హీరా ఖాణి రాయగడ్ కోటలో పాలమ్మాయి - About hirkani life story - hirakani life in telugu


ఛత్రపతి శివాజి నిర్మించిన కోట రాయగఢ్‌. ఆ కోటకు ఒకే ఒక సింహద్వారం ఉంది. ఆ కోటలోకి రాకపోకలు సాగిం చేందుకు అదొక్కటే ద్వారం. ఎవరైనా ఆ ద్వారం గుండానే రావాలి, పోవాలి. అలా ప్రతిరోజూ కోట లోపలికి వచ్చి తమ పనులు చూసుకొని వెళ్ళేవారిలో హీరా ఖాణి అనే మహిళ కూడా ఉంది. కోటకు దగ్గరలో గల ఒక గ్రామంలో హీరాఖాణి జీవిస్తోంది. పాలు అమ్ము కోవడం ఆమె వృత్తి. రోజూ కోటలోకి వచ్చి పాలు అమ్ముకొని, డబ్బు సంపాదించుకొని సాయంత్రానికి తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయేది.
అయితే, సూర్యాస్తమయం తరువాత కోట సింహద్వారాన్ని తప్పకుండా మూసేస్తారు. మళ్ళీ తెల్లారేవరకు తెరవరు. ఆ సమయం లోపు ఎవరైన కోట వెలుపలికి వెళ్ళలేకపోతే తెల్లారేవరకు కోటలో ఉండాల్సిందే. ఒకరోజు కోటలోని ఒక గృహిణికి ప్రసవ నొప్పులు రావడంతో హీరాఖాణి ఆమెతోబాటే ఉండిపోయింది. ప్రసవమయ్యేటప్పటికి రాత్రయింది. ఆమె తన గ్రామానికి వెళ్ళాలని రాగా సింహద్వారం మూసి ఉంది. ‘నాకొక చంటిబిడ్డ ఉంది. నేను వెళ్ళకపోతే, ఆ బిడ్డకు పాలుపట్టే అవకాశముండదు. కాబట్టి నన్ను బయటకు పంపండి’ అని ఆమె సైనికులను ఎంతో వేడుకుంది. అయితే వాళ్ళు ససేమిరా అన్నారు.
దిక్కుతోచని హీరాఖాణి ఏడుస్తూ అక్కడే కూర్చుంది. సూర్యోదయం తర్వాత సింహద్వారం తలుపులు తీసిన సైనికులు హీరాఖాణి కోసం వెతికారు. కాని ఆమె కనిపించలేదు. నిజానికి ఆమె ఆ రాత్రే సైనికుల కళ్ళుగప్పి తప్పించుకుపోయింది. తమ కర్తవ్యంలో లోపముండటంతో బాటు, కోట భద్రతకూ అపాయ ముందని భావించిన సైనికులు వెంటనే శివాజీకి ఈ విషయం చేరవేశారు. ఛత్రపతి శివాజీ హీరాఖాణిని పిలిపించాడు. నియమానికి వ్యతిరేకంగా కోటలో నుండి వెళ్ళినందుకు తనకు శిక్ష విధించమని కోరింది హీరా.
అయితే శివాజీ ‘అమ్మా! శిక్ష సంగతి తర్వాత చూద్దాం. అసలు కోటలో నుండి బయటకు అర్ధరాత్రి పూట వెళ్ళాల్సిన అవసరమేమిటి ? ఎలా వెళ్ళావు?’ అని అడిగాడు. ‘నా తల్లి ప్రేగుకు ఏం చేసైనా సరే ఇంటికెళ్ళాలి, చంటిబిడ్డకు పాలు పట్టాలి అనిపించింది. అప్పుడు కాపలాదారులకు కన్పించని దారి నా తల్లిప్రేగుకు కనిపించింది’ అన్నదామె. ‘బయటకు ఏ దారి గుండా వెళ్ళావో అది నాకు చూపించు’ అన్నాడు శివాజి. హీరాఖాణి ఆ దారిని చూపింది. శివాజీ ఆమె మాతృ హృదయానికి, ధైర్యానికి మెచ్చుకుని, ఆమెకు నమస్కరించాడు. ఆ దారిని వెంటనే మూసేయించాడు. ఆమె గౌరవార్థం రాయగఢ్‌ కోట సింహద్వారానికి ఆమె పేరుపెట్టాడు. – బ్రహ్మానందరెడ్డి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments