Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశం గర్వించదగ్గ విప్లవవీరుడు ఆజాద్ About Revolutionary Freedom Fighter Chandra Sekhar Azad

ఊపిరున్నంత వరకు ఉరకలెత్తే ఉద్యమగుణం నీది ప్రాణమున్నంత వరకు పట్టుబడని స్వాతంత్ర్యగుణం నీది  శత్రువుచేతికి దొరకకుండా స్వేచ్చాబలిదా...

ఊపిరున్నంత వరకు
ఉరకలెత్తే ఉద్యమగుణం నీది
ప్రాణమున్నంత వరకు
పట్టుబడని స్వాతంత్ర్యగుణం నీది 
శత్రువుచేతికి దొరకకుండా
స్వేచ్చాబలిదానమైన 'ఆజాద్'వి నీవు
ఆంగ్లరాక్షసులపై విరుచుకుపడ్డ
భారతీయ సమరసింహానివి నీవు
సాహసానికి  చిరునామావై
సహాయ నిరాకరణ ఉద్యమాన నిలిచావు
చిన్ననాడే పోలీసుల చిక్కి
ఆజాద్ నంటూ కోర్టును హడలగొట్టావు
కొరడాదెబ్బల బాధని మరచి
వందేమాతరమంటూ వారణాసిన వెలిగావు
స్వతంత్ర్యదేవి సమారాధనలో
నవయవ్వనాన్ని బలిదానం చేసి
మాతృభూమి స్వేచ్చార్చనలో
జీవనకుసుమాన్ని పాదార్పణ చేసి
భారత మాత ఒడిలోన
భక్తుడిగా నేెలకొరిగిన ఓ వీరయోధా!
మరువము నీ త్యాగం.. 
మరువము నీ జీవితం..
ఎందుకంటే ఓ స్వాతంత్ర్యవిప్లవాగ్రేసరా?
మేము నీ వారసులం...
అవును మేము నీ వారసులం.....
ఇలా వారసత్వాన్ని నేటి మనం అందుకొని,తర్వాత తరానికి అందజేయటం మన కర్తవ్యం. నేటి యువతరానికి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు తలవటం, వారి జీవితాల్ని స్మరించటం జాతి ఆవశ్యకత ల్లో ఒకటి. అలాంటి భారతీయ విప్లవవీరులలో అగ్రగణ్యుడు,దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఆజాద్ జీవితాన్ని తెలుసుకుందాం.చంద్రశేఖర్ సీతారాం తివారి స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బదర్క గ్రామం.మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాంతివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర ఆజాద్ జూలై 23,1906 లో జన్మించారు. కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాశీలో చదివించాలనే పట్టుదల తల్లిదండ్రులకి వుండేది. కానీ ఆజాద్ కి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లు వదిలి పారిపోయి ఆజాద్ ముంబయిలోని మురికి వాడలో నివసించసాగాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలోని  నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారతస్వాతంత్ర్యం కొరకు గాంధీజీ చేస్తున్న సహాయనిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికిపోతుంది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే "జైలు"అని తల తిక్క సమాధానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15రోజులు జైలు శిక్షవిధించాడు. ఇతని తలతిక్క సమాధానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో,తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి ,15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తన కర్తవ్యాన్ని గుర్తుచేసింది. ఆ విధంగా మళ్లీ ఆంగ్లేయుల చేతికి ప్రాణంతో ఎప్పటికీ చిక్కకూడదని నిర్ణయించుకున్న చంద్రశేఖర్ .... చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.

చరిత్రలో మరువని ఓ పేజీ కాకోరీ: స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులయిన ఆష్పకుల్లాఖాన్, రోషన్ సింగ్ లు ఆంగ్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్రపన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి కాకోరి అనే ప్రదేశంవద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్ర శేఖర్ అజ్ఞాత వాసంలోకి వెళ్ళి పోయాడు.
రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాళికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.

విప్లవ కొలిమికి నేతృత్వం: చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ దేవ్ లు కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొని సాండర్స్ అనే పోలీసును కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ సింగ్ ని కాల్చక తప్పలేదు. తర్వాత రహస్య జీవితాన్ని గడుపుతూనే విప్లవ కార్యక్రమాల రచన చేసేవారు. ఈ క్రమంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ ఆజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.

చివరి వరకు ఆజాద్: అనంతరం ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కు లో తమ ఇతర విప్లవ మిత్రులతో కలిసి భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఒక దేశద్రోహి ఇచ్చిన పక్క సమాచారంతో వచ్చిన పోలీసుల్ని ఆజాద్ గమనించాడు. వెంటనే తన రివాల్వర్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్ తో నిలువరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. బ్రిటిష్ వారికి తాను పట్టుబడటం ఇష్టంలేక, మరో క్షణం ఆలోచించకుండా ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తుపాకి తన తలవైపుకి పెట్టుకుని కాల్చుకున్నాడు. 25 ఏండ్ల నవయవ్వనంలో చంద్రశేఖర ఆజాద్ మాతృభూమి విముక్తి కోసం ఆజాద్ గానే వీరమరణం పొందాడు. ఆజాద్ లోని ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగమయ భావన, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు నేటి తరంలో నిర్మాణం చేయాలి. నేటి తరం బలిదానాలు చేయాల్సిన పనిలేదు. దేశాభివృద్ధికి సమయం ఇచ్చి పని చేయటమే ఆజాద్ కి ఇచ్చే నిజమైన నివాళి. -సామల కిరణ్.
(జూలై 23 చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా).

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. జయహో చంద్రశేఖర్ ఆజాద్.వారివంటి త్యాగధనుల కష్టమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం.
    Thanks for sharing

    ReplyDelete