రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? - about constitution day in telugu - megaminds

1


రాజ్యాంగం అందించిన మన వారసత్వం:
1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా, రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015 లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకొంటారన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్లాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్ట్ 15న మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకు రెండేళ్లకు పైనే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం 'జనగణమన' ను స్వాతంత్ర్య సమరయోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన రోజు ని "రాజ్యాంగ దివస్" గా జరుపుకుంటున్నాము. ఈ సందర్బంగా మనం కొన్ని ఆసక్తికర అంశాలని కింద తెలుసుకుందాం.

రాజ్యాంగరూపకర్తల దృష్టిలో హిందుత్వం: రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగపు తుది ప్రతిని పరిశీలిస్తే హిందూ వారసత్వాన్ని రూపకర్తలు గుర్తించినట్లే కనిపిస్తుంది. రాజ్యాంగంలో ఇరవై రెండు రేఖా చిత్రాలు ఉన్నాయి. వాటి జాబితాను చూస్తే ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి.

1. ముస్లిం యుగానికి ముందు కాలానికి సంబంధించిన చిత్రాల్లో మొహంజొదారో ముద్ర, వైదిక ఆశ్రమం (గురుకులం), లంకపై రాముని యుద్ధం, గీతోపదేశం, బుద్ధభగవానుడు, మహావీరుడు, ధర్మప్రచారం, హనుమంతుడు, విక్రమాదిత్యుని ఆస్థానం, నలందా విశ్వ విద్యాలయం, ఒరిస్సాకు చెందిన శిల్పం, నటరాజ విగ్రహం, గంగావతరణ దృశ్యం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువల్ని ప్రతిబింబించే చిత్రాలే. ఇవన్నీ దుష్టశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సేవాభావం. మానవత్వం, జ్ఞానం, ధర్మపరాయణత్వం వంటి హిందూ జీవన విలువల్ని చూపుతాయి.

2. మధ్యయుగానికి ప్రతీకగా ఒరిస్సాకు చెందిన హిందూ శిల్పం, నటరాజ విగ్రహం, భగీరధుని తపస్సు, గంగావతరణాల చిత్రాలు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు హిందూ పరంపర, సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగాయని రాజ్యాంగకర్తలు గుర్తించారు. ఆ తరువాత ముస్లిం యుగం ఈ అవిచ్ఛిన్న పరంపరను అడ్డుకుందని కూడా వాళ్ళు సూచించారు.

ఈ సాంస్కృతిక భావనే వివిధ రాజ్యాంగపు గుర్తులు, ప్రభుత్వ సంస్థల ఆదర్శ వాక్యాలలోనూ కనిపిస్తుంది. పార్లమెంటులో స్పీకర్ కుర్చీకి పైన ‘ధర్మచక్ర ప్రవర్తనాయ’ (ధర్మచక్రాన్ని తిప్పుటకొరకు) అని చెక్కి ఉంటుంది. ‘ధర్మ’ భావన హిందూ సంస్కృతిలో తప్ప మరెక్కడా కనిపించదు. (దీనిని మతంగా పొరబడు తుంటారు). అలాగే ‘లోక ద్వార మపావార్ను పశ్యేమ వయంత్వా'-ఛాందోగ్య ఉపనిషత్ (ప్రజాశ్రేయస్సు కొరకు ద్వారాన్ని తెరచి వారికి ఉదాత్తమైన సార్వభౌమత్వ పథాన్ని చూపించు) అని ప్రవేశ ద్వారం వద్ద రాసి ఉంటుంది. సెంట్రల్ హాల్ దగ్గర
‘అయం నిజ| పరోవేతి గణనా లఘు చేతసాం. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం -పంచతంత్రం. (నావాళ్ళు, ఇతరులు అంటూ ఆలోచించటం సంకుచిత మార్గం. ఉదారశీలురైన వారికి సమస్త జగత్తు ఒకటే కుటుంబం) అని ఉంటుంది.

సభలోని ఒక గుమ్మటం లోపలి వైపున ‘న సా సభా యత్ర న సంతి వద్ధా| , వృద్ధా| న తే యే న వదంతి ధర్మం, ధర్మ| స నో యత్ర న సత్యమస్తి, సత్యం న తద్ యచ్ఛలమభ్యుపైతి (మహాభారతం) (పెద్దలు లేని సభ సభ కానేకాదు, ధర్మానికి అనుగుణంగా మాట్లాడనివారు వృద్ధుడే కాదు. సత్యం లేనిదే ధర్మం నిలువజాలదు. ఏ సత్యమైనా సరే వంచనకు, కపటత్వానికి తావు లేనిదిగా ఉండాలి) అని రాసి ఉంటుంది.

ఇక రెండవ గుమ్మటం లోపల ‘సభా వా న ప్రవేష్టాయ వక్తవ్యం వా సమంజసం, అబ్రువన్ విబ్రువన్ వాపి, నరో భవతి కిల్విషి (సభలో ప్రవేశించకుండా ఉండడమో, లేక అందులో ఉంటే ధర్మానుగుణంగా మాట్లాడటమో చేయాలి. అసలు మాట్లాడనివారు, లేదా అసత్యంగాను, అధర్మంగానూ మాట్లాడేవారు పాపం చేస్తున్నట్లే) అని ఉంటుంది. ఇవే కాక అనేక ఆదర్శవాక్యాలు, సూక్తులు పార్లమెంటు గోడలపై కనిపిస్తాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువలేనని వేరే చెప్పక్కరలేదు.

అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం అందించే విశాల దృక్పథం పెంపొందించే సాంస్కృతిక విలువలే నేడు మనకు శ్రీరామరక్ష. ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా తన మతాన్ని అనుసరిస్తూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంగీకరిస్తూ, దేశ సమగ్రతకి, దేశాభివృద్ధికి పాటు పడటమే రాజ్యాంగ దినోత్సవ సందేశం. రాజ్యాంగ మౌలిక విషయాలను, ప్రాథమిక హక్కులను, పౌర విధులు, ఆదేశ సూత్రాలను అర్ధం చేసుకొని భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి గా నిలుపుదాం. -సామల కిరణ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment
To Top