ఇంతకీ ఆర్.ఎస్.ఎస్.ను ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? - 95 Years ago Why Started RSS and Who Started - megaminds

megaminds
0
ఇంతకీ ఆర్.ఎస్.ఎస్.ను ఎందుకు పెట్టారట?(95సం.ల క్రితం దసరానాడు). 1921లో దేశంలో సహాయనిరాకరణోద్యమం జరుగుతూ ఉండగా నాగపూర్ పరిసరాలలోని గ్రామ గ్రామానికీ వెళ్లి దేశంపట్ల తమకర్తవ్యమేమిటో వివరించి, రాజద్రోహ నేరానికి విచారింపబడి ఒక ఏడాదిపాటు జైలుశిక్ష ననుభవించిన వాడాయన. అయితే జైలుశిక్ష ననుభవించటంతో తన జీవితం తరించి పోయిందనే భ్రమ ఆయనలో లేదు. "చాలాసార్లు మనుష్యులు సాధనాలను ప్రేమిస్తూ, సాధించవలసిన లక్ష్యాన్ని మరిచిపోవటం జరుగుతుంటుంది. మనం అటువంటి పొరబాటు చేయరాదు." అని తన తోటివారిని హెచ్చరించి- "మనం పట్టుదలతో మనపనిని చేస్తూ ఉంటే, విదేశీపాలకులు తప్పక మనదేశాన్ని వదలిపెట్టి పోతారు" అని విశ్వాసం ప్రకటించిన వాడాయన. జైలులో ఉన్నరోజుల్లో మనదేశం పెద్దది. మనప్రజలు శూరులు, ప్రజ్ఞావంతులు, మనది అత్యంత శ్రేష్ఠమైన ధర్మం, మనది గౌరవప్రదమైన, అత్యంత ప్రాచీనమైన చరిత్ర. అయినప్పటికీ వందల సంవత్సరాలు గా మనం పరాధీనులుగా ఎందుకు ఉన్నాం? - అనే మౌలికమైన ప్రశ్న గురించి లోతుగా ఆలోచించి, మన దుర్దశకు మనమే కారణం, మనలోని అలసత్వం, స్వార్థ ప్రవృత్తీ మన పరాజయానికి కారణం. మన లోని అంతర్గత కలహాలవల్లనే మనం పరాధీనుల మైనాం అన్న విషయమై నిష్కర్షకు రావటమేగాక, ఏ గుణగణాలను మన దేశప్రజలలో నిర్మించవలసియున్నదో, దానికై ఎటువంటి కార్యప్రణాళికను రూపొందించవలసియున్నదో క్షుణ్ణంగా ఆలోచించి, అమలుపెట్టినవాడాయన. ఆయన పేరు డా౹౹కేశవ రావ్ బలిరామ్ హెడ్గేవార్. డాక్టర్జీ అని ఆయనను అందరూ పిలిచేవారు.

ఆయన పూర్వీకులు నేటి తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఉన్న కందకుర్తి గ్రామానికి చెందినవారు. నిజాం నవాబుల పాలనలోని ఇబ్బందులను తట్టుకోలేక నరహరిశాస్త్రి హెడ్గే 1800 తర్వాత నాగపూర్ తరలివెళ్లాడు. ఆయనకు మూడవతరం లోని వాడైన కేశవరావ్ 1889 ఉగాదినాడు (ఏప్రియల్ 1న) జన్మించాడు....

విదర్భ ప్రాంతంలోని జాతీయవాదుల సహకారంతో వైద్యవిద్యను అభ్యసించేందుకు కొలకత్తా చేరుకొని, వైద్యవిద్య నభ్యసిస్తూనే అనుశీలన సమితి అనే రహస్య విప్లవ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. 1913లో దామోదర్ నదికి భయంకర మైన వరదలు వచ్చినపుడు రామకృష్ణ మిషన్ మాధ్యమంగా వరద బాధితుల సేవా కార్యక్రమాలలో నిమగ్నుడై పనిచేశాడు. 

వైద్యవిద్య పూర్తయిన సందర్భంలో కాలేజి ప్రిన్సిపాల్ కేశవరావును పిలిచి- "బర్మాలోని ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ నుండి ఉత్తరం వచ్చింది. అక్కడ ఖాళీగా ఉన్నస్థానానికి యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నారా..‌ అని అడిగారు. నీపేరు సిఫారసు చేస్తున్నా" అని చెప్పారు. కేశవరావు తాను ప్రభుత్వో ద్యోగం చేయదలచ‌ లేదని చెప్పి, ధన్యవాదాలు తెలియ జేశాడు. "దేశపరిస్థితి  అస్తవ్యస్తంగా ఉంది. నావంటి యువకులు వేలాదిమంది తమ సర్వస్వాన్ని అర్పించి పనిచేసినప్పుడే కొంత చక్కబడుతుంది. బంధుత్వ భావనతో, దృఢదీక్షతో పనిచేయగల త్యాగశీలురు, సేవావ్రతులు అయిన కార్యకర్తలకోసం భారతమాత పిలుస్తున్నది. ఆ మార్గంలో నేను పయనించ నిశ్చయించుకొన్నాను" అని ప్రిన్సిపాల్ గారికి వివరించి చెప్పాడు. నాగపూర్ తిరిగి వచ్చారు.

అప్పటికి మొత్తం మధ్య ప్రాంతాలలో కేవలం 75 మంది వైద్యులు ఉండేవారు. డా. హెడ్గేవార్ గాని వైద్యవృత్తిలో ప్రవేశించినట్లయితే ఎంతో ఖ్యాతిని ధనాన్ని సంపాదించగల్గి ఉండేవారు. కానిఆయన బ్రహ్మచారిగా ఉండిపోయి, జాతినిఆరాధించటమనే వ్రతాన్ని స్వీకరించారు.

1920 డిసెంబర్ లో అఖిల భారత కాంగ్రెస్ మహా సభలను నాగపూర్లో నిర్వహించాలని నిర్ణయమైంది. లోకమాన్య తిలక్ అధ్యక్షతన మహాసభలు జరుగ వలసి యుండగా ఆగస్టు 1న ఆయన దివంగతు డైనాడు. అటువంటి స్థితిలో అధ్యక్ష స్థానానికి అర్హులెవరు? అరవిందఘోష్ ను అధ్యక్షునిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనను ప్రాంతీయ కాంగ్రెసు ఆమోదించింది. డా. బాలకృష్ణ శివరాం మూంజే, డా.హెడ్గేవార్ లు ఆగస్టులో పుదుచ్చేరికి వెళ్లారు. కాని క్రియాశీల రాజకీయాలలోనికి రావడానికి అరవిందులు  నిరాకరించారు. చివరకు విజయ రాఘవాచారి గారి అధ్యక్షతన సభలు జరిగాయి. 

మహాసభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో డా. హెడ్గేవార్ చాలా శ్రమించారు.1200మంది వాలెంటీర్లను కూర్చుకొని వారికి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ముప్పదివేల మందితో ఆ సభలు వ్యవస్థితంగా జరిగాయి. మహాసభల విషయ నిర్ధారణ సమితి సమావేశంలో డాక్టర్జీ ఒక తీర్మానాన్ని పరిశీలన నిమిత్తం అంద జేశారు. "భారతీయ గణతంత్రాన్ని స్థాపించటము, పెట్టుబడిదారీ విధానం సాగించే అత్యాచారాల నుండి దేశాలకు విముక్తి కలిగించటమూ దీని ఉద్దేశ్యం." ఈతీర్మానం విషయ నిర్ధారణ సమితిలో ఆమోదం పొందలేదు. అయితే డా. హెడ్గేవార్ భారత జాతీయ స్వాతంత్ర్య సమరాన్ని ప్రపంచంలోని సకల పీడిత తాడిత జాతులతో, సామ్రాజ్యవాద శృంఖలాలలో బంధింపబడియున్న దేశాలతో జోడించే ప్రయత్నం చేయటమూ గమనించిన మాడరన్ రివ్యూ పత్రిక ఇలా వ్రాసింది. "But the proposed resolution, which excited laughter among serious minded people, deserved a better fate than what it met with the Subjects Committee". (గంభీరమనస్కులైన వారిమధ్య నవ్వుపుట్టించిన ఈ ముసాయిదా తీర్మానం విషయనిర్ధారణ సమితి పట్టించిన గతికంటే, మరింతశ్రద్ధగా పరిశీలించదగి యున్నది)

1921 లో రాజద్రోహనేరానికి విచారింపబడి జైలుకు పంపబడిన విషయం ప్రారంభంలోనే ప్రస్తావింప బడింది. ఇలా రకరకాల ఉద్యమాలలో నుండి, అనుభవాలలో నుండి, అధ్యయనాలలో నుండి సాగిన తన పయనంలో, నిరంతరంగా సాగిన మేధోమథనంలో నుండి 1925  విజయదశమినాడు ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. 

డా. హెడ్గేవార్ జీవితంపై పరిశోధాత్మక గ్రంథాన్ని రచించిన డా౹౹రాకేశ్ సిన్హా ఇలా వ్రాశారు. "గణవేషమూ (యూనిఫామ్), పెరేడు, ఆటపాటలు, వివిధశారీరిక కార్యక్రమాలరూపంలో కనబడే అర్ధసైనిక సంఘటన, లేదా హిందూ సంరక్షకదళమూ కాకుండా సంఘం ఒక వైచారిక (ఆలోచనలకు, సంస్కరణలకూ ప్రాధాన్యమిచ్చే) ఉద్యమం. దాని లక్ష్యం సంపూర్ణ రాష్ట్రాన్ని(జాతిని) ఉద్దేశాలను గ్రహించుకొన్నదిగా రూపొందించటంకోసం సంఘటిత పరచటం. ఆయన సంఘకార్యాన్ని రాజ్యాధి కారానికో, అధిక సంఖ్యాకవాదానికో, హిందువుల సంఖ్యాధిక్యతకో లేదా రాష్ట్రానికి ఉండే ఒక పార్శ్వానికో పరిమితంచేయలేదు. సంపూర్ణ రాష్ట్రాన్ని, సంపూర్ణ సమాజాన్ని, రాష్ట్రంయొక్క సర్వాంగీణ వికాసాన్ని -వీటినే ఆయన తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. ఆయన సంఘానికి హిందూరాష్ట్రంతో ఏకరూపత, తాదాత్మ్యత అనే ఆదర్శాన్ని లక్ష్యంగా నిర్ధారించారు. అంతేగాక సంఘటన ఆదర్శాలను భూత, వర్తమాన , భవిష్యత్తుల యాత్రతో అనుసంధానం చేశారు. ఏదో ఒక ప్రయోజనం సాధించిన ఆనందంతోనో, ఒక లక్ష్యాన్ని సాధించుకున్ప తృప్తితోనో సంఘం యొక్క సంఘటనాకార్యంలో విరామం రాకూడదని ఆయన ఆలోచన. సంఘటన యాత్ర సమాజజీవితంతో, రాష్ట్ర జీవితంతో ఏకరూపమైపోవాలనీ, ఆకాంక్షించటమే గాక జీవితానికి ఏకైక కార్యంగా కార్యకర్తలు మలుచుకోవాలని నొక్కిచెప్పారు. సంఘానికి అవసరమయ్యే నిధులను విరాళాల రూపంలో బయటివారినుండి సేకరించుకోవటంకాక, స్వయంసేవకులు ఏటేటా 'గురుదక్షిణ' సమర్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు."

డా.హెడ్గేవార్ జీవనదృక్పథాన్ని స్పష్టంచేసిన ఒక సందర్భాన్ని తప్పక స్మరించుకోవాలి. ఒకసారి ఆయన ఒక తైలవర్ణ చిత్రపటాన్ని, దానిక్రింద "టీచ్ అజ్ హౌ టు డై" (ఎలా మరణించాలో మాకు నేర్పు) అనివ్రాసి ఉండటమూ గమనించారు. ఆయన ఆ వాక్యాన్ని  మార్చి "టీచ్ అజ్ హౌ టు లివ్" (జీవించవలసిన తీరును మాకు బోధించు) అని వ్రాశారు. 1940లో డా. హెడ్గేవార్ దివంగతులైనారు. కాని ఆర్. ఎస్.ఎస్. దినదిన ప్రవర్ధమానమౌతూ ఈ దేశపు పరమ వైభవాన్ని సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. -వడ్డి విజయసారథి.
('ప్రజ్ఞానిధులు, త్యాగధనులూనైన మనదేశభక్తులు' గ్రంథం నుండి)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top