Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భోగి, సంక్రాంతి, కనుమ, సంక్రాంతి దానాలు, గొబ్బెమ్మలు, గొబ్బి పాటలు గురించి పూర్తి వివరాలు - sankranti information in telugu

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ ...

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి.
సూర్యుడు నెలకొక రాశిలోకి మారుతాడు. కొత్త రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సంవత్సరంలో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తాడు. అంటే ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయన్నమాట. అయితే పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ రోజుతో ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకే మకర సంక్రమణాన్ని హిందువులైన మనం పెద్ద పండుగగా జరుపు కుంటాం.
రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన తరుణాన్ని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు భూమధ్య రేఖకి ఒకసారి అటు, ఒకసారి ఇటు ప్రయాణిస్తాడు. ఆయన భూమధ్య రేఖకి ఉత్తర దిక్కుగా ప్రయాణించడాన్ని ‘ఉత్తరాయనం’, దక్షిణ దిక్కుగా ప్రయాణించడాన్ని ‘దక్షిణాయనం’ అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలు. కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు ధనుస్సు రాశిలో ప్రవేశించేవరకు రాత్రి అని స్కాంధ పురాణం తెలుపుతోంది. ఉత్తరాయనం దేవతలకు పగలు కనుక యజ్ఞ యాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని సూచిస్తుంది మకర సంక్రాంతి. అందుకే భీష్ముడు ఉత్తరాయన పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనుస్సు రాశిలో ప్రవేశించినది మొదలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెల పొడుగునా వాకిళ్ల ముందు రంగువల్లులు తీర్చిదిద్దుతారు.
సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అను పేర్లతో మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు.
భోగి
భోగి నాడు తెల్లవారు జామునే పాత కర్ర పుల్లలు, పిడకల దండలు, కొబ్బరి మట్టలు లాంటివి వేసి పెద్ద మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. వస్తువులను, కోరికలను మంటల్లో వెయ్యడం వల్ల వైరాగ్యం కలుగుతుందని అర్థం. అందుకే పాత వస్తువులతో పాటు మనుషుల మనస్సుల్లో దాగి ఉన్న కొన్ని అలవాట్లు, కోరికలను సైతం అగ్నిలో దహింపజేసి, ఆ రోజు నుంచి కొత్త ఆయనంలోకి ప్రవేశించి, కొత్త జీవితాన్ని ప్రారంభి స్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగి మంట వేస్తారు. అలా అందరూ ఒకే చోట చేరడం వల్లన సమైక్యత ఏర్పడుతుంది.
భోగి రోజు తల్లులు పిల్లల తలమాడుపై ఉండే బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనె పెట్టి, కుంకుడు రసంతో తలంటు స్నానం చేయించాలి. ఆ రంధ్రం లోకి నూనె చేరటం ద్వారా చైతన్యం కలుగుతుందని మన ఋషుల మాట. తప్పనిసరిగా కుంకుడుకాయల రసంతోనే తలంటాలి. తరువాత నూతన వస్త్రధారణ, సూర్యునికి ఇష్టమైన పాయసం చేయాలి. ఈ రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. రేగిపళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడింటిని కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. ఇంట్లోని పెద్దవాళ్ల తరువాత పేరంటాళ్లు కూడా పోస్తారు. దీనివల్ల పిల్లలపై దృష్టిదోషం పోతుందనేది విశ్వాసం. చివరలో పేరంటాళ్లకి వాయనం ఇస్తారు. రేగు చెట్టును బదరీ వృక్షం అంటారు. రేగు పండును సంస్కృతంలో ‘అర్కఫలమ్‌’ అంటారు. ‘అర్క’ అంటే సూర్యుడని అర్థం. ఈ పండు కూడా రంగులోనూ, ఆకారంలోనూ సూర్యుణ్ణి పోలి ఉంటుంది. కాబట్టి తలమీద నుండి పోస్తున్న ఈ రేగుపళ్ల లాగే సూర్యశక్తి, ఈ పిల్లవానికి శరీరం నిండుగా ఉండాలని పెద్దల ఆకాంక్ష, దీవెన. భోగి రోజున గుమ్మడికాయతో వంటకాలు చేయడం ప్రత్యేకత.
భోగి రోజు ఇంద్రునికి ఇష్టమైనది. ఆ రోజు శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి పదవిని దక్కించుకున్న రోజు. భోగి రోజున కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యంతో పొంగలి చేసి, ఇంద్రునికి, విష్ణువుకి నైవేద్యంగా సమర్పించడం ఆచారం. శ్రీమహావిష్ణువు వామనావతారంలో భోగి రోజున బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కినట్లు కథనం. అందుకే ఈ రోజున వామనుని పూజించడం కూడా సంప్రదాయం.
భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం. నెలరోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి సంతోషించి స్వయంగా రంగనాథుడై దివినుంచి భువికి దిగి వస్తాడాయన. అంగరంగ వైభవంగా భోగినాడే ఆండాళ్లమ్మను చేపట్టి భూలోకాన్ని తరింపచేస్తాడు. భోగీంద్రుడంటే ఆదిశేషుడనే అర్థం కూడా ఉంది. హరికి భోగీంద్రశయనుడని పేరొచ్చింది అందుకే.
సంక్రాంతి
సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. తొలిపంట ఇంటికి రావడమే అందుకు కారణం. ఆ సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడే పంట పొలాలను, రాబోయే దిగుబడిని తలచుకొని సంతోష పడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత సంతోషానికి, ఆనందానికి మించినది ఇంకేముంటుంది? అందుకే శ్రమకు సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకుల ఆనందంలో పాలు పంచుకుంటారు.
సంక్రాంతి దానాలు
సంక్రాంతి నాడు పితృదేవతలకు, అర్హులకు ఏమి దానం చేస్తామో అవి ముందు జన్మలలో కూడా మనకు ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ రోజు ఎవరి ఇంటా ‘లేదు’ అనేమాట రాకూడదని పెద్దలు చెబుతారు. అలాగే సంక్రమణ కాలంలో ధాన్యం, గోవులు, కంచు, బంగారం లాంటివి దానం చేయాలి. వీటిని దానం చేసేంత శక్తి లేనివారు నువ్వులు లేదా నెయ్యి లేదా వస్త్రాలను దానం చేయాలి. ఫలాలు, కర్రలు, చెరుకు, మీగడలతో పాటు మజ్జిగ దానం చేయడం మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలంలో చేసే దానాలకి ఎన్నోరెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడు రోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్ర వర్తికి వరం ఇచ్చాడు. కనుక బలికి ఇష్టమైన దానాలు చేస్తూ సంతోషిస్తారు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయడం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. దక్షిణాయనం పూర్తయి పితృదేవతలు తమ స్థానాలకు వెళితే మళ్లీ ఆరునెలల వరకు రారు కనుక కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు.
గొబ్బెమ్మలు
గోపి శబ్దం నుండి పుట్టింది గొబ్బి. గోపి, గోబి, గొబ్బిగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతారు. కన్నె పిల్లలు కృష్ణుని గోపిగా తలచి, గొబ్బెమ్మలను పెట్టి వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడటం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యునికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకు సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరిదేవిగా భావించి చివరి రోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే తొందరంగా పెళ్లవుతుందని, కోరుకున్న మొగుడు వస్తాడని నమ్మకం. రంగు రంగులుగా తీర్చిదిద్దిన రంగువల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్టేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటిలో తెలియజేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని కొందరు చెబుతారు. ఇలా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని దండగా గుచ్చి, ఆ పిడకల నిప్పుసెగ మీద పాయసం వండి, భగవంతునికి నివేదిస్తారు.
గొబ్బి పాటలు
సంక్రాంతి నాడు ముగ్గులు, వాటి మీద ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బిళ్లమీద ముళ్లగోరింట, గుమ్మడి పూలు పెడతారు. ఈ గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు చేరి గొబ్బి పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.
గొబ్బి సుబ్బమ్మ సుఖములియ్యవే
చేమంతి పువ్వంటి చెల్లెలినియ్యవే
తామర పువ్వంటి తమ్ముడినియ్యవే
మల్లె పువ్వంటి మామానీయవే
బంతి పువ్వంటి బావానియ్యవే
కుంకుమ పువ్వంటి కూతురనీయవే
కొబ్బరి పువ్వంటి కొడుకు నీయవే
అరటి పండంటి అల్లుడినియ్యవే
గులాబి పువ్వంటి గురువునియ్యవే
మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే..
సంక్రాంతి ముగ్గులు – అంతరార్థం
హేమంత ఋతువులో భూమి సూర్యునికి దూరంగా జరగటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దానిని నివారించడానికి ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి, గుల్ల సున్నంతో ముగ్గులేయడం వల్ల సున్నంలోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారిణిగా తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన ధారణశక్తి పెరుగుతుంది.
సంక్రాంతి రోజున హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు వారి సన్నాయి తాళాలు, వివిధ రకాల పందేలు, కోలాటాలతో గ్రామాలన్నీ ఆనందడోలికల్లో తేలియాడుతాయి. ‘హరిలో రంగహరి’ అంటూ అందరికీ వీనుల విందునందించే హరిదాసులు మన సాంస్కృతిక రాయబారులు. నుదుట పొడవాటి బొట్టు, తలపాగా దానిపైన పొందికగా అమర్చిన గుండ్రని పాత్ర, చేతుల్లో చిడతలు, కాళ్లకు గజ్జెలు, పంచె కట్టుతో కూడిన వారి వేషధారణ కనులకూ విందునిస్తుంది. మధురమైన గాత్రంతో చిడతలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో వారు హరికీర్తనలు పాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చూడముచ్చటైన అలంకారాలతో దర్జాను ఒలకబోసే గంగిరెద్దులు, ఊరంతా కలియ తిరుగుతూ ఉంటాయి. లయబద్ధంగా సాగుతున్న పాటకు అనుగుణంగా జానపదులు గుంపులుగా వేసే కోలాటం, ఆ ముచ్చట చూడవలసిందే కాని వర్ణించలేము.
మరికొన్ని ప్రాంతాలలో సంక్రాంతి నాడు బొమ్మల కొలువు పెట్టి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. ఇంకా గాలిపటాలు ఎగురవేయడం, పారు వేట, జల్లికట్టు వంటివి ఆడతారు.
అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులను ఆడించే పిట్టల దొరలు, విచిత్ర వేషధారులు మున్నగు కళాకారులంతా ఈ పండుగ దినాలలో వచ్చి వారివారి కళలను ప్రదర్శిస్తూ, ఎవరికి వారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ, చివరగా ఒక పాత వస్త్రాన్ని ఇమ్మని కోరి, భుజాన వేసుకుని ‘సుభోజ్యంగా ఉండాలమ్మా’ అంటూ దీవించి వెళతారు. గ్రామ సీమల్లో ఏ కళాకారులనూ రిక్తహస్తాలతో పంపకుండా కలిగిన దానిలో కలిగినంత ఇచ్చి పంపుతారు. ఇదే వారి సదాచారం.
కనుమ
కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూల దండలని వేసి ఊరేగిస్తారు. వాటికి హారతిచ్చి పూజ చేస్తారు. కనుమ రోజున ప్రత్యేక వంటకం మినప గారెలు. పితృదేవతలకు గారెలంటే ప్రీతి అని పెద్దలంటారు. గారెలను ఇష్టంగా భుజించే పక్షి ‘కాకి’. కనుమ రోజు తనకిష్టమైన గారెలు ప్రతి ఇంటా ఉంటాయి. కాబట్టి ఆరోజు కాకి ఆహారం కోసం మరో ప్రదేశానికి పోదు. ‘కనుమ నాడు కాకి కూడా కదలదు’ అన్న సామెత దీన్నుంచే వచ్చింది. అంతేకాకుండా పితృదేవతలు కాకి రూపంలో వచ్చి నైవేద్యంగా పెట్టిన గారెలను భుజిస్తారని అంటారు. కనుమ నాడు ప్రతివ్యక్తి పితృదేవతలకి పెట్టుకోవాలి.
కొన్ని ప్రాంతాలలో పొంగలి చేసి, పసుపు, కుంకుమలను కలిపి వ్యవసాయ భూములలో చల్లుతారు. దీనినే ‘పొలి చల్లడం’ అంటారు. ఈ సమయంలోనే గుమ్మడికాయను దిష్టితీసి పగలకొడతారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని, చీడ పీడలు రావని రైతుల నమ్మకం.
‘సంక్రాంతి’ ఒంటరిగా రాదు. ముందు భోగి, వెనుక కనుమను వెంట బెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుంది. మనం చేసే పూజలు, సమర్పించే నైవేద్యాలు స్వీకరించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి, ఆశీర్వదిస్తుంది.
– డా|| యం. అహల్యాదేవి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. తెలుగు వెలుగు రేఖల రవల్లు ఈ సమాచార స్రవంతి

    ReplyDelete