ఒత్తిడిని అధిగమించడం ఎలా? - stress management skills

ప్రస్తుత జీవన శైలిలో, చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరిలో ఒత్తిడి అనే మాట సహజమైపోయింది. దీనివలన రకరకాల అనారోగ్య సమస్యలు, (శారీరకంగా, మానసికంగా) వస్తున్నాయి.
అసలు ఒత్తిడి అంటే ఏమిటి ? అదుపులో లేని నిరంతర నకారాత్మక ఆలోచనల వలన ఒత్తిడి హార్మోన్‌లు విడుదలై రక్తంలో కలుస్తాయి. అలా రక్తం మలినమై నెమ్మదిగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఒత్తిడి – రకాలు
– చిన్న పిల్లలకి హోమ్‌వర్క్‌ ఒత్తిడి
– స్కూల్‌ లేక ఆఫీసుకి టైమ్‌కి చేరుకోలేక పోతున్నాననే ఒత్తిడి
– బాస్‌ చెప్పిన పని పూర్తి చేయలేదని ఒత్తిడి
– విద్యార్థులకి ర్యాంకులు రాలేదని ఒత్తిడి
– సమయానికి జీతం రాకపోతే ఇంటి ఖర్చుల ఒత్తిడి
– ఇంటి అద్దె ఇవ్వటం ఆలస్యం అయితే యజమాని ఒత్తిడి
– అనారోగ్యం ఇంకా తగ్గలేదని ఒత్తిడి
– ఇంకా ఉద్యోగం రాలేదనే ఒత్తిడి
– ఉద్యోగం వస్తే, పెళ్ళి అవుతుందో లేదోననే ఒత్తిడి
ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న, పెద్ద ఒత్తిడి ఉంటోంది. చిన్నపాటి ఒత్తిళ్ళ వలన పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కాని పెద్ద ఒత్తిళ్ళు దీర్ఘకాలం వేధిస్తూ అనారోగ్యాన్ని తెచ్చి పెడ్తాయి.
ఒత్తిడికి కారణాలు
– అజ్ఞానం (అవసరమైన విషయాలపై అవగాహన లోపించటం)
– మానసిక సంతులనం లేకపోవటం
– శారీరక, మానసిక దృఢత్వం లేకపోవటం
– అత్యాశ పడటం
– అన్నీ నేనే చేయాలనుకోవడం
– పోషకాహార లోపం
– సరైన విశ్రాంతి లేకపోవటం
– అధిక శ్రమ
– నిద్ర సమస్యలు
ఒత్తిడితో కలిగే నష్టాలు
80-90 శాతం అనారోగ్య సమస్యలు ఒత్తిడి వలనే వస్తున్నాయి. ఒత్తిడి వ్యాధి కంటే చెడ్డది. వ్యాధి శరీరంలో ఏదో ఒక అవయవం మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఒత్తిడి మాత్రం శరీరంలోని ప్రతి కణం మీద ప్రభావాన్ని చూపిస్తుంది.
ఒత్తిడి వలన మైగ్రేన్‌, తలనొప్పి, నిద్ర సమస్యలు, అజీర్ణం, ఎసిడిటీ, మలబద్ధకం, హై బి.పి, హృదయవ్యాధులు, చర్మ వ్యాధులు, సైనస్‌, అస్థమా, ఎలర్జీలు, నడుము నొప్పులు, మెడనొప్పులు, మతిమరుపు, ఏకాగ్రత లోపించటం, షుగరు, స్త్రీలలో ఋతు సమస్యలు, కీళ్ళ నొప్పులు, దిగులు, బాధలు, ఇలా ఎన్నో రకాల శారీరక మానసిక వ్యాధులు రావటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఒత్తిడి వలన స్ట్రెస్‌ హార్మోను విడుదలై శరీరంలో ఏ అవయవం బలహీనంగా ఉంటుందో దానికి సంబంధించిన అనారోగ్యం వస్తుంది.
ఒత్తిడికి చికిత్స
ముందుగా తాను ఒత్తిడికి గురవుతున్నాననే విషయం గమనించాలి. అది ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. దానికి తగిన చికిత్స చేయాలి. క్రింది అనేక చర్యలు పాటిస్తూ రకరకాల ఒత్తిడులను అధిగమించవచ్చు.
– పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి.
– ప్రోటీన్స్‌ కలిగిన ఆహారం నిత్యం తీసుకోవాలి.
– మంచినీరు రోజుకి తగినంత (4-5 లీ) తాగాలి.
– రోజూ సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
– శ్రమ తరువాత తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
– నిత్యం శారీరక వ్యాయామం (సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, విశ్రాంతి, ధ్యానం) తప్పకుండా చేయాలి. వ్యాయామం వలన గ్రంథులు ఎక్కువ, తక్కువ కాకుండా సక్రమంగా పనిచేస్తాయి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది.
– క్రియలు, జలనేతి, సూత్రనేతి, వమన ధౌతి వారంలో ఒకసారి చేయాలి.
– ఆవర్తనా ధ్యానం (సైక్లిక్‌ వెంటిలేషన్‌) వారంలో ఒకసారి చేయాలి.
– వారంలో ఒకసారి యోగనిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోవాలి.
– పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకొంటూంటే, విజయ హాసం మొదలై, ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
– భావోద్వేగాల నియంత్రణకు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవొచ్చు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినొచ్చు.
– ఉత్తములతో స్నేహం, సత్సాంగత్యం, కుటుం బంతో మంచి సంబంధాలు ఉంచుకోవటం వలన మానసిక శాంతి, మనోధైర్యం వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా జీవించవచ్చు.
– కుటుంబంతో కలిసి విహారానికి వెళ్ళొచ్చు.
– మనకు అందుబాటులో లేని కోర్కెలు పెట్టుకోకుండా, అప్పులు చేయకుండా, ఉన్నదానిలోనే సర్దుకుంటూ ముందుకు వెళితే ఎటువంటి బాధలు, ఒత్తిళ్ళు ఉండవు.
– డి. వెంకటరావు, యోగా థెరపిలో నిపుణులు, 9542708262

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

2 Comments

Thank You