Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సమస్యలున్నప్పుడు ఈ ముగ్గురిలా బ్రతకాలి - Inspirational leadership qualities - MegaMinds

ఏళ్ళ తరబడి ఈ ముగ్గురు లాక్ డౌన్ ఎలా గడిపారో...! భారత స్వాతంత్ర్య పోరాటకాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్...

ఏళ్ళ తరబడి ఈ ముగ్గురు లాక్ డౌన్ ఎలా గడిపారో...!
భారత స్వాతంత్ర్య పోరాటకాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య వీర సావర్కర్ ను అండమాన్ జైలుకు పంపారు. మూడు కోట్ల ఇటుకలు  ఉపయోగించి, 698 గదులుగా నిర్మించిన సెల్యులార్ జైలులో ఆయనను మూడవ అంతస్థులోని గదిలో బంధించారు. ఒక్కొక్క గది 13'.6×7'.6 (3 మీ ×3.5 మీ ) వైశాల్యంతో ఒకేఒక కిటికీ కలిగి ఉండేది. అక్కడ ఇతర తనలాంటి ఖైదీలతోబాటు ఆయన అనుభవించిన శిక్షల గురించి నేను ఇక్కడ మళ్ళీ ప్రస్తావించదలచుకోలేదు. 
ఆయనలాగే ఏళ్ళ తరబడి జైలుగదిలో మగ్గిపోయి, శిక్ష అనుభవించిన ఇంకో ఇద్దరి గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ వ్యాసం నిజానికి నేను స్వంతంగా వ్రాసింది కాదు. విశ్వవాణి కన్నడ దినపత్రిక సంపాదకుడు శ్రీ విశ్వేశ్వర భట్ రెండు వేర్వేరు రోజుల్లో వ్రాసిన విషయాలనే నేను తెలుగు పాఠకులకు అందిస్తున్నాను.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా  27 ఏళ్ళపాటు జైలులో గడిపాడు. దక్షిణాఫ్రికా లోని కేప్ టౌన్ నుండి 7 కి.మీ దూరంలో ఉన్న రాబ్బెన్ ద్వీపంలో ఆ జైలు ఉండేది. కిటికీలోనుండి చూస్తే ఎదురుగా తెల్లటి సున్నపురాయి కొండ కనబడేది. దాన్ని చూసిచూసి మండేలా దృష్టి మందగించింది. ఆయనను విడుదల చేసినపుడు , వందలాది పత్రికా విలేకరులు తమ కెమెరాలతో ఒకేసారి ఫ్లాష్ లైట్లను వెలిగించగా, ఫ్లాష్ ఉపయోగించవద్దని వాళ్ళతో మండేలా విన్నవించుకోవాల్సి వచ్చింది. మండేల జీవితం గురించి హాలీవుడ్ లో సినిమా తీయాలని నిర్ణయమైనపుడు, మండేలా పాత్ర ధరించే నటుడు, అ జైలులోని గదిని చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఉండిన మండేలా మనస్థితిని అర్థం చేసుకోవడానికి, ఒకవారం  ఆ గదిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నటుడికి ఒక్కరోజు కూడా అక్కడ ఉండటం సాధ్యం కాక తిరిగి వచ్చేశాడంటే, ఆ జైలు జీవితం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి!

పాల్డెన్ గ్యాత్సో టిబెట్ కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి. తన ఎనిమిదేళ్ళ వయసులో మొనాస్టరికి చేరుకున్నాడు. దీక్ష తీసుకుని సన్యాసిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. 
ఇది 1959 నాటి సంగతి, చైనా టిబెట్ మీద దాడి చేసింది. దలైలామా శరణార్థిగా భారత్ కు వచ్చేశాడు. ఆయనతోబాటే గ్యాత్సో కూడా రావాల్సి ఉండింది. కానీ ఇతర లామాలను హెచ్చరించాలనే తాపత్రయంలో ఉండగా చైనా సైనికులకు దొరికిపోయాడు. గ్యాత్సో భారతీయ గూఢచారిగా పనిచేస్తున్నాడనే అనుమానం చైనాది. దానికితోడు కొందరు బంధిత బౌద్ధ సన్యాసులు, గ్యాత్సో మీద ద్వేషంతో, ఆయన భారత గూఢచారి అని చైనా సైనికులకు చెప్పి, తాము కఠిన శిక్షకు గురికాకుండా తప్పించుకున్నారు. గ్యాత్సో నోరు విప్పలేదు. తలక్రిందులుగా వ్రేలాడదీశారు. తర్వాత నాలుగురోజులు ఉపవాసము ఉంచారు. అయిదవరోజున బరువైన టైరును అతడి మెడలో వేసి నిలబెట్టారు. త్రాగడానికి కూడా నీరివ్వలేదు. అపుడపుడూ ఆయనను చూడటానికి వచ్చే సైనికులు ఆయన మీద మూత్రం పోసేవారు. రెండుమూడు రోజులకొకసారి భోజనం పెట్టేవారు. అదికూడా తేళ్ళు, ఎలుకలు, పందికొక్కులు, పురుగులు, పాములతో చేసిన వంటకాలతో. అది తినకపోతే ఉపవాసమే గతి. దాంతో ఆయన ఎక్కువగా ఉపవాసమే ఉండాల్సిన పరిస్థితి. రెండు మూడు నెలలకొకసారి స్నానానికి ఒక బకెట్ నీరు ఇచ్చేవారు. 
మూడేళ్ళు గడిచిపోయేటప్పటికి గ్యాత్సో కృశించిపోయాడు దాంతో జైలునుండి తప్పించుకోవాలనుకున్నాడు. తనతోటి ఏడుమందితో కలిసి సైనికుల కళ్ళుగప్పి జైలునుండి పరారయ్యాడు. అయితే ఎదురుగుండా భారత సరిహద్దువైపునుండి వస్తున్న చైనా సైనికుల దృష్టిలో పడ్డారు. ప్రారంభంలో ఆరేళ్ళ జైలు శిక్ష పడగా, అందులో అప్పటికి మూడేళ్ళు గడిచిపోయాయి. జైలునుండి పరారవ్వడానికి పోయి దొరికిపోవడంతో, వారి జైలు శిక్ష  మళ్ళీ ఎనిమిదేళ్ళకు పెంచబడింది. చిమ్మచీకటి గదిలో బంధించారు. మధ్యాహ్నపు మండుటెండలో బయటకు తెచ్చి, కళ్ళకు కట్టిన నల్లబట్టను విప్పేవారు. తీవ్రమైన ఎండకు  కొందరికి చూపు పోయింది. రాత్రి కాగానే బౌద్ధ సన్యాసులను ఒకచోట చేర్చి, దలైలామాను తిట్టడం అనే శిక్ష వేసేవారు. దాన్ని వ్యతిరేకిస్తే చావుదెబ్బలే. దలైలామాను తిట్టడం మరియు సన్యాస జీవితం గడపడం సాధ్యం కాని పరిస్థితి. రెండింటిలో ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. దాంతో ఆయన చావుదెబ్బలనే ఎంచుకున్నారు. 
1975 లో శిక్షాకాలం ముగిసి విడుదల చేయాల్సి ఉండినా వాళ్ళు వదలిపెట్టలేదు. 1983 వరకూ శిక్షను పొడిగించారు. తమ మాట వినని ఖైదీలను చైన సైనికులు వేగంగా వెళ్ళే ట్రక్కుల క్రిందికి తోసేవారు. ఆ శవాలను భుజాలకెత్తుకుని నదిలో విసిరేసి రమ్మనేవారు.
ఇదిలా ఉండగా గ్యాత్సోను చూడటానికి వచ్చిన ఒక వ్యక్తిద్వారా, టిబెటియన్ రాజకీయ ఖైదీలు అనుభవిస్తున్న కరుణాజనక వ్యథలను ప్రపంచం తెలుసుకుంది. చైనాపై ఒత్తిడి పెరగడంతో  ముప్పై ఏళ్ళ జైలుశిక్ష అనుభవించేసిన ఖైదీలను చైనా వదిలేయాల్సివచ్చింది. అప్పటికే 32 ఏళ్ళ శిక్ష అనుభవించిన పాల్డెన్ గ్యాత్సో బయటికి వచ్చాడు. 1992 లో జైలునుండి విడుదలైనా, భారతదేశానికి పోరాదని ఆంక్షలు విధించారు. అయితే గ్యాత్సో అధికారుల కళ్ళుగప్పి భారత్ కు వచ్చాడు. జైలులో సైనికుల మూత్రసేవన అనేది గ్యాత్సోకు ఒక శిక్షలాగా అన్పించనేలేదంటే, అక్కడి శిక్షలపట్ల ఆయనెంతగా తన గుండెను రాయిగా మార్చుకున్నాడో అర్థం చేసుకోండి. 2018 లో ఆయన మనదేశంలోనే చనిపోయాడు. ఆయన జీవితచరిత్రతో Fire Under The Snow: True Story of a Tibetan  Monk అనే పుస్తకం వచ్చింది.

కరోనా లాక్ డౌన్ ఎపుడు ముగుస్తుందో, 21 రోజుల క్వారంటైన్ శిక్షకన్నా మించింది లేదు, ఇంకా వారం రోజులు గడిచేదెలా? అనుకోకుండా పై ముగ్గురు ఏళ్ళ తరబడి లాక్ డౌన్, క్వారంటైన్  లకు గురైనా విశ్వాసం కోల్పోకుండా పక్కన ఎవరూ లేకుండా, ఒంటరిగా జీవితం గడిపారు. వాళ్ళ నుండి మనం ప్రేరణ పొందుదాం. మన లాక్ డౌన్ ఏళ్ళ తరబడి అక్కర్లేదు, ఓ వారం లేదా మరో నెల రోజులంతే ! -బ్రహ్మనంద రెడ్డి సింగారెడ్డి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments