Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పరమపూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జీ అంతిమ సందేశం - puujya dr hedgewar ji final speech - megaminds

అది 9 జూన్ 1940 ఆర్ ఎస్ ఎస్ స్థాపన జరిగి అప్పటికి 15 సంవత్సరాలు, అప్పటికే యావత్ అఖండ భారతదేశం మొత్తం ఆర్ ఎస్ ఎస్ శాఖలు విస్తరింపబడినాయి. స్థ...


అది 9 జూన్ 1940 ఆర్ ఎస్ ఎస్ స్థాపన జరిగి అప్పటికి 15 సంవత్సరాలు, అప్పటికే యావత్ అఖండ భారతదేశం మొత్తం ఆర్ ఎస్ ఎస్ శాఖలు విస్తరింపబడినాయి. స్థాపకులైన పరమపూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జీ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు, జూన్ 9 నాటికి ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణించింది అయినప్పటికీ వారు ఆర్ ఎస్ ఎస్ సంబదిత దేశవ్యాప్తంగా వచ్చినటువంటి స్వయంసేవకులకు వర్గ ముగింపు రోజు ఆరోజు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ శక్తినంతా కూడతీసుకుని వర్గ ముగింపు రోజున వారి అంతిమ సందేశం ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ ని యదాతదంగా ఇవ్వడం జరిగింది. దేశంకోసం పనిచేసే ప్రతి ఒక్కరూ వారి చివరి సందేశం ద్వారా ప్రేరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్జీ శాంత గంభీర స్వరంతో సందేశం ప్రారంభించారు.

మాననీయ సర్వాధికారీజీ, ప్రాంత సంఘచాలక్ జీ, ఇతర అధికారులారా, స్వయం సేవక బంధువులారా!
నా ఆరోగ్యం సరిగా లేనందువల్ల మీ అందరి ఎదుటా నాలుగు మాటలు మాట్లాడగలుగుతానో లేదోనని అనుమానంగా ఉంది. నేను గత 24 రోజులుగా మంచంలోనే ఉన్నాను. నిజం చెప్పాలంటే సంఘ కార్యం దృష్ట్యా ఈ సంవత్సరం చాలా బాగుందనే చెప్పాలి. నేను ఈ రోజు హిందూరాష్ట్ర యొక్క ప్రతిబింబాన్ని నా కళ్ళముందు చూస్తున్నాను.

మీలో ఎవరెవరు ఎంతెంత దూరం నుంచి వచ్చారో! నా అనారోగ్యం కారణంగా మీ అందరినీ కలవలేకపోయాను. నా మనసులో కోర్కె అయితే ఉంది. కాని ఆ విధంగా చేయలేకపోయాను. పూనా సంఘ శిక్షావర్గలో పదిహేను రోజులు పాల్గొన్నాను. అక్కడికి వచ్చిన స్వయం సేవక్ లందరితో పరిచయం చేసుకొన్నాను. ఇక్కడ నేను మీకు ఏవిధంగాను సేవ చేయలేకపోయాను. సరే, అది సాధ్యపడలేదు. ఇప్పుడు మీరంతా ఒకచోట కూర్చొని ఉండగా కనీసం చూడాలని, చేతనయితే నాలుగు మాటలు చెప్పాలని, ఈ రోజున ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇంతకు ముందు నేను చూడని వారెందరో ఉన్నారు. అయినా, నా మనసు మీవైపు ఎందుకు పరుగులు తీస్తోంది? మీ మనసులు నావైపు ఎందుకు ఆకర్షించపడుతున్నాయి? మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అందుకు కారణము. సంఘ సిద్ధాంతంలో అంతటి అద్భుత ప్రభావం ఉన్నది. ఎక్కడైతే సంఘతత్వం వ్యాపించి ఉందో, అక్కడ అపరిచితులైన వ్యక్తులు కూడ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. వారి నడుమ ప్రగాఢమయిన ఆత్మీయత అల్లుకుంటుంది. కొద్ది సమయంలోనే వారు మిత్రులవుతారు.

కొద్దికాలం కిందటి మాట. నేను పూనాలో ఉన్నాను. నాతో సాంగ్లీ వాస్తవ్యులు కాశీనాథ్ రావ్ లిమయే ఉన్నారు. మేము పూనాలోని "లకడీకపూల్" మీద వెళ్తున్నాము మాకు పదేళ్ళ పిల్లలు ఇద్దరు ఎదురుగా వచ్చారు. వారిద్దరూ మావైపు చూసి చిరునవ్వు నవ్వి ముందుకు సాగారు. నేను కాశీనాథ్ రావు గారితో "వారిద్దరూ సంఘం స్వయంసేవకులు" అన్నాను. కాశీనాథ్ రావుగారు "మీరు వారిని ఎట్లా గుర్తించారు? వారివద్ద బాహ్య చిహ్నములు ఏవీ కానరావడం లేదు కదా!" అన్నారు.

వారితో “మీరు పరీక్షించదలచితే ఇప్పుడే చూడండి” అంటూ నేనే ఆ పిల్లలను వెనకకు పిలచి “మీరు మమ్మల్ని గుర్తుపట్టారా?” అని అడిగాను. వారు "ఆ! రెండేళ్ళ క్రితం మీరు మా శాఖకు వచ్చారు. మీరు మా సరసంఘచాలక్ హెడ్గేవార్. వారు సాంగ్లీకి చెందిన కాశీనాథ్ రావు లియే గారు అన్నారు. ఈ విధంగా ఒకరినొకరు గుర్తించగలగడం, పరస్పరం ఆత్మీయతను కలిగి ఉండడం సంఘ తపస్సు యొక్క ఫలం. ఇది ఏ వ్యక్తివల్లనో అయిన పనికాదు.

ఇంతకుముందే మీరు మద్రాసుకు చెందిన సంజీవ కామత్ గారి ఉపన్యాసాన్ని విన్నారు వారు అపరిచితులుగా, అతిథులుగా ఇక్కడికి వచ్చారు. వారు యిక్కడ నాలుగు రోజులు గడిపారో లేదో మన స్వయం సేవక బంధువు అయిపోయారు. సోదరుడుగా ఇక్కడి నుంచి వెళ్ళుతున్నారు. ఇలా మనసులు కలియడం ఏ ఒక్క వ్యక్తి కృషి ఫలితం కాదు. ఇదంతా సంఘం యొక్క కృషి ఫలితం.

మన భాషలు వేరు. అలవాట్లు వేరు. పంజాబు, మద్రాసు, బెంగాలు, సింధ్, ఢిల్లీ, బొంబాయి వంటి అనేక దూరప్రాంతాల నుంచి వచ్చాము. అయినప్పటికీ స్వయంసేవకులంతా ఇంతగా కలసిమెలసి ఎందుకుంటున్నారు. ఎందుకు ఒకరిపట్ల మరొకరికి ప్రేమభావన ఉంది? దీనికి ఒకే ఒక కారణం ఉంది. మనమందరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఘటకులము కావడమే. సంఘంలో ప్రతి స్వయం సేవక్ మరొక స్వయం సేవక్ ను సోదరుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అన్నదమ్ములు ఒక్కొక్కసారి తమలో తాము డబ్బు విషయంలోనో, ఆస్తి విషయంలోనో తగాదా పడుతుంటారు. కాని స్వయం సేవకులు తమలో తాము ఎప్పుడూ పోట్లాడుకోరు.

గత 24 రోజులుగా నేను ఇంటిలో ఉన్నాను. మంచంలో పడి ఉన్నాను. కాని నా మనస్సు మాత్రం మీ అందరివద్దనే తిరుగాడుతూ ఉంది. నా శరీరం ఇంట్లో ఉంది. కాని నా మనసు వర్గలో ఉంది. గత సాయంత్రం మీ అందరితో కలిసి 5 నిమిషాలు సంఘస్థాన్లో ఉండి ప్రార్ధన చేయాలనే కోర్కె కలిగింది. కాని డాక్టర్లు అందుకు అనుమతించలేదు.

నేడు మీరంతా బయలుదేరి మీ మీ ఊళ్ళకు వెళ్ళుతున్నారు. అందువల్ల మీకు వీడ్కోలు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్లి పోతున్నందుకు విడిపోతున్నందుకు విచారించవలసిన పనిలేదు. మనమందరము ఇక్కడ కలసి ఒక మహత్కార్యాన్ని గురించిన నిర్ణయం తీసుకొన్నాము. దానిని పూర్తి చేయడం కోసం మనం వెళ్ళుతున్నాము. నా శరీరంలో ప్రాణమున్నంతవరకు నేను సంఘాన్ని మరచిపోనని ప్రతిజ్ఞ చేయండి. ఏదైన వ్యామోహంలో పడి మీ మార్గాన్ని విడనాడకండి. నేను అయిదేళ్ళ కిందట స్వయం సేవక్ గా ఉండేవాడిని అని చెప్పుకోవలసిన పరిస్థితి కలగనీయకండి. మనం ఆజన్మ స్వయంసేవకులం. తను మన ధను పూర్వకంగా సంఘం కార్యాన్ని చేస్తామన్న మన నిశ్చయాన్ని మనం మన హృదయాలలో ప్రజ్వలంగా పదిలపరచుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకొనేటప్పుడు ఈ రోజు నేను సంఘం పని ఏమి చేశాను?" అని మన మనస్సును ప్రశ్నించుకొందాం రోజూ శాఖా కార్యక్రమంలో పాల్గొన్నంత మాత్రాన, శాఖకు హాజరైనంత మాత్రాన మన పని పూర్తి అవుతుందనుకోరాదు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మన హిందూ సోదరులనందరినీ సంఘటితపరచాలి. మనం చేయాల్సిన మహత్కార్యం సంఘం వెలుపలే ఉంది. సంఘం కేవలం స్వయంసేవకుల కోసం కాదు. సంఘానికి వెలుపల ఉన్న వ్యక్తులకు దేశ ఔన్నత్యాన్ని సాధించే సరియైన మార్గాన్ని చూపటం మన కర్తవ్యము. హిందూజాతికి నిజంగా మేలు చేకూరేది ఈ సంఘటన ద్వారా మాత్రమే.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కు మరే పని లేదు. చాలామంది అడుగుతుంటారు. ముందు ముందు సంఘం ఏమి చేయబోతోంది?' అని. అది నిరర్థకమైన ప్రశ్న. హిందూ సమాజాన్ని సుసంఘటితం చేసే పనిని ముందు ముందు మరింత తీవ్రంగా చేస్తుంది. మనం ఈ పనిని చేస్తుండగానే స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. ఇది నిశ్చయమని భావించండి అప్పుడు యావత్తు భారతదేశం సంఘమయ మవుతుంది. ఆ రోజున హిందూ సమాజాన్ని తేరిపార చూసే ధైర్యం ఏ ఒక్కరికీ ఉండదు. మనం ఎవరిపైనా దురాక్రమణ చేయము. కాని మన పైన ఎవ్వరూ దురాక్రమణ చేయకూడదనే విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి.

ఈ రోజే మీకు కొత్త విషయమేమీ చెప్పడం లేదు. మన జీవితాలలో ప్రముఖస్థానం ఈ సంఘకార్యానికి ఇవ్వాలి. సంఘకార్యమే నా జీవనకార్యమని ప్రతి స్వయం సేవక్ గుర్తుంచుకోవాలి. మీరు మీ మీ స్థానాలకు వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని మీ హృదయాలలో పదిలపర్చుకొంటారనే నమ్మకం నాకుంది. ఈ విషయం చెబుతూ బంధువులు మీకు అందరికీ వీడ్కోలు ఇస్తున్నాను. (సంఘ మంత్రద్రష్ట డాక్టర్ హెడ్గేవార్ పుస్తకం నుండి సేకరణ)
పూజ్య హెడ్గేవార్ జి పరమపదించి 8 దశాబ్దాలు అవుతున్నప్పటికీ వారి ప్రేరణ ఇంకా పొందుతునే ఉన్నారు దేశప్రజలు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment