Page Nav

HIDE

Classic Header

{fbt_classic_header}

Top Ad

Popular Posts

Latest Posts

latest

ప్రస్తుతం జరుగుతున్న కురుక్షేత్రంలో భారత యువత రాణించగలరా? - MegaMinds

శంకా సంకుచితాంతరంగులు కురుక్షేత్రంలో రాణించగలరా? మూడు శతాబ్దులముందు వరకు యావత్ప్రపంచానికి కావలసిన అన్నివస్తువులను తయారుచేసిఇచ్చి...

శంకా సంకుచితాంతరంగులు కురుక్షేత్రంలో రాణించగలరా?

మూడు శతాబ్దులముందు వరకు యావత్ప్రపంచానికి కావలసిన అన్నివస్తువులను తయారుచేసిఇచ్చిన భారతదేశం ఈనాడు తమప్రజలకు అవసరమైన వస్తువులు తయారుచేసుకోలేదా? నిజంగానే భారతజాతి స్థితి ఇంతగా దిగజారిందా?

నేడు సగటుభారతీయుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టిన అర్జునుడులా ఉన్నాడు. తన రక్తంలో, తన సంప్రదాయంలో, తన దేశపు కళలలో, తనదైన సాహిత్యంలో ఏమిఉన్నదో అది స్ఫురించటంలేదు. మనం తీసుకొనే చర్యలకు పాపం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల వాళ్ళేమైపోతారో అనిబాధపడిపోతున్నాడు. చైనావాళ్ళెక్కడ రెచ్చిపోతారో అని భయపడి పోతున్నాడు.

మన దగ్గర ముడిసరుకులు వట్టిపోలేదు. పంటలు పండించే చేవ తగ్గిపోలేదు. రకరకాల వస్తువుల ఉత్పాదన చేసే సామర్థ్యం నశించిపోలేదు. అయినా ఎందుకు అయోమయ స్థితి? 

కొన్నిదశాబ్దాలుగా విదేశీవస్తువులు మేలైనవని, దిగుమతిఅయిన వస్తువులు వాడటంద్వారా గొప్పతనం ప్రదర్శించుకోవచ్చునని మనకు నాటి మన పాలకులు మప్పినారు. గాంధీవారసుల మని ప్రకటించటం కోసమే ఖద్దరు, అంతకుమించి ఖద్దరు, చేనేత వస్త్రాలపై ప్రేమలేదు. మనదేశంలోని కోట్లాదిప్రజలకు భుక్తి సమకూర్చేమార్గమన్న స్పృహలేదు. అన్నివస్తువుల విషయంలోనూ వారికి ఏవిధమైన స్పృహా లేదు. ఉన్నదల్లా ఏమేరకు కమీషన్లు లభించగలవనే లెక్కలే ! 

దశాబ్దాలుగా సైన్యానికి ఆయుధాలు ఇవ్వలేదు. తూటాలు ఇవ్వలేదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదు. రోడ్లువేయలేదు, వాహనాలు సమకూర్చలేదు. ప్రజలకునేర్పినది ఒక్కటే.. ఎవడు ఎక్కువ పైసలిస్తాడో, ఎవడు వాగ్దానాల పంచరత్నాలు గుప్పిస్తాడో, ఎవడు త్రాగబోస్తాడో వాడికి వోటువేయటం. 

ఆంగ్లమాధ్యమం ఇంజినీరింగ్ చదువులద్వారా గొప్ప సర్టిఫికెట్ లు చేతికివచ్చాయి. కౌశలాలు, నైపుణ్యాలు నేర్పవలసినతీరులో నేర్పలేదు.  నాటకాలు సాగిపోయాయి. కాలేజీ పెట్టటమంటే భవనాలు మాత్రమేనా? రీ ఇంబర్స్ మెంట్ ఉంటే సరిపోయిందా? పాఠాలుచెప్పి నైపుణ్యాల నలవరిచే ఉపాధ్యాయులు, ఆచార్యులూ ఉండనక్కరలేదా? ఇన్ స్పెక్ షన్ వేళకు ఎక్కడినుండో తెచ్చిన వారిని నిలబెడతారు. ఈ తీరున ప్రతిచోటా నాటకాలే నడిచాయి.

వీటిలోంచి తయారైవచ్చినవారికి మనదేశాన్ని మనం రక్షించుకోగలమని, మన ప్రజలను మనం పోషించుకోగలమని, మనం ఎవరినీ ప్రాధేయపడ నక్కరలేదనీ విశ్వాసంకల్పించగలమా?  ఇదే నేటి సమస్య. 

విశ్వాసాన్ని- ఆత్మవిశ్వాసాన్ని మేల్కల్పటం, సంకల్పాన్ని దృఢతరంచేయటం,  మన సామర్థ్యాలను గుర్తుతెచ్చుకొని కర్తవ్యోన్ముఖులం కావటం, విదేశీ ఏజెంట్లు అలవాటు చేసిన తేనెపూసిన విషపదార్థాలను ఏమాత్రం మోమోటమిలేకుండా తిరస్కరించటం - ఇదే ఇప్పుడు చేయవలసినపని , అనుసరించవలసిన నీతి.

ఈ సందిగ్ధ వాతావరణంలో వందేళ్ళక్రితం గురుదేవ రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పినమాట గుర్తువస్తున్నది. భారతదేశంలో అక్షరాస్యులు ఇరవై శాతమేకాగా నూరుశాతం విద్యావంతులే! అదెలాగా? ఇక్కడి ప్రజలందరికీ తాము మాట్లాడే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషలేగాక మరో భాషకూడా తెలుసు. అది రామాయణ మహాభారతాల భాష. అది సందేహాలను తీరుస్తుంది విశ్వాసాన్ని అందిస్తుంది, కర్తవ్యం తెలియజేస్తుంది.
 
ప్రతిభారతీయుడూ వ్యాసమహర్షి రచించిన మహాభారతం నుండి అందులోని ప్రముఖపాత్రలైన శ్రీ కృష్ణార్జునులనుండి ప్రేరణ పొందగల అవకాశం ఉంది. మహాభారతం ఒక నవల మాత్రమేకాదు. జీవితంలో ఎలా పోరాడుతూ ముందుకు సాగాలో, విజయాన్ని ఎలా కైవసం చేసికోవాలో, తనమార్గంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పే అనుభవాల సమాహారం. 

శ్రీ కృష్ణుని మార్గదర్శనంలో ముందడుగువేసిన విజయునిలా నేడు మనకు లభిస్తున్న సందేశాన్ని గ్రహించుకొని  ధనుర్ధారులమై విజయపథంలో ముందుకు సాగుదాం.

వీర భారతభూమి నావిర్భవించి 
పౌరుషములేని బానిస బ్రతుకు లేల? 
ఈ అయోమయ శృంఖలా లింకనైన 
త్రెంచుకొని బయల్పడి విజృంభించరేల?
  (కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి  గారి విజయశ్రీ నుండి)
-శ్రీ వడ్డి విజయసారది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..