా. నాటి మహమ్మారితో పోలిస్తే కోవిడ్‌ తీవ్రత తక్కువే. స్పానిష్‌ ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినవారిలో 10 నుంచి 20 శాతం మృతి చెందగా, కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మరణాలు ఒక శాతంలోపే ఉన్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక విధ్వంసం మాత్రం అప్పట్లో కంటే అనేక రెట్లు ఎక్కువ. స్పానిష్‌ ఫ్లూ సృష్టించిన విధ్వంసం చరిత్రలో ఎవరూ మరచిపోలేనిది. తమ జనాభాలో ఎక్కువ మంది కోవిడ్‌ బారిన పడటం చాలా దేశాలను వణికించింది. ఇతర దేశాల్లో కంటే మన దేశంలో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంది. వ్యాధి సోకినవారిలోనూ ఎక్కువమందిలో తీవ్రత తక్కువగా ఉంది. ఫ్లూ, ఇతర కరోనా సమస్యలకు మనలో జన్యుపరమైన నిరోధం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు.

ప్రచ్ఛన్న సవాళ్లు విసిరిన కోవిడ్-19: మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్న ఎనిమిది సాంక్రమిక వ్యాధుల జాబితాలో ఊహకందని మరో ఉపద్రవమూ పొంచి ఉందంటూ 2018 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు హెచ్చరిక చేసింది. చైనాలో పుట్టి అచిరకాలంలోనే పలు దేశాల్ని చుట్టబెట్టిన మహమ్మారికి కోవిడ్‌ అని డబ్ల్యూహెచ్ఓ నామకరణం చేసి.. పారాహుషార్‌ పలికినా- ప్రపంచాన్నే సరిహద్దుల్లేని సంగ్రామ స్థలిగా మార్చేసిన కరోనా ఈ ఏడాదంతా సామాజిక, ఆర్థిక విలయాన్నే సృష్టించింది. దేశ విదేశాల్లో ఎనిమిది కోట్ల మందికి సోకి 18 లక్షల మందికిపైగా అభాగ్యుల్ని కబళించిన కోవిడ్‌ ప్రపంచార్థికానికి కలిగించిన నష్టం రూ.150 లక్షల కోట్ల పై మాటే. ఇండియాలో లాక్‌డౌన్‌ కారణంగా స్థూల దేశీయోత్పత్తికి వాటిల్లిన నష్టం రూ.20 లక్షల కోట్లని అంచనా. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై రవాణా సేవలు నిలిచిపోయిన వేళ బిడ్డల్ని చంకనెత్తుకొని వందల కిలోమీటర్లు నడుచుకొంటూ సొంతూళ్లకు పయనమైన లక్షలాది వలస శ్రామికుల వెతల పయనాన్ని మించిన మానవ మహా విషాదం ఉందా? దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించినా, నేటికీ విద్యాసంస్థల్ని తెరవలేని పరిస్థితి. ఉపాధి మార్గాలు పూర్తిగా తెరుచుకోని దుస్థితి. ఆరోగ్య సేవలూ అన్ని స్థాయిల్లో అందుబాటులోకి రాని వైనం. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలకూ అంతరాయం వంటివన్నీ కోవిడ్‌ విసిరిన ప్రచ్ఛన్న సవాళ్లే. ఆ జాడ్యాల ను రూపుమాపే సమర్థ కార్యాచరణ ప్రభుత్వాల నుంచి ప్రజలు ఆశిస్తోంది. అది నేటి తక్షణ  అవసరం.  
                                             .  
సరఫరా గొలుసుల విచ్ఛిన్నంతో ప్రపంచవ్యాప్తంగా మార్పు: ఆర్థిక అసమానతలు, అనారోగ్యం వల్ల ఆదాయాన్ని కోల్పోవడం, చికిత్సకోసం జేబులో నుంచి ఖర్చు వల్ల దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు ఏటా పేదరికంలోకి కూరుకుపోతున్నారు. కాస్త చెప్పుకోదగిన స్థాయి నాణ్యమైన ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తే చాలు.. ఆరోగ్య సంరక్షణతో పాటు మనం మౌలిక వసతుల నిర్మాణానికి, విద్య-నైపుణ్యాలను మెరుగు పరచడానికి, ఉపాధి ఆధారిత పరిశ్రమలను, సేవలను ప్రోత్సహించడానికి శరవేగంగా చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ సంక్షోభ సమయంలో జరిగిన సరఫరా గొలుసుల విచ్ఛిన్నం ప్రపంచ లావాదేవీల రీతిలో మార్పు తెచ్చింది. భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన దేశం 10-15 మెగా ఇండస్ట్రియల్‌ పార్కుల్ని పారిశ్రామిక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి. ఒక్కో దాంట్లో 25,000 నుంచి 50,000 ఎకరాల భూ బ్యాంక్‌ను అందుబాటులో ఉంచాలి. ఈ పార్కుల వరకైనా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసి, అనవసరమైన నియంత్రణల్ని తొలగించాలి. ఎన్ని ఉద్యోగాలిస్తారనే ప్రాతిపదికన ప్రోత్సాహకాలు కల్పించాలి. దీంతోపాటు, పెద్దయెత్తున కార్మికుల అవసరం ఉండే పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టి వస్త్ర, రెడీమేడ్‌, పాదరక్షలు, బొమ్మలు, తోలు, ఎలక్ట్రానిక్స్‌ తదితరాల్లో అనవసర నిబంధనలన్నింటినీ తీసి పారేయాలి. అప్పుడే ఈ దేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం అవుతుంది. 

అనివార్యంగా మారిన జీవన విధానం: కోవిడ్‌ ప్రభావం వ్యవసాయం మీద కన్నా పరిశ్రమలు, సేవల రంగాలపై ఎంతో ఎక్కువగా ఉంది. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. దాదాపు 30 కోట్ల మంది కొత్తగా పేదలు, పస్తులుండేవారి జాబితాలో చేరిపోయారు. 1929 నాటి మహా మాంద్యం సృష్టించిన ఆర్థిక విధ్వంసాని కన్నా ఇదేమీ తక్కువ కాదు. ఇళ్లలో పనిచేసే శ్రామికుల్లో అనేక మందికి తిరిగి ఉద్యోగాలు లభించవు. వాషింగ్‌ మెషీన్లు, రోబో స్వీపర్లు తదితర వినియోగ వస్తువులతో పనుల్ని సొంతంగా చేసుకోవడాన్ని మధ్యతరగతి ప్రజానీకం అలవరచుకొంది. పేద వర్గాల్లో మహిళలు సంపద సృష్టిలో భాగం కావడం ఇప్పటికే ప్రమాదకర రీతిలో పడిపోతోంది. ఉపాధి కలాపాల్లో మహిళల వాటా తగ్గుతున్న పెద్ద దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటే. 

కోవిడ్‌ నుంచి భారత్  మూడు పెద్ద పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. 
1} అభివృద్ధి చెందుతున్న దేశాలను.. ముఖ్యంగా భారత్‌ను పీడిస్తున్న ఆరోగ్య రంగ సంక్షోభం, ఆదాయ అసమానతలకు సంబంధించినది.
2} గత శతాబ్దంలో పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న ఆరోగ్య సంక్షోభాలకు సంబంధించినది. 
3} వచ్చే 30 ఏళ్లలో మన పిల్లలు ఎదుర్కోబోతున్న భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) పెరుగుదల సంక్షోభం. మరిన్ని మహమ్మారులు, గ్లోబల్‌ వార్మింగ్‌.. ఈ రెండూ ప్రపంచ స్థాయి సవాళ్లు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి చర్యలు అవసరం.

అనూహ్య సంఘటనల పరంపర: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తుల జీవితాలను ప్రశార్థకం చేసిన సంవత్సరం 2020. భారతదేశంలో కరోనావైరస్ భారత్లో తుఫానులు, హిమాలయాలపై చైనాతో ఉద్రిక్తతలు, ఆర్థిక అంతరాలు మొదలైన అనూహ్య సంఘటనల పరంపర కొనసాగింది. 
1] 2020 సెప్టెంబరులో, పార్లమెంటు ఉభయ సభలు నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులను ఆమోదించాయి. దానిపై పంజాబ్-హర్యానా రైతుల నిరసనలు  కొనసాగుతున్నాయి. పౌరసత్వ చట్టాన్ని వివాదాస్పద చట్టంగా చిత్రీకరించి దానిపై నిరసనలు జరిగాయి. భారత్ నుండి విడిపోయిన భూభాగాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుండి ముస్లింలు  కానివారు రక్షణ కోసం భారత్కు వస్తే వారికోసం పౌరసత్వ చట్టాన్ని చేసారు. ముస్లింల కోసం కూడా ఉండాలని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఢిల్లీలోని షహన్భాగ్లో నిరసనలు, దాడులు జరిగాయి. చివరకు మతకలహాలకు దారితీసింది.
2} లడఖ్‌లో ఎల్‌ఏసి వెంట భారత్-చైనా ఘర్షణ కొనసాగుతున్నది. స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి హిమాలయాలలో సమస్యల తీవ్రత పెరుగుతూ వచ్చింది. చైనా ఆకస్మికంగా లద్ధాక్లో ఆక్రమణకు దిగింది. అక్కడ జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు బలిదానమైనారు. చైనా సైనికులు ఎంత మంది చనిపోయారో చైనా ప్రకటించలేదు. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి హిమాలయాలలో తలెత్తిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించు కోవటానికి భారత్ కృత నిశ్చయంతో ఉన్నది. అట్లాగే 490 సంవత్సరాలుగా నలుగుతున్న అయోధ్య సమస్య  పరిష్కరించబడి 2020 ఆగస్టు 5వ తేదీన భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ శిలాన్యాస్ జరగటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.

జీవితాలను మేలిమలుపులు కూడా తిప్పిన కరోనా : 2020వ సంవత్సరం అనేక సమస్యలను తెచ్చిన దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే అనేక మలుపులు కూడా తిప్పింది. గ్రామాల  సమగ్రాభివృద్ధికి తెరలేపింది. ప్రజలు మళ్ళీ ఒక్కసారి. పరంపరాగత భారతీయ ఆయుర్వేదం వైపు మళ్లారు. దృష్టి మళ్లుతున్నభారతీయ జీవనం మళ్ళీ  తెరపైకి వచ్చింది. ఆహార విహారాలలో చాలా మార్పులు తెచ్చింది. అడంబరాలు, భేషజాలు సరయినవి కాదని కూడా కోవిడ్ గుర్తుచేసింది. సాంకేతికత ఆవసరానుకూలంగా ఉపయోగపడింది. ఇట్లా చెప్పుకుంటూపోతే మన జీవితాలను అనేక మేలి మలుపులు కూడా తిప్పింది  కోవిడ్ 19. మొత్తానికి మనదేశాన్ని, ప్రపంచాన్ని యూటర్న్ చేసింది. దీనిలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా  ఉన్నాయి. 2020 మొత్తానికి కొంత విషాదాన్ని మిగిల్చి, కొంత కనువిప్పును కలిగించి వెళ్ళిపోతున్నది. -శ్రీరాంపల్లి మల్లికార్జున్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments