Type Here to Get Search Results !

తల్లి సమాజ నిర్మాత - successful mother stories in telugu

మాత-సమాజ నిర్మాత
    భారతీయ సంస్కృతిలో మహిళ స్థానం-మాతృస్థానమే. ప్రతి మహిళను మాతృమూర్తిగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది. తల్లిగా, తనయగా, చెల్లిగా, చెలియగా, ఇల్లాలిగా వివిధ స్థానాల్లో తన ప్రేమని అందించే స్త్రీని మాతృస్థానంలో మహిమాన్వితగా మన శాస్త్రాల్లో చెప్పబడింది. "మతి జానాతి యా సా మాతా"- అంటే మనసు తెల్సుకుని ప్రవర్తించేది మాత అని అర్ధం. మాన్యతే పూజ్యతేయా సా మాతా- అని నిరుక్తంలో చెప్పబడింది. గౌరవించదగినది, పూజించదగినది కనుక మాత అని దీనికి అర్ధం. అంతే కాదు సంతానానికి మాన్యత కల్గించునది (మానయతి సా మాతా) మాత అని కూడా చెప్తారు. అంటే తాను పూజనీయ స్థానములో ఉండటమే కాదు తన సంతానాన్ని కూడా గౌరవం అందుకునే విధంగా తీర్చిదిద్దే మహాశిల్పి మాత.

అమ్మ సంస్కారాలు నేర్పే తొలిగురువు
-పొద్దున నిద్రలేవగానే దేవునికి దణ్ణం పెట్టుకోమంటుంది. అరచేతుల్లో దేవుడున్నాడు మొక్కుకోమంటుంది
-మన బతుకుతున్న ఈ నేలతల్లిని కాళ్ళతో తొక్కుతాం కదా క్షమించమని నమస్కారం చేయమంటుంది.
-సృష్టికి వెలుగునిచ్చే సూర్యునికి దణ్ణం పెట్టమంటుంది.
-స్నానం చేయిస్తూ నీటికి దణ్ణం పెట్టిస్తుంది.
    ఇలా పసితనం నుండి బిడ్డను ప్రకృతి ఆరాధకునిలా చేస్తుంది. ప్రకృతిపట్ల కృతజ్ఞత భావం నిర్మాణం చేయటంలో తల్లి పాత్రే ప్రథమం.
-దేవునికి దణ్ణం పెట్టుకొమ్మంటుంది.
-పెద్దల కాళ్ళకి దండం పెట్టిస్తుంది.
-బిచ్చగాళ్ళకి అన్నం పెట్టిస్తుంది.
      ఇలా పెద్దల పట్ల గౌరవాన్ని, దైవం పట్ల విశ్వాసాన్ని పెంపొందించే తొలి గురువు అమ్మ. అందుకే ఒక తల్లి వందమంది ఉపాధ్యాయులతో సమానం అని అంటారు. బాల్యంలోని ఈ అభ్యాసాల వలన పెద్దయ్యాక మంచి సంస్కారవంతులుగా సమాజంలో సంతానం నిలబడుతుంది.

విలువలు నేర్పించటంలో అమ్మ
-భారతీయత ను వ్యవహారంలో నిలిపి ఉంచేవి విలువలు. యుగాలు మారినా విలువలు మారవు. సత్యంవద అని వేదవచనం స్వీకరించిన హరిశ్చంద్రుడు, ధర్మాచరణ కోసం రాముడు, ధర్మరక్షణ కోసం కృష్ణుడు, త్యాగ గుణంలో దధీచి-శిబి, దేశ రక్షణ కోసం జీవించిన శివాజీ-రాణా ప్రతాప్ లు విలువల కోసం జీవించినవారే. త్యాగం, ప్రేమ, దానం, దయ, సత్యం వంటి సుగుణాల్ని తల్లి తన బిడ్డలకి పసితనంలోనే అలవాటు చేస్తుంది. చేతికి తినేది ఏమిచ్చినా అక్కకి ఇవ్వు, తమ్మునికి ఇవ్వు, అన్నయ్యకు ఇవ్వు అంటూ ఇతరులకి ఇచ్చి తాను తినటం అలవాటు చేస్తుంది.
-కుక్కను కొట్టకు, తమ్ముడ్ని ఏడిపించకు, అందరితో కలిసి మెలిసి ఉండు ఇలాంటివెన్నో చెప్పి దయాగుణం, స్నేహగుణం నేర్పిస్తుంది.
-శ్రీ రాముని, శ్రీ కృష్ణుని సంఘటనలు, మహాపురుషుల గాథలు ఎన్నో చెప్పి ఉన్నతవ్యక్తిత్వం కలవారిగా మలుస్తుంది అమ్మ.
         రామాయణంలో త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా, సోదర ప్రేమకి అర్ధంగా నిలచిన లక్ష్మణుణ్ణి తయారుచేసిన సుమిత్ర తల్లులకి ఆదర్శం. తాను కష్టాల్లో ఉండి, పరాయి రాజ్యంలో తల దాచుకున్న స్థితిలో కూడా ఇతరుల కన్నీరు తుడవడానికి తన బిడ్డని త్యాగం చేస్తానన్న తల్లి కుంతి ఈ దేశ మహిళా మణులకి ఆదర్శం. విదేశీ దురాక్రమణలు, పరాయి పాలకుల దమనకాండలు వర్ణించి ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పోసి గొప్ప వీరునిగా శివాజీని తీర్చిదిద్దిన జిజియా మాత భారతీయ మాతృమూర్తులకి ఆదర్శం. మహాపురుషుల జీవిత గాథల్ని బోధించి, ధార్మిక విలువలెన్నో చెప్పి, జట్కా నడిపేవాడిని అవుతానని చెప్పిన నరేంద్రుడ్ని, కృష్ణుని వంటి గొప్ప సారధివి కావాలని ప్రేరణ ఇచ్చి, విశ్వ విఖ్యాతుణ్ణి చేసిన భువనేశ్వరి దేవి ఈనాటి స్త్రీలకి స్ఫూర్తి ప్రదాత.
         "మొక్కయి వంగనిది మ్రానయి వంగునా" అన్నట్లు పసితనంలో అందించే  సంస్కారమే వ్యక్తుల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. పిల్లల్ని దేశానికి పనికొచ్చే ప్రయోజకుల్ని తయారు చేయటంలో తల్లి పాత్ర ఎంత విశిష్టమైనదో పై ఉదాహరణల ద్వారా అర్ధమై ఉంటుంది. ప్రతీ భారతీయ స్త్రీమూర్తి  తమ సంతానాన్ని పాశ్చాత్య పోకడలకి దూరంగా ఉంచి, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలని అర్ధం చేయించాలి. దేశాభివృద్ధిలో "వ్యక్తి నిర్మాణం" ఆవశ్యకం అని గుర్తించాలి. మంచి వ్యక్తుల నిర్మాణం తద్వారా సమాజ నిర్మాణం సాధ్యం. అలాంటి వ్యక్తుల శిల్పి మాత, అందుకే మాత సమాజ నిర్మాత. -సాకి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. మనది మాతృస్వామిక రాజ్యం. దేశం భారత దేశం నా మాతృభూమి అంటూ ప్రతిజ్ఞ చేస్తాము. గాయత్రి మంత్రాన్ని అనునిత్యం జపించుతూ పంచ శక్తులను ఆరాధించుతాము.

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..