‘నేను నీకు రక్ష – నీవు నాకు రక్ష – మనమంతా దేశానికి ధర్మానికి రక్ష’ అంటూ శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ బంధువులందరికీ రాఖీ కడుతూ సంకల్పం చేసుకొనే గొప్ప పండుగ రక్షాబంధన్. దేశ వ్యాప్తంగా అక్కా చెల్లెళ్లందరూ తమ అన్నలు, తమ్ముళ్ళకు ప్రేమతో, ఆప్యాయతతో రాఖీ కట్టి సోదర భావాన్ని చాటే పండుగ రక్షా బంధన్.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) లో సంవత్సరం పొడవునా 6 ఉత్సవాలు జరుగు తాయి. సమాజాన్ని విస్తతంగా కలుస్తూ, కలుపుతూ, కొత్త వ్యక్తులను సంఘానికి పరిచయం చేస్తూ, వ్యక్తుల మధ్య సోదర భావాన్ని చాటేవిధంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ నియమితంగా జరిగే ఆర్.ఎస్.ఎస్. శాఖలలో అనేక రకాల శారీరిక, బౌద్దిక్ కార్యక్రమాల సాధన చేస్తాము. వీటి ద్వారా మన ఈ భూమి పట్ల భక్తి, ధర్మము సంస్క తి పట్ల శ్రద్ధ, సమాజం పట్ల ప్రేమ ఏర్పడతాయి.
‘భూమి-ధర్మము-సమాజము’ ఈ మూడింటి కలయికే దేశమని, ఇది ‘హిందూ రాష్ట్రం’ (రాష్ట్రం అంటే జాతి అని సంస్కృత అర్ధం) అని అన్నారు ఆర్.ఎస్.ఎస్. నిర్మాత డాక్టర్ హెడ్గేవార్. రక్షాబంధన్ ఉత్సవంలో అందరం ఒకరికొకరు రాఖీ కట్టుకొంటూ ఈ మూడింటిని రక్షిస్తామని సంకల్పం చేసుకొంటాం.
భూమి-ధర్మము-సమాజము: భూమి సాక్షాత్తూ భగవంతుడే స్వయంగా అవతరించి, సంచరించి, కోట్లాదిమంది సాధకులకు దర్శనాన్ని అందించిన ఏకైక పవిత్ర భూమి భరతభూమి. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు రావణాసుర సంహారం కోసం దక్షిణానికి వచ్చాడు. ద్వారక (పడమర) ముఖ్యపట్నంగా పాలిస్తున్న శ్రీ కృష్ణుడు నరకాసుర వధకోసం అస్సాంలోని ప్రాగ్జ్యోతిషపురం వెళ్లాడు. శ్రీ రాముడు ఉత్తర దక్షిణాలు కలిపితే, శ్రీ కృష్ణుడు తూర్పు పడమరలను కలిపాడు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుల పాదస్పర్శతో ఈ భూమి ఆణువణువూ పవిత్రమైంది.
రాజస్థాన్‌లోని తన్నోట్ అనే సరిహద్దు గ్రామంలో తన్నోట్‌మాత దేవాలయంపై 1965-71 యుద్ధ సమయంలో పాకిస్తాన్ అనేక బాంబులు కురిపించింది. అన్ని బాంబులు పడినప్పటికి అమ్మవారి గుడిని ఏమి చేయలేక పోయినాయి. ఇది అమ్మవారి దయే అని అక్కడి వారంతా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. సాక్షాత్ జగజ్జనని చేత రక్షింపబడుతున్న భూమి మనది. అటువంటి ఈ భూమిని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తున్న తీవ్రవాదుల నుండి ప్రతి అంగుళం కాపాడుకోవలసిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరిది.
ధర్మము ఈ సష్టిలోని మొత్తం జీవరాశి సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని కోరుకొనే ఏకైక ధర్మం మన హిందూధర్మం. భార్యను తప్ప మిగతా స్త్రీలను తల్లిగా చూడాలనే విలక్షణమైన సంస్కతి మనది. పుట్టిన ప్రతి శిశువు భగవంతుని స్వరూపమని (ఏ ఒక్కరు పాపి కాదని) చెప్పే ధర్మం మనది. మనిషి మాత్రమే ఈ సృష్టిలోని మిగతా జీవరాశులన్నిటికి బ్రతికే స్వేచ్ఛ ఉందని భావిస్తాడు. ప్రకతి మన అవసరాలను తీరుస్తుందే కాని కోరికలు తీర్చదని ఉద్బోధించే ధర్మం మనది. ప్రకతిని పూజించాలి సేవించాలి కాని శోషించ కూడదని (నాశనం చేయరాదని) మన ధర్మం చెపుతుంది.
భగవంతుడు సర్వాంతర్యామి అని, ఈ సృష్టి మొత్తం భగవంతుని అంశతో నిండినదని మనం భావిస్తాము. భగవంతుడు ఒక్కడే అని, ఆయనను అనేక రూపాలలో, మార్గాలలో చేరవచ్చని విశ్వసించే ధర్మం మనది. ఈ ఆలోచన ప్రపంచం మొత్తానికి అందించాలి. ‘నా దేవుడు మాత్రమే గొప్ప’ అనే ఆలోచన అసహనానికి, తీవ్రవాదానికి దారితీస్తుంది. నేడు ప్రపంచంలో అశాంతికి ఈ అసహనం, తీవ్రవాదాలే కారణం. ఇతర విశ్వాసాలను, నమ్మ కాలను, ఆరాధనా పద్ధతులను అంతమొందించ టమనేది భగవంతుని కార్యంగా భావించటం ఎంతటి అరాచకాన్ని సష్టిస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
ప్రపంచంలో సుమారు 100కు పైగా దేశాలలో నివసిస్తున్న హిందువుల కారణంగా ఆయా జాతులు, ఆయా సంస్కతులు, ఆయా దేశాలూ నష్టపోయాయనే మాటను చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా ఎవరూ వినలేదు. కాని నా దేవుడు మాత్రమే గొప్ప అని చెపుతున్న ఇతర మతాల కారణంగా ప్రపంచంలో ఎన్ని దేశాలు, జాతులు, సంస్కతులు నాశనం అవుతున్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము.
ఏ మతానికి, సంస్కృతికి చెందిన వ్యక్తి అయినా ఇతర మతాలను, సంస్కృతులను గౌరవించాలనే శ్రేష్ఠ ఆలోచనను మన ధర్మం అందించింది. ప్రపంచంలో నేడు రగులుతున్న అశాంతికి విరుగుడు మంత్రం ఇదే. ప్రపంచానికి నేడు భారత్ అందించాల్సిన గొప్ప ఆలోచన ఇది.
‘చూసిన దానిని నమ్మాలి’ అని విజ్ఞానం చెబుతుంది. ‘నమ్మితే చూడగలవు’ అని మన ఆధ్యాత్మికత బోధిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో సత్యాన్ని అన్వేషిస్తూ మనిషి ఎంతటి ఉన్నతి సాధించాడో మనకు తెలుసు. త్యాగం, శాంతి, ప్రేమ, సత్యం, ఇత్యాది గుణాలను అలవరచుకుంటూ జీవితానికి ఒక పరమార్ధాన్ని తెలిపిన ఋషి, మునులు జన్మించిన గొప్ప సమాజం మనది. మనిషి ఎలా బ్రతకాలనే విజ్ఞానంతో పాటు ఎందుకోసం బ్రతకాలనే జ్ఞానాన్ని కూడా అందించిన శ్రేష్ఠ గురు పరంపర గల జాతి మన భారత జాతి.
ఇటువంటి శ్రేష్ట గుణాలు కలిగిన మన సమాజం కాలక్రమంలో ఐక్యతను కోల్పోయి, అసంఘటితమై, తన గొప్ప గుణాలను మరచిపోయింది (ఆత్మ విస్మతి). ఈ ఆత్మవిస్మృతి కారణంగా ఈ సమాజం తనదైన దానిపట్ల గౌరవభావం కోల్పోయి, ఆర్భాట గుణం కలిగిన పాశ్చాత్య నాగరికతను గుడ్డిగా అనుకరిస్తూ పతనావస్థకు చేరుకుంది.
మన సమాజంలోని ఈ ఆత్మవిస్మృతిని, అనైక్యతను డాక్టర్ హెడ్గేవార్ గమనించారు. ఈ సమాజానికి మనవైన గొప్ప గుణాలను గుర్తుచేసి, తిరిగి ఐక్యత (సంఘటితం) నింపాలని సంకల్పించారు. ఆ సంకల్పంతోనే 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు.
ఆర్.ఎస్.ఎస్. శాఖ ద్వారా ప్రతి వ్యక్తిలోను మార్పు తీసుకువస్తూ, అతను చేసే ప్రతిపనిలోనూ సమాజ శ్రేయస్సు గురించే ఆలోచించేలా తీర్చి దిద్దుతూ, సమాజంలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం 90 సంవత్సరాల నుంచి జరుగుతోంది. సమాజం ముందు అనేక రకాల సమస్యలున్నాయి. కాని తన ముందున్న సమస్యను ఒక సమస్యగా గుర్తించకపోవటమే అతిపెద్ద సమస్య.
సమాజంలో అత్యధిక మంది మంచివారే. కానీ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కతిని, జాతీయభావాలు గల సంస్థలను వ్యతిరేకించేవారు అతి కొద్దిమందే. కానీ ధ్వని యంత్రం (మైకు) ఈ అల్పసంఖ్యాకుల వద్ద ఉన్న కారణంగా వారి గోల ఎక్కువగా వినబడుతుంది. ఈ స్థితి నుండి సమాజాన్ని బయట పడవేయాలి.
మనమంతా ఒక్కటే: ‘నేను ఒక్కడినే’ అనుకున్నప్పుడు ‘ఏం చేయగలను’ అనిపిస్తుంది. ‘మనందరం ఒక్కటే’ అనుకునప్పుడు ‘ఏదైనా చేయగలం’ అనిపిస్తుంది. రక్షాబంధన్ పండుగ మనలో సోదర భావాన్ని పెంపొందిస్తూ ‘మనందరం ఒక్కటే’ అనే భావాన్ని కలిగిస్తుంది. సామూహిక శక్తి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తుంది. మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలనే సంకల్పాన్ని దృఢతరం చేస్తుంది. అటువంటి సంకల్పశక్తి ఈ సమాజానికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. సమాజంలోని హెచ్చుతగ్గులు, భేదభావాలు, కులాల మధ్య ద్వేషాలు మొదలైన అన్నిటికి అతీతంగా ‘మనమంతా భరతమాత సంతానం, అందరం సోదరులం’ అనే భావంతో అందరం కలిసి రక్షాబంధన్ పండుగను వైభవంగా జరుపుకుందాం, ప్రతి గుండెను తట్టి లేపుదాం. – భరత్ కుమార్, ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Raksha Bandhan 2025, Shravana Purnima festival, Rakhi celebration, importance of Raksha Bandhan, Raksha Bandhan rituals, Rakhi festival history, Raksha Bandhan significance, brother sister festival, Hindu festivals August, Raksha Bandhan traditions