శివరాత్రి - About Shivaratri in telugu

యోగశాస్త్ర ప్రకారం- శివుడు ఆదిగురువు. ఆయన ప్రప్రథమ యోగి. దేవతలకు శివుడే యోగసూత్రాలను బోధించాడని, శివప్రవచనంలో మొదటి భాగాన్ని ఆయన అర్ధాంగి పార్వతికి బోధించాడని పురాణ కథనాలు. ప్రతి యోగసూత్రంలోనూ పార్వతీదేవిని దేదీప్యసౌందర్య రూపంగా, దయాస్వరూపిణిగా వర్ణించాడు. ఈ సూత్రాల్లో రెండో భాగాన్ని సప్తర్షులకు బోధించాడు. యోగశాస్త్రం అంటే యోగాసనాలు వేసి దేహదారుఢ్యం పెంచుకోవడం కాదు. సృష్టి సమస్తాన్ని గురించి, జీవనగమ్యాన్ని ఆవిష్కరించేదే ఈ యోగశాస్త్రం. వ్యక్తి ఎటువంటి స్థాయిలో, ఎటువంటి చైతన్యవికాస దశలో ఉన్నప్పటికీ, కైవల్యానికి ఒకమార్గం చూపుతుంది ఈ శాస్త్రం. కేదారనాథ్‌ వద్ద కాంతి సరోవరం తీరాల్లో ఈ ప్రబోధం ఇవ్వడం జరిగిందంటారు. జగత్తుకు అందించిన తొలి యోగసంవిధానం అది.

ఆదిగురువు అయిన శివుణ్ని పూజించి, చరితార్థులు కావడానికి భక్తులకోసం శివరాత్రి పర్వదినాన్ని ఎంచుకున్నారు పెద్దలు. ఆ రాత్రి ఉత్తర దిఞ్మండలంలో గ్రహరాశుల గతులను అనుసరించి అనేక విశ్వశక్తుల ఆవిర్భావం జరుగుతుందంటారు. ఆనాడు ఉపవాసం ఉండి, జాగరణం చేస్తే ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక శిఖరాలు చేరుకొంటాడని విశ్వసిస్తారు. శివసాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆత్మ మేలుకున్నప్పుడే మనలోని చైతన్యం దివ్య భావమాధుర్య ప్రవాహమవుతుంది. అలౌకిక సౌజన్యం పురివిప్పుకొంటుంది.

మహేశ్వరుడు నిర్గుణ, నిరాకార విశ్వవ్యాపక మహాశక్తి. సర్వాంతర్యామి. చరాచర ప్రపంచం అంతటా తేజరిల్లుతున్నాడు. భక్తులను అనుగ్రహించేందుకు సగుణాకార నిరాకారాల ప్రతిరూపమైన లింగాకృతి ధరిస్తాడు. లింగమే సంకేతం. లింగపూజ నిరాకార నీరాజనం. తన అనంత మహత్వాన్ని జ్యోతిర్లింగంగా ప్రదర్శించి ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటున్న బ్రహ్మ, విష్ణువుల అహంకారాన్ని అణగదొక్కి వారికి గుణపాఠం చెప్పాడని ఒక కథ చెబుతారు.

మాఘమాసం కృష్ణ చతుర్దశినాడు ఆ దివ్య సంఘటన జరిగింది. శివుని చింతన, కాలరహిత విశ్వరూపం వారికి అప్పుడు అర్థమైంది. ఇక మానవమాత్రులం మనకేం అర్థం అవుతుంది? పురాణకథలు కల్పితాలుగా కనిపించినా, ఒక మహాసత్యం వాటిలో సాంకేతికంగా దాగిఉంటుంది. విశ్వసృజన ప్రాభవ ప్రదీప్తమైన పరాత్పర తత్వం మూడు రూపాలుగా బ్రహ్మ-విష్ణు-శివునిగా శోభిల్లుతుంటుందని శివలింగ ఆవిర్భావ కథ మనకు చెబుతుంది. బ్రహ్మ, విష్ణువులు పరమేశ్వరుని సార్వభౌమత్వాన్ని గుర్తించి విశేష పూజలతో సేవించి వారు కీర్తించారు. ఆ పర్వదినమే 'మహాశివరాత్రి' అయింది. మనలో అజ్ఞానమే రాత్రి. మనలో జ్ఞానమనే వెలుగు నింపేది శివరాత్రి. 'శి' అంటే శివుడు, 'వ' అంటే శక్తిరూపమని 'శివపద మణిమాల' చెబుతోంది.

శివరాత్రినాడు శివుని మారేడుదళాలతో పూజించడం, ఉపవాస, జాగరణాలను పాటించడంవల్ల శివానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆనాడు చేసే స్నానం పుణ్యప్రదమని ప్రతీతి. రాక్షసులుగా మారి పరులను హింసించడమే వినోదక్రీడగా మారిన కొందరి బుద్ధిని భగవంతునివైపు, మంచితనం వైపు తిప్పడానికే ఈ పుణ్యస్నానాలు, పర్వదినాలు మన పూర్వీకులు నిర్ణయించారనిపిస్తుంది. జాగృతమైన ఆత్మతో శివుని పూజించడంవల్ల జీవితం విజయవికాస ప్రస్థానమవుతుంది. కె.యజ్ఞన్న ఈనాడు అంతర్యామి 02.03.2011

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments