Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సూర్యజయంతి - రథసప్తమి విశిష్టత - About ratha sapthami in telugu - about surya jayanti in telugu

సూర్యజయంతి- రథసప్తమి విశిష్టత సూర్యుడు హైందవుల ప్రత్యక్ష దైవం, రథ సప్తమి అంటే సూర్యుణ్ణి ఆరాధించే పండుగ. మాఘమాసం సూర్యునికి అత్యంత ప్రీత...


సూర్యజయంతి- రథసప్తమి విశిష్టత

సూర్యుడు హైందవుల ప్రత్యక్ష దైవం, రథ సప్తమి అంటే సూర్యుణ్ణి ఆరాధించే పండుగ. మాఘమాసం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన మాసం. మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి, దీనినే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడి రథ గమనం ఉత్తర దిక్కుకు మళ్ళే ఈ రోజుకు హైందవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానముంది. ప్రతినిత్యం సూర్యుడు ఉదయించక ముందే తల స్నానం చేయడం, సూర్యదేవుడిని ధ్యానిం చడం మహా ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహారకమని మునులు తెలిపారు.

సప్తమి నాడు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, తలస్నానం చేస్తారు. రథసప్తమి నాడు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వెను కొన్ని ఆరోగ్యకర విషయాలున్నాయి. సూర్య కిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసుకునే వృక్ష జాతులలో రుద్రాక్ష, జిల్లేడు, రేగు వంటివి ముఖ్యమైనవి. జిల్లేడు, రేగు ఆకులు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. ఆ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వలన వాటిలోని విద్యుచ్ఛక్తి, నీళ్ళలోని విద్యుచ్ఛక్తి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపి సత్ఫలితాలు ఇస్తాయి.

ఎలాంటి అనారోగ్యాన్ని మన దరికి రానీయకుండా చేస్తాయి. ఆ ఆకులు నిల్వ చేసుకున్న ప్రాణశక్తి తలలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి, నాడుల్ని ఉత్తేజ పరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి, అందులో సూర్యబింబ ప్రతిమను తమలపాకుపై కుంకుమతో గీస్తారు. ధనుర్మాసంలో నెలరోజుల పాటు పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి వాటితో ఆరు బయట (సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో) వండిన బియ్యపు పొంగళిని చిక్కుడు ఆకులో సూర్య నారాయణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరోగ్య ప్రదాత
జ్యోతిష్య శాస్త్రంలో ‘ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృ చింతారవేః ఫల’ అని ఉంది. ఈ శ్లోకం సూర్యగ్రహ ఫలితాన్ని వివరిస్తుంది. సూర్యకాంతి ద్వారా డి విటమిన్‌ లభిస్తుంది. సూర్యుడి కిరణ జన్య సంయోగ క్రియ ద్వారానే మనం ఈ సృష్టిలో బతకగలుగు తున్నాం. ఆహారాన్ని పొందుతున్నాం. వైదిక వాఙ్మయం సంధ్యా వందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రియలను ప్రవేశ పెట్టింది.
సూర్య నమస్కారాలు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనవి, కనుక సూర్యనమస్కారాలు చేస్తే అరోగ్యానికి మంచిది, ప్రతిరోజూ ఈ శ్లోకాలు చదివి పదమూడు సూర్యనమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలు మన దరిచేరవు.

ధ్యేయ: సదా సవిత్రు మండల మధ్య వర్తీ,
నారాయణ సరసిజానన సన్నివిష్ట:
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ,
హరీ హిరణ్మయ వపు: ద్రుత శంఖ చక్ర:


1. ఓం మిత్రాయ నమః, 2. ఓం రవయే నమః, 3. ఓం సూర్యాయ నమః, 4. ఓం భానవే నమః, 5. ఓం ఖగాయ నమః, 6. ఓం పూష్ణేనమః, 7. ఓం హిరణ్య గర్భాయ నమః, 8. ఓం మరీచయే నమః, 9. ఓం ఆదిత్యాయ నమః, 10. ఓం సవిత్రే నమః, 11. ఓం ఆర్కాయ నమః, 12. ఓం భాస్కరాయ నమః, 13. ఓం శ్రీ సవిత్రుసూర్యనారాయణాయనమ:
ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.

ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
ఆయు: ప్రజ్ఞా: బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే

ఈ లింక్ ద్వారా సూర్య నమస్కారాలు చూడవచ్చు సూర్య నమస్కారాలు ఎలా చేయాలి?

సాంకేతిక ప్రమాణాలు అభివృద్ధి చెందని రోజుల్లోనే ఆనాటి మన శిల్పకారులు అంకిత భావంతో కొన్ని ఆలయాల్లోని గర్భగుడుల్లో నిర్దేశించిన మాసాలలో, రోజులలో సూర్య కిరణాలు పడేలా నిర్మాణాలు చేశారు. ఇది ఎంతో ఆశ్చర్య పరచే అంశం.

 • ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద అంతర్వేది నరసింహస్వామి క్షేత్రం ఉంది. అక్కడ లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్టు పాదాలపై ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కొన్ని రోజుల పాటు సూర్య కిరణాలు పడతాయి.
 • అనంతపురం నుండి 140 కి.మీ. దూరంలో హేమవతి సిద్దేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివుడు విగ్రహ రూపంలో ఉంటాడు. ప్రతి ఏడాది శివరాత్రి నాడు గర్భగుడిలోని మూల విరాట్టు సిద్ధేశ్వరస్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.
 • ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రఖ్యాతి పొందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు నెల పాటు సూర్య భగవానుడి ప్రభాత కిరణాలు గర్భాలయంలోకి ప్రవేశించి మూల విరాట్టు చెన్న కేశవ స్వామిపై పడడం ఒక మహాద్భుతం.
 • శ్రీకాకుళంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని, కంచిలోని కామేశ్వర ఆలయాన్ని ప్రత్యేక వాస్తు ఆధారంగా నిర్మించారు. అందు వలన ఈ రెండు ఆలయాల్లో సంవత్సరానికి రెండుసార్లు గర్భాలయంలోని పూజా మూర్తులపై సూర్య కిరణాలు ప్రసరించడం విశేషంగా చెప్పుకుంటారు.
 • మహారాష్ట్రలోని అష్ట వినాయకులలోని పాలిక్షేత్రం లో వెలిసిన బాల గణపతి విగ్రహంపై ప్రతి సంవత్సరం దక్షిణాయన ప్రారంభంలో సూర్య కిరణాలు మూల విరాట్టుపై ప్రసరించుట విచిత్రం.
 • మహారాష్ట్రలోని అష్ట వినాయకులలో మరొక క్షేత్రమైన రంజన్‌గావ్‌లో గల గణపతిపై సంక్రాంతి రోజున సూర్యుని కిరణాలు మూల విరాట్టుపై పడుట అత్యంత ఆశ్చర్యకరం.
 • తిరుపతి నుండి 7 కి.మీ.దూరంలో గల నాగ లాపురంలోని మత్స్యరూపంలో దర్శనమిచ్చే విష్ణు ఆలయంలో గల వేద నారాయణుడి విగ్రహం మీద ప్రతి సంవత్సరం మార్చి నెలలో 26, 27, 28 తేదీలలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.
 • అం.ప్ర.లోని నంద్యాల పట్టణానికి సమీపంలో మహా నంది శైవక్షేత్రం ఉంది. అక్కడ నవనందు లుంటాయి. అందులో ఒకటి సూర్యనంది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే తొలి కిరణాలు ఈ నంది విగ్రహం మీద ప్రసరిస్తాయి. అందుకే దీన్ని సూర్యనందిగా పిలుస్తారు.
 • మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మహాలక్ష్మి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో, తిరిగి నవంబర్‌ 9, 10, 11 తేదీలలో సూర్య కిరణాలు గర్భాలయం లోని మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం మీద మొదటి రోజు పాదాలపై, రెండవ రోజు ఛాతి భాగంలో, మూడవ రోజు నుదుటిపై సాయంత్రం వేళలో పడటం విశేషం.
 • తిరుత్తణిలోని ఆర్ముగస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాసంలో 3 రోజులు సూర్యకిరణాలు ఆ ఆలయం గోడకు ఉన్న రంధ్రం ద్వారా ప్రసరించి ఆర్ముగస్వామి పాదాలను మొదటి రోజు, రెండో రోజు హృదయ భాగాన్ని, మూడోరోజు శిరస్సును తాకుతాయి.
 • ఒరిస్సాలోని పూరీ సమీపంలో గల కోణార్క సూర్య దేవాలయంలో ఖగోళ పరమైన నిగూఢ రహస్యాలున్నట్లు పాశ్చాత్య పరిశోధకులు గుర్తించారు. అక్కడ సౌరశక్తి నిక్షిప్తమైనట్లు వారు నిర్ధారించారు.
 • ఈ సూర్యారాధన మనదేశంలోనే కాకుండా చైనా, ఈజిప్ట్‌ దేశాల్లో కూడా ఉంది.
రాముడికి, రావణుడికి జరిగిన యుద్ధంలో వ్యాస మహర్షి ఆదిత్య హృదయ ఉపదేశంతోనే రాముడు విజయం సాధించాడని పురాణాలు తెలుతున్నాయి.
సూర్య భగవానుడికి రథసప్తమి నాడు మూడు సార్లు అర్ఘ్యములిచ్చి నమస్కరించుట వలన ఆయుః వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధన, ధన్యాధి సంపదలు కలుగుతాయి. శత్రు బాధల నుండి విముక్తులవుతారు. శుభాలు కలుగుతాయి.
సూర్యుడిని ఆరాధించడం వలన మోక్షం సిద్ధిస్తుందని స్కాంధ పురాణంలో కాశీ ఖండంలో పేర్కొన్నారు. ఆదిత్య హృదయాన్ని తమ హృదయంలో ప్రతిష్టించుకొని సూర్యుడిలా విశాలంగా ఆలోచించే వారికి, సమాజానికి ఉపకారం చేసేవారికి, క్రమశిక్షణతో మెలిగే వారికి ఓటమి ఉండదు. రోగాలు దరిచేరవు.

ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌ అన్నారు మన పూర్వులు. వేదాల్లో సూర్యదేవతా సూక్తంలో సూర్యశక్తి గురించి వివరంగా ఉంది. సూర్యోపాసన, ఆరాధన, సూర్య నమస్కారాల వల్ల చర్మ, అస్థి, హృదయ సంబంధ వ్యాధులు నయమవుతాయి. అందువల్లనే వేదకాలం నుండి సూర్యారాధన ఉంది. ఆరోగ్యానికి, స్వస్థతకి రథసప్తమి వ్రతాన్ని సూచించారు మన మునులు. భవిష్య పురాణంలో ఆ వివరాలన్నీ ఉన్నాయి.

సూర్య రథం
సప్తాశ్వ రథమారుఢం ప్రచండ కశ్యపాత్మజం |
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌||

సూర్య రథానికి చక్రం ఒక్కటేనని అది ఒక సంవత్సర కాలానికి ప్రతిబింబమని, ఆ చక్రంలోని ఆరు ఆకులు ఆరు ఋతువుల కు ప్రతీకలని, రథానికి కట్టిన ఏడు గుర్రాలు ఏడు రోజులకు, సూర్యకాంతిలోని సప్త వర్ణాలకు చిహ్నాలు అని మన పూర్వీకులు వర్ణించారు. సూర్య రథసారది పేరు అనూరుడు అతనికి కాళ్ళు ఉండవని చెబుతారు.

ఈ వ్యాసం కూడా చదవండి రథసప్తమి విశిష్టత - ఆరోగ్య కారణాలు - ఆధ్యాత్మిక కారణాలు 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments