Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

పిల్లలలో సమాజంపట్ల అవగాహన పెంచాల్సిన బాధ్యత తల్లితండ్రులదే - parents' responsibility to raise awareness of society among children

పిల్లలను తల్లిదండ్రులు పెంచే విధానంపైనే వారి వ్యక్తిత్వం, నడవడి ఆధారపడి ఉంటుంది. పిల్లలందరి లోనూ సృజనాత్మకత ఉంటుంది. ఎవరికయినా బాల్యమే ...


పిల్లలను తల్లిదండ్రులు పెంచే విధానంపైనే వారి వ్యక్తిత్వం, నడవడి ఆధారపడి ఉంటుంది. పిల్లలందరి లోనూ సృజనాత్మకత ఉంటుంది. ఎవరికయినా బాల్యమే పునాది. బాల్యంలో వారు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో వారు రాణించేలా చేస్తాయి. పిల్లలలో దాగున్న సృజనాత్మకతను పెద్దలు గుర్తించి, వాటిని వెలికితీయాలి. సృజనాత్మక కళలను నేర్పించడంతోపాటు, సామాజిక అంశాలను కూడా బోధిస్తూ, మానవీయ విలువలను నేర్పించాలి.

ర్యాంక్‌లు, గ్రేడ్‌లు అంటూ వేధిస్తూ, ఆటలకు పంపితే హోంవర్క్‌ చేయరని, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుందన్న అపోహతో ఆటలకు కూడా పంపకుండా, వారి సమయాన్ని చదువుకే వెచ్చించాలని నిర్బంధిస్తే, పిల్లలకు చదువుపట్ల విముఖత ఏర్పడుతుంది. స్కూలు, చదువు, టి.వి. చూడటానికే పరిమితమయ్యే పిల్లలు, ఇతర విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి చూపరు. ఆ కారణంగా, పిల్లలలో సృజనాత్మకత, మైత్రీభావం లోపించి, నలుగురిలో మెలిగే విధానాన్ని కూడా నేర్చుకోలేరు.

సమాజ విషయాల పట్ల పిల్లలకు సరయిన అవగాహన ఉండాలి. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని, వారికి సాయపడే గుణం ఉండాలి. తోటి పిల్లలతో కలహించకుండా, మైత్రీభావంతో మెలగాలి. వస్తువులయినా, తినుబండారాలయినా తోటి పిల్లలతో పంచుకునే మసస్తత్వం ఉండాలి. ‘నా’ అన్న భావానికి మనసులో చోటివ్వకూడదు. వికలాంగులను హేళన చేయకుండా, వారిపట్ల దయాగుణం కలిగి ఉండాలి. వారిని వేరుగా చూడకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో చలించిపోకుండా, చెదిరిపోకుండా ఉండేలా పెద్దలు పిల్లలను పెంచాలి.

సామాజిక విలువలను అర్థం చేసుకుంటూ పెరిగే పిల్లలు మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుని, ఏ విషయాన్నయినా సాధించగలుగుతారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు. ఎప్పుడూ చదువుతోనే కాలం గడుపుతూ, ర్యాంకుల కోసం పోటీపడే పిల్లలలో సామాజిక అవగాహన తక్కువగా ఉంటుందని పిల్లలపై అధ్యయనం నిర్వహించిన అధ్యయనవేత్తలు తెలియజేశారు.

తల్లిదండ్రులు తమ కోరికలన్నీ పిల్లలపై రుద్ద కూడదు. తమకు ఇష్టమయిన రంగంలోకే పిల్లలు ప్రవేశించాలని వారిమీద ఒత్తిడి తేకూడదు. అప్పుడు వారు, తల్లిదండ్రులు నిర్బంధించిన రంగంలో ప్రవేశించినప్పటికీ, అందులో రాణించలేక ఓటమి పాలవుతారు. పిల్లల ఇష్టాలకు, ఆలోచనలకు, మనసుకు ప్రాధాన్యమివ్వాలి. పిల్లల శక్తి సామర్థ్యా లను అర్థంచేసుకోవాలి. పౌర బాధ్యతలను బాల్యం నుంచే పిల్లలకు నేర్పిస్తే దేశ పౌరునిగా తమ బాధ్యతను నిర్వహించగలుగుతారు.

వారికి అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తూ ఉండాలి. ఉదాహరణకు ముఖ్యంగా బయటకు వెళ్ళినపుడు ఎలా బెలగాలో చెప్పాలి. ట్రాఫిక్‌ నిబంధనలేమిటో, రోడ్డును ఏ సమయంలో దాటి అవతలవైపుకు వెళ్ళాలో, నాలుగు రోడ్ల కూడలి స్థలాల్లో వెలిగే బల్బులకు అర్థమేమిటో పిల్లలకు బాల్యం నుంచే నేర్పించాలి. పోలీసులను చూసి భయపడవద్దని, వారు తమను రక్షిస్తారని, తమకు అండగా ఉంటారని చెప్పాలి. రోడ్డు మీద అపరిచితులు తమకు ఇబ్బందిని కలిగిస్తున్నా, వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించినా, వెంటనే విషయాన్ని రోడ్డుమీద ఉన్న పెద్దలతోకానీ, ట్రాఫిక్‌ పోలీసులకు కానీ తెలియపరచి, వారి సహాయాన్ని పొందమని చెప్పాలి.

రోడ్డుమీద అడ్డదిడ్డంగా పరుగులు తీయటం, ఏదయినా వస్తువును కాలితో తన్నుకుంటూ వెళ్ళడంవల్ల ఆపదలు కలుగు తాయని హెచ్చరించాలి. పై నుంచి తెగి, క్రిందకు జారుతున్న గాలిపటాన్ని అందుకోవాలని, రోడ్డుమీద ఇటూ అటూ పరుగులు తీస్తే వాహనాలవల్ల ప్రమాదాలు కలుగుతాయని, అలా చేయకూడదనీ పిల్లలను హెచ్చరించాలి. అంతేకాదు, మేకపిల్లలు, కుక్కపిల్లలు, పిల్లుల తోకపట్టుకుని లాగుతూ వాటిని బాధించ కూడదని చెప్పాలి.

క్యూ ఉన్న ప్రతిచోటా క్యూ పద్ధతిని పాటించాలని పిల్లలకు చెప్పాలి. బస్సుల్లో తోసుకుంటూ ఎక్కడం, దిగడం ప్రమాదమని హెచ్చరించాలి. సభ్య సమాజం లో ఏ విధంగా నడచుకోవాలన్నది పిల్లలకు బాల్యం నుంచే పెద్దలు నేర్పించాలి. సమాజం అంటే ఏమిటో, సమాజపు విలువలేమిటో పిల్లలకు బోధిస్తూ, మంచి చెడు మధ్యతేడా ఏమిటో పిల్లలు గుర్తించేలా పెంచితే, వారు సమాజంలో మంచి పౌరులవుతారు.

నమస్తే ఒక తండిగ్రా కొన్ని విషయాలు పెద్దలనుండి సేకరించి మీ అందరికీ అందిస్తున్నాను మనం తల్లి తండ్రులుగా ఈ  విషయాలను పాటిస్తే మన ఇళ్ళనుండే కలాం లు తయారవుతారు.. అబ్దుల్ కలాంగారు రాష్ట్రపతిగా ఉన్నంత కాలం పిల్లల్నే కలిశారు, తల్లి తండ్రులు సక్రమంగా ఉంటే దేశం అభివృద్ది చెందుతుందని భావించారు. -రాజశేఖర్ నన్నపనేని.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..