Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

yoga for diabetes in telugu - మధుమేహం నుండి విముక్తి కోసం ఈ యోగాసనాలు వేయండి

మధుమేహం  నేడు అనేకమందిని బాధపెడుతున్న అనారోగ్య సమస్య  ఇది వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా  వేరే మార్గం లేదా  భారతీయ జీవన విధానమైన య...

మధుమేహం నేడు అనేకమందిని బాధపెడుతున్న అనారోగ్య సమస్య ఇది వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా వేరే మార్గం లేదా భారతీయ జీవన విధానమైన యోగలో ఏమైనా పరిష్కారం ఉందా .... చూద్దాం.
మధుమేహానికి మరో పేరు ‘షుగర్‌’. దీనినే చక్కెర వ్యాధి అని, డయాబెటిస్‌ అని కూడా పిలుస్తారు. రక్తంలో గ్లూకోస్‌ స్థాయి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే ఆ స్థితిని మధుమేహంగా గుర్తిస్తారు వైద్యులు.
సాధారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ తగినంతగా ఉత్పత్తి అవకపోవడం వలన గ్లూకోజ్‌ నిల్వలు పెరిగిపోయి, మధుమేహం వ్యాధి వస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచగలిగితే రక్తంలోని గ్లూకోజ్‌ నిల్వలను సాధారణ స్థాయికి తేవచ్చు.
మధుమేహం రావడానికి కారణాలు :
1.    మానసిక వత్తిడి (స్ట్రెస్‌)
2.    సరైన శారీరిక శ్రమ లేకపోవడం
3.    అధిక బరువు
మధుమేహాన్ని ఎలా నియంత్రించవచ్చు : 
1.     ఆహార నియమాలు పాటించడం ద్వారా,
2.     శారీరిక వ్యాయామం (యోగ, ప్రాణాయామం, ధ్యానం మొదలైనవి) చేయడం ద్వారా,
3.     మానసిక వత్తిడిని తగ్గించడం ద్వారా,
4.     మందుల ద్వారా.
యోగ చికిత్స :
మధుమేహాన్ని శారీరిక శ్రమ ద్వారా తగ్గించవచ్చు. శారీరిక శ్రమ అంటే ఇంటిపని వ్యాయామం, యోగాసనాల అభ్యాసం, ప్రాణా యామం, ధ్యానం వంటివి చేయడం. వీటిద్వారా శరీరంలో మపసులో సమతుల్యత, ప్రశాంతత ఏర్పడుతుంది. పాంక్రియాస్‌ గ్రంధి ఉత్తేజితమై, ఇన్సులిన్‌ తగినంత విడుదలవుతుంది. తద్వారా మధుమేహం అదుపులోకి వస్తుంది.
యోగ సాధన ప్రారంభించడం, యోగ సాధన చేయడం అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఇది ఒక రోజులో జరిగే పని కాదు. అందుకని యోగసాధన ప్రారంభించబోయే ముందు డాక్టరు సలహాను తప్పక తీసుకోవాలి. యోగ సాధన తప్పకుండా యోగ గురువు పర్యవేక్షణలోనే జరగాలి. సొంతంగా చేయవద్దు.
యోగాభ్యాసంతో మధుమేహ నియంత్రణ :
ఈ క్రింది యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అభ్యాసం చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
యోగాసనాలు :

1. అర్థ కటి చక్రాసన్‌
ఇది కూడా నిలబడి చేసే ఆసనమే.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.    కుడి చేతిని సాచి పైకి ఎత్తాలి. భుజం చెవికి తగులుతూ ఉంటుంది. ఈ స్థితిలో చేయి పైకి లాగి ఉంచాలి.
2.    నడుము పై భాగాన్ని నెమ్మదిగా ఎడమవైపుకు వీలైనంత వంచాలి. నడుముతో పాటు పైకి ఎత్తిన చేయి కూడా వంగుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.    నడుమును సాధారణ స్థితికి తేవాలి. నిటారుగా ఉండే ప్రయత్నం చేయాలి. పైకెత్తిన చేయి అలాగే ఉంటుంది.
4.    పైకెత్తిన కుడిచేతిని కిందకు దించుతూ స్థితికి రావాలి. విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా ఎడమచేతితో ప్రారంభించి, కుడివైపుకు వంగుతూ చేయాలి.
లాభాలు : వెన్నెముక సాగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది, తుంటి కీళ్ళు బలపడతాయి. నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. మలబద్ధకం వదులుతుంది.
2. అర్థ చక్రాసన్‌
ఇది నిలబడి చేసే ఆసనం.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.    రెండు చేతులను నడుముకు వెనుక వైపున పిరుదుల పైన ఉంచాలి. నడుం వద్ద అరచేతు లతో పట్టి ఉంచి, చేతివేళ్ళు ముందుకు చాపాలి.
2.    తల, మెడ, నడుము వెనక్కి వంచాలి. మోకాళ్ళు వంచరాదు. శరీర భారం పిరుదులపై ఉన్న చేతులపై పడుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.    తల, మెడ, నడుము ముందుకు తెచ్చి నిటారుగా ఉంచాలి.
4.    చేతుల్ని కిందికి తెచ్చి స్థితికి రావాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నెముకలోని నరాలు వదులయి, సులువుగా వంగే స్థితి వస్తుంది. తలలోకి రక్తప్రసరణ వృద్ధి అవుతుంది. మెడ కండరాలు దృఢమవుతాయి. ఛాతి మరియు భుజములను విశాలపరుచును.
సూచన : గుండె వ్యాధులు కలవారు, తల తిరుగు బాధలు ఉన్నవారు, ఇటీవల కడుపుకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఈ ఆసన వేయరాదు.
3. వక్రాసన్‌
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    కుడికాలుని వంచి, కుడిపాదాన్ని చాచివున్న ఎడమ మోకాలి పక్కన ఉంచాలి.
2.    శరీరాన్ని కుడివైపు తిప్పుతూ, ఎడమచేతిని కుడి మోకాలి పక్కగా పెట్టి కుడి మోకాలి బొటనవ్రేలు పట్టుకోవాలి. కుడిచేతిని వీపు వెనుక ఉంచి, అరచేతిని నేలకు అదిమి ఉంచాలి, కుడివైపు చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. సాధారణ శ్వాస తీస్తూ ఒక నిమిషం వరకు ఈ స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి.
3.     ఎడమ చేతిని వదిలి, మామూలుగా శరీరానికి ఎడమవైపుకు తేవాలి.
4.    కుడికాలిని కూడా మామూలుగా తీసుకుని స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా రెండో వైపున చేయాలి.
లాభాలు : వెన్నెముకకూ, కాలేయానికి, చిన్న ప్రేవులకూ, జీర్ణ గ్రంథులకూ శక్తినిస్తుంది. మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్ర పిండాల వ్యాధి, కాలేయానికి సంబంధించిన జబ్బులూ, నడుము కండరాల నొప్పి, తుంటి కీళ్ళ నొప్పులు పోతాయి.
సూచన : హెర్నియా ఉన్న వారు ఈ ఆసనం చేయరాదు.
4. అర్థమత్స్యేంద్రాసన్‌
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    కుడి మోకాలుని వంచి, పాదాన్ని ఎడమ పిరుదు కింద ఉంచాలి.
2.    ఎడమపాదాన్ని కుడి తొడకు పక్కగా ఉంచాలి.
3.    కుడిచేతిని ఎడమ మోకాలికి వెలుపల, ఛాతీకి మోకాలికి మధ్యకు తీసుకు వచ్చి, ఎడమకాలి బొటన వ్రేలిని పట్టుకోవాలి. కుడి భుజం ఎడమ మోకాలికి వెలుపల ఉంచాలి.
4.    ఎడమచేతిని వీపు వెనుక నుంచి తీసుకువచ్చి, కుడి తొడను ముట్టుకోవాలి. ఎడమ భుజంపై నుంచి వెనక్కి చూస్తూ ఉండాలి. నడుము పై భాగాన్ని నిటారుగా ఉంచాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.     ఎడమ చేతిని వదిలి, మామూలుగా శరీరానికి ఎడమవైపుకు తేవాలి.
6.     కుడి చేతిని వదిలి, మామూలుగా శరీరానికి కుడివైపుకు తేవాలి. శరీరం ముందుకు తిరుగుతుంది.
7.     ఎడమకాలిని కుడి తొడపై నుండి తీసి, ముందుకు చాపాలి.
8.     కుడికాలిని కూడా మామూలుగా తీసుకుని స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
లాభాలు : వెన్నెముక నరాలకు జీవం అందించి, శక్తి నిస్తుంది. కాలేయానికి మర్దన కలిగించి బాగా పనిచేయిస్తుంది. మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్రపిండ వ్యాధులు తగ్గుతాయి.
సూచన : హెర్నియా ఉన్న వారు ఈ ఆసనం చేయరాదు.
5. గోముఖాసన్‌
 స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    కుడి కాలిని వంచి ఎడమ తొడకు పక్కన ఉంచాలి.
2.    ఎడమ కాలిని వంచి కుడికాలి కింద నుండి తెచ్చి, తొడ ప్రక్కకు పెట్టాలి. అప్పుడు ఎడమ కాలిపై కుడి తొడ వస్తుంది.
3.    ఎడమ చేతిని పైనుంచి వీపు మీదకు తీసుకోవాలి.
4.    కుడిచేతిని క్రిందనుండి వీపు మీదకు తీసుకొని ఎడమచేతి వ్రేళ్ళతో కుడి చేతి వేళ్ళని కలపాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.    తరువాత వరుసగా కుడి చేయి, ఎడమ చేయి, ఎడమ కాలు, కుడి కాలు వెనక్కు తెచ్చి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : మధుమేహం, వీపు నొప్పి, మూత్ర పిండాల వ్యాధి తగ్గుతాయి.
6. భుజంగాసన్‌
 స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1.     రెండు చేతులనూ వంచి, అరచేతులను పక్కటెముకల పక్కన ఉంచాలి.
2.    నెమ్మదిగా తలను, ఛాతిని కొద్దిగా పైకిలేపి ఉంచాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.    ఛాతి, తలను కిందికి తెచ్చి, గడ్డాన్ని నేలకు ఆనించాలి.
4.    చేతుల్ని చాచి, స్థితికి రావాలి. కాళ్ళ మధ్య దూరం పెంచి విశ్రాంతి పొందాలి.
లాభాలు : మెడ కండరాలు, వెన్నునరాలు వదులయి, బలంగా అవుతాయి. మెడ, వీపు నొప్పి, జీర్ణవ్యాధులు, పొట్టలోని కొవ్వు తగ్గుతాయి.
సూచన : హెర్నియా, రక్తపోటు వున్నవారు ఈ ఆసనం వేయరాదు.
7. ధనురాసన్‌
స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1.     మోకాళ్ళను వెనుకకు మడిచి, రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ స్థితిలో శరీరం వీపు వైపుగా వంగుతుంది.
2.     తలను, ఛాతీని పైకెత్తాలి. కాళ్ళను లాగి వెన్నెముక ధనుస్సు ఆకారంలో వంగునట్లుగా పైకెత్తి ఉంచాలి. చూపు పైకి ఉంటుంది. మోకాళ్ళు దూరం చేయరాదు. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.    నెమ్మదిగా తల, మెడ, ఛాతి ముందుకు తెచ్చి; చేతులు, కాళ్ళని వదిలాలి.
4.     కాళ్ళు, చేతులు చాపి, స్థితికి రావాలి. కాళ్ళ మధ్య దూరం పెంచి విశ్రాంతి పొందాలి.
లాభాలు : శరీరం, వెన్నెముక చురుగ్గా అవుతాయి. నడుం నొప్పి తగ్గుతుంది. పిరుదులు వదులవుతాయి. పొట్టలో కొవ్వు కరుగుతుంది. జీర్ణక్రియ పెరిగి, మధు మేహం తగ్గుతుంది.
సూచన : హెర్నియా లాంటి వ్యాధులున్నవారు, బలహీనంగా ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
8. అమృతాసన్‌ (శవాసన్‌)
మెత్తటి దుప్పటిపై వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, కాళ్ళు, చేతులూ దూరంగా ఉంచి శవం మాదిరిగా ఉంచాలి. తలను ఒక పక్కకు వాలి ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలను శిథిలం (స్పర్శ లేని స్థితి) చేయాలి. దీర్ఘ శ్వాస, నిశ్వాసలు చేస్తూ ఉండాలి. నిద్ర పోకూడదు. ఈ ఆసనంలో 10 నుండి 30 నిముషాల వరకు ఉండవచ్చు. అన్ని ఆసనాలు చేసిన తరువాత చివరిలో ఈ ఆసనం వేయాలి.
లాభాలు : శవాసన్‌ లేదా అమృతాసన్‌ అని పిలిచే ఈ ఆసనంలో శరీరానికి, మనస్సుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు తేలికవుతాయి. మనస్సు తేలికవుతుంది. రక్తప్రసరణ, గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గుతుంది. అన్ని అవయవాలకు చక్కటి విశ్రాంతి లభించి, కొత్త శక్తిని సంతరించుకుంటాయి. వత్తిడితో వచ్చే అధిక రక్తపోటు, తలపోటు వంటివి ఉపశమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరానికి అమృతం లభిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈ ఆసనం వేసిన తరువాత అంత హాయిగా, తేలికగా ఉంటుంది. అందుకే దీనిని అమృతాసన్‌ అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని అన్ని వయసుల వారు, అందరూ చేయవచ్చు.
గమనిక : పైన సూచించిన అన్ని ఆసనాలు మొదటి రోజునే చేయరాదు. రెండు మూడు రోజులకు ఒక ఆసనం పెంచుకుంటూ పోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. జీవితాంతం చేస్తే ఉన్న వ్యాధులు నివారణ అవడమే కాక, వ్యాధులు రాని స్థితి కూడా పొందవచ్చు. కాబట్టి నిదానంగానే చేయాలి.
మరొక విషయం ఏంటంటే, వ్యాయామం ప్రారంభంలోనే ఈ యోగాసనాలు వేయరాదు. యోగాసనాలు చేయడానికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు ముందుగా సూక్ష్మ వ్యాయామం, శిథిలీకరణ వ్యాయామం చేయాలి. కొన్ని సూర్యనమస్కారాలు కూడా చేయాలి. ఈ ప్రక్రియను ప్రతిరోజూ పాటించాల్సిందే.
ప్రాణాయామం :
1. కపాలభాతి
2. విభాగీయ శ్వాస (సెక్షనల్‌ బ్రీతింగ్‌)
3. నాడీ శుద్ధి ప్రాణాయామం
4. భ్రామరీ ప్రాణాయామం
గమనిక : పైన సూచించిన అన్ని ప్రాణాయామ క్రియలు మొదటి రోజునే చేయరాదు. రెండు మూడు రోజులకు ఒక క్రియ పెంచుకుంటూ పోవాలి.
ధ్యానం :
1. నాద అనుసంధాన
2. ఓం కార ధ్యానం
సూచన : పైన చెప్పిన వివిధ ప్రక్రియల యోగసాధన వలన చక్కెర స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. అప్పుడు మందుల డోసు తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకుంటే చక్కెర స్థాయి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే దీనిని రక్తపరీక్ష చేయించుకుని, డాక్టరు సలహా తీసుకుని మాత్రమే మందుల డోసు తగ్గించుకోవాలి.
గమనిక : పైన సూచించిన యోగ సాధన అంతా మొదట యోగ గురువు పర్యవేక్షణలోనే ప్రారంభించాలి. ఇలా నెల లేదా రెండు నెలలు యోగ సాధన చేసిన తరువాత యోగ గురువు అనుమతితో సొంతంగా అభ్యాసం చేయవచ్చు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments