రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవ సారాంశం - rss vijayadashami 2019 mohan ji speech

megaminds
0

పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాస సారాంశం
ఆదరణీయ ప్రముఖ అతిధి మహోదయ, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన ఇతర అతిధులు, పూజనీయ సాధుసంతులు, మాననీయ సంఘచాలకులు, సంఘకు చెందిన ఇతర మాననీయ అధికారులు, మాతృమూర్తులు, పుర ప్రముఖులు, స్వయంసేవక బంధువులారా….
ఈ విజయదశమికి ముందు సంవత్సరం శ్రీ గురునానక్ దేవ్ 550వ ప్రకాశవత్సర ఉత్సవం, మహాత్మా గాంధీ 150వ జయంతితో చాలా ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా ప్రారంభమయిన కార్యక్రమాలు నిర్ధారిత సమయం వరకు సాగుతాయి. 10 నవంబర్ నుంచి స్వర్గీయ దత్తోపంత్ థేంగ్డే జన్మ శతాబ్ది సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే గడచిన ఏడాదిలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, పరిణామాలవల్ల ఆయనను గుర్తుచేసుకోవడం మరింత ప్రత్యేకంగా మారింది.
మే నెలలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికలను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించింది. భారత్ వంటి విశాలమైన భూభాగం, అపారమైన వైవిధ్యం కలిగిన దేశంలో ఎన్నికలు నిర్ధారిత ప్రణాళిక ప్రకారం, యోజనబద్ధంగా ఎలా జరుగుతాయన్నది వారికి ఆసక్తి కలిగించే మొదటి విషయం. 2014లో ఎన్నికల ఫలితాలను అంతకు ముందున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, నకారాత్మక రాజకీయాలు ప్రభావితం చేసాయా లేక ప్రజలు దేశపు దశను, దిశను మార్చాలనే సంకల్పంతో అలా ఓట్లు వేశారా అన్నది 2019 ఎన్నికల్లో నిర్ధారణ కావాల్సిఉండింది. ప్రపంచం ఈ విషయాన్ని కూడా ఆసక్తిగా గమనించింది. ప్రజలు తమ అభీష్టాన్ని స్పష్టంగా ప్రకటించారు. అలాగే ప్రజాస్వామ్య ధోరణి, వ్యవస్థ విదేశాల నుంచి తెచ్చుకున్నవి కాదని, తరతరాలుగా ఇక్కడి జనమానసంలో ఉన్నవేనని, వాటి ప్రకటిత రూపమే ఈ ఎన్నికల ఫలితాలని స్పష్టమైంది. అంతకు ముందుకంటే ఎక్కువ స్థానాలు కట్టబెట్టడం ద్వారా ప్రజలు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో స్పష్టం చేశారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తూ, దేశ హితం కోసం వాటిని పూర్తిచేయాలనే ధోరణి, సాహసం రెండోసారి ఎన్నికైన ప్రభుత్వంలో ఉన్నదనే విషయం అధికరణం 370 సవరణతో స్పష్టమైంది కూడా. ప్రభుత్వంలో ఉన్న పార్టీ  మొదటి నుంచీ ఈ పని చేస్తామని చెప్పింది. అయితే ఈసారి చేసి చూపింది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని, రెండు సభల్లోనూ మూడింట రెండువంతుల ఆమోదంతో, సామాన్య ప్రజానీకపు ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఇందుకు ప్రధానమంత్రి, గృహామంత్రితో పాటు అధికార పక్షం మొత్తం, అలాగే ప్రజల అభిష్టాన్ని గుర్తించి మద్దతు తెలిపిన ఇతర పార్టీలు కూడా అభినందనపాత్రమైనవి. అయితే అధికరణం 370 మూలంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం అంతమై, న్యాయం జరిగినప్పుడే ఈ పని పూర్తవుతుంది.  అలాగే అక్కడ నుంచి అన్యాయంగా తరిమివేతకు గురైన కాశ్మీరీ పండిట్ ల పునరావాసం, వారికి సురక్షితమైన జీవనం లభించినప్పుడే పూర్తవుతుంది. ఇప్పటి వరకు కాశ్మీరీ ప్రజలకు అందకుండా పోయిన హక్కులు, అధికారాలు లభించాలి. అలాగే అధికరణం 370 తొలగింపువల్ల తమ భూములు, ఉద్యోగాలు పోతాయని, తాము పెను ప్రమాదంలో పడిపోతామన్న ప్రజల భయాందోళనలు కూడా తొలగి మిగిలిన దేశ ప్రజానీకంతో వారు సాదరాపూర్వకంగా కలవగలగాలి. కలిసి దేశాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించగలగాలి.
ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరిని ఆశ్చర్యపరస్తూ, అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తూ, వారి ప్రశంసలు అందుకుంటూ సెప్టెంబర్ నెలలో మన శాస్త్రవేత్తలు చంద్రునిపై ఇప్పటివరకు ఏ దేశం అడుగుపెట్టని దక్షిణ ధృవ ప్రాంతంపై చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ దింపి అద్భుతం సృష్టించారు. అయితే ఈ ప్రయోగం అనుకున్న రీతిగా పూర్తిగా సఫలం కాకపోయినా మొదటి ప్రయత్నంలోనే ఇంతటి విజయాన్ని సాధించడం ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యపడలేదు. ఇది మన శాస్త్రవేత్తల ప్రతిభ, సామర్ధ్యం, పట్టుదలను చూపుతుంది. వీటివల్ల దేశగౌరవం ప్రపంచంలో మరింత పెరిగింది. ఇలా ప్రజలు చూపిన పరిణతి, దేశంలో జాగృతమైన స్వాభిమాన భావన, ప్రభుత్వంలో కనిపించిన దృఢ సంకల్పం, మన శాస్త్రవేత్తలు ప్రదర్శించిన అపారమైన ప్రతిభాపాటవాలు మొదలైనవాటివల్ల ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలచిపోతుంది.
కానీ ఇలాంటి శుభ పరిణామాల మధ్య మనం మన బాధ్యతను మరచి, నిర్లక్ష్యభావంతో, అంతా ప్రభుత్వమే చేయాలి, చేస్తుందనే ఆలోచనతో నిష్క్రియులుగా, స్వార్ధపూరితంగా మారకూడదు. మనం దేశ పరమవైభవ సాధన అనే ఏ లక్ష్యం ముందుంచుకుని ప్రయాణం ప్రారంభించామో అది ఇంకా దూరంగానే ఉంది.  ఈ కార్యంలో అనేక ఆటంకాలు సృష్టించి మనల్ని ముందుకు సాగనివ్వకుండా చేయాలనుకునే శక్తుల ప్రయత్నాలు అంతంకాలేదు. పరిష్కారాలు కనుగొనవలసిన సమస్యలు, సమాధానాలు వెతకవలసిన ప్రశ్నలు మన ముందు ఇంకా ఉన్నాయి.
మన దేశపు రక్షణ సామర్ధ్యం, సైన్యపు సంసిద్ధత, ప్రభుత్వపు రక్షణ విధానం, విదేశాంగ విధాన నైపుణ్యం మొదలైన విషయాల్లో మనం పూర్తి స్థాయిలో తయారుగా ఉన్నాము. భూసరిహద్దులు,  జల సరిహద్దుల పరిరక్షణ విషయంలో ఇంతకు ముందుకంటే కూడా పటిష్టంగా ఉన్నాము. భూ సరిహద్దుల విషయంలో మరిన్ని రక్షణ పోస్ట్ ల ఏర్పాటు, జల సరిహద్దుల పరిరక్షణలో, ముఖ్యంగా ద్వీప సమూహాల రక్షణలో, మరింత నిఘా అవసరం. దేశం లోపల కూడా ఉగ్రవాద దాడులు, హింసా చాలా తగ్గాయి. లొంగిపోతున్న ఉగ్రవాదుల సంఖ్య పెరిగింది.
వ్యక్తి లేదా ప్రపంచ జీవనంలో సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్ని సామాన్యమైనవి ఉంటాయి. కొన్ని క్రమక్రమంగా బయటపడతాయి. మన శరీరం, బుద్ధి ఎంత చురుకుగా, ఆరోగ్యంగా ఉంటే ఆ సమస్యలను ఎదుర్కొనే సామర్ధ్యం అంత పెరుగుతుంది. అయితే లోపల నుంచే సమస్యలు పుట్టుకువచ్చే ప్రమాదం కూడా ఉంది. అనేక రోగాలు పుట్టించే క్రిములు మన శరీరంలోనే ఉండవచ్చును. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ క్రిముల ప్రభావం బయటపడుతుంది. లేకపోతే అవి ఉన్నట్లు కూడా తెలియదు.
కొన్ని సంవత్సరాలుగా భారతీయుల ఆలోచనలో మార్పు వచ్చిందని మనకు అనిపిస్తుంది. అలాంటి మార్పును వ్యతిరేకించేవారు దేశంలోనూ ఉన్నారు, బయటా ఉన్నారు. భారత్ అభివృద్ధి సాధించడం వల్ల తమ స్వార్ధ ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం ఎవరిలో కలుగుతోందో ఆ శక్తులకు ఈ దేశం శక్తివంతం కావడం కూడా ఇష్టం ఉండదు.  దురదృష్టవశాత్తు భారతీయ సమాజంలో ఏకాత్మత, సమానత్వం, సమరసత ఏ స్థాయిలో ఉండాలో అలా ప్రస్తుతం లేవు. ఈ లోటును ఆసరాగా తీసుకుని ఈ శక్తులు తమ కార్యకలాపాలు ఎలా సాగిస్తున్నాయో మనం చూస్తున్నాం. జాతి, ప్రాంతం, భాష, మొదలైన అంశాలను ఆధారం చేసుకుని సమాజంలో భేదభావాన్ని పెంచడం, పరస్పరం విద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఈ వైమనస్యం, వేర్పాటువాదం ద్వారా ప్రత్యేక అస్తిత్వాలను, వర్గాలను రూపొందించడం, ఈ దేశపు చిరంతన సామాజిక ప్రవాహంలో వేరువేరు, ప్రతికూల ప్రవాహాలను సృష్టించడం కోసం ఈ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ కుతంత్రాలను గుర్తించి, వాటిని సైద్ధాంతిక, సామాజిక స్థాయిల్లో నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు, అమలుచేసే విధానాలను వక్రీకరించి, దుర్వ్యాఖ్యలు చేసి తమ దుష్ట ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం కూడా ఈ శక్తులు చేస్తాయి. అందువల్ల నిత్య జాగురుకతతో వ్యవహరించడం అవసరం. ఇలా న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ పట్ల అవిశ్వాసాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దీనికి అన్ని స్థాయిల్లో సమాధానం చెప్పాలి.
ఒక వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వ్యక్తులపై మూకదాడులకు పాల్పడుతున్నారంటున్న వార్తలు తరచుగా మన పత్రికల్లో చూస్తున్నాం. అయితే ఇలాంటి దాడులు కేవలం ఒక వర్గానికి చెందివారు మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదు. రెండు వైపుల నుంచి ఇలాంటి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఇలాంటి దాడులు యోజనబద్ధంగా చేయిస్తున్నారు. కొన్నిసార్లు గోరంతను కొండంతలుగా చూపిస్తున్నారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి హింసాత్మక సంఘటనలవల్ల సమాజంలో వివిధ వర్గాల మధ్య పరస్పర సంబంధాలు ప్రభావితమవుతాయన్న సంగతి గుర్తించాల్సిందే. ఇలాంటి ప్రవృత్తి మన దేశ పరంపర కాదు. అలాగే మన రాజ్యాంగం దీన్ని అనుమతించదు. ఎన్ని విభేదాలున్నా, ఇతరులు ఎంతగా రెచ్చగొట్టినా చట్టపరిధికి లోబడే న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచి పోలీసుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి. స్వతంత్ర దేశపు పౌరులు విస్మరించకూడని బాధ్యత ఇది. ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడేవారికి సంఘ్ ఎప్పుడు మద్దతు తెలుపలేదు, తెలుపదు కూడా. ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి స్వయంసేవకులు ఎప్పుడూ ప్రయత్నిస్తారు. కానీ భారతీయ పరంపరలో లేని ఈ మూకదాడులను ఇక్కడ సర్వసాధారణ విషయమని, ఇక్కడి పరంపర అని చూపడానికి `లించింగ్’ అంటూ ప్రచారం చేయడం, దేశానికి, ముఖ్యంగా హిందూ సమాజానికి ఈ అపవాదును అంటగట్టడానికి, అల్పసంఖ్యాకుల్లో భయాందోళనలు కలిగించడానికి జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను అందరూ అర్ధంచేసుకోవాలి. రెచ్చగొట్టే భాష, చర్యలకు ఎవరు పాల్పడకూడదు. ఒక ప్రత్యేక సముదాయం తరఫున మాట్లాడేవారు, వివిధ వర్గాల మధ్య కలహాలు, కలతలను రెచ్చగొట్టడం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించే నాయకులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడం కోసం అవసరమైన చట్టాలు మన దేశంలో ఇప్పటికే ఉన్నాయి. వాటిని సక్రమంగా, కఠినంగా అమలు చేయాలి.
సమాజంలో సద్భావన, సంవాదం, సమరసత పెంపొందించేందుకు వివిధ వర్గాలు కృషి చేయాలి. వివిధ వర్గాల మధ్య సద్భావన, సమరసత, సహకారం, చట్టానికి లోబడి తమ అభిప్రాయాలను వ్యక్తంచేయడం వంటివి పాటించడం నేటి పరిస్థితుల్లో చాలా అవసరం. ఇలాంటి సంవాదం, సహకారం పెంపొందించడానికి స్వయంసేవకులు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతిమంగా కొన్ని నిర్ణయాలు న్యాయస్థానాల ద్వారా వస్తాయి. నిర్ణయం ఏదైనా పరస్పర సద్భావన ఎలాంటి మాట లేదా చర్య వలన దెబ్బతినకుండా చూసుకోవడం ప్రజలందరి కర్తవ్యం. ఇది కేవలం ఏదో ఒక వర్గపు బాధ్యత మాత్రమే కాదు. ఇది అందరి బాధ్యత. దీనికి అందరూ కట్టుబడి వ్యవహరించాలి. ముందు మన నుంచి అది ప్రారంభం కావాలని అనుకోవాలి.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో వచ్చిన మాంద్యం సర్వత్ర ప్రభావం చూపుతుంది. అమెరికా, చైనాల మధ్య సాగిన వాణిజ్య యుద్ధపు ప్రభావం భారత్ తో సహా అన్నీ దేశాలపై ఉంటుంది. ఈ మాంద్యపు స్థితి నుంచి బయటపడటానికి ఆర్ధిక శాఖ గత నెలలో అనేక చర్యలు చేపట్టింది. ప్రజాహితం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, క్రియాశీలమైన వ్యవాహర శైలి దీని వల్ల స్పష్టమవుతుంది. ప్రస్తుతపు ఆర్ధిక మాంద్యపు వలయం నుంచి మనం తప్పక బయటపడతాం. అలా చేయడానికి మన ఆర్ధికవేత్తలకు పూర్తి సామర్ధ్యం ఉంది.
ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరచేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎప్ డి ఐ)లకు అనుమతించడం, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవలసి వస్తోంది.  అయితే ప్రజలకు హితం చేకూర్చే విధానాలు, పథకాల అమలుకు అధిక ప్రాధాన్యతనివ్వడం, అట్టడుగున ఉన్నవారికి కూడా వాటి ఫలాలు అందించడం, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి  జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను సరిచేయవచ్చును.
ఆర్ధిక స్థితిని చక్కదిద్దే ఒత్తిడిలో స్వదేశీ భావనను మరచిపోవడం కూడా నష్టానికి దారితీస్తుంది. `స్వదేశీ’ నిత్యజీవితంలో దేశభక్తి ప్రకటిత రూపమని దత్తోపంత్ థేంగ్డే అన్నారు. ఆచార్య వినోబా భావె దానిని `స్వాభిమానం’, ‘అహింస’ అని అభివర్ణించారు. ఏ ఆర్ధిక సూత్రాలు, ప్రమాణాల ప్రకారం చూసినా ఏ దేశం స్వయంసమృద్ధి, స్వావలంబన సాధిస్తుందో, ప్రజలందరికీ ఉపాధి చూపగలుగుతుందో ఆ దేశం మాత్రమే అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను విస్తరించుకోగలదని, మొత్తం మానవాళికే సురక్షితమైన, సుదృఢమైన భవిష్యత్తును అందించగలదని తెలుస్తుంది. మన దేశపు ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు బాహ్యమైన ఒత్తిడులకు లొంగకుండా, ఎక్కువ కాలం పట్టేదైనా స్వీయ బలం, సామర్ధ్యం పైనే ఆధారపడి మన లక్ష్యాన్ని, ప్రయాణాన్ని నిర్ణయించుకోవాలి.
అయితే మన ఆర్ధిక స్థితిపై ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు మనం కొన్ని చర్యలు చేపట్టవలసి వస్తుంది. అందుకు మన మౌలిక విధానాలు, సూత్రాలను గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది. మన అవసరాలు, ప్రజల స్థితిగతులు, మనకు అందుబాటులో ఉన్న వనరులు, జాతి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి మనకు ఉన్న శక్తిసామర్ధ్యాలు మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకుని మన ఆర్ధిక విధానాలను రూపొందించుకోవాలి. నేటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అనేక సమస్యలకు పరిష్కారం చూపలేకపోతోంది. అది అనుసరిస్తున్న విధానాలు, ప్రమాణాలు అసంపూర్ణమైనవని అనేకమంది ప్రపంచ ఆర్ధికవేత్తలే అంటున్నారు. ఈ నేపధ్యంలో  మనం మనదైన ఆర్ధిక విధానం, వ్యవస్థను రూపొందించుకోవాలి. అది పర్యావరణానికి హానికలిగించని విధంగా వనరులను ఉపయోగించుకుని అధిక ఉపాధి అవకాశాలను పెంపొంచడానికి, అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడానికి, మన శక్తి, అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంబంధాలను విస్తృతపరచుకోవడానికి దోహదం చేయాలి.
స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల తరువాత కూడా మనం `స్వ’ ఆధారిత విధానాన్ని రూపొందించుకోవడంలో విఫలమయ్యాం. దీనికి కారణం మన విద్యావిధానం. మనలను బానిసలుగా ఉంచడానికి విదేశీ పాలకులు ప్రవేశపెట్టిన విద్యావిధానాన్నే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కొనసాగించాం. కనుక భారతీయ దృక్పధానికి అనుగుణమైన విద్యా విధానాన్ని, ప్రణాళికను మనం రూపొందించుకోవాలి. విద్యారంగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలను గమనిస్తే `స్వ’ ఆధారిత విధానాన్ని రూపొందించుకోవడం వల్లనే అవి ఆ స్థితిని సాధించగలిగాయని అర్ధమవుతుంది. అందువల్ల స్వభాష, స్వభూష (దేశీయ కట్టు), స్వ సంస్కృతి పట్ల గౌరవాన్ని, పూర్తి అవగాహనను కలిగించి ప్రపంచంలోని సర్వ ప్రాణులపట్ల ప్రేమ, సహానుభూతిని కలిగించగలిగే విద్యావిధానం అవసరం. ఉపాద్యాయుల శిక్షణ ప్రణాళికలో కూడా సమూలమైన మార్పులు అవసరం.
విద్యా విధాన లోపాలతోపాటు సమాజ జీవనంలో సాంస్కృతిక, నైతిక విలువలు తరిగిపోవడం, అనైతిక ధోరణి పెరగడం కూడా ప్రధాన సమస్యలు. `మాతృవత్ పరదారేషు’(పర స్త్రీ తల్లితో సమానం) అనే భావనతో స్త్రీని గౌరవించిన ఈ దేశంలో, స్త్రీ గౌరవాన్ని నిలపడం కోసం మహా యుద్ధాలకు కూడా వెనుకాడరాదన్న ఇతివృత్తాలు కలిగిన రామాయణ, మహాభారతాలవంటి ఇతిహాసాలు ఉన్న దేశంలో, పవిత్రతను కాపాడుకునేందుకు స్త్రీలు `జోహర్’ ద్వారా అమరులైన దేశంలో మహిళలకు అటు సమాజంలోనూ, ఇటు కుటుంబంలోనూ భద్రత కరువయ్యింది. ఇది మనందరికీ అవమానకరమైన విషయం. మాతృమూర్తులు జ్ఞానవంతులై సాధికారత సాధించేట్లుగా,  స్వీయరక్షణ సామర్ధ్యం సంపాదించుకునే విధంగా చూడాలి. పురుషులలో మహిళల పట్ల మన సాంస్కృతిక విలువలైన పవిత్ర, గౌరవ భావాలను కలిగించాలి.
ఈ రకమైన శిక్షణ, బోధన కుటుంబ వాతావరణం ద్వారా చిన్నప్పటి నుంచి లభిస్తుందని మనందరికీ తెలుసు. కానీ కుటుంబాలు చిన్నవైపోయిన నేటి పరిస్థితుల్లో ఈ బోధన సాగడంలేదు. మరొక ప్రమాదకరమైన పరిణామం ఏమిటంటే యువతరంలో ఎక్కువమంది మాదకద్రవ్యాలకు బానిసలు కావడం. యువతరాన్ని నిర్వీర్యం చేయడం కోసం సంపన్నమైన సంస్కృతిక విలువలు కలిగిన చైనా వంటి దేశంలో ఒకప్పుడు విదేశీ పాలకులు మాదకద్రవ్యాలు అలవాటు చేశారు. నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ మాదక ద్రవ్యాలను దూరంగా ఉంచగలిగే మనోబలాన్ని పెంపొందించే విధంగా కుటుంబాలు ఉండాలి. ఈ విషయంలో స్వయంసేవకులతో సహా అందరూ తల్లిదండ్రులు జాగరుకులై ఉండాలి.
సమాజంలో విలువల పతనం, అడ్డు అదుపులేని అవినీతికి ప్రధాన కారణం సాంస్కృతిక విస్మృతి, క్షీణత. దీనిని సవరించడానికి అనేక చట్టాలు అమలు చేస్తూ ఉంటారు. అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. వ్యవస్థలో పైనుంచి ప్రక్షాళన, సవరణ చర్యలు చేపట్టిన కింది స్థాయిలో అవినీతి పద్దతులు కొనసాగే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ సవరణ చర్యలనే ఆసరాగా తీసుకుని అవినీతిని విస్తరింపచేస్తున్నారు కూడా. అలాగే చట్టాలను గౌరవించేవారు, నియమాలను అనుసరించేవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండా, సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాశ మన మనస్సుల్లోకి ప్రవేశించింది. ఇదే సకల అవినీతికి మూలం. కుటుంబ స్థాయిలో ఆదర్శవంతమైన, నైతికమైన జీవనశైలిని అనుసరించడం సమాజ పరివర్తనకు తద్వారా దేశ సౌభాగ్యానికి చాలా అవసరం.
సమాజాన్ని జాగృతం చేయడంలో, సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో ప్రసార మాధ్యమాల పాత్ర చాలా ప్రముఖమైనది. లాభాపేక్షతో సంచలన విషయాలపైనే దృష్టి పెట్టే పద్దతి కాకుండా సకరాత్మక, నిర్మాణాత్మక వాతావరణాన్ని సృష్టించడం కోసం మీడియా ప్రయత్నిస్తే దేశ నిర్మాణ కార్యం మరింత వేగవంతమవుతుంది.
మన దేశంలో ఎలాగైతే సకారాత్మక, నిర్మాణాత్మక వాతావరణాన్ని ఏర్పరచాల్సిఉందో, అలాగే ప్రపంచం మొత్తంలో బాహ్యమైన వాతావరణాన్ని (పర్యావరణం) పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకు అన్నీ దేశాలు తమతమ పర్యావరణ విధానాలను తగిన విధంగా మార్చుకోవాలి. ఇందుకోసం సాధారణ ప్రజల దైనందిన అలవాట్లు, జీవనంలో కూడా చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం.  సంఘ స్వయంసేవకులు ఈ దిశలో కూడా పని చేస్తున్నారు. వారి ప్రయత్నాలు, కృషికి మరింత నిర్దిష్టమైన రూపాన్ని చేకూర్చడం కోసం `పర్యావరణ గతివిధి’ అనే కార్యం ప్రారంభమైంది.
90 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజంలో ఏకాత్మత, సద్భావన, సదాచరణ, సద్వ్యవహారాలను పెంపొందించడానికి కృషి చేస్తోంది. స్వయంసేవకుల సేవాభావం, నిష్ట పట్ల దేశంలో నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయి. కానీ ఇప్పటికీ సంఘ గురించి పెద్దగా తెలియనివారిలో సంఘం పట్ల అవిశ్వాసాన్ని, భయాన్ని నింపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. సంఘం హిందూ సంఘటన కార్యం చేస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆధారం చేసుకుని సంఘ తమను తాము హిందువులుగా గుర్తించని ముస్లిములు, క్రైస్తవులు మొదలైన వర్గాల పట్ల ద్వేషాన్ని కలిగిఉందని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన, దూషణతో కూడిన ఆరోపణల ద్వారా హిందూ సమాజం, హిందూత్వంపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక తమ స్వార్ధ ప్రయోజనాల కోసం సమాజాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన, కుట్ర ఉన్నాయి. ఇది కావాలని కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్నవారికి తప్పిస్తే మిగిలిన అందరికీ తెలిసిన, తెలుస్తున్న విషయం.
ఈ దేశపు, జాతి అస్తిత్వం, గుర్తింపు గురించి సంఘకు స్పష్టమైన అవగాహన, కల్పన ఉన్నాయి. అదే భారత్ హిందూ రాష్ట్రం, హిందుస్తాన్ అనే దృఢమైన విశ్వాసం. సంఘ దృష్టిలో హిందూ అనే పదం, శబ్దం కేవలం తమను తాము హిందువులమని గుర్తించేవారో, పరిగణించుకునేవారికో పరిమితమైనది కాదు. ఎవరు ఈ దేశ వాసులో, ఎవరి పూర్వజులు భారతీయులో, ఎవరు ఈ దేశ ఉన్నతి కోసం అందరితో కలిసిపనిచేయడానికి ముందుకు వస్తున్నారో, ఎవరు భిన్నత్వాన్ని అంగీకరించి, గౌరవిస్తున్నారో అలాంటి భారతీయులంతా హిందువులే. వారి ఆరాధనా పద్ధతి, భాష, ఆహారపు అలవాట్లు, జన్మస్థలం మొదలైనవి ఏవైనా కావచ్చును. ఇవేవీ వారి భారతీయతకు అడ్డురావు. బలిష్టుడైన వ్యక్తి, అలాగే శక్తివంతమైన సమాజంలో నిర్భీతి ఉంటుంది. శుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన బలవంతులైన వ్యక్తులు ఎవరిని బెదిరించరు, అధికారం చెలాయించాలనుకోరు. కేవలం అభద్రతా భావంతో బాధపడే బలహీనులే ఇతరులను భయపెట్టడానికి, బెదిరించడానికి చూస్తారు. సద్గుణయుక్తమైన, వినయశీలి, బలశాలి అయిన హిందూ సమాజాన్ని తీర్చిదిద్దడానికి  సంఘ పనిచేస్తోంది. ఇలాంటి సమాజం ఎవరిని భయపెట్టదు, అలాగే ఎవరికి భయపడదు. బలహీనులను, భయపడుతున్నవారిని రక్షిస్తుంది.
హిందూ అనే పదాన్ని మతానికి మాత్రమే ముడిపెట్టడం అనే గందరగొళపు ఆలోచన, కల్పన బ్రిటిష్ వారి కాలం నుంచి మొదలైంది. ఈ పదాన్ని అంగీకరించని వర్గం సమాజంలో ఉంది. వాళ్ళు తమను తాము భారతీయులుగానే పిలుచుకుంటారు. కొందరు భారతీయత, సంస్కృతిపై ఆధారపడిన నాగరకతలను ఆంగ్ల పదం `ఇండిక్’ అని పిలుస్తారు. భయంవల్లగానీ, అవగాహన లేకపోవడంవల్లగానీ హిందూ శబ్దాన్ని అంగీకరించనివారు, వ్యతిరేకించేవారిని కూడా సంఘ సమాదరిస్తుంది. ఉపయోగించే పదాలు వేరుకావచ్చును, రీతిరివాజులు, ప్రాంతం, భాష, వేరుకావచ్చును. కానీ ఈ ప్రత్యేకతలు ఉన్న వారిని ఈ సమాజంలో భాగమేనని భావిస్తుంది. ఈ ఏకత్వభావనే ఈ జాతి మూల తత్వం, మౌలిక చింతన. అదే హిందూత్వం. ప్రాచీనమైన మన దేశపు ధార్మికమైన స్వభావాన్ని, సంస్కృతిని సంరక్షించి దేశ సర్వాంగీణ ఉన్నతి కోసం కృషి చేయాలనదే దీని లక్ష్యం.
ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉంది. ఈ దేశం తన స్వభావానికి, సంస్కృతికి తగినట్లుగా దృఢమైన పునాదులపై నిలబడాలి. ఈ భావనను మనసులో పెట్టుకుని సమాజాన్ని పటిష్టపరచడానికి సద్భావన, సామరస్యం, సదాచారాలను పెంపొందించుకోవాలి. ఈ కృషిలో సంఘ స్వయంసేవకులు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. ఈ లక్ష్య సాధన కోసం పరిశ్రమిస్తారు. కాలానుగుణంగా వచ్చే అన్నీ రకాల సవాళ్లను ఎదుర్కొని ప్రతి స్వయంసేవక్ ఈ పని చేయాలి.
అయితే ఈ కార్యాన్ని ఏదో కొందరు వ్యక్తులో, ఒక సంస్థకో వదిలిపెట్టి మనం మౌన ప్రేక్షకులుగా మారితే లాభం లేదు. దేశాభివృద్ధికి కృషి చేయడం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, సంక్షోభాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడం మొదలైనవి ఎవరో వచ్చి చేస్తారని భావించకూడదు. ఎవరో ఒకరు ముందుండి అవసరమైనంత వరకు నాయకత్వం వహిస్తారు. కానీ  సంపూర్ణమైన, సర్వతోముఖమైన, శాశ్వతమైన విజయం సాధించాలంటే మాత్రం స్పష్టమైన దృక్పధం, నిస్వార్ధమైన, నిజాయితీతో కూడిన కృషి, సుదృఢమైన ఏకత్వ భావన ఉండాలి. అలాంటి వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాలి.
ఈ కార్యానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడానికి అవసరమైన కార్యకర్తలను తయారుచేసేందుకు సంఘ పనిచేస్తోంది. ఈ కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో చూపుతున్న ప్రభావాన్ని బట్టి మనల్ని, మన కుటుంబాలను, దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఆనందమయంగా మార్చగలిగిన మార్గం ఇదేనని ఋజువవుతోంది.
ప్రస్తుత కాలపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనమంతా ఈ పవిత్ర, ఉన్నత కార్యంలో భాగస్వాములం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
`యుగపరివర్తన్ కీ బెలామే హమ్ సబ్ మిల్ కర్ సాథ్ చలే
దేశ్ ధర్మ్ కీ రక్షాకే హిత్ సహతే సబ్ ఆఘాత్ చలే మిల్ కర్ సాథ్ చలే మిల్ కర్ సాథ్ చలే
Source: vsktelangana

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top