Type Here to Get Search Results !

యువత మద్యానికి ఎందుకు బానిసలవుతున్నారు? - Why are young people addicted to alcohol? - in Telugu


సమాజంలో మత్తుపదార్థాల అవసరం పెరగటానికి అనేక కారణాలున్నాయి. ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, ప్రస్తుతం ప్రజలు తమ బ్రతుకు తెరువు కోసం తంటాలు పడవలసిన పరిస్థితి లేదు. జనాభాలో చాలా భాగం బ్రతుకు తెరువు కోసం తంటాలుపడే పరిస్థితుల నుంచి బయటపడ్డారు. ఎప్పుడైతే మనుషులు మనుగడ భయాలనుంచి బయటపడతారో, అప్పుడు వాళ్లు తమకు ఇష్టమైనవి, ఆసక్తి కరమైన, వేరే వాటికోసం చూస్తారు. అలాంటివి వారికి దొరక్కపోతే సుఖం కోసం, మత్తు కోసం వారికి అవసరాలు ఎక్కువ అవుతాయి. అందుకే, పెద్దవాళ్లు ధనవంతులైనా, కొంత వయసు వచ్చేదాకా, పిల్లలకు ఆ విషయం తెలియకూడదు.
భారత సంస్కృతిలో, రాజులు, మహారాజులు కూడా తమ పిల్లలను చదువు కోసం ఇతర పిల్లలతో పాటు గురుకులాలకు పంపించేవారు. పిల్లలందరూ చాలా మామూలు స్థాయిలోనే జీవించేవారు. ఎవరికైనా సరే, వారి జీవితంలోకి సంపద రాకముందే, వారి జీవితంలోకి క్రమశిక్షణ, బాధ్యత, నిమగ్నత రావాలి. లేకపోతే ఆ సంపదే తలభారం అవుతుంది. ప్రస్తుతం ఈ తరానికి జరుగుతున్నది అదే.
తగ్గుతున్న క్రియాశీలత, శ్రద్ధ
ఈ రోజుల్లో కనపడుతున్న మరో కారణం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకి వెళుతున్నారు. పసితనంలో పిల్లలకు కావాల్సిన శ్రద్ధను వారు చూపలేకపోతున్నారు. అందువల్ల పిల్లలు అనేక ఇతర అడ్డదారులు తొక్కుతున్నారు. వారికి కావలసినంత శారీరక శ్రమ కూడా లేదు. మీరు మీ శరీర దృఢత్వాన్ని ఆస్వాదించలేకపోతే, శరీరం యొక్క చురుకుదనాన్ని, సత్తువను ఆస్వాదించి లేకపోతే, ఇక మీరు ఆస్వాదించగలిగేది మత్తు మందులు మాత్రమే. ఇప్పుడు మత్తు మందులు మత్తునే కాదు, కొన్ని గంటల వరకు మీరు ఎంతో చురుగ్గా ఉన్న అనుభూతినిస్తాయి. అందువల్లనే ఈతరంలో చాలా ఎక్కువమంది ఆ మార్గంవైపు వెళుతున్నారు.
ఈ తరం వాళ్ళు మత్తుపదార్థాల వైపు వెళ్లడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే, వారి ఆశలు కూలిపోతున్నాయి. వాళ్ల మెదళ్ళలో స్వర్గాలు కూలిపోతున్నాయి. వాళ్ళింకా తమ పరిస్థితి గురించి వివరంగా చెప్పలేకపోవచ్చు. వారికి కావాల్సిన స్పష్టత, ధైర్యము ఇంకా లేవు. మనం చాలా కాలంనుంచి ‘మీరు వీటినుంచి దూరంగా ఉంటే, స్వర్గంలో మీకు ఇవి చాలా ఎక్కువ అనుభవించ వచ్చు’ అంటూ చెప్పుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు ఇవన్నీ కూలిపోతున్నాయి, అందువల్ల వారు ఇక్కడే త్రాగేస్తున్నారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనిషికి తన బ్రతుకు తెరువు కోసం శారీరక శ్రమ చేయవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ ఒక్క విషయమే మత్తు పదార్థాలు కావలసిన అవసరాన్ని పెంచుతోంది మిగతా సుఖ, సౌఖ్యాలను ఆస్వాదించడం నేర్చుకోవాలి
పరిష్కారం ఏమిటి? మీకు పెరుగుతున్న పిల్లలు ఉంటే, వారిని ఆటల్లోనూ, కొండలు ఎక్కడం, ఈతకొట్టడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనులను చేయించాలి. వారికి సంగీతం, వేరే కళలు, దేనిమీదైనా ఆసక్తి కలిగేలా చూడాలి. వారు తమ తెలివితేటలు, మనోభావాలు చవిచూడకలగాలి. ఎప్పుడైతే వారు తమ చురుకుదనం, తెలివితేటలు, మనోభావాల ద్వారా వచ్చే సంతోషాన్ని ఆస్వాదిస్తారో, తమ శారీరక సుఖాల కోసం వారు వెతుక్కోవటం సహజంగానే అప్పుడు చాలా తక్కువ అవుతుంది. పిల్లలు చాలా ఆసక్తిగా అనేక ఇతర కార్యకలాపాలలో నిమగ్నం కావాలి. అప్పుడు సహజంగా వారికి మత్తు పదార్థాల అవసరం తగ్గుతుంది.
మనం మరో విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు త్రాగుడు ప్రచారానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాల్లో, వీడియోల్లో ప్రచారం చేస్తున్నారు. అది అన్నిచోట్లా ప్రత్యక్షమౌతోంది. ‘మీరు తాగకపోతే ఇంకెందుకు బ్రతుకు’ అన్నట్లుగా సమాజం భావిస్తున్నది.
ఈ మానవ శరీరం అతి గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ. మీకు మత్తు కావాలంటే దానిని లోపల నుంచి తయారు చేసుకోవచ్చు. అది మీకు ఎటువంటి మైకాన్నిస్తుందంటే, మీకు మత్తునిస్తుంది, అదే సమయంలో మీరు చాలా చురుగ్గా ఉంటారు కూడా. ఇటువంటి మత్తు మనం పిల్లలకు, యువతకు రుచి చూపించాలి. అందుకే మేము ఈ యోగా సాంకేతికతను అందరి జీవితాల్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు మీలోనే అటువంటి కొన్ని పరిస్థితులకు చేరితే, మీకు అసలైన మైకం తెలుస్తుంది, ఆ రకమైన మత్తు ఏ మత్తుమందూ ఇవ్వలేదు. అంతేకాక మీరు ఎంతో చురుగ్గా ఉంటారు. అది మీ శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
మనం వాటిని ఇంకా మెరుగైన విధంగా చేసుకోవటం నేర్చుకోవాలి. మనుషులు తమలోపలికే చూసుకొని, అతి ఉత్తమ సాఖ్యాలను అందుకోవడం నేర్చుకోవాలి. మన యువత వీటిని అనుభూతి చెందేలా మనం చూడాలి. మనం వారికి ఇలాంటి ప్రత్యామ్నాయాలు చూపకపోతే వారు మందు, మత్తు పదార్థాల వైపుకు సహజంగానే వెళ్తారు.
ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, శాంతంగా ఉండాలన్న, సంతోషంగా ఉండాలన్నా, మీకు ఏది కావాలన్నా, మీకు ఒక కెమికల్ అవసరం అవుతోంది. ఎప్పుడైతే ఈతరం ఈ రకంగా కెమికల్స్ వాడుతుందో, ఎప్పుడైతే 90 శాతం ప్రజలు ఈ ఔషధాలు ఇంకా ఇతర కెమికల్స్ రోజువారీగా వాడతారో, అప్పుడు ఆ తరం మనకన్నా అనేక విధాలుగా చాలా బలహీనంగా ఉంటుంది. అది మానవత మీద మనం చేసే పెద్ద నేరం. ఇప్పుడు మనమంతా కలసికట్టుగా లేచి నిలబడి, కావలసిందేదో చేయాలి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..